తిరుపతి కొండల సీను. నాయకీ నాయకులు పిల్లల్ని పిలుస్తున్నారు. చిన్నగా దగ్గి తన సీట్లో కూర్చున్నాడు ప్రసాదరావు.
మరునాటి ఉదయం వరకూ ఇద్దరిం మధ్యా చాలా ముభావంగా రెండు మూడు మాటలతో మాత్రమే కాలం దొర్లిపోయింది.
ఈసారి ప్రసాదరావు దగ్గిర మరి కాస్త చనువు వచ్చింది వాసుకి. మొహమాటం , సిగ్గూ పోయి, అమ్మమ్మా, పెద్ద మామయ్యా, జయా అని ఒక్కొక్కరి పేరూ చెపుతూ ఎన్నో సంగతులు చెప్పాడు. రాజశేఖరం తొందరపాటూ, ఇంకా ఎన్నోన్నో మాటలు చెప్పి ప్రసాదరావు ని నవ్వించాడు. మధ్యమధ్య ప్రశ్నలు వేస్తున్నాడు ప్రసాదరావు కుతూహలంగా.
వాసు వెళ్ళిపోయే రోజు ప్రసాదరావు లో దిగులు కొట్టవచ్చినట్టు కనిపించింది. "మళ్ళీ ఎప్పుడువస్తావు?" ప్రశ్నించాడు బట్టలు సర్దుకుంటున్న వాసుని.
"ఇంకా నేను ఇంట్లోంచి వెళ్ళలేదు. చాలా రోజులు ఉన్నాను ఈసారి మీ దగ్గిర. మళ్ళీ ఎప్పుడు వస్తావు? అంటున్నారు. అడుగడుగునా ఒక్కసారి రా చూడాలని ఉంది అని వ్రాస్తుంది అమ్మ. "నే నేలా చదవాలి, నాన్నా?" అమ్మ ఉత్తరాలు చదివి మామయ్య ఏమన్నాడో తెలుసా?....తరచు వెళ్ళవద్దని. కొన్ని రోజులు పూర్తిగా మానేస్తే చూడాలనే తపన దానంత టదే తగ్గుతుందట."
"అలా తగ్గేది కాదు నా తపన. నువ్వు వచ్చి తీరవలసిందే!"అదోలా నవ్వుతూ అన్నాడు ప్రసాదరావు.
"అల్లాగే.... ఇక్కడికి వస్తే ప్రశాంతంగానే ఉంటుంది. ఆ బుక్సే వో ఇక్కడికే తెచ్చుకుంటాను. అమ్మ దగ్గరికి ఆ ఊరెళ్ళానంటే ఒకటే గొడవ.... ఈసారి తొందరగానే వస్తాను....కాని, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, నాన్నా!" ఆ గొంతులో అర్దింపు.
"నా ఆరోగ్యనికేం? బాగానే ఉందే!"
"ఏమిటి బాగుంది? తెల్లవార్లూ దగ్గుతున్నారు. నే వినలేదనుకున్నారా?"
తన ఆరోగ్యం గురించి హెచ్చరిస్తున్న కొడుకు.... నిండుగా తృప్తిగా వాసు వైపు చూశాడు ప్రసాదరావు. "ఇవిగో , టాబ్ లేట్సి లానే ఉన్నాయే! వాడలేదెం? ప్చ్.... మీకు దగ్గరుండి ఎవరు చెపుతారు? నాన్నా! ఈవేళ నేను పోతున్నాను. ఈ దగ్గిలా ఎక్కువవుతుంది. ఒంటరిగా గదిలో పడుకుని దగ్గుతో చుట్టుకుపోతారు....మంచినీళ్ళు ఇచ్చే దిక్కన్నా లేదు....మీతో డాక్టరు చెప్పిన ప్రతి మాటా నాకు అర్ధమైంది.... మీరు సరిగా మందు వాడితే కాని లాభం లేదని...." ఆ గొంతులో సున్నితమైన బాధ, విసుగు.
అలా తనను నిలదీసి హెచ్చరిస్తూ, మందలిస్తున్న వాసు వైపు విప్పారిత నేత్రాలతో "ఈ మాట లంటూన్నది ఇతనేనా?' అనే ఆశ్చర్యంతో చూసి, "డాక్టరేం చెప్పారు, వాసూ?" అన్నాడు చిన్నగా నవ్వుతూ ప్రసాదరావు.
"మీకు జ్వరం వచ్చిన రోజు లక్ష్యం లేకుండా షాపుకి వెళ్ళారు. మీ కూడా నేనూ వచ్చాను, గుర్తుంది కదూ?".... మీ ఓనరు ఫేమిలీ డాక్టరు మిమ్మల్ని టెస్టు చేసి, అశ్రద్ధ చేస్తే టి.బి. రావచ్చు ఆనలే?" అన్నాడు వాసు.
"నేను అశ్రద్ధ చేస్తానని అలా బెదిరించా డంతే. మరేం దిగులుపడకు. నాకేం ఫర్వాలేదు." తేలిగ్గా నవ్వేశాడు ప్రసాదరావు.
అన్నీ సర్దుకుని వాచీ చూసి, "టైమయింది నాన్నా! నే వెళతాను." అన్నాడు వాసు.
"బీరువా లో పాకేట్టుంది. అది కూడా హోల్దాల్లో పెట్టు." అంటూ తను బాత్ రూమ్ వైపు నడిచాడు ప్రసాదరావు.
పాకెట్ విప్పి చూసిన వాసు, చిన్న అట్ట పెట్టె చూశాడందులో. ఆ పెట్టెలో నీలం రాయి పొదిగిన బంగారు ఉంగరం. అతని మనస్సార్ధ్రమైంది. గబగబా వెలికి తొడిగి , "బాగుంది , నాన్నా, చూడండి." అన్నాడు టవలుతో మొహం తుడుచుకుంటూ వచ్చిన ప్రసాదరావు కి చెయ్యి చూపిస్తూ!
వాసు చెయ్యి ఒకసారి పట్టుకు చూసి, "ఇదెందుకు?' అన్న ప్రశ్న రానందుకు సంతోషంగా, "ఇదే బాగుంది . లూజు కాలేదు కదూ? మొదట ఎర్ర రాయి రింగు తీశాను. కాని ఇది బాగున్న ట్టనిపించింది." అన్నాడు ప్రసాదరావు.
కదలబోతున్న రైలు పెట్టెలో తనవైపే చూస్తున్న వాసుని -- "జాగ్రత్త. వెళ్ళగానే లెటరు వ్రాయి. డబ్బింకా అవసరమైతే వ్రాయి, సెలవు దొరికితే ఒకసారి వచ్చి వెళ్ళు. ఒకరోజు ప్రయాణమేగా ?" అని ప్రసాదరావు గబగబా చెబుతున్నా మాటలకి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి.
"మరి వెళ్ళండి మీరు....అశ్రద్ధ చెయ్యక ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి." పరుగుతీస్తున్న రైలు పెట్టెలోంచి రుమాలు ఊపాడు వాసు. నిశ్చేతనంగా ఆటే చూస్తూ నిలుచున్నాడు ప్రసాదరావు.
* * * *
"అమ్మాయ్, వాసు ఉత్తరం వ్రాశాడా?" అడిగింది జానికమ్మ. "తమ్ముడు వ్రాశాడమ్మా, వాసు బి.ఎ. లో చేరతాడని. చూడు, అన్ని కబుర్లు చెప్పాడు. మనం వచ్చేశాక ఒక్క ఉత్తరం వ్రాశాడూ? చూడమ్మా, వాసు కేలాగన్నా గోపీ దగ్గరికి వెళ్ళాక నిబ్బరం వచ్చేసింది." అని ఫిర్యాదు చేసింది మధుమతి.
"పోనీలేవే, కుర్ర నాగన్న. డబ్బు గోపీ పెడుతున్నాడు కదూ?' కొంచెం బెరుగ్గా కూతురు వైపు చూస్తూ అంది జానికమ్మ.
"అయి ఉంటుంది.... స్కాలర్ షిప్ ఇస్తున్నారనుకో. డబ్బు సంగతి ఎత్తేసరికి మామా అల్లుడూ కూడా ఆ మాట దాటేస్తున్నారు.....రాజు ఉడికిపోతున్నాడెందుకనో.... తాను చెప్పించలేనన్నాడు. వాడికి దయ కలిగింది, చదివిస్తున్నాడు. 'గోపీ ఊరకనే నీ కొడుకుని చదివించడం లేదు. ఏదో ఎత్తేశాడు' అంటున్నాడు. నాకు ఒళ్ళు మండింది. వాడేసిన ఎత్తు నాకూ ఇష్టమే అన్నాను. నా మీద కోపం వచ్చినట్టుంది, నాలుగు రోజులై మొహం చారుచేసుకుని తిరుగుతున్నాడు.'
పోనీలే, మధూ , వాడి తత్త్వమే అంత. ఏదో నీ కొడుక్కి నాలుగు ముక్కలు రావడం కదా కావలసింది? ఎవరేమన్నా పట్టించుకోకు. ఇంకో మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే వాడు డిగ్రీ తెచ్చుకుంటాడు. అప్పుడు ఏదన్నా పని దొరుకుతుంది.... నీ ఇల్లూ, నీ వాకిలీ హాయిగా బ్రతుకుదూ గాని..."
'తన ఇల్లూ, తన వాకిలీ , కొడుకు హయాంనాడా ఏర్పరిచింది? ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా వేరు కాపురం ముందామని చెప్పాడు తన భర్త తనకు! తన తలిదండ్రులను అలా ఎన్నిసార్లు కోరాడు? అతనికి తానూ భార్యా జంటగా కాపురం ఉండాలని పించేదేమో! ప్చ్.....అతని కోర్కెలు తన కోసం చంపుకున్నాడు! శూన్యంలోకి చూసి దీర్ఘంగా నిట్టూర్చింది మధుమతి. ఆమె మనస్సు బరువెక్కి పోయింది నెమ్మదిగా తన గదికి వెళ్ళి తలుపు బిగించుకుంది.
* * * *
"వాసూ నాకీ పాఠం ఓసారి చెప్పవా?" వాసు వినిపించుకోలేదు.
"ఏయ్ , నిన్నే! ఒక్కసారి చెప్పవా? ఆ టీచరు చెప్పింది నాకు అర్ధం కాలేదు, వాసూ?" ఈసారి తన పుస్తకం లో తల దూర్చి చదివే వాసు ఏకాగ్రత కి కాస్త భంగం కలిగిందేమో! కొంచెం తలెత్తి పద్మజ వైపు చిరాగ్గా చూశాడు.
"ఒక్కసారి ....పది నిమిషాలు.... చెప్పవా?' అతని చూపుల్లో చూపు కలిపి అడిగింది పద్మజ.
"వీలవదు, పద్మజా!....నాకు ఇంపార్టెంటు లేసేన్సు ఉన్నాయి. ప్లీజ్! నన్ను డిస్టర్బ్ చెయ్యకు, వెళ్ళు." చిరాగ్గా అన్నాడు వాసు.
"అమ్మ నడుగుతా నయితే....కాకపోతే రేపు ఫస్టు పీరీడు నిలుచుంటాను." నెమ్మదిగా అన్న పద్మజ గొంతులో ఓటమిని సహించే బాధ ద్వనించింది.
గది గుమ్మం దాటుతున్న పద్మజ -- "పద్మజా!" అన్న పిలుపుతో వెనుదిరిగి చూసింది.
"రా, ఏ పాఠం చెప్పాలి?" చిన్నగా నవ్వుతూ అడిగాడు వాసు.
"పోనీలే, నువ్వు చదువుకో." వెళ్ళబోతున్న పద్మజ చెయ్యి టక్కున పట్టుకున్నాడు వాసు. 'ఆయామ్ సారీ, పద్మజా! మీ అమ్మ ఏం చెబుతా రిప్పుడు? ఇప్పటివరకూ మనకి చాకిరీ చేసి! రా, చెబుతాను" అన్నాడు వాసు.
అతని చేతిలో తన చెయ్యి. ఆ పిల్ల హృదయం లో తియ్యని సంచలనం , సిగ్గు . మృదువుగా చెయ్యి విడిపించుకుని, అతని ఎదర కుర్చీలో కూర్చుని పుస్తకం తెరిచింది.
ప్రకృతి నిద్రలోకి ఒరిగింది. దూరాన చర్చి లో గంట పదకొండు సార్లు మ్రోగింది.
'అమ్మ....ఎంత బాగా చెప్పగలవు, వాసూ!.... నే అడుగుతే ఏదన్నా చెబుతావు కదూ?' ఆ పిల్ల కళ్ళు మెరిశాయి తృప్తిగా.
"దానికేం? రోజూ రా" అనేశాడు వాసు.
"నువ్వే టీచరు ఉద్యోగం చేస్తే?"
"ఇప్పుడు చేసింది ఆ ఉద్యోగమేగా! ఇంకేమన్నా సందేహాలు ఉన్నాయా?" ఆ పిల్ల మాటలకి అడ్డు వస్తూ నవ్వాడు వాసు.
"థాంక్యూ...గుడ్ నైట్.... మరి వెళతాను." లేచి నిలుచుంది పద్మజ.
"గుడ్ నైట్! పదకొండయింది. లైటార్పి బెడ్ లైటు వేసి వెళ్ళు"అంటూ బద్దకంగా ఒళ్ళు విరిచి పక్క మీద వాలిపోయాడు వాసు.
పద్మజ టెన్త్ క్లాసు. వాసు బి.ఎ ఫస్ట్ ఇయర్. ప్రతి రోజూ గంటో, అరగంటో వాసు దగ్గర ట్యూషను. అతను గౌరవనీయుడైన గురువు. ఆమె వినయవతి అయిన శిష్యురాలు, ఆ కొంతసేపు. ఇంట్లో అతను అత్తయ్య కొడుకు మాత్రమే కాదు, ఆమె మనసుకి నచ్చిన మిత్రుడు. వాసు దృష్టిలో ఆమె అణకువ గల తెలివైన మంచి పిల్ల. వారిద్దరి మద్యా ఏదో అవ్యక్తమయిన అనుబంధం. దృడపడుతుంది.
ప్రసాదరావు కీ, మధుమతి కి వారాని కో ఉత్తరం వ్రాస్తున్నాడు వాసు. దసరా సెలవులు వస్తాయనగా ఇద్దరూ అత్రతగా చూడాలనే తపనతో రమ్మని వ్రాశారు. ఇద్దరికీ జవాబులు వ్రాశాడు.
* * * *
