ఆవిడగార్కి పిల్లలు కావాలనుకోడం బాగానే వుంది - దానికి తగిన వాతావరణం, మూడ్ కల్పించవచ్చు కదా! మూతి ముడుచుకుని అలకలు, సాధింపులు, మాటలు చేతలతో విసుర్లు కాకుండా - యింటికొచ్చేసరికి నవ్వు మొహంతో "అల్సిపోయారు వుండండి గీజర్ ఆన్ చేశాను టబ్ నింపుతాను వేడి నీళ్లతో అని ఓ రెండు చుక్కలు ఉడుకులాం వేసి, స్నానం చేశాక తెల్ల పైజమా కుర్తా తీసి అందించి డైనింగ్ టేబిల్ దగ్గర వేడిగా అనురాగం వడ్డించి - ఆపైన చక్కగా నాలుగు తమలపాకులు కిళ్లీలు చుట్టిచ్చి - రెండు అగరువత్తులు గదిలో వెలిగించి - తెల్లచీర కట్టుకుని, మల్లెపూలు తురుముకుని -" ఊరుకో బాబూ, మరీ అంత అత్యాశ వద్దంటున్నారా - ఇప్పుడంత సీను లేదయ్యా, ఇవన్నీ పాత సినిమా సీనులంటారా! కరక్టే సార్ - ఇదంతా హైటెక్ యుగం. ఇప్పుడెవరికీ అంత టైము లేదు. ఉద్యోగాల బాధ్యతతో పిల్లలని కనడానికీ టైము లేక పోస్ట్ పోన్ చేసుకునే రోజులు! ఎంతసేపు కోర్సుల మీద కోర్సులు చేసి, జాబ్ లో ఎంత ఎదిగిపోదామా, ఎన్ని ఉద్యోగాలు మార్చి పైపైకి వెళ్ళిపోయి టాప్ పోస్ట్ కి వెళ్లి లక్షలెలా ఆర్జించడమా అని తప్ప స్త్రీ పురుష సంబంధాలు కూడా మెకానికల్ గా టైమ్ షెడ్యూల్లోకి వెళ్ళిపోయాయి - రొమాన్స్, శృంగారం అన్న పదాలకి తావులేని హడావిడి, యాంత్రిక జీవితం - వంట్లో ఓపిక, ఉత్సాహం అంతా డబ్బు సంపాదించడానికే సరిపోతుంది. ఏం తింటున్నాం, ఏం సుఖపడ్తున్నాం అన్న భావనే లేదు. ఏదో పెళ్లికాక ముందు కాస్త నచ్చిన అమ్మాయి కనిపిస్తే టేస్టు, భావాలు కలిశాయని భ్రమించి పెళ్లాడడం, ఆ ఆకర్షణ నాలుగు రోజుల ముచ్చటయి జీవితం రొటీనయిపోవడం, ఇదివరకు తరాలలో డబ్బులు పుష్కలంగా లేకపోయినా సౌకర్యాలు తక్కువయినా, సంపాదించేది ఓ రకంగానైనా యింట్లో సుఖ సంతోషాలుండేవి - భార్యా భర్త పిల్లలు కల్సి సినిమా, షికార్లు తిరగడం, పండగలకి పబ్బాలకి చుట్టాలు రాకపోకలు ఆప్యాయతలుండేవి. ఇప్పుడీ యువత డబ్బు సంపాదించే మిషనుల్లా మారిపోయారు - జీతాలంటే బోలెడు! అవి యిచ్చే వస్తు సుఖాలు - తప్ప అనురాగాలు ఆప్యాయతలు ఏవి!... నిద్రంతా, కలత నిద్ర ఆలోచనలతో.. పడుకో బాబూ పడుకో, మళ్లీ పొద్దుట ఆఫీసుకెళ్లద్దూ - తనని తానే జోకొట్టుకున్నాడు హరీష్.
పొద్దుట లేచేసరికి కావేరి మాయం - డైనింగ్ టేబిల్ మీద పళ్ల బౌల్ కింద నోట్ - 'భార్య కావలిస్తే వచ్చి తీసికెళ్ళు - క్షమాపణలతో - టైమ్ లిమిట్ - నెల'. ఎంత పొగరో చూశారా! ఏం తప్పు చేశానని వెళ్లి క్షమాపణలు చెప్పి తీసుకురావాలో.. పోనీ.. హాయిగా, ఇరవై తొమ్మిది రోజులు గడిపి ఆఖరు రోజు ఆలోచించవచ్చు - యీ తిక్క వేషాలు చూసే ఆ మొదటి మొగుడు ప్రాణం విసిగి డైవోర్సు యిచ్చి వుంటాడు! మొదటి మొగుడేమిటి - అయ్యో, చెప్పలేదా! ఈవిడగారికిదివరకో పెళ్లి అయింది - తను డైవోర్సి అని తెలిసీ, మావాళ్ల కిష్టం లేకపోయినా, వాళ్లు పెళ్లికి రామని చెప్పినా కావేరిని ప్రేమించి పెళ్లాడాను - ఏదో ఘనకార్యం, త్యాగాలు చేశానని చెప్పను గాని తనకీ కృతజ్ఞతన్నా లేదే అనిపిస్తే అది నా తప్పా! టైమ్ లిమిట్ నెలట! నెలదాటితే ఏం చేస్తుందో! మళ్లీ డైవోర్సు యిస్తుందా.
ఈవిడగారు పుట్టింటికి వెళ్ళేసరికి అక్కడి సీన్ ఊహించవచ్చు.'అదేమిటే చెప్పా పెట్టకుండా వంటరిగా వచ్చావు' అంటుంది వాళ్ల మామ్మ ఆశ్చర్యంగా - 'ఏం చెప్పి రావాలా' అని యీవిడ దబాయించి మేడ మీదకెళ్లి పోతుంది - 'ఏం పుట్టింటికి రావడానికి హక్కు లేదా' అంటూ తల్లి తండ్రి అడిగినా అదే ధోరణిలో అంటుంది - చూద్దాం వాళ్లకేం చెపుతుందో వాళ్లు నాకేదన్నా ఫోను చేస్తారేమో అదీ చూస్తాను...! ఈ పెళ్లన్నా బుద్ధిగా నిలుపుకో ఈసారి తిక్క వేషాలేస్తే అంతే సంగతులు- అలా ఊ - ఆ - అంటే విడాకులు యిచ్చి ఎన్ని పెళ్లిళ్లు చేసుకుందామనుకుంటున్నావు. మూడోసారి నీవు చేసుకుందామన్నా నిన్ను చేసుకునేవాడు దొరకద్దూ - అంటూ కూతురికింత గడ్డి పెట్టకుండా వుంటారా! దాంతో ఈవిడ గారు దారికి వస్తుందన్న నమ్మకం నాకేం లేదు. ఏదో ఆలోచించి నేనే ఒక షాక్ ట్రీట్ మెంటివ్వాలి - ఆలోచనల మధ్యే తయారయి ఆఫీసుకెళ్లిపోయాడు హరీష్.
నాలుగో రోజు రాత్రి ఫోను మోగింది - తీస్తే అట్నించి మామగారు! 'హలో సార్, హౌ ఆర్ యూ' కావాలనే చాలా కులాసాగా పలకరించాను. ఆయన ఒక్క హలోతో సరిపెట్టేసి డైరక్ట్ గా పాయింటు కొచ్చేశారు. 'కావేరి వచ్చి మూడు రోజులయింది' అన్నాడు. 'అవునంకుల్' అమాయకంగా అన్నా. 'ఏం జరిగిందసలు?'. 'నాకేం తెలియదు అంకుల్. పొద్దుట లేచేసరికి డైనింగ్ టేబిల్ మీద చీటీ వుందంతే-'. 'అంటే, నీకు చెప్పకుండానే వచ్చిందా! అసలు ఏంటి గొడవ'. 'నాకేం తెలుసు మీ అమ్మాయి అక్కడే వుంది అడక్కపోయారా' గడుసుగా అన్నాను. 'అదేం చెప్పలేదు-వూరికే వచ్చానంది'. 'అయితే సరే, ఊరికే, మళ్లీ బుద్ధి పుడితే ఇటొస్తుందిలెండి' చాలా తేలిగ్గా అన్నాను. పాపం ఆ మహానుభావుడికింకేం మాట్లాడాలో తెలియక. అల్లుడ్ని ఎలా నిలదియ్యాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారేమో. 'అయితే మీ యిద్దరి మధ్య ఏం గొడవ జరగలేదా' మళ్లీ రెట్టించాడాయన. 'నా తరఫు నించి, ఏం గొడవ జరిగినట్టు గుర్తులేదు - మీ అమ్మాయికేమన్నా గుర్తుందేమో అడగండి-' మళ్లీ క్షణం మౌనం... "ఏం జరగకపోతే వచ్చిం దగ్గర నుంచి మూడీగా వుంది - మాట్లాడిస్తే కరుస్తూంది - ఏం చెప్పందే మాకెలా తెలుస్తుంది - యిద్దరికిద్దరు యిలా అయితే ఎలా హరీష్ - పెద్దవాళ్లం ఏదో సలహా చెపుతాం సంగతి తెలిస్తే - సర్దుబాటు చేస్తాం - పంతాలకి పోతే ఎలా చిన్న చిన్న విషయాలకే...'
'అది మీ అమ్మాయికి చెప్పాల్సిన మాటండీ' నవ్వుతూ అన్నాను.
'అమ్మాయికీ చెప్పాను, మీకూ చెప్తున్నాను' కాస్త అసహనం ధ్వనించింది.
'చూడండి సార్.. ఐ హావ్ నో కంప్రయింట్స్ ఎబౌట్ హర్ - ఆవిడకేం వున్నాయో నాకు తెలీదు - గుడ్ నైట్' అంతో ఫోన్ పెట్టేశాను.
'ఆ అబ్బాయి పాపం తనకేం తెలీదంటున్నాడు. తనేం దీని గురించి కంప్లయింట్ చేయలేదు. అబ్బాయి పాపం నవ్వుతూ మామూలుగానే మాట్లాడాడు... 'మామగారు కాంప్లిమెంట్ యిచ్చి వుంటారు'. మనమ్మాయి సంగతి మనకు తెలుసు. ఊ - ఆ - అంటే చాలు దీనికి తిక్క వస్తుంది - తననుకున్నది కాస్త యిటు అటు అవరాదంటుంది. తప్పు మనమ్మాయిలో వుంచుకుని అతన్నేం అనగలం - అత్తగారు మామగారు తర్జనభర్జనలు పడుతుంటారు. కూతుర్ని పిలిచి ఫోను విషయం చెపితే 'మిమ్మల్నెవరు ఫోను చెయ్యమన్నారంటూ' ఎగరవచ్చు ఆవిడగారు. చెప్పుకోనీ ఏ కారణం చెప్పుకుంటుందో! నా మొగుడికి రొమాన్స్ తెలీదు. పిల్లలు కావాలంటే కో అపరేట్ చెయ్యడం లేదు అని చెప్పుకోనీ! మొగుడ్ని బ్లేమ్ చేసేముందు తన లోపాలు యీ యిరవై రోజుల్లో తెల్సుకోనీ!
* * * * *
కురవక కురవక మబ్బులు దట్టంగా కమ్మి వర్షం కురుస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నప్పుడు మేఘాలు తేలిపోతే ఎంత నిరాశ - ఆ నిరాశ నిజం కాదు అంటూ మేఘం లేకుండానే వర్షం కురిస్తే కలిగే ఆనందం - రకరకాల టెస్టులు, ఎక్స్ రేలు, స్కానింగ్ లు చేసి డాక్టరేం అంటాడో అని బెంగపడే పేషంట్ కి ఏం జబ్బు లేదని క్లీన్ చిట్ యిస్తే కలిగే ఆనందం - ఆ రోజు మా అత్తవారింటి వాళ్ళ మొహాల్లో కనపడింది నాకు - కూతురు పంతం తెలిసి, అల్లుడు వచ్చి తీసుకెళ్ళకపోతే వెళ్ళదని తేలాక, ఏ తప్పులేని అల్లుడిని ఎలా తప్పుపట్టడం, ఎలా రమ్మనడం, కూతురు కాపురం ఎలా నిలబడుతుంది అని మధనపడుతున్న వేళ పిలవకుండానే అల్లుడింటికి వస్తే ఎంత రిలీఫ్ దొరుకుతుందో అది వాళ్ల మొహంలో కన్పించింది. కావేరి తెల్లపోయి చూసింది - డైనింగ్ టేబిల్ దగ్గరున్న అందరూ సంభ్రమంగా ఆహ్వానించారు - 'హాయ్ కావేరీ' నవ్వుతూ పలకరించా, మొహం ఈసారి నల్లబడింది. 'రా హరీష్.. రా. ఫోనన్నా చేయొచ్చు గదా - మామగారి పిలుపు - 'రా నాయనా, భోం చేద్దువుగాని' అత్తగారి పలకరింపు - 'బాగున్నావా నాయనా' మామ్మగారి ఆప్యాయత. 'ప్లజంట్ సర్ ప్రైజ్ బావగారూ'- బావమరిది పలకరింపులు అయ్యాక.... 'మంచిపని చేశావు, శని ఆదివారాలు చూసి రెండు రోజులుండేట్టు వచ్చావు సంతోషం నాయనా' అన్నారత్తగారు.
'శని ఆదివారాలేం ఖర్మ. యింక రోజూ సండేలే - జాలీ డేలే'సరదాగా అన్నా - అంతా దిమ్మెరపోయారు. 'అదేమిటి' అంతా ఒక్కసారే అన్నారు.
'జాబ్ రిజైన్ యిచ్చేశానండీ. యీ కార్పొరేట్ ఉద్యోగాలు, హైటెక్ ఉద్యోగాలు చేయదలచుకోలేదు.. ఏమిటండీ ప్రాణానికి సుఖం లేకపోయాక డబ్బేం చేసుకుంటాం - ఏ ఆనందం, సుఖం లేని యీ ఉద్యోగాలెందుకు, డబ్బు సంపాదించడం ఒక్కటే ధ్యేయంగా పెట్టుకుంటే జీవితంలో చాలా కోల్పోతున్నానని అర్థం అయి రిజైన్ ఇచ్చేశా - ఏదో నైన్ టూ ఫైవ్ ఉద్యోగం - ఏదో మామూలు కంపెనీలో చూసుకుంటాలెండి' చాలా విరక్తిగా అన్నా. అంతా మొహాలు చూసుకున్నారు. అందరి కళ్లల్లో కలవరం - కావేరి మొఖం మరింత నల్లబడింది.
'అదేమిటి హరీష్, ఏభై అరవై వేలొచ్చే ఉద్యోగం రిజైన్ యివ్వడం తెలివితక్కువ పని అని అనిపించలేదా...' ఆందోళన ఆయన గొంతులో.
"ఏమో, మంచో చెడో, తెలివితక్కువ పనో నాకు తెలియదు. సంపాదించే నాకు సుఖం లేదు, నా ఉద్యోగం వల్ల నా భార్యకానందం లేదు... ఎవరి కోసం చెయ్యాలి రాత్రి పగళ్లు కష్టపడి.. కనీసం డబ్బు యిచ్చే సుఖాల వల్ల భార్యనైనా సంతృప్తి పరచలేక పోయినపుడు ఇంకెందుకు యింత కష్టపడడం".
'అదేమిటి హరీష్ - సుఖంగా బతకడానికి కావల్సింది డబ్బు. అదే లేకపోతే యీ మాత్రం అన్నా సుఖ సంతోషాలెక్కడుంటాయి. మంచి ఉద్యోగం వదిలి, ఏదో పదివేల ఉద్యోగం చేస్తాననడం.. ఫూలిష్ నెస్' కించిత్తు కోపం, అసంతృప్తి ధ్వనించింది. కావేరి మొఖం ఊసరవిల్లిలా నిమిషానికో రంగు మారిపోతోంది.
