Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 22

   
    "యువర్ ఆనర్, ఇది అసలు జరిగిన సంగతి. తను అనుకున్నట్టు వాళ్ల దగ్గర డబ్బులు లేకపోగానే వున్న డబ్బంతా వాళ్లు వదలకపోయేసరికి కోపంతో వాళ్లని కట్టుకథ అల్లి పోలీసులకి పట్టించింది. యువర్ ఆనర్, ఈ రోజుల్లో అమ్మాయిలు తమ షోకులకి, షికార్లకి, సరదాలకి ఎక్ స్ట్రా మనీ, ఈజీ మనీ సంపాదనకు అబ్బాయిలకి ఎర వేస్తున్నారు. తల్లిదండ్రులకు ఉద్యోగాల పేరుతో దూరంగా ఉంటూ, ఇలాంటి చిల్లర పనులు చేస్తూ, డబ్బు సంపాదిస్తున్నారు."
    "అబ్జక్షన్ యువరానర్, డిఫెన్స్ లాయరు అమ్మాయిలను గురించి చాలా అవమానకరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నా క్లయింట్ మర్యాదగల మధ్యతరగతి అమ్మాయి. ఆ అమ్మాయి మొహం చూడండి, ఎంత అవమానంతో, సిగ్గుతో చితికిపోయిందో?" శృతి ఎర్రబడిన మొహంతో కళ్లు తుడుచుకోవడం చూపిస్తూ అన్నాడు. శృతి తల దించుకుంది. "నా క్లయింట్ అలాంటి అమ్మాయి అయితే, గప్ చిప్ గా వూరుకునేది గానీ, ఇలా పబ్లిక్ గా కోర్టుకెక్కి నిలబడేది కాదు. డిఫెన్స్ లాయరుగారు తమ క్లయింట్స్ ని రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది!" గట్టిగా వాదించాడు ప్రాసిక్యూటర్.
    "యువర్ ఆనర్, నా క్లయింట్స్ ఆ అమ్మాయిని బలాత్కార ప్రయత్నం చేశారనడానికి సాక్ష్యాలుంటే చూపాలి. కేవలం ఇరుగుపొరుగు ఆ అబ్బాయిలిద్దరూ గదిలో ఉండగా మాత్రం చూశారు. రాజు, వెంకట్ తమంతట తాము వెళ్లారా, ఆ అమ్మాయి పిలిస్తే వెళ్లారా? ప్రాసిక్యూటర్ గారు చెప్పినట్టు ఆ అమ్మాయి తెలివిగా ట్రాప్ చేసి తీసుకెళ్లిందా అని చెప్పడానికి ఏ సాక్ష్యమూ లేదు. అలాంటప్పుడు నా క్లయింట్స్ ని దోషులుగా ఎలా చిత్రీకరిస్తారు? కేవలం ఆ అమ్మాయి మాట మీద నేరం ఎలా నిరూపిస్తారు యువర్ ఆనర్?" నిలేశాడు డిఫెన్స్ లాయర్.
    "కోర్టు లంచ్ బ్రేక్ తరువాత విచారణ చేపడుతుంది. ఈలోగా ప్రాసిక్యూటర్ వారి తరఫున ఏమైనా సాక్ష్యాధారాలు చూపే ప్రయత్నం చేయగలరు. కోర్ట్ ఈజ్ ఎడ్జన్డ్ ." జడ్జి లంచ్ బ్రేక్ కి వెళ్లిపోయింది.
    శృతి దిగులుగా, నిస్సహాయంగా తన లాయరు వంక చూసింది. "ఏం చేద్దాం సార్? సాక్ష్యమెక్కడనుంచి తేవాలి? సాక్ష్యం చూపించకపోతే కేసు కొట్టేస్తారా?" దిగులుగా అంది.
    ఇవన్నీ అలవాటయిన ప్రాసిక్యూటర్ "చూద్దాం! జడ్జిమెంట్ కి ఇంకా టైముంది. ఆలోచిస్తా" అంటూ లంచ్ కి వెళ్ళిపోయాడు.

                                                 *  *  *

    జడ్జి ఛాంబర్ లో లంచ్ చేస్తుండగా బెదురుగా చూస్తూ లోపలికి వచ్చిన శృతిని చూసి "ఇక్కడేం చేస్తున్నావు? లోపలికి ఎలా వచ్చావు? ఏం కావాలి నీకు?" దురుసుగానే అంది.
    "మేడమ్, నేను నిజమే చెప్తున్నాను మేడమ్. ఆ రోజు వాళ్లిద్దరూ నా మీద బలప్రయోగం చేయబోయారు. అదృష్టం బాగుండి, ఆ క్షణంలో తెలివిగా వాళ్లని పక్కదారి పట్టించి తీసుకెళ్లాను. దేవుడి సాక్ష్యంగా నిజం చెప్తున్నా. నన్ను నమ్మండి" అమాయకంగా అంది.
    "నీవిలా నా దగ్గరకి వచ్చి మాట్లాడకూడదు. ఏం చెప్పాలన్నా కోర్టులో చెప్పాలి. ఇలా రావడం, నాతో మాట్లాడటం నీ కేసుకి మైనస్ పాయింట్ అవగలదు. వెంటనే వెళ్లు, అసలు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు?" కోపంగా అంది జడ్జి.
    లంచ్ తరువాత కేసు మళ్లీ మొదలయింది. ఇరువురి క్రాస్ ఎగ్జామిన్ లు, లాయర్ వాదనలు పూర్తయ్యాయి.
    "ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలు చూపలేకపోవడం వల్ల, కేవలం వారి నోటి సాక్ష్యం తప్ప, వేరే ఆధారాలు ప్రతివాదులని దోషులుగా ఈ కేసులో చూపించలేకపోయినందువల్ల, నేరం జరగలేదు, కేవలం నేర ప్రయత్నం జరిగినందువల్ల రాజు, వెంకట్ లకి కోర్టు మొదటి తప్పుగా వారికి తీవ్రమైన వార్నింగ్ గా అభ్యంతరం తెలుపుతూ, మొదటి తప్పుకి క్షమించి కోర్టు కేసు కొట్టివేయడం జరిగింది. కానీ, న్యాయస్థానం వారి చర్యని అభ్యంతరకరమైన చర్యగా పరిగణిస్తూ... వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ... ఒక జడ్జిగా న్యాయస్థానంలో కూర్చున్న ఒక స్త్రీగా ఇలాంటి యువతకి ఒక విన్నపం. మీలాగా బతుకుతెరువుకి ఇల్లు వదిలి బయటకు వచ్చే ఆడపిల్లలని వారి బతుకు బతకనీయండి. వారిని గౌరవించడం నేర్చుకోండి. వారు తలెత్తుకు ధైర్యంగా బతికే పరిస్థితులు కల్పించండి. మీరు ఆవేశంలో, అనాలోచితంగా చేసే కొన్ని దుశ్చర్యలు ఆడపిల్లల జీవితాలని నాశనం చేస్తాయి. మీ తోటి సోదరికి ఇదే జరిగితే మీరు ఎలా బాధపడతారన్నది ఒక్క నిమిషం ఆలోచిస్తే భవిష్యత్తులో ఇలాంటి పనులు చేసేముందు క్షణం ఆలోచించండి. ఇది కోర్టు తరఫున ఈనాటి యువతకి ఒక విన్నపం అనుకోండి, హెచ్చరిక అనుకోండి." జడ్జి కేసు మూసేసి లేచి నిల్చుంది. రాజు, వెంకట్ లు తలలు దించుకున్నారు. శృతి నిస్పృహగా, నిరాశగా బోను నుంచి దిగింది.

                                                 *  *  *

    "మేడమ్, నేనిలా రావడం తప్పే. నేను ఒక జడ్జిగారింటికి రాలేదు మేడమ్! మీలాంటి ఉన్నతస్థానంలో వుండి, న్యాయాన్యాయాలు విచారించే అధికారం చేతిలో ఉండి కూడా, అబద్ధాన్ని, అన్యాయాల్ని ప్రోత్సహించే తీర్పు ఇవ్వడం నిజంగా నాకు చాలా మనస్తాపం కల్గించింది. అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న స్త్రీలు సాక్ష్యాలు, ఆధారాలు ఎలా చూపిస్తారు? అందరూ చూస్తుండగా ఇలాంటి పనులు చేస్తారా ఎవరన్నా? ఆ పరిస్థితిలో సాక్ష్యం చెప్పడానికి ఎవరుంటారు? మేడమ్! ఏ ఆడపిల్లా అబద్ధంగా తనమీద అత్యాచారం జరిగిందనో, జరగబోయిందనో పోలీసు కంప్లైంట్ ఇస్తుందా? ఒక స్త్రీ అలా కంప్లైంట్ ఇచ్చిందంటే అప్పటికే అవమానం సహించి, తలెత్తుకోలేని స్థితిలో ఉండి కూడా ధైర్యంగా నిలబడిందంటే, తనలా కొందరమ్మాయిలకయినా ధైర్యం ఇచ్చి, ఇలాంటి సంఘటన జరిగినపుడు దోషులను పట్టివ్వడం మీ కర్తవ్యం అని చెప్పడానికే!"
    "చూడమ్మా శృతీ! నీ ఆవేశం, ఆవేదన నాకర్థం అయింది. నాకున్న పరిధిలో న్యాయస్థానంలో కూర్చున్నప్పుడు కొన్ని నిబంధనలు, న్యాయసూత్రాలు తప్పక పాటించాలి.సాక్ష్యాధారాలు చూపలేని కేసులకి సరియైన తీర్పు వెలువడదు. మన న్యాయదేవత కళ్లకు గంతలు కట్టుకుంది. కళ్లే కాదు చెవులు కూడా మూసుకుంది. సాక్ష్యం లేనప్పుడు ఒక స్త్రీగా నేను నిన్ను నమ్ముతాను. నీవు చెప్పింది నిజమని నాకు తెలుసు. కానీ, నా పరిధిలో న్యాయసూత్రాలు చట్రంలో నేనూ బందీనే. చూడమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన న్యాయసూత్రాలు, చట్టాలు తిరగరాస్తే తప్ప 'దుష్టశిక్షణ' జరగడం కష్టం. 'శిక్షరక్షణ' 'దుష్టశిక్షణ' అర్థాలు మారిపోయి 'దుష్టరక్షణ' జరిగిపోతోంది. మనం అందరం పోరాడాల్సింది మన చట్టాలు సవరించి న్యాయసూత్రాలు తిరగరాసి స్త్రీకి రక్షణ కల్పించే అంశాలు చేర్చాల్సి వుంటుంది. అంతవరకూ న్యాయస్థానాలని తప్పు పడితే ఫలితం వుండదు. అలాంటి మంచిరోజు రావాలని ఓ స్త్రీగా నేనూ కోరుకుంటున్నాను" శృతి భుజం తట్టి ఓదార్పుగా అంది జడ్జి జయలక్ష్మి.

                                                            ('వంశీ' రచయిత్రుల కొత్త కథలు, ప్రచురణ - ఆగస్టు 2017)

                                                *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS