"మన పక్క ఇంటి తాసీల్దారు గార్ని అడిగాను-- ఓ గుమస్తా పోస్తుంటే వేయించండి మా మనమడికని. అబ్బాయి రానివ్వండి. చూస్తాను. తప్పకుండా మీకు ఉపకారం చేస్తాను అన్నాడతను." అంటూ వేలితో మజ్జిగ కలిపి కూతురు కంచంలో వేసింది జానికమ్మ.
మజ్జిగ లో అన్నం కలుపుతున్న మధుమతి గుండెల్లో గతం చిందులు తొక్కింది. 'తలక్రిందులైన కాలం. ఈ ఇంట్లో , తాసీల్దారు , పక్కింట్లో అభ్యర్ధి గత కాలంలో నివసించారు. ఆనాటి బామ్మ గారి స్థానే ఈనాడు ఆనాటి తాసీల్దారు భార్య జానికమ్మ. గతాన్ని క్షణ క్షణం గుర్తుకు తెచ్చి ఏడిపించే పరిసరాల్లోనే తన జీవితం జీర్ణించుకు పోతుంది. తన ఆయువు అరిగి పోతుంది. తన దెంత నికృష్ట మైన బ్రతుకు! తనని వదిలి వెళ్ళిన అతను ఎంత అదృష్ట వంతుడు! తననూ, తన్ను గుర్తు తెచ్చే పరిసరాల్నీ వదిలి, గత జీవితాన్ని పూర్తిగా విస్మరించి కొత్త జీవితాన్ని మలుచుకుని హాయిగా జీవిస్తున్నాడు . అగ్నిసాక్షిగా , పంచ భూతాల సాక్షిగా బంధు సమక్షం లో ప్రమాణాలు ఒకే త్రాటి మీద ఇద్దరి జీవితాలూ పయనించాలని. అవన్నీ వట్టివి. పురుషుని జీవితం, స్త్రీ జీవితం - ఇద్దరూ విడిపోయిన తరువాత ఆ బ్రతికే తీరూ వేరవుతాయి. అతను చెట్టు ఆకు రాల్చినట్టు భార్యనీ, బిడ్డనూ వదిలించుకుని మళ్ళీ చిగురించినట్టు ...తాను వేరు తెగిన తీవలా ఎండి కృశించి పోయింది. ఛీ, ఛీ! తిండి, బట్టతో తృప్తి పడే జీవితం జీవితమేనా? తానెందుకు బ్రతుకుతుంది?....' ఆమె చీకటి జీవితంలో సన్నని వెలుగు రేఖ.... వాసు ఆమె మనః పధం లో మెదిలాడు. అతను తనకోసం వదిలి వెళ్ళిన తన తపః ఫలం. త్వరత్వరగా ఏదో నిశ్చయానికి వచ్చిన మధుమతి చెయ్యి కడిగి లేస్తూ, "మరి తాసీల్దారు గారిని వాసు ఉద్యోగం విషయమై ఒత్తిడి తేకమ్మా! మళ్ళీ అదే ఆఫీసు, మళ్ళీ వాసు అందులో గుమస్తా! వద్దమ్మా! ఈ పరిసరాల మీద నాకు తీపి లేదు. నాకు ఎటన్నా దూరంగా పోవాలనుంది." అంది.
తన భర్త ఖాళీ చేసిన ఆ ఇంట్లో ఈ ఇరవై మూడు సంవత్సరాలలో ఎందరెందరో అద్దెకు దిగి మళ్ళీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. రెండు సార్లు ఇల్లు మరమత్తు చేశారా ఇంటి వాళ్ళు. ఆ ఇల్లు, అతను ఉండే గదీ ఈ వేళ ఓసారి చూడాలనే కోర్కె కలిగింది మధుమతికి. ప్రసాదరావు వెళ్ళిన ఈ ఇరవై సంవత్సరాల్లో ఏనాడూ గడప దాటని మధుమతి , ఆ వేళ పక్కింటి తాసీల్దారు గారి ఇంటికి పెరటి త్రోవను వెళ్ళింది. ప్రసాదరావు ఆనాడు నివసించే గదిలో చాప వేసింది. తాసీల్దారుగారమ్మాయి , పద్దెనిమిదేళ్ళ నిర్మల. 'అమ్మా, అత్తయ్యగారొచ్చారు.....జయా వాళ్ళ అత్తయ్య." పిలిచింది నిర్మల సన్నని గొంతుతో. ఆమె తల్లి అన్నపూర్ణమ్మ "ఎప్పుడూ గుమ్మం దాటని వారు మా ఇంటికి వచ్చారంటే విశేషమే!' అంటూ నవ్వి, "అబ్బాయి రాలేదా ఇంకా?' అంటూ వాసుని గురించి ఎన్నో ప్రశ్నలు ఆడపిల్ల తల్లిలా ఆసక్తిగా ప్రశ్నించింది. అన్యమనస్కంగా జవాబులిచ్చింది మధుమతి. తానూ, ప్రసాదరావు పెళ్ళి కాకపూర్వం నవ్వుతూ కబుర్లు చెప్పుకున్న ఆ గది. ఆ గదిలో ప్రతి అంగుళం ఆమె కెంతో అత్మీయమైనదిగా అనిపించింది. ఒక్కసారి గదంతా కలయజూచి లేచి నిలుచుంటూ , "ఊరకనే ఓసారి చూసి పోదామని వచ్చాను. ఎన్నోసార్లు నిర్మల రమ్మని పిలిచి మానేసింది" అంది మధుమతి.
"అబ్బాయి వస్తే ఓసారి తప్పకుండా పంపించండెం? ఎంతో బాగుంటాడుట మీ అబ్బాయి!" తాహసీల్దారు భార్య అన్నపూర్ణమ్మ ఆశగా మధుమతి వైపు చూసింది. ఈసారి మధుమతికి నవ్వొచ్చింది 'శభాష్! ఈనాడు తన స్థానం లో నిర్మల. వద్దు, పెద్దింటి పిల్ల తన కొడుక్కి భార్య కాకూడదు. ఆమె అహంలో మాడి పోతాడు' అనుకుంటూ , వాళ్ళిచ్చిన తాంబూలం అరటి పళ్ళూ తీసుకు పెరటి తోవను ఇంటికి వచ్చేసింది. అరటి పళ్ళు జానికమ్మ కీ, తాంబూలం సుందరమ్మ కి ఇచ్చి కాళ్ళు కడిగేసు కుంది మధుమతి.
* * * *
"అబ్బ! ఎంతకాలానికి వచ్చావు?" గుమ్మాని కడ్డుగా నిలుచున్నా జయ వైపు చకితుడై చూశాడు వాసు. నీలం పరికిణి, నల్లని జాకేట్టూ, చిన్న చిన్న పూల ఓణీ మధ్య అందమైన పాలరాతి బొమ్మలా మెరిసిపోయే జయ. క్షణం అతని చూపులు చెదిరి పోయాయి. "చాలా కాలం తరవాత వచ్చాను, నిజమే కాని, నన్ను తమ్మన్నావా? పోమ్మన్నావా? దారి కడ్దులే!" నవ్వుతూ అన్నాడు వాసు.
"సారీ....నువ్వదోలా మారినట్టు కనుపిస్తుంటే !" అని నాలిక కరుచుకుంది జయ.
ఇంట్లోకి వస్త్గూనే, "అమ్మా!' అని పిలిచాడు వాసు.
"ఎన్నాళ్ళ కి చూశాను, బాబూ? కళ్ళు కాయలు కశాయి. వాచీ పోయానురా" అంది మధుమతి చీర చెంగును చెయ్యి తుడుచుకుంటూ.
"ఎలా, అమ్మా! సెలవుల్లో ప్రాక్టికల్స్ ఉన్నాయని రాలేదు. అమ్మమ్మేది?" అన్నాడు వాసు.
"ఎవరూ? వాసు బాబా? పెద్దాడి వైపోయావే! ఏదీ, ఇలా రా, వాసూ!" కళ్ళజోడు సవరించుకుని కనుబొమలు చిట్లించి చూస్తూ అంది జానికమ్మ.
"బాగా వ్రాశావా? క్లాసోస్తుందా?" తనకన్నా బెత్తెడు పొడుగున్న కొడుకు తల నిమిరింది మధుమతి.
"వాసును దగ్గరగా తీసుకుంటూ, "నా కలెక్టరు బాబు ఎంత బాగున్నాడు!" అని అతని చెక్కులు పుణికి ఆ చేతులు ముద్దు పెట్టుకుంది జానికమ్మ.
(1).jpg)
రాజశేఖరం , సుందరమ్మ చంద్రం, ఒక్కొక్కరే వాసు వైపు వింతగా చూసి పలకరించారు.
తల్లిని పరిశీలనగా చూసిన వాసు -- "అమ్మా, ఏం అలా వున్నావు? ఒంట్లో బాగుండలేదా?" అని ప్రశ్నించాడు.
వెలసిన చీర చెంగు రెండవ భుజం మీద కప్పుకుంటూ , "బాగానే ఉంది. రా, కాఫీ ఇస్తాను. బట్టలు మార్చుకో" అంది మధుమతి.
బట్టలు మార్చి, కాఫీ తాగి ఇల్లంతా కలియజూసిన వాసుకి ఏదో గ్రహింపయింది. సున్నం వెయ్యని నల్లని గోడలు, నవార్లు తెగిన మంచాలు, దుప్పటి లేని పరుపూ , స్టాండు కి వేలాడే పాతచీరా, చిక్కి నలుపెక్కిన మధుమతీ, అన్నం గిన్నె పక్కన చారు గిన్నె .... కొట్టవచ్చినట్టు కనిపించింది అ ఇంట్లో తారట్లాడే దారిద్యం. అతని హృదయం కదిలిపోయింది.
భోజనానికి పిలిచిన మధుమతి వైపు జాలిగా చూస్తూ "నాకు అక్కర్లేదమ్మా" అన్నాడు వాసు.
"ఎందుకు అక్కర్లేదు? వట్టిది, ఎందుకలా దిగులుగా అయిపోయావు? తలనొప్పా?' కంగారు పడిపోతుంది మధుమతి.
అయిష్టంగానే భోజనాల గది వైపు నడిచాడు వాసు. పైట చెంగు చాటు చేసుకుని ఏదో ప్లేటు తో పక్కింటి నుంచి తెచ్చింది జానికమ్మ. కనిపెట్టిన వాసు - "అసలు నాకు అక్కరలేదంటే ఏమిటమ్మా!' అంటూ ఇంకా ఏమో అనేయ్యబోతున్న నోటిని అదుపులో పెట్టుకోడానికి నోటి నిండా అన్నం కూరుకున్నాడు వాసు.
"బాబూ, ఈ సంవత్సరంతో చదువు సరికదూ?" అడిగింది జానికమ్మ. వాసు జవాబు చెప్పెంతలో -- "పాసయ్యాక సరో కాదో ఆలోచన. ఇప్పుడెందు కమ్మా ఆ ప్రశ్న?" అని విసుక్కుంది మధుమతి.
"నా కేందుకమ్మ!....ఏదో వాడు ఉద్యోగం చేసి నాలుగు రాళ్ళు తెస్తే నీ కష్టాలు గట్టెక్కుతాయని కాని...." గొణుగుతున్న జానికమ్మ -- "అమ్మా! అన్న మధుమతి తీవ్రమైన మందలింపు విని మౌనం వహించింది. వాసు భోజనం ముగించి వెళ్ళాక "తాసీల్దారు గారు ఉద్యోగం వేయిస్తారు, వెళ్ళి అడగమని వాసుకి చెప్పకమ్మా! నేనే చెబుతాను నెమ్మదిగా. పడినన్ని రోజులు మరి పడేనుగా ఇబ్బందులు? దిగులు పడతాడు మన లేమి వింటే, రాజు చేసిన వ్యవహారం సంగతి కూడా చెప్పద్దు." అని నెమ్మదిగా అంది మధుమతి.
"అలాగేలేవే. నువ్వే చెప్పు. ఇంకా కుర్రాడు కాడుగా. వాడికీ తెలుసు మన పరిస్థితులు. చివరంటా నీ గురించే మనస్సుకి శాంతి లేకుండా పోతుంది...." చిరాగ్గా అంది జానికమ్మ.
ఏదో చెప్పబోయే జానికమ్మ , అడ్డు తగిలే మధుమతి. విషయం అర్ధం చేసుకోలేని వాసు గబగబా డాబా మెట్లెక్కి , "జయా!' అనిపిలిచాడు.
వాసు రావడం గమనించిన జయ నిద్ర నటించింది. "జయా!" మృదువుగా పిలిచాడు వాసు.
జవాబు శూన్యం. ఆమె పెదవులు కొంటె నవ్వుతో కదులుతున్నాయి.
"చ, పో! నిద్ర నటిస్తున్నావు!"
ఆ పిల్ల బింకంగా నవ్వే పెదవులు బిగబట్టింది.
"ఏయ్, జయా! లేవాలి." టేబిలు పై కొట్టి శబ్దం చేశాడు.
ఆమె కదల్లేదు.
"నిన్ను ఎలా అన్నా లేపందే నే వెళ్ళను. ఏయ్, దొరసానీ!' నవ్వుతూ పిలిచాడు వాసు.
ఆమె పెదవులు కదిలి మళ్ళీ ముడుచుకున్నాయి.
