Previous Page Next Page 
కౌసల్య పేజి 18

                        

                                       11
    వెంకట్రామయ్య వెళ్ళిపోయాక ఇల్లు బావుతుమంటూ ఉంది. ఇలా అవుతుందని ఆనందం కాని, విశాలాక్షి కాని అనుకోలేదు. జ్యోతి , మాధవరావు ల మంచితనమూ, వాళ్ళ  హోదా, వాళ్ళే విధంగా తమ సంబంధం గురించి పాకులాడింది చెప్పి "బాబయ్య చెయ్యాలనే చేశాడు ఈ సంబంధం" అని ఆనందం విశాలాక్షి తో అంటూ ఉండగా ముకుందం అక్కడికి వచ్చి , "నాకు తెలుసురా. నేను మొదటి నుంచీ బాబయ్య పద్దతి కనిపెడుతూనే ఉన్నా. నే చెబితే విన్నారా? నీ చదువా చెడగొట్టాడు; ధాన్యానికి ధాన్యమా మట్టిపాలు చేశాడు. ఇక ఈ పెళ్ళి సంగతి సరేసరి" అంటూ అసలే మండుతున్న వాళ్ళ గుండెల్లో ఆజ్యం పోశాడు. దానితో వాళ్ళకు కోసం కట్టలు తెంచుకుని మొదట పిల్లను   మనుగుడుపులకు తీసుకు వెళ్ళడం మాని పెద్దాపురం నుంచి పుల్లేటి కుర్రు బయలుదేరారు. అప్పటి నుంచీ మనస్సు లో ఉన్న ఉక్రోషం వెళ్ళగక్కాలనే చూశారు ఆనందం , విశాలాక్షి. కాని ఎప్పటి కప్పుడు ఏ చుట్టాలో, పనివాళ్ళో ఉండటం వల్ల, వాళ్ళ ఎదట బాబయ్య తో ఘర్షణ పడడం బాగుండదని ఊరుకున్నారు. ఇప్పుడు సమయం దొరికింది.; నాలుగూ అనేశారు.
    అలా అనేసి తమ హృదయ భారం తీర్చుకుందామనుకున్నారే కాని, దాని పరిణామం ఇలా ఉంటుందని వాళ్ళు ఊహించలేదు. వెంకట్రామయ్య అంత పౌరుషంతో సర్వమూ వదిలేసి, నిలుచున్న పళాన వెళ్ళి పోతాడని వాళ్ళు ఊహించ నైనా లేదు. తీరా అతను వెళ్ళి పోవడానికి ఉద్యుక్తుడైన సమయంలో విశాలాక్షి కి కోపం వచ్చింది. 'కన్న పిల్లలయితే ఇలా వదిలేసి వెళ్ళునా? మొత్తం మీద పినతండ్రి అనిపించు కున్నాడు. తండ్రి తండ్రే; పినతండ్రి పినతండ్రే! పోనీ వెళ్ళనీ!' అనుకుంది.
    వెళ్ళవద్దని అపు చెయ్యడమో, వెళ్ళుతుంటే ఊరుకోవడమో-- ఏది మంచిదో నిర్ణయించుకోలేక అలా చూస్తూ ఊరుకున్నాడు ఆనందం. అతను ఒక నిర్ణయానికి వచ్చేసరికి అంతా చెయ్యి జారిపోయింది. అప్పటికే బాబయ్య వెళ్ళి పోయాడు.
    ఏమూలో కొంచెం బాధ పడుతున్నా, మొత్తం మీద బాబయ్య వెళ్ళిపోయినందుకు సంతోషిస్తున్నవాడు ముకుందం. ఈ దెబ్బతో తన చేతిలోకి పెత్తనం వస్తుంది; విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చు. కవి సన్మానాలా, కవి సమ్మేళనాలా, పుస్తకావిష్కరణలా! ఒకటేమిటి? తన ఇష్టం.
    ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కాక, జరిగిన సంఘటనలను ఒకదాని కొకటి ముడి పెట్టి పర్యవసానాన్ని సరిగా గ్రహించలేక సతమతమవుతుంది జానకి. చిన్నప్పుడు తండ్రి పోవడం ఆమెకు తెలియదేమో , ఆ లేత మనస్సు ఇప్పటిదాకా ఏ విఘాతం కలగకుండా తల్లి ప్రేమలో , మేనమామల అనురాగం లో అన్నింటి నీ మించిన తాతగారి వాత్సల్యం లో పెరిగింది. పెద్ద తాతగారి దగ్గర ఆమెకు అంత చనువు లేదు. అందువల్ల అయన మరణం ఆమెకు అంతగా పట్టలేదు. అందరూ ఏడిస్తే తనూ ఏడిచింది. పైగా అప్పటికి బొత్తిగా అజ్ఞానం. ఇప్పుడిప్పుడే జ్ఞానం వచ్చి, లోకాన్ని అర్ధం చేసుకుంటున్న సమయంలో, లోక వృత్తాంతం ఇంత తీవ్రంగా ఇంత బలంగా అఘాతంగా అర్ధమయి రావడంతో జానకి మనస్సు బాగా వికలమై పోయింది. ఆరోజు ఎవరూ సరిగా భోజనాలు చెయ్యలేదు ముకుందం తప్ప.
    హృదయానికి వజ్రఘాతం లా తగిలిన ఆ హటాత్సంఘటన నుంచి వాళ్ళంతా కోలుకోవడానికి వారం పది రోజులు పట్టింది. ఈలోగా వీరిగాడూ, సత్తేయ్యా , పనిమనిషి వాళ్ళను చుట్టూ ముట్టేశారు -- "పెద్ద బాబుగారు కనిపించడం లేదేమిటి" అంటూ. ఏమి చెబుతారు? అక్కడికీ విశాలాక్షి కొంచెం సర్ధబోయింది -- "ఊరు వెళ్ళారు. కొన్నాళ్ళ లో వస్తారు " అని. "ఊరు వెళ్ళుతుంటే పొద్దున నాతొ మాట్లాడి నప్పుడు చెప్పకుండా ఉంటారా? పైగా అయన వెళ్ళి ఇన్నాళ్ళు ఉండిపోయే ఊరు మాత్రం ఏముంది?" అన్న వీరి గాడి అనుమానాలకు విశాలాక్షి సమాధానం చెప్పలేక పోయింది. విసుగెత్తి ముకుందం అన్నాడు: "లేకపోతె పెద్ద బాబుగారిని మేం దాచేశామురా/ బుద్ది లేకపోతె సరి. వెళ్ళి నీ పని చూసుకో." దానితో వీరిగాడు నోరెత్తలేదు. కాని వాడి మనస్సు లో ఏదో అనుమానం పీకుతూనే ఉంది. గుడ్ల నీళ్ళు కుక్కుకుంటూ సత్తేయ్యా ఒకటి రెండు మాట్లు అన్నాడు: "సూశావుట్రా -- నా సేవి లో ఒక్క మాటయినా ఎయ్యకుండా ఎల్లి పోయాడు మా రాజు. --ప్చ్! అవునులే. ఎందు కెయ్యాలి? నేను కూలి ముండావోడ్నీ: అయన పెబువూ."
    వెంకట్రామయ్య కనిపించక పోవడం, ముకుందమే వ్యవసాయం వ్యవహారం చూసుకుంటుండడం చూసి ఊళ్ళో పదిమందీ పది రకాలుగా అనుకున్నారు. బాగా పరిచయం ఉన్న ఏ శాస్త్రి గారి వంటి వాడో, గ్రామ మునుసబో ఇంటికి వచ్చి భోగట్టా చేశారు. వాళ్లకు అనుమానం కలగకుండా, ఏమీ తేల్చకుండా జాగ్రత్తగా సర్ది చెప్పి పంపించాడు ఆనందం. కొన్నాళ్ళు ఊళ్ళో కలిగిన సంచలనం క్రమంగా సద్దు మణిగింది.
    ముకుందం వ్యవసాయ పు పనులు ప్రారంభిస్తూ "దమ్ము చేసి ఊడ్పించాలంటే కనీసం అయిదారు వందలైనా కావాలి. మనదగ్గర ఇప్పుడా డబ్బు లేదు." అన్నాడు.
    "ఏ శాస్త్రి గారి దగ్గరో బదులడుగు. పంటలు రాగానే ఇచ్చేద్దాము" అంది విశాలాక్షి.
    "అడిగాను. అయన దగ్గర సర్దుబాటు కాదట." అన్నాడు ముకుందం.
    "మరయితే ఏం చేద్దాము?"
    "ఏముందీ? ఏ ఇల్లో తాకట్టు పెట్టి బాంకు లో తీసుకు రావాలి."
    "తాకట్టా? మన కా మాత్రం పలుకుబడి లేదా ఊళ్ళో? నోటు మీదో, నోటి మీదో అప్పు పుట్టదా?' అంది విశాలాక్షి.
    "ఎందుకొచ్చిన తాపత్రయం? పోనీ, అక్కయ్యా తాకట్టు పెడితే మాత్రం మనకి వచ్చే నష్టం ఏమిటి?" అన్నాడు ఆనందం.
    "సరే, మీ ఇష్టం " అంది విశాలాక్షి.
    మర్నాడు ఆనందం, ముకుందం సంతకాలు పెట్టి ఇల్లు తాకట్టు పెట్టారు.
    రోజులు గడుస్తున్నాయి. జానకి స్కూలు ఫైనల్ పాస్ అయింది. ముకుందం వ్యవసాయపు పనులలో మునిగి తేలుతూ, ఒక్క క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. వ్యవసాయపు అదునూ, పదునూ తెలియక పోవడం వల్ల ఏది ముందు చెయ్యాలో, ఎలా చేస్తే సుఖమో అర్ధం కాక కాళ్ళు విరగ తొక్కుకుంటున్నాడు. "అయ్యగారూ, అది అలా కాదు" అని ఏ సత్తెయ్య అయినా చెప్పబోతే "నాకు తెలుసు .నువ్వు సలహా ఇయ్య నక్కర లేదు" అని కస్సు మంటున్నాడు. ముకుందం ప్రవర్తన ముందే గ్రహించడం వల్ల వీరిగాడు మాత్రం అటువంటి సలహా సంప్రదింపుల జోలికి పోకుండా తన పనేదో తాను చేసుకు పోతున్నాడు. ముకుందం విసుగు ఆనందాన్నీ, విశాలాక్షి ని పని లేకుండా కూచున్న సోమరులని విదలించడం, పెంకిరకం అని జానకిని సాధించడం దాకా వచ్చింది. ఆనందం, విశాలాక్షి ఏదో సర్దుకు పోతున్నారు కాని, పౌరుష వంతురాలయిన జానకి తో చిక్కు వచ్చేలాగ కనిపించింది. ముకుందం విసుగు చూసి ఒకటి రెండు మాట్లు ఎదుర్కొంది -- "ఏమిటి మామయ్యా , నువ్వు పడుతున్న పాటు? ఇలా ఇంట్లో వాళ్ళ మీద అస్తమానూ విసుక్కుంటావు" అంటూ. దానితో ఇంట్లో పెద్ద గొడవ అయినంత పని అయింది. అంతా సర్దుబాటు చేసి ప్రశాంత వాతావరణం పునః స్థాపించే సరికి ఆనందం తల ప్రాణం తోకకు వచ్చింది. ఇలా అయితే ఏమీ లాభం లేదనుకుని ఆ సాయంత్రమే ముకుందం పొలం వెళ్ళిన సమయం చూసి ఆనందం విశాలాక్షి తో సంప్రదింప నారంభించాడు.
    "చూశావా, అక్కయ్యా! నాకేమో ఈ ఫైర్ బ్రాండ్ వాళ్ళ నిద్దరినీ ఒకచోట ఉంచడం మంచిది కాదేమో అనిపిస్తోంది."
    "ఏం చేద్దాము? అయినా దీని పొగరు రోజు రోజుకీ ఎక్కువయి పోతోంది. పెద్దంతరం చిన్నతరం లేకుండా ఏమిటిది? భయం , భక్తీ ఉండక్కర్లా?"
    "పోనీ, అది చిన్న పిల్ల అనుకో. వీడి పెద్దరికం ఎమేడిసింది?"
    "ఏమోరా-- నాకేమీ పాలుపోవడం లేదు."
    "నాకో ఆలోచన తట్టుతోంది , అక్కయ్యా."
    "ఏమిటది?"
    "జానకిని ఈ ఏడు , మనం ఇంత క్రితం అనుకున్నట్లు, కాకినాడ లో పి.యు.సి లో చేర్పిస్తే?"
    "ఆడపిల్లను ఒంటరిగా పోరుగూళ్ళో చదివించడమా?"
    "అదేమీ ఫరవాలేదు. అక్కయ్యా హాస్టల్ లో చేర్పిస్తే ఏ బెంగా ఉండదు."
    "వందో , రెండు వందలో ఎవరి దగ్గరో బదులు తెస్తాను. అనక వంట వచ్చాక తీర్చుకోవచ్చు."
    "ఎన్నని తీర్చు కుంటామురా? ఇప్పటికే ఇల్లు తనఖా పెట్టారా? ఇంకా ఎన్ని అప్పులు చెయ్యాలో' ఈ ముకుందం గారి హయాము లో! వీటన్నిటికీ తోడు ఇప్పుడీ రెండు వందలూ. ఇంతటి తోటి అయిందా? మళ్ళీ ప్రతి నెలా దానికి పంపే వందో ఏభయ్యో?"
    "నాకు ఉద్యోగం వస్తే నా జీతంలో నుంచి పంపిస్తూ ఉంటాలే జానకికి."
    "వెనకటి కేదో సామ్యం చెప్పినట్లుంది. నేను కట్టబోయే ఇంటి పెరట్లో, వెయ్యబోయే కొబ్బరి మొక్కలు కాయబోయే కాయల్లో , నీకో సగం నాకో సగం అన్నాడట నీలాటి వెర్రాడే. ఇంకా ఉద్యోగం లేదు; సద్యోగం లేదు. అప్పుడే నీ జీతం లో నుంచి పంపించే ఏర్పాటు చూస్తున్నావు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS