"సినబాబుగారా? రాత్రేళ ఇలా వచ్చారేటి?"
"అబ్బే. షికారు వెళ్ళి నువ్వు ఉన్నావేమో చూసి పోదామని ఇలా వచ్చాను."
"మరి ఇంటి దగ్గర సత్తేయ్యా, అమ్మాయీ లేరూ?"
"నేను ఇంటి దాకా వెళ్ళలేదు. ఈవేళప్పుడు నువ్వు ఇంట్లో ఉండవు కదా అని మధ్య లోనే వెనక్కి తిరిగాను."
"రండి. బాబూ. ఇంతదాకా వచ్చి వెనక్కి ఎల్లి పోవడం ఏటి? కాసేపు కూసుని ఎళుదురు గాని. రండి బాబూ."
కొంచెం సేపు తటపటాయించి ఆనందం వీరి గాడి వెనకాల బయలుదేరాడు. మనుష్యుల అలికిడి విని సత్తేయ్యా, సుందరమ్మ మంచం మీద నుంచి లేచి విడివిడి గా నిలబడ్డారు. చంద్రుడు ఆకాశం లో బాగా బారెడు పైకి లేచి లోకాన్నంతా పాలసముద్రం లా మార్చేస్తున్నాడు. పాక దగ్గరికి వస్తూనే "సినబాబు గారు వచ్చారురా. సత్తేయ్యా" అన్నాడు వీరిగాడు. సుందరమ్మ పైట సర్దుకొని పాకలోకి వెళ్ళిపోయింది. సత్తెయ్య తెల్లబోయి అలాగే ఉండిపోయాడు.
"ఎర్రా సత్తేయ్యా , ఎలా ఉంది నీ తల కాయ నెప్పి?' అన్నాడు.
"కొంచెం తగ్గింది, మామా" అని సత్తెయ్య అంటుంటే, ఆనందానికి నవ్వు వచ్చింది.
"మీరు నిలబడే ఉన్నారు. "వీరిగాడు ఆనందాన్ని ఉద్దేశించి అన్నాడు.
"కాదు. వెళ్ళిపోతాను . ఆ! ఒక్క విషయం నీతో చెబుదామని వచ్చాను."వీరిగాడు చేతులు కట్టుకొని "సెలవియ్యండి " అన్నాడు.
"మరేమీ లేదు. నాకు ఉద్యోగం అయింది."
"ఏ ఉద్యోగం ? ఏ ఊరు బాబయ్యా?"
"పోలీసు ఇన్ స్పెక్టరు ఉద్యోగం లే. ఇంకా ఏ ఊరు వెయ్యలేదు. ప్రస్తుతానికి అనంత పురం వెళ్ళాలి ట్రెయినింగు కి."
"సిత్తం."
"జానకిని కాలేజీ లో చేర్పిస్తున్నాను కాకినాడ లో."
"సిత్తం."
"మేము ఇద్దరమూ వెళ్ళిపోతే ఇంక ఇంట్లో ఉండేది అక్కయ్యా, అన్నయ్యానూ."
"ఏమో బాబూ! ముకుందం బాబుకి కోపం మా జాస్తి. ఆయనతోటి ఎలాగో ఏమో? మీరు కూడా ఊళ్ళో ఉండరు" అన్నాడు సత్తెయ్య.
"ఫరవాలేదు . ఎలాగో అలాగ ఈఏడు గడపండి. వచ్చే ఏటికి వ్యవసాయం ఎత్తి కట్టేసి అంతా పట్నం వెళ్ళిపోతాము."
వీరిగాడు ఆ మాట విని ఒక్కమారుగా ఉలిక్కి పడ్డాడు. "ఊరు వదిలి ఎల్లి పోవడం ఎందుకు బాబూ-- తాత తండ్రుల కాడ నుంచీ ఉన్న ఊరు." అన్నాడు తేరుకుని.
ఆనందం మౌనంగా ఊరుకున్నాడు.
"ఎవసాయం ఎత్తి కట్టేస్తే , మిమ్మల్ని నమ్ముకున్న మాబోటి కుటుంబాల గతి ఏం కావాల బాబూ?' అన్నాడు సత్తెయ్య.
"దానికేమిటి? చేను అమరకం మీకే ఇచ్చేస్తాము. ఏటా మీరే ఇద్దురు గాని మాకు ధాన్యం."
వీరిగాడి కెందువల్లో ఈ సంభాషణ రుచించ లేదు. "అది సరేగానండి, మీరెప్పుడేళ'తారు ఊరు?" అన్నాడు.
