14
"హార్టీ కంగ్రాచ్యులేషన్స్" అంటూ ప్రేక్షకులలో నుంచి లేచి వచ్చి జానకి ని అభినందించింది జ్యోతి. ఇంకా రోటరీ క్లబ్బు కార్యదర్శి ద్వితీయ బహుమతి వచ్చిన వారి పేరు చదవనే లేదు. ఇంతట్లో కే ప్రధమ బహుమతి వచ్చిన జానకి ని కరతాళ ధ్వనులింకా ముగియ కుండానే జ్యోతి వెళ్ళి అభినందించడం , అక్కడ చేరిన సభ్యుల కందరికీ ఆశ్చర్యంగా కనిపించింది. అంతా ఒక్క మాటు విస్తుపోయి వాళ్ళలో వాళ్ళేదో మాట్లాడుకోసాగారు.
అంతా సద్దుమణిగాక "రెండవ బహుమతి -- మిస్టర్ తిలక్ -- మెడికల్ కాలేజీ" అని ప్రకటించారు రోటరీ క్లబ్ కార్యదర్శి . మళ్ళీ కరతాళధ్వనులు చెలరేగాయి. తర్వాత అందమైన "వీనస్ ,' మినర్వా ' పాలరాతి విగ్రహాలు జానకికి, తిలక్ కు బహుమతులుగా ఇచ్చారు. తమ అభ్యర్ధనను మన్నించి నగరంలో ఉన్న అన్ని కళాశాలలవారు తమ తమ విద్యార్ధినీ విద్యార్ధులను అంతర కళాశాల వక్తృత్వపు పోటీకి అభ్యర్ధులుగా పంపినందుకు కృతజ్ఞత లర్పించారు కార్యదర్శి.
కార్యక్రమం ముగిసి అంతా ఇవతలకు వచ్చేశారు. చేతిలో బహుమతి పట్టుకొని మౌనంగా తల వంచుకొని తన మోటారు సైకిలు దగ్గరికి వెళ్ళుతున్నాడు తిలక్. జ్యోతి కి అతన్ని చూసేటప్పటికి ఎందుకో జాలి వేసింది. నిజానికి అతనే బాగా మాట్లాడాడు. తనే గుణ నిర్ణేత అయితే అతనికి ప్రధమ బహుమతి ఇచ్చి ఉండును. పాపం! జరిగిన అన్యాయానికి ఎంత బాధపడుతున్నాడో! 'పోనీ, వెళ్ళి ఒక్కమారు పలకరిస్తే !' ఈ ఆలోచన రావడం తడవుగా, జానకి చెయ్యి పట్టుకొని గబగబా తిలక్ దగ్గరికి వెళ్ళి, "నమస్తే" అంది జ్యోతి. తిలక్ ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాడు.
"కంగ్రాచ్యులేషన్స్ అండి. నా పేరు జ్యోతి. ఈమె స్నేహితురాలిని." అంది నవ్వుతూ.
తనను అంత చనువుగా పలకరిస్తున్న జ్యోతిని చూసి మొదట్లో కొంచెం తొట్రుపడి, అంతలోనే సర్దుకొని, "థాంక్ యూ" అన్నాడు తిలక్. ఆ సమయంలో ఏమి చెయ్యాలో తోచక తెల్లబోయి నిలుచుంది జానకి. అది చూసి ఆమెను మోచేత్తో పొడిచి సైగ చేసింది జ్యోతి. అతి కష్టం మీద నాలిక తడిచేసుకుని అభినందనలు తెలిపింది జానకి.
వణికే కంఠంతో తిలక్ "థాంక్స్ -- నిజానికి మిమ్మల్ని నేను అభినందించాలి." అన్నాడు. ఈ పరస్పర అభినందనలకు ముగ్గురూ నవ్వుకున్నారు.
"వస్తామండి. సెలవు" అంది జానకి.
"ఇక్కడికి దగ్గరలోనే నా గది ఉంది. మీకు అభ్యంతరం లేకపోతె కొంచెం కాఫీ తీసుకుని వెళ్ళుదురు గాని...."
"అభ్యంతరం ఏమిటి, కాఫీ ఇస్తానంటే? కాని.....ఆలస్యం అయితే మా వార్డెన్ వల్ల చివాట్లు తినవలసి వస్తుంది. పోటీలు అవగానే తిన్నగా హాస్టల్ కి వచ్చేయాలని ఆర్డరు."
'అలాగే, ఒక్క పది నిమిషాలలో వెళ్ళిపోదురు గాని, కాఫీ తీసుకుని."
"అదెలా సాధ్యం అవుతుందండీ? మనం వెళ్ళాక అక్కడ కాఫీ పెట్టడానికి అధమం పదిహేను నిమిషాలయినా పడుతుంది. పైగా గది అంటున్నారు. బ్రహ్మచారుల కొంపల్లో అన్నీ అమారుగా ఉంటాయని నమ్మకం ఎక్కడుంది?"
జ్యోతి సంభాషణ జానకికి రుచించడం లేదు.
"అక్కర్లేదు. మనం వెళ్ళడం , కాఫీ తీసుకుకోవడం. అంతే" అన్నాడు తిలక్.
"అంత చప్పున ఎలా తయారవుతుంది? అనుకోకుండా లభ్యం అయిన ఇద్దరు కొత్త స్నేహితులను మీరు కాఫీకి ఆహ్వానించారని కలగని, మనం వెళ్ళేటప్పటికి , మీ గదే అమారుగా కాఫీ సిద్దం చేసి ఉంచుతుందా?"
"గదే సిద్దం చేస్తుందో, గదిలో ఉన్న హీటరే సిద్దం చేస్తుందో చూద్దురు గానిగా?"
"ఏం జానకీ! వెళదామా?"
"అయన అంతగా పిలుస్తున్నప్పుడు వెళ్ళక పొతే బాగుంటుందా?"
జానకికి జ్యోతి ప్రవర్తన చూస్తున్న కొద్దీ ఒళ్ళు మండిపోతున్నది. 'ఏదో వంక పెట్టి తప్పించు కోవాలి కాని, ఏమిటీ మెత్తబడడం? పైగా ముక్కూ మొహం ఎరగని ఆ మూడవ వ్యక్తీ దగ్గర పాపం తనకేమీ అభ్యంతరం లేనట్టూ, అంతా తన తప్పే అన్నట్టూ ప్రవర్తిస్తుందేమిటి? "మా కిద్దరికీ ఉండటానికి వీలులేదు. వెంటనే వెళ్ళిపోవాలి" అని ఖచ్చితంగా చెప్పక, "ఏమంటావు జానకీ!" అంటే అర్ధం ఏమిటి? అతని దృష్టి లో మర్యాదా, నాగరికతా తెలియని వ్యక్తిగా నేను తేలిపోవడం కోసమే గదా? దీనికి ఇంత కింతా రోగం కుదర్చాలి. దీనికి లేని అభ్యంతరం నాకే నేమిటి?"
ఇలా అలోచించి, చివరకు అంది: 'అవును, వెళ్ళక పొతే బాగుండదు. నడు. వెళదాము." ఇలా అన్నాక జ్యోతి ముఖం లో కవళికలు ఎలా మారతాయో అని పరిశీలించింది. ఈ మాటతో జ్యోతి తెల్లబోతుంది అనుకుంది జానకి. కాని అలా కాకుండా జ్యోతి రెట్టించిన ఉత్సాహంతో "వెరీ గుడ్ . నడవండి. మా గార్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు" అంది తిలక్ తో.
ఫ్లాస్కు లో ఉన్న కాఫీ రెండు కప్పుల్లో పోసి "తీసుకోండి" అన్నాడు తిలక్.
"మరి మీరో" అంది జ్యోతి.
"మీరిప్పుడు నాకు అతిధులు. ఫరవాలేదు. తీసుకోండి."
"సరే" అని జ్యోతి కప్పు నోటి దగ్గర పెట్టుకుంది. జానకి మాత్రం సాసరు లో కొంచెం కాఫీ పోసుకొని , కప్పు అక్కడే పెట్టేసి "నాకిది చాలు" అంది.
'అదేమిటి? మీ కిచ్చిందే కొంచెం. అందులో ఇంకా ఉంచేస్తారేమిటి?"
"నేను అంత తాగలేను. కప్పులోది మీరు తీసుకోండి." అంది జానకి.
తిలక్ మాటల్డలేదు ; కాఫీ కప్పు తీసుకోనూ లేదు.
జానకి కాఫీ కప్పు అతనికి అందించి, నవ్వుతూ "ప్లీజ్" అంది. తిలక్ కాఫీ తీసుకున్నాడు మారు మాట్లాడకుండా. అది చూసి జ్యోతి "అదేమీటండోయ్ , మీ గదిలో మాచేత బతిమాలించుకుంటున్నారు?'అంది.
తిలక్ నవ్వాడు. నవ్వులో అతనికి పోల మారింది.
"ఎవరో తలుచుకుంటున్నారు" అన్నాడు.
"తలుచుకొనే వారు ఒకరున్నారన్నమాట!" అంది జానకి సాభిప్రాయంగా.
"ఆ! ఉన్నారు. మా అమ్మ."
జానకి వెంటనే సిగ్గుపడింది తను అనవసరంగా అపోహతో మాట అని తేలిపోయినందుకు.
"ఉహూ! నువ్వు బాగానే మాట్లాడతా వన్నమాట! ఇంకా ముద్దరాల వనుకున్నాను!" అంది జ్యోతి. జానకి ఎర్రబడిన కన్నులతో దొంగ కోపం నటిస్తూ చురచురా చూసింది జ్యోతి కేసి.
"చూడు , ఇంకా చూడు. నేనేం భయపడతా ననుకున్నావా?' అంది జ్యోతి.
వాళ్ళిద్దరి కుహన కలహాన్ని చూసి నవ్వుకున్నాడు తిలక్. ఎంత స్వచ్చమైన హృదయాలు వీళ్ళవి! ఏమీ అరమరికలు లేకుండా, కొత్తవాడిని జంకూ, భయమూ లేకుండా ఎంత స్వేచ్చగా ఉంటున్నారు! ఇంకా అరగంట కూడా కాలేదు వాళ్ళతో తనకు పరిచయమై ఎన్నో ఏళ్ళ నుంచీ స్నేహితులయినట్లు ప్రవర్తిస్తున్నారు.
"ఆడవాళ్ళ చూపులు ఆడవాళ్ళ నేమీ భయపెట్ట లేవు" అంది జ్యోతి.
"ఏమండోయ్, డామేజింగ్! అంటే మీ అర్ధం ఏమిటి? ఆడవాళ్ళ చూపులు చూసి మగవాళ్ళు భయపడి పోతారనే కదా?"
"నిశ్చయంగా."
"నేనొక్కనాటికి ఒప్పుకోను."
"కొందరు ఒప్పుకోనంతటిలో నిజం నిజం కాకపోదు."
"మీరు చెప్పింది ఒక్కనాటికి నిజం కాదు."
"ముమ్మాటికీ నిజం."
"కాదు. ఒకవేళ ఏ పురుషుడైనా భయపడినట్లు కనిపించినా అది ఒట్టి నటన మాత్రమే కాని నిజం కాదు."
"అది నటన కానీండి, నిజం కానీండి. భయపడతాడా , లేదా ? అదీ కావలసింది."
"నటన అయితే ఏం ప్రయోజనం?"
"ప్రయోజనం కాకపోవడమేమిటండి? నటన అయితే ఇంకా మంచిది. ఏమంటే , స్త్రీ పురుషుడ్ని భయపెట్టిందంటే , అతడు నిజంగా భయపడాలని కాదు. ఆ పరిస్థితిలో కూడా అతను ఎలా తట్టుకొని నిలబడతాడు అని పరీక్షించడమే. అతను లొంగి పోకుండా స్థైర్యంతో నిలబడితే అదే చాలు. అంతకంటే కావలసింది ఏమిటి? అటువంటి మేరు ధీరుడి మీద తన బాధ్యత అంతా ఉంచేసి తను హాయిగా ఏ చీకు చింతా లేకుండా జీవించవచ్చు."
"మరయితే ఇంక అతను భయం నటించడం ఎందుకు? ధైర్యంగా నిలబడితే సరిపోలేదూ?"
"అబ్బే. అక్కడే ఉంది చిత్రం. అలా అని అతను తన లెక్క లేకుండా నిర్లక్ష్యంగా నిలబడి పోవడం కూడా స్త్రీ సహించ లేదు. తనచేత సమ్మోహితుడు కాని మొండి వాడి కంటే , తన వెనకాలే తిరిగే మూర్ఖుడు నయం అనుకుంటుంది స్త్రీ."
"అంటే చివరికి చెప్పవచ్చే దేమిటి? స్త్రీ కి వశ్యుడు కాకుండా, అలా అని నిర్లక్ష్యంగా ఉండకుండా భయపడి భయపడనట్లు ఉండాలన్న మాట పురుషుడు?"
జ్యోతి అవునన్నట్లు తల ఊపింది.
"మీ సిద్దాంతమే కనక నిజం అయితే స్త్రీ ఒక పెద్ద గండు పిల్లీ, పురుషు డొక చిన్న చిట్టెలుకాను" అన్నాడు కోపంగా తిలక్.
అతని మాటలకు పకపకా నవ్వారు జ్యోతి, జానకీ.
"ఇంక వెళ్ళొస్తామండి." అంటూ లేచారు.
"ఉండండి. రిక్షా పిలుస్తాను. చాలా సంతోషం , మీరు నా ప్రార్ధనని మన్నించి వచ్చినందుకు."
"ఎంతమాట!" అంది జానకి.
"మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందాము. ఫలానా అప్పుడు అని చెప్పడానికి వీలులేదు, మేము గరల్స్ హాస్టలు లో ఉంటున్నాము గనక. ఖైదీల కైనా కొంచెం స్వేచ్చ ఉంటుందేమో కాని, మాకు ఉండదు. ఉంటామండీ." అంది జ్యోతి.
