కమల భర్త పోయాక ఆ యింట్లో చాలారోజుల తర్వాత అంతా మనసారా నవ్వారు.
* * * *
వసంత ఉద్యోగంలో చేరింది మర్నాడు. ఆ ఆఫీసులో మొత్తం నలబై మంది పని చేస్తున్నారు. ఒక్కొక్క సెక్షన్ విడివిడిగా బుక్కింగ్స్ కాన్సిలేషన్స్ , యిండియన్ ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా, యింటర్ నేషనల్.....అకౌంట్స్, బిల్స్, యిలా విడివిడిగా పెద్ద హాలులో ఒక్కొక్క సెక్షన్ గ్లాస్ ఫార్టిషన్స్ తో వున్నాయి. మొత్తం హాలంతా ఎయిర్ కండిషన్లు చేయబడి ఉంది. వసంత కాక అన్ని సెక్షన్స్ కలిపి ఎనమండగురు అమ్మాయిలున్నారు. రిసెప్షనిస్టు అమ్మాయి ఫాతిమా చాలా అందంగా, స్టయిల్ గా వుంది. అనుకుంది వసంత చూడగానే ఎయిర్ ఇండియా టిక్కెట్లు బుక్ చేసుకునే చోట స్మార్టుగా వుండే అమ్మాయిల నిద్దరిని పెట్టారు. యిద్దరూ టైపిస్టు లు అమ్మాయిలే. ఆపరేటర్ అమ్మాయే.
మొదటిరోజు అంతా గాభారాగా , గజిబిజిగా , ఏది ఎక్కడో, ఎవరెక్కడో తెలియక బితుకుబితుకు మని చూసింది. ఆఫీసు కెళ్ళగానే ఎక్కడి కెళ్ళాలో, తనెక్కడ కూర్చోవాలో , ఏం చెయ్యాలో తెలియక వెర్రి మొహంతో నిల్చుంది రిసెప్షనిస్టు ఫాతిమా వసంతని చూసి చిరునవ్వుతో దగ్గిరికి రమ్మని సంజ్ఞా చేసింది. "మీరు డైరక్టర్ కి పర్సనల్ స్టెనో గా సెలక్టు అయి వచ్చారు గాదూ..... మీ సీటు బాస్ రూములో వుంది వుండండి ఫ్యూను చూపిస్తాడు. కేశవ్ యీ అమ్మాగారు నళిని గారి సీటులోకి వచ్చారు. సీటు చూపించు తీసికెళ్ళి..... వెళ్ళండి ఫరవాలేదు. మీ సీటులో కూర్చోండి. బాస్ వచ్చి లెటర్స్ అవి డిక్టేట్ చేస్తారు. షార్టు హాండ్ తీసుకుని టైపు చెయ్యాలి. అయన వర్కంతా మీరే చూడాలి. మిగతా ఆఫీసు కాగితాలన్నీ టైపు చెయ్యడానికి అదిగో ఆ అమ్మాయిలు సుందరి, వల్లీ వున్నారు. కేశవ్ , ముందు యీ అమ్మాయిగార్ని అందరి సీట్లు దగ్గిరికి తీసికెళ్ళి పరిచయం చెయ్యి.....లేదులే, నేనే తీసికెడతాలే " - అని వాచీ చూసుకుంటూ యింకా టైముందిలే - అనుకుంటూ లేచింది ఫతిమా . వసంత ని వెంట బెట్టుకుని ప్రతి ఒక్క సీటు దగ్గిరికి తీసికెళ్ళి కొత్తగా అప్పాయింట్ అయిన బాస్ స్టెనో అని పరిచయం చేసింది. డైరక్టుగా బాస్ కింద పని చేయాల్సిన వసంతని అందరు కుతూహలంగా మర్యాదగా నమస్కరించుకుంటూ చూశారు. వసంత అందరికి పరిచయ నమస్కారాలు పెట్టింది. కొందరు మాత్రం ఓహో అన్నట్లు తలెగరేసి మళ్ళీ పనిలో పడ్డారు. ఒకరిద్దరు ఫోనులో బుకింగ్స్ చేసుకుంటూ వసంతని చూసి పలకరింపుగా నవ్వారు. అందరూ అయ్యాక ఫతిమా ఆమెని బాస్ గదిలోకి తీసుకెళ్ళింది. అది వసంతని యింటర్వ్యూ చేసిన గదే. ఆ గదిలో ఒకపక్క కిందభాగం సగం వరకు టేక్ వుడ్ ఫ్రేం , మిగతా గ్లాసుతో పార్టిషన్ వుంది. దాన్లో ఒక టేబుల్, కుర్చీ, టైప్ మిషను వుంది. "మీ సీటు అదే.....బాస్ వచ్చే వేళ అయింది. మరేం ఫరవాలేదు, గాభారాపడకండి" స్నేహపూర్వకంగా చెయ్యి నొక్కి వెళ్ళబోయింది. వసంత నోరు పెగుల్చుకుని "థాంక్స్ ..... థాంక్స్ ఎలాట్ ..... ఏమి తెలియక గాభారాపడ్డారు. రాగానే , మీరు.....నాకు హెల్ప్ చేశారు...... మిమ్మల్నందరిని చూస్తుంటే యీ ఆఫీసులో ఉద్యోగం చెయ్యటం చాలా బాగుంటుందనిపిస్తుంది ....కాని ....నా సీటు కూడా అక్కడ మీ మధ్యన వుంటే బాగుండేది " బిడియంగా గది చూస్తూ అంది వసంత.
ఫతిమా ఆశ్చర్యంగా చూస్తూ, "బలేవారే, యీ సీటు స్పెషల్ సీటు దీనికోసం యీ గదిలో కూర్చోడం అదృష్టంగా భావిస్తారు. మీ ముందున్న నళిని పెళ్ళి చేసుకుని రిజైన్ యిచ్చి వెళ్ళగానే సుందరి, వల్లీ యీ పోస్టు వాళ్ళకి రావాలని ఎంతో తాపత్రయపడ్డారు. వాళ్ళని కాదని కొత్త అమ్మాయిని సెలక్టు చేసినందుకు వాళ్ళ కెంత కోపంగా వుందో, అలాంటిది యీ సీటు ఇక్కడ కాకుండా అందరి మధ్యన వుండలంటారేమిటి. బాస్ కి పర్సనల్ స్టెనో అంటే బాస్ లా అధికారం చెలాయించే సీటండీ. బాబు అది మైగాడ్ మీతో బాతాఖాని పెట్టుకు కూర్చున్నానేమిటి..... లంచ్ అవర్లో మాట్లాడుకుందాం....' పరిగెత్తినట్టే వెళ్ళిపోయింది ఫతిమా. అప్పటికి దడ తగ్గి వసంత, తన సీటుకి వెళ్ళి కూర్చుండి. ఆరోజు యీ పార్టీషనే గమనించలేదు అనుకుంది. ఎయిర్ కండిషన్డ్ చల్లదనం అనుభవిస్తూ , తన కీ ఉద్యోగం రావటం ఎంత అదృష్టమో ఆలోచిస్తూ , ఆనందిస్తూ కూర్చుంది. ఆఫీసులో అమ్మాయిలంతా స్మార్టుగా డ్రస్ అయ్యారు. తనకున్నవి నాలుగే నాలుగు మంచి చీరలు. యీ నెల ఎలాగో ఆ నాల్గు చీరలు, అక్క చీరలు మూడు మంచివి వున్నాయి. వాటితో గడిపితే జీతం తీసుకోగానే ముందు నాల్గు చీరలు కొనుక్కోవాలి. ఆఫ్ అర్గండీ, రెండు ఆఫ్ అమెరికన్ జర్జట్ లాంటి చీరలు 70, 80 లో వస్తాయి. ఒక మంచి హాండ్ బ్యాగ్ కొనుక్కోవాలి. అలా కొనుక్కోవలసిన లిస్టు ఆలోచిస్తూ జీతంలో సగం తను తీసుకుని మిగతా సగం తండ్రికి ఇవ్వాలని కాగితం మీద లెక్కలు కట్టింది. ఆ తరువాత ఆలోచన బాస్ మీదికి వెళ్ళింది. నిన్న యింటర్వ్యూ చేసిన ముగ్గురిలో డైరెక్టరు ఎవరో, ఆ ముసలాళ్ళు రారు గదా, వసంత కుతూహలంగా , ఆరాటంగా చూసింది. ఫతిమాని ఆ విషయం అడగాల్సింది అనుకొంది. ఫతిమా తో స్నేహం చేసుకోవాలి. లేకపోతే యింతమంది మధ్య అలవాటయ్యే వరకు వంటరిగా ఫీలవ్వాలి. ఆ సుందరి, వల్లీ యిద్దరూ తమ పోస్టు ఎగరేసుకుందని తనని చూసి మొహాలు అదోలా పెట్టారు. వసంత ఆలోచిస్తుండగానే గదిలో బూట్ల చప్పుడు విని తలెత్తి చూసి, గాభరాగా లేచి నిలబడింది. నిన్నటి ముగ్గురిలో ఒకాయన ఆ యువకుడి లో పోలికలున్నాయన లోపలికి వచ్చాడు. సీటులో కూర్చుంటూ వసంతని చూసి 'గుడ్ మార్నింగ్ , జాయిన్ అయ్యారన్న మాట" ఇంగ్లీషులో పలకరించాడు. ఆయన రాగానే గుడ్ మార్నింగ్ అనాలని తట్టనందుకు వసంత గాభరా పడి "గుడ్ మార్నింగ్ సర్" అంది తన కుర్చీలోంచి లేచి యివతలకు వస్తూ.
"ఊ ... యీ సీటులో పని గురించి మీకు ఎవరయినా చెప్పారా - నా పర్సనల్ స్టెనో అంటే యిక్కడ నేను డిక్టేట్ చేసే కాగితాలు, ఉత్తరాలు యీ గది దాటి వెళ్ళకూడదు యీ విషయాలన్నీ సీక్రెట్ గా వుండాలి. నేను డిక్టేట్ చేసిన ఉత్తరాలు డిస్పాచ్ కూడా యిక్కడ నించే జరగాలి. డిస్పాచింగ్ విషయాలు తెలియవేమో మీకు.' అంటూ ఆగి, బెల్ నోక్కారాయన. ఫ్యూను రాగానే "డిస్పాచ్ క్లర్క్ మూర్తిని పిలు ఒక్కసారి" అన్నాడు . మూర్తి అన్న అతను రాగానే "ఈ అమ్మాయి కొత్తగా నా స్టేనోగా చేరింది. ఉత్తరాలు డిస్పా'చింగ్ వగైరా గురించి యీ అమ్మాయికి ఒకటి రెండు రోజులు దగ్గిరుండి చూపండి. యింకా తెలియనవి వుంటే ఆ టైపిస్టు అమ్మాయిలను కొంచెం చెప్పమనండి.' అన్నాడు. "ఎస్ సర్ వినయంగా అని అతను వసంత వైపు తిరిగి, మీ ఉత్తరాలు టైపింగు అయ్యాక ఫ్యూనుతో చెప్పితే వచ్చి చెపుతాను అన్నాడు. వసంత తల ఊపింది..... ఒకటి రెండు రోజులు కొత్తగా వుంటుంది. అలవాటయిపోతుంది. అల్ రైట్ ఆ రైటింగ్ పాడ్ తెచ్చుకోండి. కొన్ని ఉత్తరాలు డిక్టేట్ చేస్తాను" అన్నాడు. వసంత లెటర్ పాడ్ పెన్సిల్ తెచ్చుకుంది. 'ప్లీజ్ బి సీటేడ్" అన్నాడాయన.
అయన మొత్తం ఐదు ఉత్తరాలు డిక్టేట్ చేశాడు. షార్ట్ హాండ్ తీసుకున్నాక అయన చెప్పిన ప్రకారం ఎన్నేసి కాపీలు కావాలో టైపు చేసింది వసంత - ఉత్తరాలని బట్టి అయన పేరు జీవన్ లాల్ అని అర్ధమయింది. ఆ ఉత్తరాలని బట్టి బిజినెస్ ఉత్తరాలు, అయన బిజినెస్ తీరు కొద్దిగా అర్ధమయింది. ఏదో పెద్ద కంపెనీ పదహారు వేల బకాయి వుందని, దయ చేసి వీలయినంత త్వరలో చెల్లించమని కోరుతూ ఒక ఉత్తరం, పారిస్ నించి వచ్చే ఫారిన్ టూరిస్ట్ బృందం నలబై మందికి వారు కోరిన విధంగా ఎయిర్ యిండియా లో ఫలాన రోజున టిక్కెట్లు రిజర్వు చేసినట్టు కనఫర్ మేషన్ ఇస్తూ ఫారిస్ కి పంపాల్సిన ఉత్తరం. యింకేదో ఆఫీసు నించి డిల్లీలో జరిగే కాన్పరెన్స్ కి వెళ్ళే పాతికమందికి టిక్కెట్లు కావాలని రాసిన దానికి, ఆ తేది ప్లయిట్ లో అన్ని టిక్కెట్లు దొరకవని ఒక ఉత్తరం. ఎవరో కాన్సిలేషన్ టిక్కెట్టు డబ్బు ఎన్ని ఉత్తరాలు రాసినా వాపసు యివ్వడం లేదు మా కంపెనీ. యికమీదట మీ ట్రావెల్ ఏజన్సీతో మేము లావాదేవీలు పెట్టుకోమని ఘాటుగా రాసిన డానికి. వినయంగా ఆ ఉత్తరానికి జవాబు, చెక్కు అప్పుడే పంపామని రాసిన ఉత్తరం ఒకటి. యిలాంటి ఉత్తరాలు బట్టి బిజినెస్ స్వరూపం కొంచెం అర్ధమైంది. ఆఖర్న యినకంటాక్స్ రిటర్న్డ్ ఫైలు చేయడానికి కొద్ది వ్యవధి కావాలని కోరుతూ యినకంటాక్స్ కమీషనర్ కు వ్రాసింది.
