Previous Page Next Page 
ఇంటింటి కధ పేజి 5


    వసంతకి ఒక్కసారిగా కాళ్ళు వణికాయి. చప్పున రుమాలుతో మొహం తుడుచుకుని అదురుతున్న గుండెలతో లోపలి కెళ్ళింది. ఎయిర్ కండీషన్ గదిలో అడుగు పెట్టేసరికి ఆ చల్లదనం, ఏదో తెలియని సువాసన ఒక్క క్షణం వసంతని మైమరపించాయి. ఆ మైమరపు నించి తేరుకుని చూసేసరికి ఎదురుగా పెద్ద ఖరీదయిన టేబిల్ దగ్గిర ముగ్గురు ఖరీదయిన మనుష్యులు కూర్చుని కనపడ్డారు. ఆ ముగ్గురిలో ఒకతను యువకుడు,  యిద్దరు ఏభై ఏళ్ళు దాటిన వాళ్ళు. ఆ యువకుడు చాలా స్మార్టుగా వసంత కలల్లో రాజకుమరుడిలా అందంగా ఉన్నాడు. లేతనీలం షర్టు, ముదుర నీలం టై, ఖరీదైన ముదురు నీలం ప్యాంట్ , నొక్కుల జుత్తు , చేతికి అతి ఖరీదయిన వాచీ.....వసంత తేరుకుని చప్పున నమస్కారం పెట్టింది. ముగ్గురి వంకా చూస్తూ ---ఆ ముగ్గురిలో బాస్ ఎవరో వసంతకి అర్ధం కాలేదు. అందులో ఒకతను వసంతని కూర్చోమని సర్టిఫికెట్ల కోసం చేయి చాపాడు. ఇంకో అయన వసంత పేరు, క్వాలిఫికేషన్స్ , టైపు స్పీడు వగైరా ప్రశ్నలు అడిగారు ఇంగ్లీషులో. కాలేజీలో చదివిన నాలుగేళ్ళు తనకి డియర్ ఫ్రెండు అయిన ఆంగ్లో యిండియన్ అమ్మాయి సుసాన్ ధర్మమా అని ప్లూయంట్ గా యింగ్లీషు మాట్లాడం వచ్చినందుకు ఆక్షణంలో ఆనందించింది వసంత. కావాలని వసంత సుసాన్ తో యింగ్లీష్ మాట్లాడేది నేర్చుకోవాలని. అదిప్పుడు పనికి వచ్చి తడుముకోకుండా జవాబులు యిచ్చింది. యింతసేపూ ఆ యువకుడు వసంతనే పరీశీలిస్తున్నాడు. అతని వంక చూడకపోయినా అతని చూపులు వసంతని యిబ్బంది పెట్టాయి. అతనొక్కసారి గొంతు సవరించుకుని --- 'యీ ఉద్యోగం చెయ్యాలని మీరెందు కనుకుంటున్నారు.... మీ ఆర్ధిక పరిస్థితి వల్లనా..... మీ నాన్నగారు ఏం చేస్తారు....' అడిగాడు. వసంత తలెత్తి ఒకసారి అతని వంక చూసి అతని చూపులని ఎదుర్కొలేనట్టుగా తలదించుకుంది.....ఒక్కక్షణం ఏం చెప్పాలో తెలియక తడబడింది. తమ లేమితనం చెప్పకుండా సరదాకి చేస్తున్నానంటే ఉద్యోగం యివ్వరేమో అనుకోని ఆ ప్రశ్నకి ఆ క్షణంలో జవాబు ఆలోచించే టైము లేక ఉన్నదున్నట్టు చెప్పేసింది. తండ్రి ఒక్కడి సంపాదన చాలకపోవడం, అన్నకి ఉద్యోగం లేకపోవటం తనకిప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేక ఉద్యోగం చేసి తండ్రికి సహాయపడాలని వుందని చెప్పింది. "ఐసీ' అన్నాడతను. సర్టిఫికెట్లు చూసి జాగ్రత్తగా కవరులో పెట్టి అందించాడయన.....ఏదో కాగితం మీద నోట్ చేసుకున్నాడాయన. "సరే మిస్ వసంత. మీకు ఏ సంగతి రెండు మూడు రోజుల్లో పోస్టు ద్వారా తెలియపరుస్తాం ఇక వెళ్ళవచ్చు మీరు" అన్నాడు. వసంత లేచి నమస్కారం చేసి తడబడుతున్న అడుగులతో బయటికి వచ్చింది. ఇంటికి వస్తుంటే .....ఆ ఉద్యోగం వచ్చేసినట్టే అన్పించి గాలిలో తేలినట్టు మనసు తేలిగ్గా సంతోషంగా అన్పించింది. ఆమె మొహంలో సంతోషం చూసి ప్రసాద్ "ఏమిటి ఉద్యోగం యిచ్చారా...." అన్నాడు ఆరాటంగా "రెండు మూడు రోజుల్లో చెప్తామన్నారు ' అంది. "నీ మొహం చూసి వెంటనే ఉద్యోగం యిచ్చినట్లు చెప్పారేమో ననుకున్నాను.....' అన్నాడు ప్రసాద్. వసంత అన్నగారి వంక ఒకసారి చూసి మూతి తిప్పి ....."నీకసలు కుళ్ళు, నాకుద్యోగం వచ్చేస్తుందని, చూసుకో ఈ ఉద్యోగం నాకు రాకపోతే....." ఉక్రోషంగా అంది. "వస్తే మంచిదేగా....నా పాకెట్ మనీ నిన్నడుగుతుంటాను ' అన్నాడు నవ్వి. 'ఆ మరే , నీ కోసమే ఉద్యోగం చేస్తున్నాను పాపం" అంది. యింటి కేడ్తుంటే ఆ నల్లపిల్ల గుర్తుకు వచ్చి అరె, పేరన్నా అడగలేదే ఆ అమ్మాయికి చెప్పానన్నా లేదే అనుకుంది.

                                             *    *    *    *
    ప్రసాద్ , వసంత యింటికి వచ్చేసరికి కాంతమ్మ కమలని తీసుకుని అటో రిక్షా ఎక్కుతోంది. కమలకి నొప్పులు ఆరంభించాయి. ఉదయం నించి పీక్కుపోయిన మొహంతో వున్న కూతుర్ని చూసి యివాళో రేపో కాన్పు అవుతుందేమోనని అనుమానించింది కాంతమ్మ.
    వసంత వాళ్ళు అటు వెళ్ళగానే "అమ్మా, నడుములో నొప్పి వస్తుందమ్మా" అంది కమల ఆందోళనగా.
    కాంతమ్మ కి కాళ్ళు, చేతులు ఆడలేదు. 'అయ్యో, నాన్నగారటు వెళ్ళారు. ప్రసాద్ అలా వెళ్ళాడు. శంకర్ , మాలతి కాలేజికి వెళ్ళారే . యింట్లో ఎవరూ లేరే ' అంటూ గాభరా పడి పోయింది. "ఎన్ని నిమిషాల కొకసారి నొప్పి వస్తుందే అమ్మా..... వుండవే తల్లీ, ఎవరినన్నా పంపి నాన్నగార్కి ఫోను చేయిస్తాను' అంటూ గాభారాపడి పరుగెత్తి నాలుగిళ్ళ అవతల వున్న ఇంజనీరు గారింట్లోంచి వెంకట్రావుగార్కి ఫోను చేయించింది.
    అయన యింటికి వచ్చి , ఆస్పత్రికి వెళ్ళే సన్నాహాలు పూర్తి చేసుకుని అటో ఎక్కేసరికి గంటా గంటన్నర గడిచింది. వసంత ని చూస్తూనే 'అక్కయ్యకి నొప్పులు వస్తున్నాయి. ఆస్పత్రికి తీసుకేడ్తున్నాం, తాళాలు పక్కింటి పిన్నిగారికిచ్చాను. నేను మళ్ళీ యింటి కెప్పుడు వస్తానో, సాయంత్రం వంటా అదీ నీవు మాలతి చూడండి. యిల్లు జాగ్రత్త ..... అంటూ అప్పగింతలు పెట్టింది. "ప్రసాద్ , నీవన్నం తిని నర్శింగ్ హోమ్ కిరా, నేను జాయిన్ చేసి ఆఫీసు కెళ్ళిపోవాలి. శలవు లేదు. నీవక్కడ అమ్మకు సాయంగా వుండు" వెంకట్రావుగారు కొడుక్కి చెప్పారు. విక్టోరియా ఆస్పత్రికి చాలాదూరం రానుపోను చార్జీలకే అవుతుందని ,దగ్గిరలో వున్నా ఓ నర్శింగ్ హోమ్  తమలాంటి మధ్యతరగతి సంసారుల కందుబాటులో వుండేది ముందుగానే బుక్ చేసుకున్నారు.
    "నీ ఉద్యోగం ఏమయిందే....నొప్పి వస్తుంటే మొహం, ఎర్రబడుతుండగా మూలుగుతూ అడిగింది కమల బయలుదేరే ముందు.
    "మూడు నాల్గు రోజులలో చెప్తామన్నారక్కా.....' అంది వసంత కమలని చూసి జాలిగా, అటో బయలుదేరింది. వసంత నిట్టూర్చి లోపలి కెళ్ళింది. ఏమిటో అన్ని బాధలూ ఆడవాళ్ళకే ...... ఈ స్థితిలో వున్న అక్కకి.....యీ పిల్ల ....ఎందుకో! ఆమె భవిష్యత్తుకి పూర్తిగా దారి మూసుకుపోతుంది. అక్క జీవితాంతం.....ఆ పిల్లో, పిల్లాడి కోసమో అన్నింటిని త్యాగం చేసి బతకాలి. ఈ దేశంలో రెండో పెళ్ళి ఆడదాన్ని పెళ్ళాడే నాధుడే లేడు. పిల్ల తల్లిని ఎవరు చేసుకుంటారు. అందులో అక్కలాంటి మెతకమనిషిని...అంతే. యింక కమల జీవితం ముగిసినట్టే. నాన్న పంచన పడి వుండి ఆ పిల్లని చూసుకుంటూ, ఆ తరువాత ఏ అన్నగారో, తమ్ముడి నీడనో , పిల్లాడు పెద్దయ్యాక కొడుకు నీడనో .....అలా వంటింట్లో మగ్గాల్సిందే ఆ జీవితం! ఏం చెప్పినా భవిష్యత్తు గురించిన ఆలోచించదు. దాని ఖర్మ .....దిగులుగా అనుకుంది వసంత.
    ....కమల ఆరోజంతా యమయాతన పడ్డాక రాత్రి పదకొండు గంటలకి డాక్టరు ఫోర్ సెప్పె వేసి మృత శిశువు ను బయటకు లాగింది. తెలివి వచ్చాక కమల 'అయన గుర్తుగా పిల్ల అయినా వుంటుందని , దాన్ని చూసుకుని బతుకీడ్చాలనుకున్నాను. యిప్పుడింక ఎవరి కోసం బతకనమ్మా" అంటూ కాంతమ్మని పట్టుకు ఏడ్చింది.
    "వూరికో తల్లీ వూరుకో. నీకీ కడుపుకోత కూడా పెట్టాడు దేముడు. తండ్రి లేనిచోట ముద్దుముచ్చట్లు జరగవని పిల్లని తీసికెళ్ళి పోయాడు దేముడు.. "తల్లి కూతురు ఒకరిని పట్టుకు ఒకరు ఏడ్చారు. కాసేపు..... వెంకట్రావు గార్కి కూతురు దుఃఖం చూస్తె దుఃఖం వచ్చింది గాని అయన అంతరాంతలలో ఎక్కడో....ఏదో పెద్ద భారం దింపినట్లయింది. ఒక బరువు, ఒక పెద్ద భాద్యత నించి విముక్తుడయినట్టు రిలీఫ్ కల్గింది. ఛీ.... ఏమిటిలా ఆలోచిస్తున్నానని తనని తాను మందలించుకుని ఏడుస్తున్న కూతురి తల మీద ఓదార్పుగా చెయ్యి వేసి నిమురుతూ..... "వూరుకోమ్మా.... నీవింతే పెట్టిపుట్టావు ' అంటూ ఓదార్పు మాటలు చెప్పారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS