Previous Page Next Page 
కౌసల్య పేజి 16

 

    "మేము పెద్దవాళ్ళ మయ్యామనే కదా నీ బాధ?"
    "బాధ!....అవును బాదే!" వెర్రిగా నవ్వాడు వెంకట్రామయ్య.
    "నువ్వు పైకి ఎంత ప్రేమ నటిస్తున్నా , నీ చేతల్లో తెలుస్తోంది , నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నదీనూ."
    "ఒరేయ్ , ముకుందం! ఇంతకన్నా ఏ కత్తో తీసి గుండెల్లో పొడవ కూడదు?" ముకుందం ఏదో అనబోతుంటే అప్పటిదాకా జరుగుతున్నాదంతా చూస్తూ నిలబడ్డ ఆనందం, రెండడుగులు ముంచుకు వేసి "నువ్వు ఊరుకో" అన్నాడు.
    "అననీరా. అననీ వాడిని మధ్యలో ఆపకు" అన్నాడు వెంకట్రామయ్య.
    "నిన్ను అనడం వల్ల మాకు కలిసి వచ్చేది మాత్రం ఏమిటి? జరిగిన దేదో జరిగిపోయింది."
    "ఆ జరిగి పోయినదే ఏమిటంట? మీకు నేను ఏమి అన్యాయం చేశాను?"
    "అబ్బే ఏం చెయ్యలేదు." వెటకారంగా అంది విశాలాక్షి.
    "ఉండు , అక్కయ్యా . నేను చెప్తాను. ఇదిగో, ఇలా విను. దాయాదులు , అన్నదమ్ముల వాళ్ళు అసహనంతో మనకు సర్వనాశనం తల పెడతారనేది ఎంత సత్యమో మాకు అనుభవం వల్ల ఇప్పుడు తెలిసింది. నీకో సంసారమూ, సుఖమూ అంటూ లేకపోవడంతో ఇతరుల సంసారాలు -- అందులో ముఖంగా నీ తోడ బుట్టి నవాడి బిడ్ద్దల సౌఖ్యం , ఆనందం చూసేసరికి నీలో అసహనం బయలుదేరింది."
    ఆ మాట ఆశని పాతంలా తగిలేసరికి "ఆ!" అని మ్రాన్పడి అలాగే ఉండి పోయాడు వెంకట్రామయ్య.
    ఆనందం తిరిగి చెప్పడం ప్రారంభించాడు . "దానితో నీ సాయశక్తులా మా అభివృద్ధి కి అడ్డు నిలవాలని ప్రయత్నించావు. మొదట్లో నా చదువుకి విఘాతం కలిగించావు. ఈఏడు వద్దు, పై ఏటికి చదివిస్టాలే అని ఆశ చూపి, తీరా సమయం వచ్చేసరికి వాన వచ్చి పంట పోయిందని వంక పెట్టావు."
    "వంకా! అది వంకా?"
    "ఆ , ముమ్మాటికీ అలా పంట పాడవటానికి కారణం నువ్వే. బుధవారం నాడు మాసూలు చేయిస్తే ఎక్కడ బాగుపడి పోతామో అని, శుక్రవారం నాటికీ వాయిదా వేసి, సిద్దాన్నం అంతా మట్టి పాలు చేశావు. ముకుందం అన్నయ్య హెచ్చరించనే హెచ్చరించాడు. అయినా మాకు నీ మీద ఉన్న అచంచల విశ్వాసం వల్ల వాడి మాట చెవిని పెట్టలేదు మేము, అందుకు శాస్తి అయింది."
    వెంకట్రామయ్య గుండెలకు తక్కేన పొదలు గీచుకుంటూన్నాయి. వినడమే అతని విధి అయింది.
    "సరే. నా చదువూ , ఈ సంసారపు ఆర్ధిక పరిస్థితి అలా పాడు చేశావు. అంతటితో తృప్తి కాలేదు నీకు. నీకు సంసార సుఖం లేదు కనక, ఇంకెవరికి ఉండటం నువ్వు సహించవు. నీ అభిమతం ప్రకారమే భగవంతుడు కూడా సాయం చేసి అక్కయ్య నీ, అన్నయ్య నీ అలా చేశాడు. ఇంక మిగిలింది నేను. నేను మాత్రం ఎందుకు సుఖించాలి అని నీ ఉద్దేశం. అందుకే అన్నివిధాలా అనుకూలమైన సంబంధం అందుబాటులో ఉండి కూడా, ఆ దరిద్రపు గొట్టు సంబంధాన్ని నిశ్చయం చేశావు. నాకా గుది బండని తగిలించావు. జన్మ జన్మలకి జ్ఞాపకం ఉండే ఉపకారం చేశావు. ఇదంతా ఎందువల్ల? నిన్ను నమ్మడం వల్లే కదా? అంతా నీదే భారం అని గుడ్డిగా నిన్ను విశ్వసించడం వల్లే కదా? మామీద ఎందు కింత కక్ష? మేము నీకేమీ అపకారం చేశామని?' కంఠం హెచ్చించి దుఃఖంతో అరిచాడు ఆనందం.
    ఆనందం అంటున్న మాటలన్నీ శూలల్లాగ గుండెలను చీల్చి వేస్తుంటే నిస్తేజుడై నిలబడి ఉండిపోయాడు వెంకట్రామయ్య. మనస్సంతా వికలం అయిపొయింది. మెదడు పని చెయ్యడం మానేసింది. జవాబెమీ చెప్పకుండా ఉండి పోయిన వెంకట్రామయ్యను చూసి తమ అభిప్రాయాన్ని మరీ బలపరుచు కోసాగారు విశాలాక్షి, ముకుందమూ, ఆనందమూను. తన ఆశయ వృక్షం ఆశని పాతం లాంటి ఈ హటా త్సాంఘటనకు కూలిపోతుంటే చూస్తూ ఊరుకో లేకపోయాడు వెంకట్రామయ్య. అగ్ని పర్వతం లా బద్దలై పోతున్న గుండెను చిక్క బెట్టుకొని , అబ్ది ఘోష లాగ ఘార్ణిల్లుతున్న మనస్సంచలనాన్ని కొంచెం సేపు అనగించుకొని, సప్తకుల పర్వతాలు కదిలి పోయి భూదేవి భయంకరంగా కంపిస్తున్న సమయంలో భయోత్పాతం తో పరిగెడుతూ పరిగెడుతూ దారిలో దొరికిన ఏ చిన్న  మొక్కనో పట్టుకుని ప్రాణాలను రక్షించుకోవాలని తాపత్రయపడే ప్రాణి లాగ ఆశతో ఒకే ఒక్క మాట అన్నాడు.
    "సరే....సరే. మీ ముగ్గురూ అలాగే అనుకుంటున్నారా?...... మంచిదే. కాని..... కాని ....నేను చెప్పేది కూడా కొంచెం వినండి."
    "ఎందుకు వినడం? ఆ మాత్రం ఊహించు కొగలము. ఇవేవీ నువ్వు దురభిప్రాయంతో చెయ్యలేదనీ, ప్రతి పని వెనకా ఎంతో సదభిప్రాయం, మా మేలు కోరే దృడమైన సత్సంకల్పం ఉన్నాయనీ అంటావు. అంతేగా?" అన్నాడు ముకుందం.
    "అబ్బాయీ , నువ్వు తొందరపాటు మనిషిని. నువ్వు ఏమన్నా నాకు బాధలేదు. ఆ , ఏదో తెలియక అన్నాడని సహించగలను. కాని, విశాలాక్షీ ఆనందం కూడా అదే అభిప్రాయంలో ఉన్నారంటే....." ఆపైన మాట్లాడలేక పోయాడు వెంకట్రామయ్య.
    కొంచెం సేపు ఊరుకొని వారికేసి చూశాడు వెంకట్రామయ్య. వాళ్ళు తలలు వంచుకొని మౌనంగా ఉన్నారు. జానకీ కేసి చూశాడు. పైట తో కళ్ళు తుడుచుకొని తాతకేసి ఆశగా చూసింది.
    వాతావరణం అంతా పూర్తిగా మారిపోయింది. ఆ విశాలాక్షి కాదు. ఆ ఆనందం, ముకుందం కారు వీళ్ళు. పూర్తిగా మారిపోయారు. చిన్నప్పుడు తను ఎత్తుకుని మోశాడు విశాలాక్షి ని. అమ్మ పెట్టిన అన్నం తిననని మారం చేస్తుంటే కధలు చెబుతూ గోరు ముద్దలు పెట్టాడు ముకుందానికి. తల్లి పోయిన రోజుల్లో పసి పిల్లవాడుగా ఉండి రాత్రిళ్ళు నిద్రపోక ఏడుస్తుంటే భుజం మీద పడుకో బెట్టుకొని రాత్రి తెల్లవార్లూ తిప్పేవాడు ఆనందాన్ని, మొన్న మొన్నటి దాకా. అంతెందుకు? ఈ క్షణం దాకా వాళ్ళు తన దృష్టి లో పసిపిల్లలు. తన రక్షణ లో పెరిగే అమాయకపు కూనలు.
    వాళ్ళకు రెక్కలు వచ్చాయని ఇవాళ తనకు హటాత్తుగా తెలిసింది. అదైనా వాళ్ళు గట్టిగా తెలియబరిచిన తర్వాత తెలిసింది. ఇంతవరకూ తెలుసుకోకపోవడం తన అజ్నాతే. ఇంక వాళ్ళకు తన అవసరం లేదు. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకగలరు. ఇంకా వాళ్ళ నెత్తి మీద కూచుని పెత్తనం చెలాయించడం భావ్యం కాదు. తను ఎంత చెప్పున అక్కడ నుంచి తప్పుకుంటే అంత మంచిది.
    అయితే అన్నయ్యకు ఇచ్చిన వాగ్దానం?
    ఇచ్చిన వాగ్దానాలు తప్పడం తనకు అలవాటేగా? పెళ్ళిలో కౌసల్య కు చెయ్యలేదూ వాగ్దానం -- 'నిన్ను వదిలి ఉండనని? అదే మయింది? అలాగే ఇదీను.
    గుండె రాయి చేసుకుని మనస్సు దిటవు చేసుకుని "మంచిది మీరు కులాసాగా ఉండండి. నేను వెళ్ళి వస్తా" అంటూ వంకీ నున్న చొక్కా తీసుకుని పైన కండువా వేసుకొని చెప్పుల కోసం ఇటూ అటూ చూశాడు.
    "ఎక్కడికి వెళతావు?" అంది నెమ్మదిగా బాధతో కూడిన కోపంతో విశాలాక్షి.
    "ప్రాణం ఉన్నన్నాళ్ళూ ఈ జానెడు పోట్టనీ పోషించుకోడానికి ఎక్కడికో అక్కడికి వెళ్ళాలిగా?"
    "నిన్ను మేమేమైనా వెళ్ళమంటే కదా?" అన్నాడు ఆనందం బాధగా.
    "మీరు వెళ్ళమనలేదు, బాబూ'! నేనే వెళ్ళుతున్నా."
    "నువ్వు వెళ్ళక్కరలేదు ఊరు విడిచి. ఈ ఆస్తిలో సగం వాటాకి నీకూ హక్కు ఉంది" అన్నాడు ముకుందం.
    జొళ్ళ కోసం హాలంతా వెతుక్కుంటూ "హక్కు భుక్తాల ప్రసక్తి దేనికిలే. నాకా ఆస్తి మీద ఆసక్తి ఉంటేగా?' అన్నాడు వెంకట్రామయ్య. విశాలాక్షి , ఆనందమూ తెల్లబోయి చూస్తున్నారు. జోళ్ళు కనిపించక పోవడంతో ఉత్త కాళ్ళతోనే బయలుదేరాడు.
    "వస్తానమ్మా, విశాలాక్షి . వస్తా అబ్బాయ్" అంటూ గడప దాతబోతుంటే ---
    "ఇంతకీ నిన్ను మేము అన్నదేమీ లేదు. నువ్వే కోపగించి వెళ్ళి పోతున్నావు. సరే అలాగే కానియ్యి. కాని భిజనాల వేళ ఇలా వెళ్ళిపోవడం ఏం బాగోలేదు. అన్నం తిని వెళ్ళు. మాకూ అంత బాద ఉండదు. లోకమూ హర్షిస్తుంది." అంది విశాలాక్షి.
    "నాకు ఆకలి లేదమ్మా" అంటూ వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి పోతుంటే అతని వెనకాలే "తాతయ్యా , తాతయ్యా! నువ్వు వెళ్ళి పోతావేమో అని చెప్పులు నేను దాచేశాను. ఇవిగో" అంటూ  బాధ, ఉద్వేగం, దుఃఖంతో కేకలు వేస్తూ జానకీ రెండు మూడు అడుగులు వేసి ఆగిపోయింది.
    ముండ్ల పొదలా పరుచుకొన్న నూతన జీవిత పధం లోకి పాద రక్షలు లేకుండా వెళ్ళి పోతున్న వెంకట్రామయ్య ఆ వీధి గడచి సందు మలుపు తిరిగాడు. ఆనందమూ, విశాలాక్షి దీర్ఘంగా నిట్టుర్చారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS