"ఎక్కడికి ప్రయాణం? ప్రాక్టికల్స్ ఉంటాయిగా ? అంత సెలవు దొరికేసరికి పరుగెత్తక పొతే ఏం?" హాస్యంగా నవ్వుతూ అంది పద్మజ.
"నీ కనవసరం." సీరియస్ గా అన్నాడు వాసు.
"అత్తయ్య దగ్గరికి ఇప్పుడు నువ్వు వెళ్ళడం లేదట." బుంగమూతి పెట్టింది పద్మజ.
"మరి ఎక్కడి కనుకుంటున్నావ్?' నవ్వబోయాడు వాసు.
"అదే అడుగుతూంట."
"నా ఫ్రెండింటికి."
"ఎవరు చెప్మా-- అంత క్లోజ్ ఫ్రెండు! నీ దగ్గరి కెప్పుడూ వచ్చినట్టు లేదే?" కవ్వించింది.
"నీ కనవసరమని చెప్పాను. మరి వెళ్ళు." చిరాగ్గా అన్నాడు వాసు.
"పోనీ, అయితే మళ్ళీ ఎప్పడు వస్తావు?"
"అబ్బబ్బ! ఏమిటి, పద్మజా, ఎవ్వర్నీ నొప్పించకూడదనుకునే నన్ను రెచ్చ గోడుతున్నావు! నా ఇష్టమొచ్చినప్పుడు, సరా?" అంటూ బాగ్ చేత్తో పట్టుకుని గుమ్మం దాటాడు వాసు.
"హమ్మయ్య! పెట్టె, హోల్దాలూ-- అన్నిటితో బారిస్టరు పార్వతీశం లా బయల్దేరుతా వనుకున్నాను. ఒక్క బాగ్ మాత్రమే! ఫర్వాలేదు. నాలుగైదు రోజులే అబ్బాయి కాంపు."
టక్కున వెనుదిరిగి , ఫక్కున నవ్వాడు వాసు. గలగలా నవ్వుతూ అతని వెనకనే నడిచింది పద్మజ.
వీధి గేటు వరకూ అతని వెనక నడిచి నిలుచుని చరచరా ముందుకి పోతూన్న అతని వైపు అతను కనుమరుగయ్యే వరకూ చూసింది. అతను వెనుదిరిగి ఒక్కసారి తన వైపు చూస్తె బాగుండు ననుకుంది. చిన్నగా నవ్వాలనుకుంది. అతను పక్క రోడ్డుకి మళ్ళిపోయాడు. బరువుగా నిట్టూర్చి, నెమ్మదిగా ఒక్కో అడుగూ వేస్తూ వెనుదిరిగి ఇంట్లోకి నడిచింది పద్మజ.
"ఆ బజ్జీల ప్లేటలానే ఉంది. వాసు కిచ్చి రమ్మన్నానే , పద్మజా , పాపం తినకుండానే వెళ్ళిపోయాడు. అంత మతి మరుపా?" వాసు టిఫిన్ తినకుండా వెళ్ళినందుకు, నొచ్చుకుంటూ కూతుర్ని మందలించింది లక్ష్మీ.
చూపుడు వేలు పళ్ళతో నొక్కుకుంటూ, "మరిచి పోయనమ్మా!" అంది పద్మజ.
* * * *
బాగా చిక్కి పాలిపోయిన ప్రసాదరావు ని చూసి కలత పడ్డాడు వాసు.
"ఉత్తరంలో వ్రాయలేదే వస్తానని?' నవ్వుతూ అడిగాడు ప్రసాదరావు.
"మీరు వ్రాసే ఉత్తరాలు నమ్మి అలా వ్రాశాను.... కాని, ఒక్కసారి మిమ్మల్ని చూసి పోదామని పించి వచ్చాను.... ప్రతి ఉత్తరం లో 'నా ఆరోగ్యం బాగుంది.' అని వ్రాస్తున్నారు...నన్ను మభ్య పెట్టాలనా? ,,,,, ఏమిటి , నాన్నా, ఇలా తయారయ్యారు?" బాగ్ గోడవార పడేసి రెండు చేతులూ నడుము కాన్చి నిటారుగా నిలుచుని ప్రసాదరావు వైపు జాలి, బాధ మిళితమైన కళ్ళతో చూస్తూ అన్నాడు వాసు.
"నువ్వంత కంగారు పడవలసినంత జబ్బేమీ లేదు." నవ్వుకుంటూ తల వంచుకున్నాడు ప్రసాదరావు.
"మరొక పెద్ద డాక్టర్ని కన్ సల్టు చేస్తే?" అత్రతగా తండ్రి వైపు చూస్తూ అన్నాడు వాసు.
"అలాగాలే. ఆలోచిద్దాం. లే, పద. బట్టలు మార్చుకో. కాఫీ తెప్పిస్తాను." అన్నాడు ప్రసాదరావు.
మరొక మంచి పేరున్న డాక్టరు దగ్గర టెస్టు చేయించుకున్నాడు ప్రసాదరావు. నాలుగు రోజుల వెళ్ళిపోతూ "మీ ఆరోగ్య మిలానే ఉంటె నేను క్లాసు తెచ్చుకోలేను. నాకు మానసికంగా ఉత్సాహం, సంతోషం కావాలి. నేను హాయిగా చదువుకోవాలంటే మీరు ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి" అన్నాడు వాసు.
"నా డబ్బు ఏభై వేలు పైన ఉంది. అదంతా నా అనంతరం నీకే వ్రాశాను. చదవేందుకు కాగిపోతుంది?"
ఆ మాట చెళ్ళున చరిచినట్టయింది వాసుకి. తెల్లబోయి "నాన్నా!" అన్నాడు. అప్రయత్నంగా కళ్ళలో నీరు తిరిగాయి.
"ఎందుకలా కలవర పడిపోతావు? ....మందులు వాడలేదనా నీ అనుమానం? ఏమైనా నా గురించి విచారించవలసిన పని లేదు. "అలా అంటున్న ప్రసాదరావు వదనంలో నైరాశ్యం, కొట్టవచ్చినట్టు కనుపించింది.
కళ్ళలో తిరిగిన నీరు చెక్కుల మీంచి జారగానే గబగబా రుమాలుతో తుడిచేసుకుంటూ , "లేదు, ఫర్వాలేదు. డాక్టరు నయిమాయిపోతుందన్నారు. నిన్నా, మొన్నా మీకు గుండె పోటు రాలేదు. జాగ్రత్తగా మందు వాడండి. మీ ఓనరు.... షాపుకి రావద్దన్నాడుగా ఉదయం? అతనిచ్చే రెండు వందల జీతం కోసం ఎందుకు రాత్రీ పగలూ పని చెయ్యాలి?" అంటూన్న వాసు మాట కడ్డు వస్తూ, 'అతని దగ్గర జీతానికి పనిచెయ్యడం లేదు, బాబూ, ఇప్పుడు. జాయింటు గా వ్యాపారం.... వారాని కోసారన్నా వెళ్ళకుండా అంతా అతని మీద వదిలెయ్యడం ధర్మమా, చెప్పు?' అన్నాడు ప్రసాదరావు. 'తన తల్లి కండక్టరు గా అనుకునే వ్యక్తీ చతురత గల వ్యాపారి. ' ఒక్కసారి ప్రసాదరావు వైపు విప్పారిత నేత్రాలతో చూస్తూ, "నాకు కావలసింది మీరూ, మీ ప్రేమా. కాని కేవలం డబ్బు మనిషిగా నన్ను ఇన్ సల్టు చెయ్యకండి, నాన్నా!" అంటూ మొహం తిప్పుకున్నాడు వాసు.
"వెళతావు కాబోలు. టైమయిపోయింది. మరి, వెళ్ళు. ఆరోగ్యం జాగ్రత్తగానే చూసుకుంటాన్లే. నాకు మాత్రం నీకోసం బ్రతకాలని లేదనుకున్నావా? గోపాలాన్ని అడిగానని చెప్పు" అన్నాడు ప్రసాదరావు, ఆ మాట మార్చి వెళ్ళమని తొందర చేస్తూ.
వీధి గేటు దాటి నిలుచుని, "ఉన్నదున్నట్టూ ఉత్తరం వ్రాస్తూండండి. నేనేం ఆడపిల్లను కాను. మళ్ళీ తొందర్లోనే మరొక సారి వస్తాను" అంటూ చిన్నగా నవ్వి వెళ్ళిపోయాడు వాసు.
వెళుతున్న కొడుకు వైపు చూసిన ప్రసదారావు హృదయం ఆర్ద్రమైంది. 'వయస్సుని మించి ఎదిగి పోయిన కొడుకు, చిలిపితనం స్థానే గంబీర్యం, అల్లరి స్థానే ఆలోచన, ముందుకు వేసే ప్రతి అడుగులో భయం, సంకోచం. ఎంతగా నలిగి పోతున్నాడు! మా కడుపున పుట్టకుండా ఉంటె ఎంత బాగుండేది! వాసు మరొక చోట, మరొక తల్లిదండ్రుల కడుపున పుట్టి ఉంటె వాడి కీవితం? ప్చ్! అన్నీకావాలని, తను సమకూర్చలేనివి కోరుతూ తన కొడుకు తన నల్లరి పెడితే బాగుండును' అనుకునే ప్రసాదరావు కోర్కె ఎండమావి అయింది. 'ఆ కోర్కె తన మనమలు తీర్చాలి.
అందుకోసం తాను తప్పక జీవించాలి.' ఇటువంటి ఊహ రాగానే ప్రసాదరావు పెదవులు విచ్చుకున్నాయి. కొన్ని సంవత్సరాలు ముందుకు మనస్సు పరిగెత్తింది. 'చక్కని బంగళా, పోర్టికో లో కారూ, ఠీవిగా హుందాగా పాతికేళ్ళ వాసూ, అందమైన అతని భార్యా, బోసి నవ్వుల బాబూ.....' ఊహ పదంలో క్షణం మురిశాడు ప్రసాదరావు.
గదిలో అడుగుపెట్టిన ప్రసాదరావు నవ్వుకున్నాడు పేలవంగా. నాలుగు రోజులు కలకలలాడిన ఇల్లు బోసిపోయింది. మళ్ళీ తనూ, తన పుస్తకాలూ, ఒంటరి జీవితం ఈ గదిలో.
ఫస్ట్ ఇయర్ పరీక్షలయ్యే లోపున నాలుగు సార్లు ప్రసాదరావు ను చూసి వచ్చాడు వాసు. కొంచెం కోలుకుంటున్నట్లే కనిపించాడు ప్రసాదరావు. గోపాలం వెళ్ళి తన ఇంటికి వచ్చి కొన్నాళ్ళు రెస్టు తీసుకోమని ఆహ్వానించాడు . మృదువుగా త్రోసి పుచ్చాడు ప్రసాదరావు.
గబగబా రోజులూ, నెలలూ దొర్లాయి. పద్మజా, జయా అందంగా పల్లెవాటు వేసుకుంటున్నారు. వాసు పచ్చని అందమైన మొహం లో నూనూగు మీసం కొత్త అందాన్ని జోడించింది. బి.ఏ ధర్ది'యర్ ఫైనలు పరీక్ష లయ్యేలోపున ఒక్కసారి, ఒక్క రోజు మాత్రమే మధుమతి దగ్గర ఉన్నాడు వాసు. నాలుగు సార్లూ మొత్తం ఒక నెల రోజులు ప్రసాదరావు దగ్గర గడిపాడు వాసు.
పరీక్షలు అవుతున్నాయి. విరామం లేకుండా చదువు తున్నాడు వాసు. ఇంటర్ మీడియట్ కోర్సయి పోతుంది ఇక పద్మజ కి. వాసు గదిలోనే చదువుతుంది ప్రతి రోజూ పద్మజ మౌనంగా. మధ్య మధ్య ఆమె యేవో ప్రశ్నలు వెయ్యడం, వాసు జవాబులు అర్ధమయ్యేలా చెప్పడం పరిపాటయింది.
"పద్మజా, ఈవేళ నాకు ట్యూషను ఫీజివ్వాలి." కోమల స్వరం పోయి పురుషత్వాన్ని పుంజుకున్న వాసు గొంతు.
తుళ్లిపడి తెల్లబోయి చూసింది పదహారేళ్ళు నిండిన పద్మజ.
"ఒక కప్పు టీ." అదే గొంతు.
"ఓ! ఐదు నిమిషాలు. తెస్తాను" హుషారుగా లేచింది పద్మజ.
టీ కప్పు తీసుకుంటూ, థాంక్స్!' అని చిన్నగా నవ్వాడు వాసు ఆమె వైపు కృతజ్ఞతగా చూస్తూ.
అతన్ని చూస్తున్న ఆమె మనస్సు చలించింది చిన్నగా. క్షణం లో తేరుకుని, "ఈ మాత్రం దానికి థాంక్స్ చెప్పాలా? ఇలా ఇంతలో నీ ట్యూషను ఫీజిచ్చి నట్టవుతుందా? ఎలా ఒడ్డున పడతానో! భయంగా ఉంది" అంది పద్మజ.
"ఇప్పుడు టైమెంతో తెలుసా? పన్నెండు. ఇంత వేళప్పుడు శ్రమ పడి టీ తెచ్చావు. థాంక్స్ చెప్పొద్దామరి?" అన్నాడు వాసు వాచీ చూసుకుంటూ.
"ఈ సంవత్సరమే! ఇటు పైన నీ గదిలో చదవడానికి వీల్లెదంది అమ్మ. ప్చ్! చాదస్తం మనిషి. చూసే వాళ్ళు ఏమన్నా అని పోతారుట. ఏమన్నా నీ దగ్గర ఇంపార్టెంటు వి నేర్చుకోవచ్చనుకో.... గంటో, ఆరో, మిగతా కాలం నా గదిలోనే చదువుకోవాలట,"
"నీ గదిలో చదవడానికి వీల్లెంది అమ్మ?" ఈ మాట వాసు హృదయం లో సూటిగా గుచ్చుకుంది. అతని వదనం వివర్ణమైంది." పోనీ, అలానే చెయ్యి, నవ్వి, పద్మజా, " వ్యధిత కంఠం తో అన్నాడు వాసు. ఆమె మాములుగా చెప్పి వెళ్ళిపోయిన మాటకి అతని మనస్సు కలత బారి , అనేక కోణాల్లో ఆలోచించింది. దూరాన తోలి కోడి కూత విన్నాడు. "ప్చ్! వయసొచ్చిన ఆడపిల్ల. వారి జాగ్రత్తలు వారివి.' అని సరిపెట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు నిద్రకు ఉపక్రమిస్తూ.
* * * *