"ఎల్లుండే వెళ్ళుదామనుకుంటున్నా , డబ్బు సర్దు బాటు అయితే."
"ఎవరినయినా అడిగారా?"
"ఇంకా లేదు. మొన్న వ్యవసాయపు పనులకి అయిదు వందలు కావలిస్తే ఊళ్ళో పుట్టలేదు కదా? ఇప్పుడీ సొమ్ము మాత్రం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచన."
"రోజుల మహత్యం , బాబూ! మనుష్యుల దగ్గర డబ్బు లేదనా? ఇదే కనక పెద్ద బాబు గారు కబురెడితే , మునసబేటి, శాస్త్రి గారేటి ఏలకు ఏలు పంపిద్దురు."
"సరే, బాబయ్య ఉంటె మాకీ తడివిట్లు ఎందుకు? అంతా అతనే చూసుకోన్ను."
వెంకట్రామయ్య విషయం తెలుసుకోవాలనే కుతూహలంతో నోటి దాకా మాట వచ్చి కూడా ఆగిపోయాడు వీరిగాడు.
"ఇంతకీ ఇప్పుడు డబ్బు ఎంత కావాలేటి , బాబయ్యా?"
"జానకికి రెండు వందలు, నాకో వంద. మొత్తం మూడు వందలేనా కావాలి కనీసం."
"మూడొందలు . రేపు సాయంత్రానికి. సరేలెండి. నేను సర్దుతా,"
ఆనందం ఆశ్చర్యంతో "నువ్వా? నువ్వు సర్దుతావా? మూడు వందలు ఎక్కడివి నీకు?" అన్నాడు.
వీరిగాడు నవ్వి , "ఎక్కడివో, మీకెందుకు బాబూ? నే సద్దుతానన్నానుగా ?' అన్నాడు.
ఆనందాని కేమీ అర్ధం కాలేదు. వీరిగాడికి సత్తెయ్య కూ తాము ఇస్తున్న జీతం మొత్తం కలిపినా, వాళ్ళ సంసారానికి గాటాగటి గా కూడా సరిపోదే? అటువంటప్పుడు అందులో తనకు ఇవ్వడానికి మూడు వందలు మిగిలే దేక్కడ? ఏదో వాడికి ఉన్న ప్రభుభక్తి కారణంగా, అయ్యో! అయ్య ఏం బాధపడతాడో అని అన్నాడు కాని, వాడి మొహం -- వాడెక్కడ? మూడు వందలు తనకు సాయం చెయ్యడం ఎక్కడ? అనుకున్నాడు. కొంచెం సేపు ఊరుకుని "ఇంక వెళ్ళివస్తా " అని బయలుదేరాడు ఆనందం. నిద్ర గన్నేరు చెట్టు దాకా వచ్చి సత్తెయ్య సెలవు తీసుకున్నాడు. వీరిగాడు ఇంకా రెండు మూడు వీధులు దాటేదాకా ఆనందం వెనకాలే వచ్చాడు. "ఉండు చీకట్లో ఇంకేం వస్తావు?" అని ఆనందం మరీ మరీ అన్నాక ఆగిపోయాడు. పాక దగ్గరికి తిరిగి వస్తూనే "ఒరేయ్ , సత్తేయ్యా , రేపు సీటీ పాటుంది కదుట్రా. ఎంతయినా సరే, రేపటి సీటీ నువ్వే పాడు. ఏం? తెల్సిందా?' అన్నాడు.
"అలాగే మామయ్యా" అన్నాడు సత్తెయ్య.
ఆకాశం లో ఉన్నత సోపానాలు క్రమంగా అధిరోహిస్తున్న చల్లని చందమామ నవ్వు వెన్నెలలలు కురిపిస్తున్నాడు.
12
రామదాసు కేమీ పాలుపోవడం లేదు. అమ్మాయిని మనుగుడుపులకు తీసుకు వెళ్ళకపొతే మానె, వాళ్ళు ఓ ఉత్తరం ముక్కయినా వ్రాయవద్దూ -- 'ఇదీ సంగతి. ప్రస్తుతం ఈ ఇబ్బంది ఉంది. ఫలానా అప్పుడు తీసుకు వెళతాము." అని? పోనీ, తను వ్రాసిన నాలుగైదు ఉత్తరాలలో ఒక్కదాని కయినా జవాబు ఇయ్యవచ్చు కదా? అదీ లేదయ్యా. తను ప్రత్యేకం పనిగట్టుకొని రేవు దాటి వెళ్ళి "ఏమిటి మీ అభిప్రాయం? పిల్ల నెప్పుడు తీసుకు వెళ్ళుతారు?" అని నోరు తెరిచి అడిగినప్పుడయినా ఒక్కళ్ళయినా కణుకూ , బెణుకూ సమాధానం చెప్పవచ్చు కదా? ఏమిటి వీళ్ళ అంతర్యం?
