10
తూలి తన మోటారు సైకిలు కింద పడబోయిన వ్యక్తిని ఎడం చేత్తో పక్కకు నెట్టి స్టాండు వేశాడు తిలక్. ఆ వ్యక్తీ ముఖంలోకి పరిశీలనగా చూశాడు . గడ్డం మసి, కళ్ళు లోతుకు పోయి నీరసంగా ఉంది ముఖం. వేషధారణ చూస్తె పెద్ద మనిషి లాగే ఉన్నాడు. ఖద్దరు పంచె, కండువా ,లాల్చీ మాసిపోయినా ఖరీదు అయినవి లాగే కనిపించాయి తిలక్ కు. కాళ్ళకు మాత్రం జోళ్ళు లేవు.
"కొంచెం ఉంటె సైకిలు కింద పడుదురు. పైగా రాంగ్ సైడు లో నడుస్తున్నారు. ట్రాఫిక్ రూల్సు తెలియవా?......లేక.....పట్నం రావడం కొత్తా?' అన్నాడు తిలక్.
అంతకు రెండు రోజుల క్రితం పుల్లేటి కుర్రు లో బయలుదేరి, ఏ ఆలోచనా లేకుండా తిన్నగా కాకినాడ వచ్చేసి తర్వాత ఏం చెయ్యాలో తోచక ఆ వీధీ, ఈ వీధి తిరుగుతున్న వెంకట్రామయ్య తిలక్ ప్రశ్న విని నవ్వాడు. తిలక్ కేమీ బోధ పడలేదు. "అలా నవ్వుతారేమిటి?' అన్నాడు.
"అవును. రాంగ్ సైడు లో నడవడం అలవాటయి పోయి, రోడ్ రూల్స్ మరిచిపోయాను." ఏదో ఆలోచిస్తూ సాభిప్రాయంగా అన్నాడు వెంకట్రామయ్య.
"ఈ మధ్యన ఇదో ఫాషనయిపోయింది , ప్రతి దానికీ అర్ధం లేని ఓ వేదాంతపు పూత పుయ్యడం."
"అలా అనకు బాబూ. ఫాషన్ కోసం ఎవరూ వేదాంతం మాట్లాడరు." అన్నాడు బాధగా వెంకట్రామయ్య.
తిలక్ వెంటనే నొచ్చుకొని "అబ్బే, ఊరికే సరదాగా అన్నానండి." అన్నాడు.
ఆహా! అన్నట్లు తల ఆడించి వెంకట్రామయ్య ముందుకు అడుగులు వేశాడు. వెనక నుంచి ఆయనను పరిశీలిస్తున్న తిలక్ అయన నీరసంగా తూలుతూ నడవడం గమనించాడు. చటుక్కున రెండు మూడు అడుగులు వేసి ఆయనను కలుసుకుని "మీరివాళ భోజనం చేశారా?" అన్నాడు.
"ఏం అలా అడుగుతున్నావు? నిన్న నెవరూ నన్ను ఇలా అడగలేదు. అడిగి ఉంటేనా...."
"ఊ! అడిగి ఉంటె?" తిలక్ రెట్టించాడు.
"నిన్ననే భోజనం చేసి ఉందును."
ఆ సమాధానంతో తిలక్ విస్తుపోయాడు. తను అప్పుడే హోటల్ లో కడుపు నిండా ఫలహారం చేసి వస్తున్న సంగతి జ్ఞాపకం తెచ్చుకుని వెంటనే "అయితే నాతొ రండి, సార్ భోజనం చేద్దురు గాని " అన్నాడు.
"నీతోనా? ముఖం ఎరగని వాడు పెట్టించే భోజనమా?....అక్కర్లేదు."
"ఏం?"
"నేనేమైనా ముష్టి వాడి ననుకున్నావా?" తీవ్రంగా అనేసి వెళ్ళిపోయాడు వెంకట్రామయ్య. కొంచెసేపు అటు చూసి నిట్టూర్చి సైకిలు ఎక్కి వెళ్ళిపోయాడు తిలక్, మెడికల్ కాలేజీ వైపు.
సాయంత్రం కాలేజీ వదలగానే దుస్తులు మార్చుకుని టెన్నిసు రాకెట్ తీసుకుని వెళదామని తన గదికి వచ్చాడు తిలక్. తీరా చూస్తె మెట్ల మీద కూర్చుని ద్వారబంధానికి చేరబడి ఉన్నాడు మధ్యాహ్నం తను చూసిన అభాగ్యుడు. తీరా దగ్గరకు వెళ్ళి చూస్తె సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలిసింది. పక్క ఇంటి వారి నౌకరు సాయంతో లోపలికి తీసుకువెళ్ళి తన బెడ్ మీద పడుకోబెట్టాడు. హోటల్ నుంచి కాఫీ తెమ్మని నౌకరు కు ఫ్లాస్కు ఇచ్చి, ఫాన్ వేశాడు. ఫాన్ గాలికి కొంతసేపయ్యేసరికి తేరుకున్నాడు వెంకట్రామయ్య.
కళ్ళు తెరుస్తూనే తిలక్ కేసి చూశాడు, తిలక్ చిరునవ్వు నవ్వాడు వెంకట్రామయ్య కూడా నీరసంగా నవ్వి "భగవంతుడు మొత్తం మీద నీ దగ్గరికే చేర్చాడు" అన్నాడు. కొంత సేపయాక ఫ్యూన్ తెచ్చిన కాఫీ పుచ్చుకుని కొంచెం స్థిమిత పడ్డాడు. తర్వాత లేస్తూ "అబ్బాయ్, వెళ్లొస్తాను" అన్నాడు.
"అమ్మమ్మ. ఒక్కనాటికీ వీల్లేదు. మీరీ రాత్రికి నాతొ భోజనం చేసి తీరాల్సిందే. భోజనం చేసి, ఇవాళటికీ ఇక్కడ విశ్రాంతి తీసుకుని రేపు పొద్దున్న వెళ్ళుదురు గాని మీ ఇష్టం వచ్చిన చోటికి" అన్నాడు తిలక్ వెంటనే.
తనెవరో తెలియకుండా , అన్యాజానురాగంతో ఆ అబ్బాయి ఇంత అభిమానం చూపించడం తో వెంకట్రామయ్య కు చాలా ఆనందం వేసింది. లోకంలో ఇంకా మంచితనం పోలేదు. జాలి,దయ, దాక్షిణ్యం పూర్తిగా తుడిచి పెట్టుకు పోలేదు ఈ నవీన యుగంలో. ఇతనేవరు తనేవరు? తనకూ ఇతనికీ సంబంధం ఏమిటి? ముక్కూ మొహం తెలియ కుండానే ఇంత ఆప్యాయత చూపిస్తున్నాడంటే మానవీయత ఇంకా ఈ ప్రపంచం లో ఉంది అన్నమాట!
తను ఎవరి నయితే పుత్ర తుల్యులు గా తలుచుకున్నాడో, ఎవరి సుఖ దుఃఖాలూ , మంచి చెడ్డలూ తనవి గా తలపోసి కంటికి రెప్పలా పెంచుకుంటూ వచ్చాడో, ఎవరిని చూసుకుని తన భార్యనూ పిల్లవాడినీ కూడా వదులుకుని ఊరుకున్నాడో, ఎవరి చేతుల్లో తన ముప్పు గడుస్తుందని ఆశించాడో ఆ పిల్లలు -- తన అన్నగారి పిల్లలు-- ఇవాళ తనకు ఏవేవో ఆపాదించి, మనసు విరుచుకుని , మమత తెంపుకుని తనను వదులు కున్నారు.
అన్నగారి పిల్లలు కనక అంతటితో వదిలి పోయింది. అదే తన పిల్లవాడయితే వదులునా? వాడు వద్దన్నా, తను కాదన్నా తమ మధ్య ఉన్న బంధం పోతుందా? తనకు ఎంత ఇష్టం లేకపోయినా లోకం కోసం అయినా వాడి దగ్గర ఉండి పోవలసి వచ్చును. ప్రపంచం కోసమేనా వాడు తనను ఆపుచేసి ఉండును. అసలు ఆ పద్దతే వేరుగా ఉండును.
ఆ! తన వెర్రి గాని, కొడుకయితే ఇంత కన్నా ఎక్కువ ఒరగబెడతాడని నమ్మకం ఏది? ఇన్నాళ్ళూ పెంచి పెద్ద చేసి, ప్రేమ పెంచుకున్న ఆనందం, ముకుందమే ఇలా ప్రవర్తించాక మొహం ఎరక్కుండా , పుట్టిన తర్వాత ఒక్కసారయినా చూడకుండా ఇవాళ వెళ్ళి 'నేను మీ నాన్నను' అంటే ప్రేమతో వచ్చి కౌగలించు కుంటాడా? ఒక్క నాటికీ జరగదు. అందుకే తను పుల్లేటి కుర్రు నుంచి కోటిపల్లి రేవుకు వచ్చి బస్సు ఎక్కేటప్పుడు త్రుటి కాలం "పోనీ రామచంద్ర పురం వెళ్ళితేనో" అని అలోచించి, వెంటనే ఆ ఆలోచన మాని కాకినాడ వచ్చేశాడు.
నయం! వెళ్ళాడు కాదు. 'ఇన్నాళ్ళ కు మేము కనిపించామా? అయితే అన్నగారి పిల్లలతో చెడిందన్నమాట!' అంటూ వెటకారం తో, దేప్పుళ్ళతో ఈసడించి ఉండును కౌసల్య. భోజనం లేక చావనైనా చస్తాడు గాని దేహీ అని ఇవాళ వీరి దయకూ, వారి దయకూ తల ఒగ్గుతాడా?
భార్య అయితే మాత్రం? మానుషం మానుషమే. చూడగా, చూడగా చుట్టాల కంటే ఏ సంబంధమూ లేని ఇలాంటి అపరిచితులే నయం అనిపిస్తున్నది. పాపం! ఈ అబ్బాయి తనమీద ఎంత అభిమానం చూపిస్తున్నాడు!
ఇలా దీర్ఘంగా ఆలోచిస్తున్న వెంకట్రామయ్య ను చూసి తిలక్ అన్నాడు: "ఏమిటండి , అంత ఆలోచిస్తున్నారు? పోనీ , నాతొ ఉండటానికి మీకు అంత మొహమాటం అయితే మీ చుట్టాల పేరు ఏదైనా చెప్పండి. అక్కడికి తీసుకు వెళ్ళి దిగాబెడతాను."
వెంటనే వెంకట్రామయ్య సంబాళించుకుని "అబ్బెబ్బే. మొహమాటం ఏమీ లేదు నాయనా. చుట్టా లేవరింటికీ వెళ్ళను." అన్నాడు. దానితో తిలక్ ముఖం విప్పారింది.
ఆ రాత్రి భోజనాలయ్యాక అతని భోగట్టా తెలుసుకుందామని "అయ్యా, ఒక్క విషయం అడుగుతాను. చెప్తారా?" అని అన్నాడు తిలక్. "అసలు మీదే వూరు? మీకు కావలసిన వారు ఎవరూ లేరా/ మీరిలా ఎందుకు వచ్చేశారు?"
ఎంతసేపటి కి జవాబు చెప్పలేదు వెంకట్రామయ్య. "మీకా ప్రశ్న బాధగా ఉందా? చెప్పడం ఇష్టం లేదా? పోనీండి, పోనీ ఈ విషయం చెప్పండి. మీ భవిష్యత్ కార్యక్రమం ఏమిటి?"
చాలాసేపు ఊరుకుని వెంకట్రామయ్య పేలవంగా అన్నాడు: "నాకు భూత భవిష్యత్తు లు లేవు. ఉన్నదల్లా వర్తమానమే. నా గత చరిత్ర ఏమీ అడగకు. అది జ్ఞాపకం తెచ్చుకుని అస్తమానూ పశ్చాత్తాప పడడం నాకు ఇష్టం లేదు."
"క్షమించండి . పోనీ, మీ పేరైనా అడగవచ్చా?"
"అదీ వద్దు. పేరుతొ మనిషి పరిమితుడయి పోతున్నాడు. తర్వాత దేశం, సంఘం , కులం చుట్టరికం -- ఇవన్నీ అతని చుట్టూ గీతలు గీసి పరిధులు ఏర్పరచి ఇంకా సంకుచితుడు గా చేస్తున్నాయి. ఇవన్నీ చెరుపుకుని , తన పేరు తాను మరిచిపోయి, నేను మొదట మానవుణ్ణి , తుదకూ మానవుడ్నే -- అనేస్థితి కి రావాలి మనిషి. అందువల్ల నా పేరు వీలైనంత వరకూ నేనే మరిచి పోదలిచాను. ఇంక నీ కెందుకు?"
తిలక్ ఏమీ మాట్లాడలేదు.
'అలాగే నీ పేరు నా కక్కరలేదు . నేనొక ముసలాడిని. నువ్వొక మంచి కుర్రాడివి అంతే."
మర్నాడు వెంకట్రామయ్య వెళ్ళిపోలేదు. అసలతనికి వెళ్లిపోవాలనే ఆలోచనే రాలేదు. ఆదివారం కావడం వల్ల తిలక్ కూడా గదిలో ఉన్నాడు. ఇద్దరూ తమ తమ సంగతులు తప్ప, లోకం సంగతులు ఎన్నో ముచ్చటించుకున్నారు. అందులో చాలా భాగం వెంకట్రామయ్య చెప్పడం, తిలక్ వినడం క్రిందే జరిగింది.
ఇలా రెండు రోజులు గడిచాయి. ఈ రెండు రోజులలో వాళ్ళిద్దరి మధ్యా పరిచయం మరికొంచెం ఎక్కువైంది. వెంకట్రామయ్య అతన్ని "అబ్బాయ్" అని పిలుస్తున్నాడు. తిలక్ వెంకట్రామయ్య ను "బాబుగారూ!' అని పలకరిస్తున్నాడు. రోజురోజుకూ తనకు సన్నిహితుడవుతున్న తిలక్ ను చూసి నిట్టూర్చి 'మళ్ళీ ఇతనితో అనుబంధం పెట్టుకుంటున్నాను. దీని పర్యవసానం ఎలా ఉంటుందో? మళ్ళీ ఇది దృడం కాకుండా ఈ వాతావరణం నుంచి తప్పుకోవాలి' అనుకున్నాడు.
ఓరోజు ప్రొద్దుటే లేచి "అబ్బాయీ, నే నింక వెళ్ళొస్తా" అన్నాడు వెంకట్రామయ్య.
తిలక్ ఆశ్చర్యంగా "ఎక్కడికి ?' అన్నాడు.
"ఎక్కడికో ! ఎన్నాళ్ళ ని నీ దగ్గర ఉండడం?"
"ఎక్కడికి వెళ్ళుదామని? ఏం చేద్దామని?" నిర్ణయం ఏమీ లేకుండా బయలుదేరితే ఎలాగ?"
"నిర్ణయం ఏముంది? అసలంటూ బయల్దేరితే భగవంతుడే ఏదో దారి చూపిస్తాడు."
"అబ్బే -- అలా గాలి జీవితానికి మిమ్మల్నోక్క నాటికీ వదిలేయ్యను."
ఎన్నాళ్ళని అతని నెత్తి మీద కూర్చుని తినడం? ఒక రోజల్లా ఆలోచించాడు. అతనికో ఆలోచన తట్టింది. ఆ రాత్రే 'అబ్బాయీ , నాకు గవర్నమెంటు వారిచ్చిన అయిదేకరాల బంజరు ఉంది సర్పవరం లో " అన్నాడు.
"ఏమిటి? ఇక్కడికి నాలుగు మైళ్ళ లో ఉన్న సర్పవరం లోనే?"
"ఊ. అది సాగు లోకి తీసుకు వచ్చి వ్యవసాయం చేసుకుంటే ...."
"బంజరు సాగు చెయ్యాలంటే అయిదారు వందలు పెట్టుబడి పెట్టద్దూ? పోనీ, దానికేం లెండి. నేనిస్తానా డబ్బు."
"నువ్వా? వద్దు."
"పోనీ, అప్పుగానే ఇస్తాను. సరా?"
"కాని....కాని....గవర్నమెంటు ఇచ్చిన పట్టా ప్రస్తుతం లేదు. నా దగ్గర."
"దానికేమీ లెండి. డూప్లికేట్ పట్టా పుట్టించవచ్చు. మా స్నేహితుడి తండ్రే ఇక్కడ అసిస్టెంటు కలెక్టరు." అన్నాడు తిలక్.
