ఆనందం ఆ సామెత కు పకపకా నవ్వేశాడు. కాని ఇంతట్లో కే అతని ముఖం గంబీరంగా మారిపోయింది. గోడనున్న గంగా వతరణం ఫోటో కేసి తదేక దృష్టి తో చూస్తూ ఆలోచనలో మునిగి ఉండిపోయాడు. కొంచెం సేపయ్యాక విశాలాక్షి అతని కేసి చూసి, "ఏమిటిరా , దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?' అంది.
"అబ్బే-- ఏమీ లేదు" అన్నాడు ముక్తసరిగా.
"ఏమీ లేదేమిటి? చెప్పు."
"అది కాదు. ఇంటర్వ్యూ కు వెళ్ళి నాలుగైదు నెలలు కావస్తోంది కదా? సెలక్టు అయినట్తో , కానట్ట్ కాగితం ఏమీ రాలేదు ఇంకా."
"వస్తుంది. తొందరేమిటి?"
ఆనందం నిస్పృహగా శ్వాస వదిలాడు.
ప్రస్తావన మార్చే ఉద్దేశ్యంతో విశాలాక్షి 'అయితే జానకిని కాలేజీ లో చేరుద్దామంటావా?" అంది.
ఇంకా ఆలోచిస్తూనే ఉన్న ఆనందం ఉలిక్కి పడి "ఏమిటి?" అన్నాడు.
"అదే. అమ్మాయిని కాలేజీ లో చేర్పించే విషయం."
ఆనందం తన ఆలోచనలలో నుంచి తేరుకుని 'అవును, అక్కయ్యా. ఏ రకంగా ఆలోచించినా, జానకిని కాలేజీ లో చేర్పించడమే మంచిదని తోస్తోంది. ఏ పెళ్ళి వారు వచ్చినా, పిల్ల ఏం చదువుకుందని అడుగుతున్నారు మొదట. ఈ రోజుల్లో స్కూల్ ఫైనల్ ఒక చదువు కాదు కదా?' అన్నాడు.
"సరే. నువ్వు అన్నట్టే ఇవాళ జానకిని కాలేజీ లో చేర్పించమయ్యా. రేపు పొద్దున్న ఉద్యోగం వచ్చిందంటూ నువ్వు నడుస్తావు. అనక ఈ అవకతవక వాడితో వేగుతూ, కూచోవాలి నేను. ఏమోరా! ముకుందం తిన్నగా వ్యవసాయంచేసి సుష్టు పెడతాడని నాకు నమ్మకం లేదు."
ఆనందానికీ ఆ అనుమానమే ఉంది. విశాలాక్షి కూడా అదే అభిప్రాయం వెలి బుచ్చడం తో ఆనందం ఇలా అన్నాడు.
"నువ్వు చెప్పింది నిజం. కాని ఈఎటికి మనం చేసేది ఏమీ లేదు. ఊడ్పు లు కూడా అయిపోయాయి. అందువల్ల ఈ ఏడు కుప్ప నూర్పుల దాకా ఊరుకుని తీర్చేసి, చేను ఏ మోతుబరి రైతు కో కౌలు కిచ్చి మీరిద్దరూ కూడా వచ్చేస్తే అంతా ఏకంగానే ఉండచ్చు."
"అదీ అంత మంచి పని కాదు. ఈ రోజుల్లో చేను కౌలు కి ఇస్తే తిరిగి మనకు మళ్ళీ ఇవ్వరట కదా? సొంత వ్యవసాయం చేసుకోకపోతే చేలు ఎక్కడ పోతాయో అనే భయంతో, కౌలు దార్లు చాలామంది పల్లె టూళ్ళు వచ్చేస్తుంటే , మనం ఊరు వదులుకుని పట్నం పోదామా?"
"మన చేనుకి ఆ భయం లేదు, అక్కయ్యా. రైతు మంచి వాడయితే కౌలుదారీ చట్టం మనకేమీ ఇబ్బంది కాదు. నమ్మకస్తుడయిన ఏ వీరి గాడి పెరనో కౌలు వ్రాస్తే సరి."
"మనకింద పని చేస్తున్న వాడికి మనం కౌలు కి ఇవ్వడమా?"
"లేకపోతె ఏ బలమైన మోతుబరి కో ఇస్తే మన భూమి మనకి రాదు" అంటుంటే జానకి వీధిలో నుంచి పరిగెత్తుకుని వచ్చి , "చిన్న మామయ్యా, నీకు కవరు వచ్చింది." అంది. కవరు అందుకుని పైన ఉన్న సర్వీసు స్టాంపు లు చూసి వణుకుతున్న చేతులతో చింపాడు ఆనందం. గబగబా రెండు ముక్కల్లో చదివేసి, విప్పారిన ముఖంతో కళ్ళు మెరుస్తుండగా "నేను సెలక్టు అయాను , అక్కయ్యా" అన్నాడు. విశాలాక్షి కి సంతోషంతో కళ్ళ నీళ్ళు నిండాయి. "పోనీలే, నాయనా , ఇందాక నువ్వు దిగాలుగా ఉండటం చూసి, ఉద్యోగం వస్తే వెంకటేశ్వరస్వామికి రెండు కొబ్బరి కాయలు కొడతానని అనుకున్నాను." అంది. ఆనందం చేతిలో నుంచి కవరు లాక్కొని అతి ప్రయత్నం మీద నాలుగు వాక్యాలు చదివి "మామయ్యా , నువ్వు ఇప్పటి నుంచి సబ్ ఇన్ స్పెక్టరు ని అన్నమాట. గుడ్ మార్నింగ్ సార్ లెప్ట్ రైట్ లెప్ట్ రైట్" అనుకుంటూ హల్లో కి నడిచింది జానకి. జానకి ఆకతాయితనానికి విశాలాక్షి , ఆనందం నవ్వుకున్నారు.
"అయితే నిన్ను ఏ ఊరు వేసినట్టు?" అంది విశాలాక్షి. "ఇంకా ఏ ఊరు లేదు. ఈలోగా అనంతపురం వెళ్ళి కొన్ని నెలలు ట్రెయినింగు అయి రావాలి. ట్రెయినింగు లో స్టయిపెండు ఇస్తారులే."
"ఉహూ!" అంది విశాలాక్షి.
"నేనో పని చేస్తాను అక్కయ్యా. జానకి ని తీసుకెళ్ళి కాకినాడ లో చేర్పించి, అక్కడ నుంచి నేను అలా అనంతపురం వెళ్తాను."
విశాలాక్షి నవ్వి "సరే, నీ ఇష్టం . కాని ముందు డబ్బు సంగతి ఆలోచించు" అంది.
"అది నే చూసుకుంటాగా?' అన్నాడు ఆనందం.
సూర్యాస్తమయం అయి కొద్దిగా చీకటి పడుతున్నప్పుడు జోళ్ళు తొడుక్కుని బయలుదేరాడు ఆనందం. స్పష్టాస్పష్టంగా ఉన్న ఆ మసక చీకటి క్రమంగా వెలుగు ను మేసి బలుస్తున్నది. ఆకాశం లోకి అప్పుడే ప్రవేశించిన నక్షత్రాలు ఎంతో అందంగా సంగారించు కుంటున్నాయి. చల్లని గాలి ఉండి ఉండి వీచి శరీరానికి సేద దీరుస్తూనే అప్పుడప్పుడు చక్కిలిగింతలు పెడుతున్నది. వీధులన్నీ గడిచి కాలవ గట్టున ఉన్న వీరిగాడి పాక హచేరుతున్న కొద్దీ ఆనందం చెవుల్లోకి స్పష్టంగా, మరింత స్పష్టంగా ఓ శ్రావ్యమైన పల్లె పదం చేరుకో సాగింది. ఆ చల్లని గాలి తెమ్మెరల మీద తేలి పోతూ.
వీరిగాడి పాకకు అల్లంత దూరం లో ఉన్న నిద్ర గన్నేరు చెట్టు నీడలో ఆగిపోయాడు ఆనందం. పాక ముందు శుభ్రంగా నీళ్ళు జల్లి ముగ్గు పెట్టిన వాకిట్లో పైన ఆకాశం లో చుక్కలు మెరుస్తుంటే మహారాజు లా నులక మంచం మీద పడుకున్న సత్తేయ్యా, మంచం పట్టే మీద కూచుని అతని జుట్టు లోకి వేళ్ళు పోనిస్తూ ఏదో పల్లె పదం పాడుతున్న సుందరమ్మ. ఏవో దివ్య లోకాల్లో విహరిస్తూ మధురానుభూతులు మనస్సుల నిండా నింపుకొన్న ఆ అదృష్టమూర్తుల ఆనందానికి అంతరాయం కలిగించడం ఇష్టం లేక అలాగే ఉండిపోయాడు ఆనందం. సత్తెయ్య హృదయంతో పాటు చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా పులకరింపజేసిన సుందరమ్మ పాట నెమ్మదిగా మంద్ర స్థాయి కి వచ్చి ఆగింది. కొంతసేపటి వరకూ ప్రకృతి అంతా ప్రశాంత గంబీర్యం తో నిశ్శబ్దంగా ఉంది -- సుందరమ్మ గాన మధురి నుంచి ఇంకా కోలుకోనట్లు. నీడలో ఉన్న ఆనందం తన చుట్టూ పరికించి చూశాడు. ఎక్కడా మనిషి అలికిడి లేదు. ఇటూ , అటూ కొంచెం దూరం లో ఉన్న పాకల్లో కూడా ఎవరూ మసులుతూ ఉన్న సందడి లేదు. తూర్పున అప్పుడే ఉదయిస్తున్న విదియ చంద్రుడి చల్లని వెలుగుల్లో వారు ; నిద్ర గన్నేరు నీడ లో తను. తన జీవితాన్ని వాళ్ళ సుందర జీవితంతో పోల్చుకున్నాడు. తనకు వివాహం అయిన నాడే సత్తెయ్య కూ అయింది. సుఖపడడానికి తనకున్న అవకాశాల్లో శతాంశమైనా లేవు వాడికి. డబ్బూ, హోదా, చదువూ సంస్కారమూ -- ఒకటేమిటి? అన్నింటి లోనూ తను ఎక్కువే. అయితే ఏం? వాడు పొందుతున్న సౌఖ్యం లో తనకు లేశమైనా లేదు. అసలు పోలికే లేదు. తమ దాంపత్యం లో అనురాగం మాట అటుంచి, అనుకూలాని కైనా ఆస్కారం లేదు. పూర్తిగా నచ్చని అన్నపూర్ణ తో తను కాపురం ఎలా చేస్తాడు? అందులో -- తన కింత అన్యాయం జరిగిందని తెలిశాక ? మనస్సంతా విరిగి పోయింది. ఏం చెయ్యడాని కీ పాలుపోకే ప్రస్తుతం పెళ్ళి కూతురిని తీసుకు రాకుండా మానేశారు. ముందు ముందు స్థిమితంగా ఆలోచించాలి-- అన్నపూర్ణ ను కాపురానికి తీసుకు వచ్చేదీ, లేనిది. ఏమైనా తన బ్రతుకు రాచబాట కాదు. మార్గం అంతా ముళ్ళే. నెమ్మదిగా ఈ కంటకాలను తప్పించు కోవాలి. జీవితాన్ని స్వర్గ ధామం చేసుకోవాలి.
ఇలా ఆలోచిస్తున్న ఆనందం మళ్ళీ అటు చూశాడు. వెన్నెలలో సుందరమ్మ నల్లని చెక్కిళ్ళు మెరుస్తున్నాయి. చెవులకు ఉన్న కమ్మలు జిగేలు మంటున్నాయి. కళ్ళు కాంతులు విరజిమ్ము తున్నాయి. మోచేతుల మీద సగానికి లేచి కూచుని ఆమె చెంపలు నిమురుతూ అన్నాడు సత్తెయ్య: "ఏటే , రహస్యం సెప్తా నన్నావు? సాయంత్రం వేళ పొలం ఎల్లోద్దంటే, తల నోస్తొందని వంక పెట్టి మామ నోక్కడ్నీ పంపించాను పొలం. ఏటి? రహస్యం ఏటి?"
సుందరమ్మ సిగ్గుతో తల దించేసింది.
ఆమె చుబుకం పట్టుకొని ఎత్తుతూ సత్తెయ్య "ఏటి , అలా సిగ్గు పడతావు? నాకు సేప్పడానికి సిగ్గేటి, పిచ్చిదానా? ఊ! సెప్పు" అన్నాడు.
సుందరమ్మ ఈమాటూ సమాధానం చెప్పలేదు. బరువుగా కళ్ళు ఎత్తి అతని కేసి చూసి వెంటనే దించేసింది.
సత్తెయ్య నవ్వి అన్నాడు: "ఒలబ్బో! నా నేరగనేటి? ఇదంతా ఒట్టి నటన -- అసలు ఆడదానికి సిగ్గేటి?"
దానితో సుందరమ్మ కు కోపం వచ్చి " ఆడదానికి కాకపొతే , మగాడి కేటి సిగ్గు?' అంది.
"అద్గదీ -- అట్లా మాట్లాడు. గువ్వ పిట్టలా మూతి ముడుసుక్కూసుంటే ఏమైనట్టు?'
"ఏటి , బావా! మగాడికి సిగ్గా? ఏటి అంటున్నావు ?"
'అవునే. అసలు నిజమైన సిగ్గు మగాడిది. ఆడదానిదంతా ఒట్టి నటన, బూటకం. అసలు ఆడదానికి సిగ్గు లేదు."
"అంటే నాదంతా ఒట్టి బూటకమా ? సరేలే."
సుందరమ్మ అలక తీర్చి తిరిగి ప్రసన్నురాలు చేసుకొనేటప్పటికి పావుగంట పట్టింది. బతిమాలాడు , పొరపాటయింది అన్నాడు. చక్కిలి గింత పెట్టాడు. సుందరమ్మ మళ్ళీ నవ్వుతూ సరదాగా ఉండటం చూసి "రహస్యం అన్నావు. ఏదో చెప్పు" అన్నాడు. మురిపించుకుని, మురిపించుకుని అతని చెవిలో నెమ్మదిగా చెప్పింది. వెంటనే సిగ్గుతో తల వంచేసుకుంది. ఒక్క గెంతు గెంతి సత్తెయ్య సంతోషంతో "ఏటి? నిజమే? ఒలబ్బో ! ఓ లబ్బో! నేను బాబునవుతానా? నిజంగా? నిజంగా? సుందరం! నా బంగారు సుందరం!" అంటూ ఆమె బుగ్గలు ముద్దు పెట్టుకోసాగాడు.
ఆనందం ఇంక అక్కడ నిలబడడం ఇష్టం లేక వెనక్కు తిరిగాడు. "ఎవరది?" అన్నాడు అప్పుడే ఇంటికి తిరిగి వస్తున్న వీరిగాడు. ఇద్దరూ చెట్టు నీడలోనే ఉండటం వల్ల ఒకరి ముఖం ఒకరు గుర్తు పట్టలేక పోయారు. వీరి గాడి గొంతు అనమాలు పట్టి "నేనురా వీరిగా" అన్నాడు ఆనందం.