వాళ్ళ ప్రవర్తన చూస్తె రామదాసు కు అనుమానం వేయసాగింది. వెర్రి తల్లి! అన్నపూర్ణ కాపురం ఏమవుతుందో! ఈ ఆలోచన వచ్చినప్పుడు రామదాసు కు భయం వేసింది. ఏదో పోగొట్టుకున్నదానిలా , పరధ్యానంగా యాంత్రికంగా మసలుతున్న అన్నపూర్ణ ముఖం చూడలేక పోతున్నాడు. సంతోషంగా, ఏ చీకూ చింతా లేకునా ఉన్న పిల్లకు, ఈ సంబంధం ఎందుకు చేసినట్టు తను? ఇంట్లో మౌనంగా పిల్ల పడుతున్న బాధ, రోజూ భార్య చేసే బాధతో కూడిన సాధింపు రామదాసు ను దాదాపు పిచ్చి వాడు చేసేస్తున్నాయి. మనస్సులో పడుతున్న మధనాన్నీ, గుండెలు ఎండుతున్న వేదననూ ఇంకొకళ్ళతో చెప్పుకుంటే కాని ఉండలేక పోతున్నాడు. అందుకని ఒకరోజున మాధవరావు ఇంటికి వెళ్ళాడు. ఆక్రితం రోజే మాధవరావు జ్యోతిని బి.ఎస్.సి లో చేర్పించివచ్చాడు కాకినాడ లో.
మెట్లు ఎక్కుతున్న రామదాసు ను చూచి "రావోయి, రా" అని ఆహ్వానించాడు మాధవరావు. వస్తూనే ఘటాన్ని సోఫాలో కూలేసి ఉస్సు మన్నాడు రామదాసు.
"ఏం, అలా ఉన్నావు?"
"ఏం ఉండటం , పోనిద్దూ! వెధవ క్లేశాలూ, బాధలూ పడుతూ బతికి ఉండటం కన్నా చప్పున చావడం మంచిది."
ఇంటి కప్పు ఎగిరిపోయే లాగ నవ్వి "నీకు వేదాంతం బాగా ముదిరి నట్లుందే?' అన్నాడు మధవరావు.
"నీకు వేళాకోళంగానే ఉంటుంది."
"లేకపోతె నేనూ నీలాగే ముఖం వెళ్ళాడేసి , డాక్టరు ధర్మమా అని మార్ఫియా మత్తులోనే మరణించిన రోగి ఫోజు పెట్టమంటావా?"
"నీకెప్పుడూ నవ్వుతాలే! జీవితంలో గంబీరంగా ఉండవలసిన క్షణాలు కూడా కొన్ని ఉంటాయి."
"అసలు జీవితమే హాస్యం. అందులో గంబీరంగా ఉండటం మరీ హాస్యం."
"సామ్యం చెప్పినట్లుంది. బాధగా ఉన్నప్పుడు గంబీరంగా ఉండక ఏం చేస్తాము?"
"అసలు బాధ అంటే ఏమిటి? సుఖానికి పూర్వ రూపం. సుఖం దుఃఖానికి పర రూపం. వెనకటికో తెలుగు కవి అన్నాదులే ----
"మంచు తెరమాటునే మహిమాలయమ్ముంది
నిట్టుర్పు నీడనే నిరవధిక సుఖముంది.'
అని. నిజంగా ఆలోచిస్తే, లోకోత్తర సౌందర్య రోచిస్సులను విరజిమ్మే ఈ జీవితంబరాన్ని వేసింది సుఖ దుఖాలనే పడుగు పెకలతోనే కాదుటయ్యా? ఈ జీవితాన్ని ఒకదాని నొకటి తరుము కుంటూ పాలించేవి కూడా వెలుగు చీకట్లేగా?"
అర్ధాంగీకారంగా తల ఊపాడు రామదాసు.
"అయ్యో చీకటి! అని అరిచినంత సేపు పట్టదు, వేగుచుక్క పొడిచి తూరుపు తెల్లవారడానికి . ఆహా! ఎంత కాంతిగా ఉంది ఈ సమయం! అనుకొనే లోపుగానే ముసురుకుంటూ వచ్చేస్తాయి చీకట్లు, సూర్య దేవుణ్ణి అగాధమైన విషౌదాంబుధి లోకి తోసేసి."
రామదాసు కు అతని సంభాషణ అంతగా రుచిస్తున్నట్లు లేదు. మాధవరావు ఇంకా ఏదో చెప్పబోతుంటే "వెళ్ళొస్తా" అంటూ లేచాడు రామదాసు.
"అదేమిటి? వెళ్ళిపోతా వేమిటి?"
"అవునయ్యా ఏదో నా గోడు వింటావని నేనొస్తే, ఈ శుష్క వేదాంతం అంతా చెబుతావు. నాకెందుకు?"
"కోపం వచ్చిందా? ఇంక నేను మాట్లాడను లే. కూర్చో."
అయిష్టంగా కూర్చున్నాడు రామదాసు. కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ "పిల్లలు కులాసాగా ఉన్నారా?" అన్నాడు మాధవరావు.
"ఏం కులాసా , పోనిద్దూ! అన్నపూర్ణ ఇంకా నా గుండెల మీద కుంపటి లా కూర్చుని ఉంది కదా?"
"ఏం? ఇంకా వాళ్ళు తీసు కెళ్ళలేదూ?"
"ఏం తీసి కెళ్ళారు నా మొహం/ ఉత్తరాలు వ్రాశాను. దుంపలు దుంపలు చేసుకుని ఆ ఊరు వెళ్ళి వచ్చాను కూడా."
"ఏమంటారు?"
"ఏమైనా అంటే ఇంక లోటేమిటి? ఏమాటా తేల్చరు. అదిగో అంటారు. ఇదుగో అంటారు. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. వచ్చాక అందరూ కలిసి సంప్రతించి వ్రాస్తాము కదా సమాధానం అంటారు."
"ఏమిటయ్యా ఇది అని ముక్కు మీద గుద్ది అడక్క పోయావా పెళ్ళి చేసిన ఆ వెంకట్రామయ్య ని?"
"అయన కనిపిస్తేగా? ఎక్కడికో వెళ్ళాడుట. ఇప్పట్లో రాడుట'. అసలు ఆయనేనట దీని కంతకీ మూల కారణం. అయన వస్తేనే కాని, ఈ చిక్కు విడదట. ఏదో చెప్పారు, ఒక మాటకీ, ఒక మాటకీ అర్ధం లేకుండా."
"మరయితే ఏం చేస్తావు? ఏకంగా పిల్లతోటే బయలుదేరి మనమూ ఊరు వెళ్ళి నలుగురి లోకీ ఈడ్పించి చివాట్లు వేయిడ్డామా?"
"దానివల్ల నలుగురి లోనూ నగుబాట్లే కదా? పైగా పిల్లకి గుప్పెడన్నం పెట్టలేక పంపించేశాడనరూ రేప్పొద్దున్న నలుగురూ నన్ను?"
"పోనీ ఏ కోర్టు ద్వారానో, ప్లీడరు ద్వారానో నోటీసు ఇప్పిద్దాము , పిల్లని పెళ్ళి చేసుకుని కాపురాని కెందుకు తీసుకు వెళ్ళడం లేదో సంజాయిషీ చెప్పమని."
"దానితో వ్యవహారం మరింత చెడి అసలుకే మోసం వస్తుందేమో!"
"అలా అయితే మాట్లాడక ఊరుకో -- నువ్వు ధైర్యంగా ఏ నిర్ణయం తీసుకోలేవు. అలా అని స్థైర్యంగా నిలబడి ఏమి జరుగుతుందో చూద్దామని వేచి ఉండనూ లేవు. ఈ రెండూ చెయ్యకుండా మధ్యన బెంగ పెట్టుకుని సతమతమయిపోతే ఏం లాభం?"
"కాని...."ఏదో చెప్పబోయాడు రామదాసు.
"ఏం, కాని? పోనీ, మెళ్ళో తాళి కట్టిన ఆ పెళ్ళి కొడుకునేనా అడిగావా ఇదేం బుద్ది రా అని?"
"అతనూ కనిపించలేదు. ఊళ్ళో లేనట్టున్నాడు."
"అయితే ప్రస్తుతానికేమీ కంగారు పడక ఊరుకో. సమయం వచ్చేటప్పటికి వాటంతట అవే సర్దుబాటు అవుతాయి " అన్నాడు మాధవరావు. అంతకంటే చెయ్యగలిగిందేమీ లేదనిపించింది రామదాసు కు.