చప్పున టేబిలు మీదున్న గ్లాసులో నీళ్ళు జామే చెవిలో రెండు చుక్కలు పోశాడు వాసు.
"ఛ! ఇదేమిటి? మోటు సరసం పోలే! మళ్ళీ చదువు తున్నావు పెద్ద..... చక్కగా సినిమాల్లో లా బుగ్గ మీద చిటికే వేసి లేపుతావనుకున్నాను." జారిన పమిట సవరించుకుంది జయ లేచి కూర్చుంటూ.
ఆమె మాటకి, ఆ ప్రవర్తన కి సిగ్గు పడ్డ వాసు చివాల్న మొహం తిప్పుకున్నాడు.
'అలా సిగ్గు పడుతున్నావు ఆడపిల్లలా. ఎందుకొచ్చినట్టు!" కిలకిలా నవ్వింది జయ.
"చాలాకాలంగా నేను రాలేదుగా. ఏమన్నా విశేషాలు చేబుతావని." ఆమె కెదురుగా కుర్చీ వాల్చుకు కూర్చున్నాడు వాసు.
తన చదువు, సంగీతం, కాలేజీ లో ఆ మధ్య వేసిన నాటకాలూ , అందులో తన పోర్షనూ, ఎదురింటి ప్లీడరుగారబ్బాయి హీరోగా , తను హీరోయిన్ గా ఎలా నటించారో -- గలగలా సెలయేరు గా సాగిపోతుంది జయ వాక్ప్రవాహం. తనకి అక్కర్లేని ఆమె మాటలు విని విసుగెత్తిన వాసు విసుగ్గా , "ఎద్దుకేం తెలుసు అతుకుల రుచి అన్నట్టు, నా కందులో అభిరుచి లేదు. నువ్వేం చేసినా నా కర్ధం కాదు. కాని....' అంటూ ఆగాడు.
"ఆ కాని?' అంది జయ.
"అమ్మావాళ్ళకి పంట ధాన్యం , అద్దెలూ చాలడం లేదా?' అడిగాడు ఇబ్బందిగా కదిలి కూర్చుంటూ.
"ఓ, గ్రహించావు! ఎలా అయినా నీది చాకు లాంటి బుర్ర. ప్చ్! ఏం చేస్తాం , వాసూ! ఓ రోజు, రెండు రోజులూ ఎవరన్నా ఓ కుటుంబాన్ని అడుకోగలరు. సంవత్సరాల తరబడి భరించగలరా? మరోలా ఫీలవకు. వాసూ! బామ్మ నోరు మంచిది కాదు సుమీ! నాకూ , తమ్ముడి కీ చదువులూ, పెళ్ళిళ్ళూ కావాలంటే నాన్న గారి జీతం ఏపాటి , చెప్పు! నాన్నగారి వంతుకి వచ్చే పంటా, అద్దె మరి ఇవ్వడం మానేశారు."
త్రుళ్ళిపడ్డాడు వాసు. బాధగా జయ వైపు చూశాడు.
"నాకు అత్తయ్యను చూస్తె జాలిగా ఉండేది కాని...."
"కాని....ఇప్పుడేమయింది...జయా?" గొంతు వణికింది.
'అత్తయ్యను చూస్తె కోపం. నువ్వు కట్టే బట్టలు మా తమ్ముడు కడుతున్నాడా? డబ్బంతా నీకు తోడి పేదవాళ్ళ లా నటిస్తున్నారు!"
"జయా!" అసహనంగా అరిచాడు వాసు.
'అరుపు లెందుకు, సిగ్గు లేక! ఉలెన్ సూట్లు వేసుకోవడానికీ, వాచీ ఉంగరాలు పెట్టుకోవడానికి నీకు అర్హతుందా అని! నీ తల్లి మా అమ్మ ఇచ్చిన పాత చీరలు కడుతుంది. నువ్వు ఉలెన్ సూట్లు వేస్తున్నావు. వాళ్ళు అన్నానికి వాచిపోతున్నారు. నువ్వు ఐ.ఎ.ఎస్ చదువుతున్నావు..... అడైనా, మగైనా , చిన్నైనా, పెద్దైనా సిగ్గూ అభిమానం ఉండాలి. అత్తయ్యా? దమయంతి లా ఓ చీరతో ఉంటె జాలిపడి అమ్మ రెండు పాత చీర లిచ్చింది. మా ఇంట్లో అందర్నీ తిట్టారు నాన్న. అసలెందుకిలా చేస్తుందో అత్తయ్య. నాన్నగారు ఎన్ని మాటలన్నా పెదవి కదపలేదు."
