"ఈ అనాధాశ్రమం వాస్తవానికి మల్లేష్ తండ్రిగారు స్థాపించారు. అప్పటినుంచీ ఎన్నో వేలమంది అనాధలకు ఈ సంస్థ అపూర్వమయిన సేవ చేసింది. తమ తండ్రిగారు చనిపోయాక ఆ భారాన్ని మల్లేష్ గారు తమ భుజస్కందాల మీదకు తీసుకున్నారు.
ఇన్ని సంవత్సరాలుగా ఈ సంస్థను నడుపుతున్నా మల్లేష్ గారు ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్కరినీ కూడా ధన సహాయంగానీ మరే ఇతర సహాయం గానీ అడగలేదు.
ప్రభుత్వాలే అప్పు తీసుకోకుండా జరగని పరిస్థితుల్లో ఆ మహనీయులు మల్లేష్ గారు మరి ఇంతమంది అనాధలున్న ఈ సంస్థ భారాన్ని ఒంటరిగా ఎలా మోస్తున్నారో నాకు తెలీటం లేదు. ఆయన చేస్తున్న ఈ అనర్గళ కృషికి మా ప్రభుత్వం కూడా మాకు తోచినంత సాయం చేయటం మా బాధ్యతగా నేను భావిస్తున్నాను.
ఈ సందర్భంగా శ్రీ మల్లేష్ గారి భాగ్యనగర్ అనాధశరణాలయానికి భవన నిర్మాణంకోసం రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇవాళ ఇస్తున్నామని తెలియజేయటానికి సంతోషిస్తున్నా!"
చప్పట్లు, ఈలలు మార్మోగిపోయాయి.
అప్పటికప్పుడే ముఖ్యమంత్రి ఆ స్థలం కాగితాన్ని మల్లేష్ కందించాడు. ఫంక్షన్ ముగిసింది.
రిపోర్టర్లు మల్లేష్ చుట్టూ మూగి ఆ స్థలం గురించి వివరాలడిగారు.
"రవీంద్రభారతి పక్కనే వున్న జాగా మా అనాధశరణాలయానికిచ్చి మా సంస్థ అభివృద్ధికి సహాయంజేసిన ముఖ్యమంత్రి పట్ల కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాల్నో నాకు సమజ్ కావటం లేదు" అన్నాడతను.
"రవీంద్రభారతి పక్కన ఎక్కడ సార్?"
"అదేనయ్యా! అసెంబ్లీ బిల్డింగ్ పక్కకి-"
అందరికీ నోటమాట పడిపోయింది.
"ముఖ్యమంత్రి అసెంబ్లీని రాసిచ్చాడా?"
గంటసేపట్లో ముఖ్యమంత్రి పాలిపోయిన మొహంతో మల్లేష్ దగ్గరకొచ్చాడు.
"ఏమయ్యా అట్లా చేశావు? ఏదొక గవర్నమెంట్ లాండ్ చూసి తీస్కోమంటే నాకు తెలీకుండా నన్ను తాగించి అసెంబ్లీ భవనం రాయించుకుంటావా? నీకేమయినా సిగ్గుందా?" కోపంతో అరిచాడతను.