ఇంకొద్దిరోజులేనా ఈ రాజభోగాలు?
అంటే.... ఆ కొద్దిరోజుల తర్వాత మళ్ళీ వెనుకటి మురికి కూపంలోకి వెళ్ళాల్సిందేనా?"
"అమ్మా!" నవ్వుతూ పిలిచాడు రవి.
శారద కొడుకు వేపు చూసింది.
"డోంట్ వర్రీ మమ్మీ! నేనున్నాగా"
శారదకు అతని మాటలు అర్ధంకాలేదు.
కానీ ఏదో ధైర్యాన్ని, ఏదో ఆశని కలిగిస్తున్నాయి ఆ మాటలు.
* * *
తిరిగి మెలకువ వచ్చేసరికి పొద్దుగూకిపోతోంది.
రాజశేఖరం లేచి కూర్చున్నాడు. తను సోనీ ఇంట్లోనే చెత్త బస్తాల మీద పడుకుని నిద్రపోయినట్లు తెలిసింది.
సోనీ ఇంట్లో లేదు.
బయటకు నడిచాడు రాజశేఖరం.
చాలామంది భాగ్యమ్మ ఇంటిదగ్గర గుమికూడి వున్నారు. లోపలి నుంచి పెద్దగా ఏడుస్తోన్న ఓ పిల్ల గొంతు వినబడుతోంది.
రాజశేఖరం దగ్గరకెళ్ళి చూశాడు.
స్కూలు యూనిఫారంలో వున్న ఓ పిల్లను తాడుతో ఇంటి గుంజకి కట్టేసింది భాగ్యమ్మ.
భాగ్యమ్మ గురించి సోనీ చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయతనికి.
రోడ్డుమీద ఒంటరిగా వెళ్ళే పిల్లలను భాగ్యమ్మ ఎత్తుకొచ్చి వాళ్ళ కళ్ళు, కిడ్నీ అన్నీ నర్శింగ్ హోమ్ లో అమ్మేస్తుందని చెప్పిందామె.
అతనికి ఆ దృశ్యం జాలి కలిగించింది.
పాపం ఆ పాప తల్లిదండ్రులు పాప కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నారో ఏమో!
గడ్డపాడు కూడా పాపవంక జాలిగా చూస్తున్నాడు.
"ఆ పాపను నర్శింగ్ హోమ్ కి ఎప్పుడు అమ్మేస్తుంది?" అడిగాడు రాజశేఖరం.
"రాత్రికి ఇలాంటివన్నీ అర్ధరాత్రి జరుగుతాయి. పగలు పాపను నర్శింగ్ హోమ్ కి తీసుకెళ్ళాలంటే అంతా అల్లరయిపోతుంది కదా!"
రాజశేఖరానికి ఎలాగయినా ఆ దారుణాన్ని ఆపాలని వుంది.
టీ బండి పక్కనుంచీ వెళ్తోంటే టీ బండి ముసల్ది పిలిచింది.
"టీ తాగుతారా?"
"డబ్బుల్లేవు!" అన్నాడు రాజశేఖరం.
"డబ్బులెవరడిగారు నిన్ను? రా! తీసుకో!"
అతనికి ఆశ్చర్యం వేసింది.
అంత అభిమానంగా డబ్బుల్లేకపోయినా ఎందుకిస్తానంటోందో అర్ధం కావటం లేదు.
"నిజం చెప్పు.... ఇంత వుదారగుణం నీకు లేదని నాకు తెలుసు."
"నీకెప్పుడు 'టీ' కావాల్సివచ్చినా ఇచ్చెయ్యమని సోనీ చెప్పింది. ఆ డబ్బు తర్వాత తనిస్తానంది."
రాజశేఖరానికి కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినాయి.
ఎంత మంచి మనుషులున్నారిక్కడ!
ఇలాంటి మనుషులు ధనవంతుల లోకంలో తనకెప్పుడూ తారసపడలేదు. బహుశా వాళ్ళకిలాంటి వాటిగురించి తలుచుకోడానిక్కూడా టైముండదేమో!
అతనికి హఠాత్తుగా ఆ బ్రిడ్జి కింది ఎయిడ్స్ పేషంట్ గుర్తుకు వచ్చాడు.
తను అతనికి ప్రామిస్ చేశాడు--- కనిపెట్టుకుని వుంటానని.
"అయితే ఒక టీ ఇవ్వు" ముసలామెని అడిగాడతను.
ఆమె గ్లాసులో సగానికి టీ పోసి యిచ్చింది.
అది తీసుకుని ఓవర్ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళాడు.
ఉండుండి ఈశ్వర్ బాధతో మూలగటం చాలాదూరం వరకూవినబడుతోంది.
బ్రిడ్జిమీద వెళ్ళే వాహనాల శబ్దాలు అతని మూలుగుడ్ని వినబడకుండా జేస్తున్నాయి.
అతను కళ్ళు మూసుకుని పడివున్నాడు.
"ఈశ్వర్!" పిలిచాడు రాజశేఖరం.
అతను ఆశగా కళ్ళు తెరచి చూశాడు.
"ఎవరూ?"
"నేనే! నీకోసం 'టీ' తెచ్చాను!"
అతని చేతికి గ్లాస్ అందించబోయాడు.
అతని చేయి పట్టులేక అటూ ఇటూ కదిలిపోతోంది.
తనే అతని నోటికి గ్లాస్ అందించాడు.
నెమ్మదిగా 'టీ' అంతా తాగాడతను.
తర్వాత వణుకుతోన్న రెండు చేతులూ ఎత్తి దణ్ణం పెట్టాడు.
"నువ్వు చాలా గొప్పోడివి! నా భార్యా, నా పిల్లలు వీళ్ళందరికంటే గొప్ప! వాళ్ళకోసం నేను ఎమ్మెల్యేగా వున్నప్పుడు చేయరాని పనులన్నీ చేసి ఆస్తులు సంపాదించి యిచ్చాను. నాకీ పాడు జబ్బు రాగానే వాళ్ళు ఇలా రుణం తీర్చుకున్నారు.
