ఉదయం వసంత ఆస్పత్రికి వచ్చింది తల్లి నింటికి పంపించడానికి. వసంతని చూస్తూనే కమల గుడ్ల నీరు కక్కుతుంది. "అక్కయ్యా ....నీకు కష్టం కల్గినా ఒకమాట చెపుతున్నాను. ఈ పిల్ల పోవడం అంతా మన మంచికే అంటారు చూడు అలా జరిగింది. అక్కయ్య నీకు భవిష్యత్తుకి దారి మూసుకు పోకుండా చెయ్యడానికే ఆ దేముడే అలా చేశాడు. మన ఆర్ధిక స్థితిలో ఆ పిల్లని ఏం పెంచగలం - తిండి పెట్టినా ముసలి వయసులో నాన్నకి అదో పెద్ద సమస్య అయ్యేది. యిప్పుడు కాకపోతే, యింకొన్నాళ్ళ కయినా నిన్ను చేసుకునేందుకు ఎవరన్నా ముందుకు వస్తారు పిల్ల లేకపోతే .....లేకపోతే..... ఏ టైపో నేర్చుకుని నీవు ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు ఎవరినన్నా యిష్టపడి చేసుకోవచ్చు. పిల్ల వుంటే దాని కోసం నీవు అన్నింటిని త్యాగం చేసి జీవచ్చంలా జీవితాంతం బతికే దానివి. నాకందుకే ఏం విచారం కలగలేదు. నీవు వూరికే అలా కుమిలి కుమిలి పోనక్కరలేదు. నా మాట విని ఏడుపు మానేయ్ ..." అరిందలా ఓదార్చింది.
'నోరుమూసుకోవే. బిడ్డని కన్నమ్మకి తెలుస్తుంది కడుపు కోత ఏమిటో. నీకేం తెలుసే , పిల్లపోతే అడ్డు తొలగిపోయింది సంతోషించమంటుంది అవ్వ నీ వాడదానివి కావే....యివేం బుద్దులు, యివేం మాటలే. మా తల్లి ఏ యింటి కెడుతుందో గాని ....' కాంతమ్మ తీక్షణంగా మందలించింది.
'అమ్మా.....నిజంగా మీ అందరికి ఏదో సమస్య తీరినట్లనిపించడం లేదూ. మీరు పైకి చెప్పరు నేను పైకి అంటాను అంతే తేడా.... అక్కకి కష్టంగా వుంటే కొన్నాళ్ళు ఉంటుంది. తరువాత నేనీ రోజు అన్న మాటలే నిజం వుందని దానికీ తెలుస్తుంది.
"నోరుమూసుకుని వెర్రిమాటలు మాట్లాడకుండా కూర్చో. నేనింటికి వెళ్ళి మళ్ళీ రాత్రికి వస్తా. ప్రసాద్ నీకన్నం తెస్తాడు. డానికి హార్లిక్స్ కాఫీ ఏది కావాలంటే అది కలిపి యియ్యి" కాంతమ్మ అప్పగింతలు పెట్టి యింటికి వెళ్ళింది.
"అక్కా.....నేనన్నమాటలకి కోపం వచ్చిందా....' పక్కమీద కూర్చుంటూ అంది.
కమల సాలోచనగా చెల్లెలి వైపు చూసి "లేదే, నీవన్నది నిజమేనే. నాన్నకి యింకో ఆడపిల్లని భరించే శక్తి లేదు, నీవన్నట్టు నేను చదువు కోడానికి అన్నింటికి అడ్డుగా వుండేదేమో పాప....కాని....వసూ అ పాపని కళ్ళారా చూడకపోయినా కూడా, ఏమిటో ఏదో కడుపులో బాధగా వుంది. కడుపులో వెలితిగా , గుండెలలో గుబులుగా వుంది. యిదేనేమో కడుపు తీపి అంటే, పోనీ పుట్టిన వెంటనే పోవడం మంచిదే అయింది. మమతలు, పెంచుకున్నాక పొతే యింకా బాధగా వుండేదేమో. ఒకసారి చూస్తానన్న డాక్టరు చూపించలేదే, చూస్తె బాధగా వుంటుందంది. అయినా ఏదో లాగే వుంది" కమల బేలగా దీనంగా అంది.
వసంత కరిగిపోయింది.
'అక్కయ్యా....నీవింక ఆ విషయం ఆలోచించకు. నీకు పెళ్ళి..... పిల్ల....యివన్నీ జరగలేదనుకుని మరో రెండు నెలలు పోయాక కాస్త కోలుకున్నాక టైపుకి వెళ్ళడం ఆరంభించు. ఏదో వ్యాపకం లేకపోతే యిలాంటి ఆలోచనలు వస్తుంటాయి. నా మాట విను నీవు....' అంటూ నచ్చచెప్పి, ఆఖరికి కమల చేత ఊ అన్పించింది . అంతటితోటే ఏదో సాధించినంత అనందం కల్గింది వసంతకి.
* * * *
'అమ్మోయ్....అక్కాయ్.....నాకుద్యోగం వచ్చేసింది....ఆ ఉద్యోగం నాకోచ్చేసింది..." పన్నెండు గంటల వేళ వచ్చిన పోస్టులో ఉత్తరం చూసి వసంత చిన్నపిల్లలా చంగున గెంతి వంటింట్లోకి వెళ్ళింది. ఆ వారం రోజులుగా ప్రతి రోజూ ప్రతి క్షణం ఎదురు చూసింది వసంత ఉద్యోగం కోసం. ఒక్కోరోజూ గడుస్తుంటే నిరాశ పాలు ఎక్కువై యింక రాదు. వస్తే యీ పాటికే ఉత్తరం వచ్చేది. నాల్గురోజులలో చెప్తా అన్నారు. వారం రోజులాయిపోయింది . బెంగగా అనుకునేది....
"నిజంగానుటే.....' కాంతమ్మ సంబరంగా అంది....కమల కూడా గదిలో గుమ్మం దగ్గిరకి వచ్చి "నిజంగా వచ్చిందే.. ఉత్తరం రాశారా ---' ఆరాటంగా అడిగింది. "నిజమేమిటి ....యిదుగో ఆర్డర్, రేపే జాయినవమన్నారు....అమ్మా..... జీతం ఎంతో తెలుసా, అంతా కల్సి ఐదొందలు ఏభై.... చూశావా అక్కయ్యా, నీ చీర కట్టి కెడితే శుభం జరగదన్నావు , చూశావా ఉద్యోగం వచ్చేసింది....ఫస్ట్ జీతంతో నీకో చీర కొంటా....' వసంత సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపొయింది. కాంతమ్మ సంతోషంగా "పోనీలే ఏదో దేముడి దయవల్ల నీకన్న ఉద్యోగం వచ్చింది. కాస్త వీన్నీళ్ళ చన్నీళ్ళుగా..... మీనాన్న కాస్త ఊపిరి పీల్చుకుంటారు....' అంది.
"ఎంతయినా వసంత అదృష్టవంతురాలే అమ్మా అనుకున్నది సాధిస్తుంది కమల అంది. అప్పుడే వీధిలోంచి వచ్చిన ప్రసాద్ ని గుమ్మం లోనే నిలబెట్టి ఎపాయింట్ మెంట్ ఆర్డర్ చూపించింది వసంత. ప్రసాద్ మొహంలో సంతోషం, విచారం రెండు ఒక్క క్షణం కదలాడాయి. "నీవే నయమే నాకన్నా , మొదటి యింటర్వ్యూ తోటే ఉద్యోగం సంపాదించావు.... కంగ్రాట్స్....అన్నాడు అదోలా నవ్వి.
"అదేమిటిరా నాకు ఉద్యోగం వస్తే ఆముదం తాగిన మొహం పెట్టావు.....' వసంత దబాయించింది.
'కాదుటే.....పాపం రెండేళ్ళుగా తిరుగుతున్నా రాలేదని వాడికి బాధగా ఉండదూ"
"ఎడవుకురా నాయనా, మా బాస్ తో చెప్పి నీకో ఉద్యోగం వేయిస్తా' వసంత వేళాకోళంగా అంది.
"ఏడిశావు వెధవ ఫోజులు పెట్టకు....పెద్ద యివిడ గారికి బాస్ దొరికాడు యిన్నాళ్ళకి. వాడితో చెప్పి ఉద్యోగం వేయస్తుంది " ప్రసాద్ ఉక్రోషంగా అన్నాడు నవ్వుతూనే. సాయంత్రం మాలతి, శంకర్ వస్తుండగానే వాళ్ళకీ ఎదురెళ్ళి చెప్పింది వసంత. వసంత కి ఊరందరికీ చాటించి యీ సంతోషవార్త చెప్పలనంత ఆనందంగా వుంది. అక్కడికి పక్కింటి పిన్నిగార్కి, ఎదురింటి వాళ్ళకి చెప్పేసింది. మాలతి విని' అమ్మయ్య ఒక ప్రాబ్లం తీరింది. కధ రెండో సీను మొదలవ్వాలన్నమాట యింక" అంది నవ్వుతూ.
"అక్కయ్య ఉద్యోగం దొరికింది. బాస్ నవ మొహనకారుడు. అన్నీ కుదిరాయి. యింకా ఆ బాస్ అక్కయ్యని ప్రేమించి, వరించి పూల మాల తేవాలి మరి . "వేళాకొళాం చేసింది. అంతా నవ్వారు , వసంత ఉడుక్కుంది. మాలతి వేళాకోళంగా ఎగతాళి చేసినా ఎందుకో ఆ మాటలు కోపం తెప్పించలేదు. నిజంగా తననుకున్నట్లు ఒక్కొక్కటి జరుగుతున్నాయి. మాలతి అన్నట్టు....ఆలోచిస్తున్న వసంత మొహంలో ఎరుపు చూసి...... "వసంతాదేవి గారూ అప్పుడే యింపాలా కారుల్లో తిరిగేయకండి. ముందు మీరు బస్సుల్లో వెడుతూండాలి. అప్పుడు బాస్ గారు లిఫ్ట్ లు యిస్తుండాలి. యింకా చాలా కధ వుంది. మొదటి రీలు తర్వాత నాలుగో రీలుకి వచ్చేయకండి.....' మాలతి వెక్కిరించింది. శంకర్ చప్పట్లు కొట్టాడు.
"వండర్ పుల్.....యిదేదో సుఖాంతం సినిమా అయ్యేట్టుంది గ్రూప్ ఫోటో కి మనం యిప్పటి నుంచి రెడీ అవాలి. చిన్నక్కయ్య గ్రూప్ ఫోటో కి ఓ టెరికాట్ ప్యాంటు కుట్టించవే జీతం రాగానే" శంకర్ సీరియస్ గా అడిగాడు. అంతా నవ్వారు.
