Previous Page Next Page 
కౌసల్య పేజి 21

 

                                                         13
    "జానకీ!" అని వరండా చివర నుంచి వినిపించిన కేకకు, తన గదిలోకి వెళ్ళబోతున్న జానకి గుమ్మం లోనే ఆగి వెనక్కు తిరిగి చూసింది. పద్దెనిమిది పందొమ్మిదేళ్ళ అందమైన అమ్మాయి ఎవరో నవ్వుతూ గబగబా తనకేసి వస్తున్నది. దగ్గరగా వచ్చి, "ఏమిటి, అలా తెల్లబోయి చూస్తావు? నేనెవరో జ్ఞాపకం లేదా?' అంది ఆ అమ్మాయి. మొదట్లో కొంచెం తొట్రుపాటు పడింది జానకి. పరిశీలనగా చూసి "ఓ! నువ్వా, జ్యోతీ!" అంది.
    "ఊ! ఏమిటి? ఎప్పుడొచ్చావు? కాలేజీ లో చేరావా? హాస్టల్ ఈ బ్లాకు లో ఉంటూనే నాకు కనిపించలేదేమిటి , ఇన్నాళ్ళూ?"
    "నేనప్పుడే చేరి నెల కావస్తోంది. మొన్నటి దాకా ఆ వెనకాల బ్లాకు లో ఉన్నాను. ఇక్కడ నాలుగు గదులు ఖాళీ వస్తే మొదట చేరిన మాలో కొందరికి ఇచ్చారు."

                                        
    "అప్పుడే కాలేజీ లో చేరడం, సీనియారిటీ స్థాపించుకోవడం కూడా అయిందన్న మాట!"
    జానకి నవ్వింది.
    "సరే, బాగానే ఉంది. నా రూమ్ నెంబరు రెండు. నీ రూమ్ నెంబరు ఇరవై . దా. అలా నా గదికి పోదాము."
    "పోదాం లే. ఎలాగా మా గదికి వచ్చావుగా? కాసేపు కూర్చుని మరీ వెళ్ళుదాము."
    ఇద్దరూ జానకి గదిలోకి వెళ్ళారు. జానకి రూమ్ మేటు గదిలో మూల ఓ కుర్చీలో కూర్చుని ఏదో చదువు కొంటున్నది. ఆమెకు జ్యోతి ని పరిచయం చేసింది జానకి. "ఈమె నా స్నేహితురాలు జ్యోతి. మన కాలేజీ లో ...." అంటూ అర్దోక్తి లో ఆగిపోయింది.
    "బి.ఎస్ సి చదువుతున్నా . సైన్సు గ్రూపు " అని పూర్తీ చేసింది జ్యోతి. కొంతసేపటి కి జ్యోతీ, జానకీ కబుర్ల లో పడ్డారు. లోకాభిరామాయణం, కాలేజీ కబుర్లు, ఉపాధ్యాయుల మంచి చెడ్డలు అన్నీ ఒకటొక్కటి గా దొర్లి పోతున్నాయి. జానకి రూమ్ మేటు పుస్తకం తీసుకుని లేచింది, కొంచెం ఇబ్బంది పడుతున్నట్లుగా.
    "మీ చదువు కి అంతరాయం కలిగించాము. క్షమించండి." అంది జానకి నొచ్చుకుంటూ.
    "లేదు, లేదు. మీరు మాట్లాడుకోండి. నేనలా రీడింగు రూమ్ కి వెళ్ళి వస్తా" అంటూ వెళ్ళిపోయింది ఆమె.
    "ఏమిటి మహా చదివేస్తోంది , అప్పుడే? ఇంకా ఆగస్టు నెల అయినా వెళ్ళలేదు" అంది జ్యోతి.
    "ఆ! అదేమీ అంత ముఖ్యమైన పుస్తకం కాదులే. ఏదో డిటెక్టివ్ నవల."
    "ఓష్! ఆ మాత్రానికే ఏకాంతమూ, ఏకాగ్రతా కావాలా? అరె! నాకు ముందుగా తెలియలేదే? లేకపోతే చెబుదును -- ఏమండోయ్ ! డిటెక్టివ్ నవలలు పదిమంది మధ్యన కూచునే చదువుకోవాలి . ఒక్కళ్ళూ ఉంటె ఝడుసు కుంటారు అని."
    జానకి నవ్వింది. జ్యోతి కూడా శృతి కలిపింది. కొన్ని క్షణాలు గడిచాక , "ఆ! అన్నట్టు మీ మాంయ్యా ఇప్పుడెక్కడున్నారు? మీ ఊళ్ళో నేనా?' అంది జ్యోతి.
    "ఏ మామయ్య?"
    "అదే. ఆరోజున పెద్దాపురం లో మా యింటికి వచ్చారు కదూ? అయన మాటే. ఆ పెళ్ళికొడుకు మామయ్య."
    "అతనా? మా చిన్న మామయ్య. పోలీసు ఇన్ పెక్టర్ ఉద్యోగానికి సెలెక్టు అయ్యాడు. ప్రస్తుతం అనంతపురం లో ట్రెయినింగ్ అవుతున్నాడు."
    ఎంతో ఆసక్తి తో వింటున్నది జ్యోతి.
    "మా పెద్ద మామయ్యా, అమ్మా పుల్లేటి కుర్రు లోనే ఉన్నారు. అసలు ఇవాళో, రేపో మా పెద్ద మామయ్యా రావాలి."
    "అయన పేరేమిటి?"
    "ముకుందం. మా చిన్న మామయ్య పేరు తెలుసుగా?"
    "ఆ" అంది జ్యోతి మందహాసం చేస్తూ. సిగ్గు బరువుతో కనురెప్పలు వాలిపోయాయి. చెంపలు కెంపులే అయ్యాయి.
    ఆలమూరు లో ఉన్న పుస్తకాలు అందంగా సర్దుకొని నేల మీద అక్కడక్కడ పడి ఉన్న చిత్తూ కాగితం ముక్కలు ఏరి అవతల పడేస్తూ "అమ్మయ్య! నిన్ను చూశాక నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. నెలనాళ్ళనుంచి ఈ అపరిచిత వాతావరణం లో ఎలాగా కాలక్షేపం చెయ్యడం? అని తెగ మధన పడుతున్నా" అంది జానకి.
    "నీకేం ఫరవాలేదు. నీకు వినే ఓపికా అంటూ ఉండాలే కాని, గంటల కొలది కబుర్లు చెబుతాను నేను. నీకు కాలేజీ లో కాని, హాస్టల్ లో కాని ఏ ఇబ్బంది వచ్చినా నాతొ చెప్పు. మనకి ఇక్కడ అంతా కొట్టిన పిండే."
    "ఉహూ! సరే, అయితే."
    మర్నాటి నుంచి జ్యోతి జానకిని తనతో కూడా తిప్పసాగింది. పొద్దున్న కాలేజీ కి వెళ్ళేటప్పుడూ, సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడూ జ్యోతి జానకిని పిలిస్తూనే ఉంది. భోజనాల కు ఇద్దరూ కలిసే వెళ్ళడం. వార్డెన్ పెర్మిషన్ తీసుకుని ఏ సినిమాకు వెళ్ళినా, బజారు కు వెళ్ళినా ఇద్దరూ వెళ్ళడం చూసి హాస్టల్ లో తక్కిన వాళ్ళు అందరూ వాళ్ళు ఇద్దరూ బాగాదగ్గర చుట్టాలు కాబోలు అనుకునేవారు. వాళ్ళిద్దరి మధ్యా స్నేహం ఇలా బలీయమై, రాను, రాను ఒకళ్ళ ను వదిలి ఇంకొకళ్ళు ఉండలేని స్థితి ఏర్పడింది. జ్యోతి లాంటి చురుకైన లోకానుభావం స్నేహితురాలు దొరకడం తన అదృష్టం అనుకుంది జానకి. జానకి లాంటి ముగ్ధతో తనకు పరిచయం కలగడం, పదహారేళ్ళు నిండినా, పదేళ్ళు కూడా లేనట్లు పసి హృదయంతో తన పెద్దరికాన్ని గౌరవిస్తూ తన రక్షణ లో ఉన్నట్లు జానకి మసలు కోవడం జ్యోతికి ఎంతో హాయిగా ఉంది.
    కాని వాళ్ళిద్దరి మధ్యా కొన్ని అభిప్రాయ భేదాలు అప్పుడప్పుడు వస్తూ ఉండేవి. జ్యోతి మగపిల్లలతో కూడా చాలా చనువుగా మాట్లాడుతూ ఉండేది. అలా మాట్లాడటం జానకి పక్కన ఉండగా ఎప్పుడేనా తటస్థిస్తే, జానకి కి చాలా ఇబ్బందిగా ఉండేది. దానికి తోడూ జ్యోతి ఆమెను వాళ్ళకు పరిచయం చేసేది, అప్పుడప్పుడు. అది జానకికి సరిపడేది కాదు. "వీళ్ళందరికీ నన్ను పరిచయం చేస్తుంది, ఎందుకు?......మతి లేకపోతె సరి!౨' అని విసుక్కొనేది.
    బజారు వెళ్ళినప్పుడు జానకి ప్రవర్తించే విధానం జ్యోతికి నచ్చేది కాదు. ఏ చీర ఎన్నిక చేస్తున్నా, ఏ ముచ్చటయినా వస్తువు కొంటున్నా తన కేమీ సంబంధం లేనట్టు ముభావంగా నిలబడేది జానకి. అక్కడికి జ్యోతి "ఇది బాగుందా? కొనమంటావా?" అని గుచ్చి గుచ్చి అడిగితె, అతి ప్రయత్నం మీద సమాధానం చెప్పేది. అదయినా అంటీ ముట్టనట్లే -- "నీకు నచ్చితే కొను. కట్టుకొనేదానివి నువ్వు కదా?" అని. దానితో జ్యోతి కి చిరాకు వేసేది. ఈ మాత్రానికి తనను తీసుకు రావడం ఎందుకు? సరదాగా తనతో సజకరించి సలహా లిస్తుందనే కదా? ఎప్పుడైనా ముచ్చట పడి "ఇదే రకం చీర ఈ రంగులో నువ్వు కూడా ఒకటి కొనుక్కో. ఇద్దరం ఒకే రోజున కట్టుకుని ఎంచక్కా కాలేజీ కి వెళదాము" అంటే "ఊహు! ఇప్పుడు నాకెందుకు పోనిద్దూ అంటూ తన సరదా నంతా నీళ్ళు కార్చేసేది.
    ఇలా అప్పుడప్పుడు వాళ్ళ ఇద్దరి ప్రకృతులూ విభిన్నమై బేధాభిప్రాయాలు వచ్చినా, తక్కిన ఎన్నో సంగతుల్లో వాళ్ళ ఇద్దరి స్వభావం ఒకటే కనక, సర్దుకు పోతూ ఒకళ్ళ కొకళ్ళు మరీ సన్నిహితులయ్యారు."
    కబురు పంపితే ఓ రోజున వార్డెన్ గదికి వెళ్ళింది జానకి. తీరా అక్కడ చూస్తె కుర్చీలో ముకుందం కనిపించాడు. "మీ మామయ్యగారట కదూ, వీరు?' అన్న వార్డెన్  ప్రశ్నకు అవునని తల ఊపింది జానకి. "నీ కోసం వచ్చారు. అలా కూర్చో. మాట్లాడుతూ ఉండు. నేనో గంటలో వస్తాను." అంటూ వెళ్ళిపోయిన వార్డెన్ వైపే గుడ్లప్పగించి చూస్తున్న ముకుందం తో "అమ్మ కులాసాగా ఉందా? నువ్వు ఎప్పుడొచ్చావు" అంటూ సంభాషణ ప్రారంభించింది జానకి. ముకుందం చెబుతూనే ఉన్నాడు. ఇంతట్లో నే "ఉండు మామయ్యా! నాకోసం ఓ స్నేహితురాలు గదికి వచ్చి కాచుకుని ఉంటుంది . ఇప్పుడే వచ్చేస్తా. ఒక్క నిమిషం" అంటూ వెళ్ళిపోయి, తిరిగి రెండు నిమిషాల్లో జ్యోతి ని వెంట బెట్టుకుని వచ్చింది జానకి.
    "ఈమె నా స్నేహితురాలు జ్యోతి. వీళ్ళ ఊరు ...." అని చెప్పబోతున్న జానకి ని మధ్యలోనే ఆపి, "అవన్నీ అనవసరం. వాళ్ళ ఊరు ఏదైతే ఎందుకు? ఆమె నీ స్నేహితురాలు ; పేరు జ్యోతి. అంతే. అంతకు మించి మనకి వివరాలవసరం లేదు" అన్నాడు ముకుందం నవ్వుతూ. అతని వాలకం , మాటలు వింతగా తోచాయి జ్యోతికి. దాదాపు ముప్పై పై మాట అతని వయస్సు. పంచె, లాల్చీ కళ్ళకు చలవ జోడు. వేష భాషలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తీ లాగే కనిపించాడు.
    జానకి తిరిగి ప్రారంభించింది . "ఇతను మా పెద్ద మామయ్య. " అంటుండగానే "ఉండు నన్ను నేనే పరిచయం చేసుకొనీ" అన్నాడు ముకుందం. కొత్తగా, వింతగా ఉన్న అతని ప్రవర్తన జ్యోతి కి కుతూహలం కలిగిస్తున్నది.  
    "నా పేరు ముకుందం. నేను జానకి మామయ్య ని. స్కూలు ఫైనలు అనే అడ్డంకి దాటలేక ప్రస్తుతం....."
    "వ్యవసాయం చేయిస్తున్నాడు మా ఊళ్ళో" అంటూ పూర్తీ చేసింది జానకి నవ్వుతూ.
    "సత్కవుల్ హాలికు లైన నేమి? అన్నాడు మా కవి కులాలం కారుడు పోతన్న."
    "అయితే మీది కవికులం అన్నమాట!" అంది జ్యోతి నవ్వుతూ.
    "ఆ! అప్పుడప్పుడు పద్యాలూ, కధలూ వ్రాస్తుంటాడులే , మా మామయ్య" అంది జానకి. గర్వంగా ముఖం పెట్టి లాల్చీ గుండీలు సర్దుకున్నాడు ముకుందం.
    జ్యోతికి అతనితో సరదాగా కబుర్లు చెప్పాలనిపించింది.
    "అయితే మీరీ ఊళ్ళో ఎక్కడ బస చేశారు?"
    "బస కేముంది? ఇవాళ పొద్దుటే వచ్చాను. తిరిగి రేపు పొద్దున్న వెళ్ళి పోతున్నాను. ఈలోగా బస మకాం ఎందుకు?"
    "ఆహా! అది కాదు. మా లేడీస్ హాస్టల్ లో మిమ్మల్ని గెస్టు గా కూడా ఉండ నియ్యరు కదా? మీ సంచీ గట్రా ఎక్కడ పెట్టుకున్నారని?"
    "ఓ! అదా? అందాకా ఈ ఊళ్ళో ఓ సాహితీ ప్రియం భావుకుడుంటే అతని ఇంట్లో పెట్టాను."
    "అయితే కవులు కవి మిత్రుల ఇంట్లో మకాం అన్నమాట!" అంది జ్యోతి.
    "అన్నమాటే" అన్నాడు ముకుందం ప్రతి అక్షరాన్ని ఒత్తి పలుకుతూ.
    "నాకెందుకో గాని, కవులని చూస్తె విపరీతమైన జాలి" అంది కొంటెగా చూస్తూ జ్యోతి.
    "జాలా? ఎందుకు?" వెటకారంగా ప్రశ్నించాడు ముకుందం. జ్యోతి ఏదో చెప్పబోయింది. అప్పటివరకూ వాళ్ళ సంభాషణ లో అంతగా జోక్యం చేసుకోకుండా కూర్చున్న జానకి హటాత్తుగా నిలబడి "అరుగో మన వార్డెన్ వస్తున్నారు" అంది. దానితో జ్యోతి కూడా లేచి "సెలవు. పునర్దర్శనం ?' అంది.
    "ఇవాళ సాయంత్రం ఓ గంట గాంధీ నగరం పార్కు లో కూర్చుని అక్కడ నుంచి సినిమాకి వెళ్ళాలని ఆలోచన. జానకీ, పోనీ, మీ వార్డెన్ పెర్మిషన్ తీసుకొని నువ్వూ, నీ స్నేహితురాలూ సాయంత్రం అలా పార్కు కేసి రాకూడదు?' అన్నాడు.
    "అలాగే. వీలయితే వస్తాము." అంది జానకి. తెచ్చిన డబ్బు జానకికి ఇచ్చి, వార్డెన్ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ముకుందం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS