ఇద్దరు కొడుకులు పెరిగి అమెరికా వెళ్ళి ప్రయోజకులు కాగానే తన కర్తవ్యం తీసిపోయినట్లు నిద్రలోనే నిష్క్రమించింది అలివేలు. అప్పటినుంచి తన జీవితం దీపం లేని గుడిలా మారిపోయింది.
భార్య ఉన్నప్పుడు చాలామంది మగవాళ్ళలా శాస్త్రికి కూడా ఆమె విలువ తెలియలేదు.ఆమె పోయాక అంతవరకు అర్ధంకాని సత్యం వెలుగులోకి వచ్చి జ్ఞానోదయమయింది. అలివేలు ఉన్నప్పుడు ఎప్పుడూ ఆమెని అగౌరపరచలేదు. గానీ ఆమెలేని జీవితం స్మశానంలో ఒంటరి నడకలా ఇంత నిస్సహాయంగా ఉంటుందని మాత్రం ఊహించనే లేదు. పరమేశ్వరశాస్త్రి ఆలోచిస్తూ నీళ్ళలోంచి దోవచేసుకుని వెళ్తున్నాడు.
అలివేలు పోయినప్పుడు ఇద్దరు పిల్లలకు అమెరికా నించి రావటానికి కుదర్లేదు. నట్టింట్లో శవాన్ని పెట్టుకొని వాళ్ళకోసం ఎంతగానో ఎదురుచూశాడు. ఏదో ఆశ! అలివేలు పిచ్చిది! వాళ్ళకి జ్వరం వస్తే ఎన్ని రాత్రిళ్ళు నిద్రమానేసింది. ఎన్ని రాత్రిళ్ళు నిద్ర మానేసింది. ఎన్ని రోజులు అన్నం మానేసి సపర్యలు చేసింది... వాళ్ళకి మాత్రం అమ్మని కడసారి చూడటానికి తీరికేలేదు. పైగా అంతిమ సంస్కార దృశ్యాలు వీడియో తీసి పంపమని పెద్దాడు అంటే.
"ఎందుకన్నయ్యా! వేస్ట్ ఆఫ్ మనీ! చూసి ఏం చేస్తాం చెప్పు. బాధపడటం తప్ప" అంటూ వారించాడు చిన్నవాడు.
తన మనసు పాతాళంలోకి కుంగిపోయినా ఏమీ అన్లేకపోయాడు. "ఇల్లు అద్దెకిచ్చో అమ్మేసో మాతో వచ్చేయండి" పెద్దాడి సలహా.
పెద్దకోడలు పక్కకి వెళ్ళి ఏదో సైగ చేసింది. వాడే మళ్ళీ అన్నాడు.
"పోనీ ఇక్కడే ఏదైనా వృద్ధాశ్రమంలో... అక్కడికొస్తే ఎటూ మీకు తోచదు" నసిగాడు. చిన్నవాడు వంటపాడాడు. ఏదో చెప్పబోతున్న స్నేహితుడు నాగభూషణం చేయిపట్టుకుని సున్నితంగా ఆపాడు తనే.
ఈ పిల్లల కోసమేనా ఆటో ఎక్కితే డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయనీ మైళ్ళ దూరం నడవటం, అన్నంలోకి రెండు ఐటమ్స్ చేసుకోకుండా ఒకటే చేసుకొని తినటం, పండక్కి బట్టలు మానేసి వాళ్ళకి పుస్తకాలు కొనటం...
"పోనీలేరా! కొన్నాళ్ళు చూద్దాం. అంతగా ఉండలేకపోతే ఏదో ఒకటి చేస్తాను" ఆ సంభాషణను తనే తుంచేశాడు. చాలా రిలీఫ్ గా ఫీలయిన కొడుకులు విషాదాన్ని నటిస్తూ ఆనందంగా అమెరికా ప్లయిట్ ఎక్కేశారు.
ఆలోచనల అలల మధ్య మరో అడుగు వేశాడు శాస్త్రి.
నీళ్ళ అలలు మోచిప్పల్ని చేప పిల్లల్లా చుట్టుకుంటూ చుట్టాల్లా పలకరిస్తున్నాయి. అలివేలు అస్థికల్ని ఇలా కృష్ణనీటిలో పెన్నిధిని జారవిడిచినట్లు కలిపేశాడు. ఇవ్వాళ మాత్రం మనసంతా ప్రశాంతంగా ఉంది.
"ఇంకెన్నాళ్ళండీ! ఈ రెండేళ్ళు కష్టపడితే నా బిడ్డలు రెండుచేతులా సంపాదించి మనల్ని నేలమీద నడవనివ్వరు" అలివేలు మాటలు నిజం అవుతున్నాయి. నేలమీద నడవనివ్వటం లేదు...
'స్వాతి'లో మాలతీచందూర్ గారు పరిచయం చేసిన నవల 'అమ్మకేమయింది' చదివి ఏడ్చేశాడు తను. నిజంగా తల్లికోసం అంతగా తపించే పిల్లలుంటారా? తమకంటూ ఒక కుటుంబం, ఒక ప్రపంచం ఏర్పడిన తర్వాత అమ్మ గురించి... ఆవేదనతో రెపరెపలాడే ఆమె జీవితం కోసం చేతులు కాపుకాసే పిల్లలుంటారా! పిల్లల కోసం తల్లిదండ్రులు చూపించే ప్రేమ, తపనల్లో కనీసం పదోవంతయినా పిల్లలు వాళ్ళ పట్ల చూపించలేరా?
భారంగా మరో అడుగేశాడు శాస్త్రి. నీళ్ళు తొడల దాకా వచ్చాయి. చిన్నప్పుడు నీళ్ళల్లో ఆడుతుంటే జలుబు చేస్తుందని గాభరాగా వళ్ళంతా తుడిచి బట్టలు మార్చేది అమ్మ. ఇవ్వాళ అమ్మ ఎందుకో మరీమరీ గుర్తొస్తున్నది.
దూరంగా కిట్టప్ప శాస్త్రికేసి ఆదుర్దాగా చూస్తున్నాడు. వాడి మోహంలో క్రమక్రమంగా ఆందోళన చోటు చేసుకుంటోంది. ఏదో అర్ధమయినట్లుగా శాస్త్రికేసి కుడిచెయ్యి ఊపుతూ గట్టిగా అరిచాడు.
"పంతులుగారూ! ఇంక లోతెళ్ళకండి. తొరగా బయటికి వచ్చేయండి" అని మళ్ళీ మళ్ళీ కేకలు పెడుతున్నాడు.
ఈ కేకలేవీ శాస్త్రి చెవులకి సోకినట్లు లేవు. సోకినా ఆయన పట్టించుకోదల్చుకోలేదేమో! అడుగులు పడుతూనే వున్నాయి. నీళ్ళు భుజాలదాకా వచ్చాయి.
కిట్టప్ప తీరం దగ్గర అటూ ఇటూ పరిగెడుతూ అరుస్తున్నాడు. వాడి గొంతులో దుఃఖపు జీర పంజరంలో పక్షిలా గిజగిజలాడుతోంది. నదిలోంచి శాస్త్రి కిట్టప్పకేసి చేతులూపాడు. ఇక వెళ్ళిపొమ్మన్నట్లు. కిట్టప్ప గుండె గుభేలుమంది .శాస్త్రి రెండుచేతులు పైకెత్తి పరమేశ్వరుడికీ, జన్మనిచ్చిన తల్లికీ నమస్కారం చేశాడు. ఆయన కళ్ళముందు చివరిగా జ్వర భారంతో దిక్కులేక తను మంచాన పడిన దృశ్యం, అలివేలు చావు మెదిలాయి.
"భగవంతుడా! తల్లిదండ్రుల మీద దయా ప్రేమ లేని పిల్లల్ని ఇచ్చేకన్నా గొడ్రాలుగా మిగుల్చు. నాలాంటి వారికి ఇచ్ఛామరణం ప్రసాదించు" అని చేతులెత్తి ప్రార్ధించాడు.
తర తరాల భారతీయ కుటుంబ సంస్కృతీ గోపురంలా ఆ నమస్కారం క్రమంగా గంగలో మునిగిపోయింది.
నేలమీద కూలబడి ఏడుస్తున్న కిట్టప్ప ఏవో గుర్తొచ్చినట్లు సంచీ తీశాడు. కొన్ని వందల కట్టలు... ఓ ఉత్తరం.. విప్పి చదివాడు.
నాయనా కిట్టూ,
నువ్వు జీర్ణించుకోలేని నిజం. ధర్మరాజు వెంట యమునిలా నువ్వు చివరిదాకా నా వెంట వచ్చావు. నా ఇల్లు నీ పేర రాశాను. ఈ డబ్బులో కొంత నా కర్మ కాండలకి వాడి మిగిలింది నువ్వు తీసుకో... నా శవసంస్కారం నువ్వే చేయి నా కొడుకులకి కబురు పంపక్కర్లేదు. నీకు చేతనైతే నీలాంటి అనాథని చేరదీయి. అలివేలమ్మ ఋణం ఇలా తీర్చుకో.. నీకు శుభం.. ఆశీస్సులతో.. శాస్త్రి.
కిట్టప్ప గుండెలు పగిలేలా ఏడ్వలేదు .శాస్త్రి వాడికి నేర్పిన చదువు ఆయన కడసారి కోరిక తెలుసుకోవటానికి ఉపయోగపడింది. కిట్టప్ప రాల్చే అశ్రుధారలు మానవసంబంధాల మీది నమ్మకాన్ని మళ్ళీ చివురింపజేస్తున్నాయి.
* * *
