రెండోవైపు
'నీకు ప్రేమించడం రాదు, ఫో' అని ఛీ కొట్టింది కావేరి. అంతటితో వూరుకోకుండా 'నీకసలు రోమాన్స్ స్పెల్లింగే తెలీదంది. శృంగారం అంటే అర్థమే తెలియదని మరో దెబ్బ కొట్టింది. అంతటితో ఆగిందా నీవసలు మగాడివేనా అన్న అనుమానం వస్తూంది అంటూ మహా వ్యంగ్యాస్త్రం వదిలి కసిగా చూసింది. మగాడ్నో కాదో ఆవిడకి తెలియదేమిటి. పెళ్ళి కాక ముందూ తెలుసు - పెళ్లయిన ఈ ఆర్నెలల్లోనూ తెలియదేమిటి? అలాంటి అర్థం పర్థం లేని వాగుళ్లకి జవాబిచ్చే ఓపిక నాకు లేదు. నిమ్మకి నీరెత్తినట్టు అంత మాటన్నా రియాక్టవని మొగుడ్ని ఏం చెయ్యలేక ఉక్రోషంగా - 'ఓ సరదా, సరసం తెలీని మొగుడితో కాపురం చెయ్యాల్సిన ఖర్మ నాకేం లేదు' అంటూ రెండో బెడ్ రూము తలుపు భళ్లున తెరిచి, ఢాం అని మూసింది - యీ సీనేం మొదటిసారి కాదు యింట్లో!
దొరికిందే ఛాన్సు హాయిగా నిద్రపోవచ్చు అనుకుని లైటార్పి పక్కమీద వాలానో లేదో నిద్ర ముంచుకు వచ్చింది. ఆవిడ అలక తీర్చే ఓపిక నాకు లేదు. పొద్దుట చూడొచ్చు ఆవిడ గారి సంగతి!
ఉదయం ఎనిమిదింటికి యింట్లోంచి వెళ్లిన మొగుడు రాత్రి ఏ తొమ్మిదో, తొమ్మిదిన్నరకో కొంప చేరిన వాడికి; రోజంతా ప్రాజెక్ట్ పని, మీటింగులు, డిస్కషన్స్ - కంప్యూటర్లతో కుస్తీలు పట్టి, గంటన్నర సేపు ట్రాఫిక్ లో పడి ఇల్లు చేరినవాడికి, రోజంతా మట్టి తట్టలు మోసిన వాడికంటే కూడా అలసిపోతాడని తెలీదా! మట్టితట్టలు మోసిన వాడికి శారీరక శ్రమే. తనలాంటి ఎగ్జిక్యూటివ్స్ కి ఫిజికల్ స్ట్రెయిన్ తో పాటు మెంటల్ స్ట్రెయిన్ తోడయి మనిషి రోజు పని పూర్తయ్యే సరికి ఏ రోజుకి ఆరోజు చెరుకు పిప్పిలా, రసం తీసేసిన మామిడి పండులా మిగులుతాడని ఈ పెళ్లాలకి తెలీదా. పోనీ ఏ చదువు సంధ్యా లేని ఉద్యోగానుభవం లేని గృహిణులుగా మాత్రం వున్నవారికి తెలియకపోవచ్చు. కాని ఈవిడ గారికి తెలియదా! ఏమన్నా అంటే, పెళ్లయ్యేంత వరకు చుట్టూ తిరుగుతారు, అప్పుడెక్కడ నుంచి దొరికిందో టైము - అప్పుడు చెట్ల చాటున కారుల్లో అవకాశం కోసం అర్రులు చాచే రొమాన్స్ యిప్పుడేం అయిందో! అంతే, పెళ్లాంకాగానే ప్రేయసి కనిపించదు పెళ్లాంలో అని దెప్పడం - అలిసిన శరీరం విశ్రాంతి కోరుతుంది - రొమాన్స్, శృంగారం ఏమిటి నా బొంద. ఎప్పుడు పక్కమీద వాలుదామా అనిపిస్తుంది తప్ప - ఇవేం ఇదివరకటి రోజులా! గవర్నమెంటు ఉద్యోగాలా పదింటికెళ్లి ఐదు గంటలకి కొంప చేరడానికీ, సావకాశంగా పడక కుర్చీలో చేరబడి భార్యామణి గారందించిన పకోడీల ప్లేటు అందుకొని తింటూ కబుర్లు చెప్పి ఆనక సినిమాకో, షికారుకో తిరగడానికి. శని ఆదివారాలొస్తే సినిమాలకి, స్నేహితుల ఇళ్ళకి తిరగడానికి ఇప్పుడు టైమేది. నెలలో రెండు వారాలు పై వూర్లు తిరగాలి - ఏ ఆదివారమో అనుకోని పని వచ్చి పడ్తుంది. ఇప్పుడీ ప్రైవేటు కంపెనీల కంప్యూటరు ఉద్యోగాలకి టైము ఏమీ వుండదు - రిజల్ట్ ఓరియంటెడ్ జాబ్స్ - నీవెంత కష్టపడ్డావో ఎవడికీ అక్కరలేదు - ఏం చేశావో రిజల్ట్ చూపించాలి - ఆర్డర్లు కావాలి, లాభాలు చూపాలి, టార్గెట్ అందుకోవాలి. యిచ్చిన జీతాలకి పని పిండుకుంటారు. వాళ్ళేం వెర్రివాళ్ళా? ఇలా పాసయి వచ్చిన వాళ్లకి ఏభై వేలు జీతాలివ్వడానికి? జీతాలు, ఫోను, కారు - ప్లాయిట్ టిక్కెట్లు యివన్నీ వూరికే కూచోపెట్టి యివ్వరు అన్నది చదువుకున్న కావేరి లాంటి వాళ్లకీ తెలీదా! ఆదివారం వస్తే ఇల్లు కదలాలనిపించదు. కమ్మగా తిని కంటి నిండా నిద్రపోవాలని యింకా టైముంటే పర్సనల్ పనులు చూసుకోడానికే సరిపోతుంది - పిల్లలుంటే సరే సరి!
ఆవిడ గారికి ఫ్యామిలీ స్టార్ట్ చెయ్యాలనిపించడం బాగానే వుంది - ముప్పై ఏళ్లు వచ్చాయి ఇంకెప్పుడు కంటాం అంది. అదీ బాగానే వుంది. కాని పిల్లలు కావాలనగానే స్విచ్ నొక్కి రైస్ కుక్కరు పెడితే అన్నం తయారయినట్టు టి.వి. ఆన్ చేయగానే ప్రోగ్రాం వచ్చినట్టు పిల్లలు పుట్టుకు రారు గదా! లేడికి లేచిందే పరుగన్నట్టు ఆవిడ కావాలనుకున్న మరుక్షణం ఆ నెలే తప్పాలంటే ఎలా! ఉద్యోగం బోరు కొట్టింది చేసి చేసి, కొన్నాళ్లు మానేస్తాను అంటే పాతిక వేల ఉద్యోగం వదిలేస్తానన్నా 'ఇటీజ్ అప్ టూ యూ అనలేదూ, తనేమన్నా అన్నాడా!
ఈ ఆడవాళ్లు ఎంతసేపు మగాడి తప్పుల్నే గ్లోరిఫై చేస్తారు. ఈ రచయితలెంతసేపూ ఆడవాళ్ల ప్రాబ్లమ్స్ మీదే రాస్తారు. మగాడికి సమస్యలే లేవనుకుంటారు కాబోలు! కష్టాలన్నీ ఆడవాళ్లకె అనుకుంటారు - ఆడవాళ్ల దృక్పథంతోనే చూస్తారు తప్ప మగవాడి పాయింట్ ఆఫ్ వ్యూతో చూడరు.
పెళ్లికాక ముందు అమ్మాయిలని ఆకర్షించడానికి పడే పాట్లు పెళ్లయి పెళ్లాం అయినా పడాలంటే ఎలా! ఇదేం సినిమానా, డ్యూయట్లు పాడుకుంటూ చెట్లు చుట్టూ పరిగెడ్తూ ఓ సీనులో స్విట్జర్లాండ్, ఇంకో సీను కోనసీమలనూ చిత్రించడానికి - నిజమే - డేటింగ్ టైములో కావేరి కోసం ఆమెతో స్నేహం కోసం అర్రులు చాచాడు - ఇంప్రెస్ చేయడానికి హోటళ్ళకి, సినిమాలకి, పార్కులకి తిప్పాడు - ఇప్పుడూ అలా అంటే ఎలా? ఉద్యోగం సద్యోగం మానేసి రోజంతా ఆవిడ చుట్టూ కొంగు పట్టుకు ఎలా తిరుగుతాడు - అప్పుడెలా టైము దొరికిందీ అంటే.. ఏదో మోజులో, ఆకర్షణలో నానా గడ్డి కరిచి టైము సర్దుబాటు చేసుకుంటారు అబ్బాయిలు - అమ్మాయితో గడిపిన టైము ఓవర్ టైము చేసి పని పూర్తి చేసో, ఏ ఫ్రెండు కాళ్ళో, గడ్డమో పట్టుకు పని చేయించడం - చేయకపోతే బాస్ చేత చివాట్లు తినడానికేనా సిద్ధపడతారు. బ్యాచిలర్ గా ప్రవర్తించినట్టు పెళ్లయ్యాక బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ఉద్యోగం ఊడితే భార్య, సంసార బాధ్యతలున్నాయన్న భయం వుండదూ! ఇవన్నీ ఆడవాళ్ల కర్థం కావు - ఎంతసేపు తననే తప్పు పడ్తుంది - ఏం తను మాత్రం తనని ఆకర్షించడానికి, ఇంప్రెస్ చెయ్యడానికి ఎంత తాపత్రయ పడేది - ఎంత చక్కగా రోజుకో రకంగా అలంకరించుకునేది - ఎంత మంచి డ్రస్సులు వేసి, తనకి చీర ఇష్టమని చీరలు కట్టి, శ్రద్ధగా మొహం దిద్దుకుని, లిప్ స్టిక్ వేసుకుని, రోజుకో రకం పెర్ ఫ్యూం చల్లుకునేది. మరిప్పుడూ అలా వుందా తను - బురఖా లాంటి నైట్ గౌను తగిలించుకుని, పొద్దుటంతా క్రీములు మొహానికి పట్టించి, జుత్తు రబ్బర్ బ్యాండ్ ముడేసి కూర్చుంటుంది - బైటికి వెడితేనే ముస్తాబు ! మొగుడు మొహానికి చాల్లే అనుకుంటారు గాబోలు పెళ్ళాలు - పుట్టిన రోజంటే అర్థరాత్రి పన్నెండుకి విష్ చేసి, తెల్లారి బొకేతో గుమ్మం ముందు నిలబడి, స్వీట్ తినిపించి, లంచ్, డిన్నర్లు ఇచ్చి మంచి కుర్తా, పైజమా కుట్టిపించి.. యిప్పుడవన్నీ చేస్తుందా తను మాత్రం! శ్రద్ధగా తనకిష్టమైనవి వండించి తెచ్చి తినిపించేది - యిప్పుడో, పొద్దుటే ఆ కుక్కర్లో పప్పు, కూర ఏదో వండాననిపించి డైనింగ్ టేబిల్ మీద పడేస్తుంది - రావడం ఓ గంట ఆలస్యమైతే తను తినేసి టి.వి. చూస్తూ కూర్చుంటుంది. వచ్చాక కాస్త వేడి చేసన్నా పెడ్తుంది! పెట్టుకు తింటాడులే అన్న నిర్లక్ష్యానికి తను బాధపడుతున్నాడా! యీ రోజుల్లో ఆడవాళ్లకి కుక్కర్లు, గ్రైండర్లు, ఓవెన్ లు వచ్చి వంట అరగంటలో చేసి పడేసి ఏదో కష్టపడుతున్నట్టు ఫోజులు! వాషింగ్ మెషీన్ లో బట్టలు వేయడం కూడా చాకిరీలా ఫీలిపోతున్నారు. ఉద్యోగం చేస్తే సరే, వుత్తినే యింట్లో వుండి కూడా మొగుడు అల్సిపోయి వచ్చాడు కాస్త దగ్గర కూర్చుని అన్నం పెడదామనుకుంటుందా! మార్పు తనలో లేదా! మొగుళ్లనే తప్పుపట్టడం ఫ్యాషనయింది ఆడవాళ్లకి.
