Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 40

    "వర్కర్స్ యూనియన్ జిందాబాద్!

    వర్కర్స్ యూనిటీ జిందాబాద్!

    మేనేజ్ మెంటు డౌన్ డౌన్!

    యాంటీ లేబర్ పాలసీ డౌన్ డౌన్!"

    ఆ కేకలకు ఉలిక్కిపడి నిద్రలేచాడు కనకారావు. త్వరగా నడిచి బాల్కనీలోకొచ్చి చూశాడు.

    భవనానికి దూరంగా నిలబడి అరుస్తున్నారు సోప్ ఫ్యాక్టరీ కార్మికులు.

    పోలీసులు వారిని ముందుకు రాకుండా నెడుతున్నారు.

    కనకారావుని చూడగానే మరింత రెచ్చిపోయారు వాళ్ళు.

    "మేనేజ్ మెంటుకో మరో గోలీ

    మేనేజ్ మెంటు-ముర్దాబాద్"

    కనకారావుకు వాళ్ళను చూస్తుంటే ఎక్కడలేని ఆవేశం వస్తోంది.

    నష్టాల్లో నడుస్తున్న ఫ్యాక్టరీని ఎవరయినా నడుపుతారా?

    టాటా అయినా, బిర్లా అయినా సరే మూసేయాల్సిందే!

    టైమ్ ఎనిమిదవుతోంది.

    రాత్రి ఆలస్యంగా పడుకోవటంవల్ల ఉదయం ఆలస్యంగా నిద్రలేచాడు.

    రాత్రే సోప్ ఫ్యాక్టరీ మూసేయాలన్న నిర్ణయం తీసుకున్నాకగానీ నిద్రపట్టలేదు. వెంటనే అందరికీ ఫోన్లు చేసి తన నిర్ణయం చెప్పాడు. పోలీసులను పిలిపించి తన ఇంటికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకున్నాడు.

    అద్దం ముందు నిలబడేసరికి అతని ప్రతిరూపం వింతగా కనిపించింది.

    మొహంలో అదివరకెన్నడూ చూడని క్రౌర్యం కనబడుతోంది. ఒకటి రెండుసార్లు చూసుకున్నాడతను అద్దంలో.

    ఎక్కడ తేడా వచ్చిందో తెలీటంలేదు.

    హఠాత్తుగా తన ప్రతిరూపం విరగబడి నవ్వసాగింది తనను చూసి.

    కనకారావు కంగారుపడ్డాడు. తననెవరయినా చూస్తున్నారేమోనని. ఒక్కసారిగా తప్పు చేస్తున్న ఫీలింగ్ అతనిని దహించి వేయసాగింది.

    అద్దం చటుక్కునవెనక్కి తిప్పేశాడు.

    వెనుక అద్దంలో మరో దృశ్యం కనిపిస్తోందిప్పుడు.

    తనే కార్మిక నాయకుడిగా తన మేనేజ్ మెంటుకి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న దృశ్యమది.

    ఆ దృశ్యం అతని రక్తాన్ని సలసల కాగేలా చేస్తోంది.

    ఎంత ఆవేశంగా అరుస్తున్నాడు తను?

    ఎంత కసిగా యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాడు?

    అతను తట్టుకోలేకపోతున్నాడు.

    బయట తనకు వ్యతిరేకంగా కార్మికుల నినాదాలు.

    అద్దంలో తనే కార్మికుల తరపున చేస్తున్న నినాదాలు.

    అద్దం ముందు పెర్ ఫ్యూమ్ స్ప్రేయర్ ఎప్పుడు చేతిలోకి తీసుకున్నాడో తనకే తెలీదు.

    ఆ విసురుకి అద్దం ముక్కలు ముక్కలయింది.

    భార్య శారద, కొడుకు రవితో పరుగున వచ్చిందా గదిలోకి.

    "ఏం జరిగిందండీ?" పగిలిన అద్దం చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది శారద.

    కనకారావుకేం చెప్పాలో తెలీలేదు.

    "ఏమీలేదు" అన్నాడు ఆవేశం అణచుకుంటూ.

    "ఆ అద్దం ఎలా పగిలింది నాన్నా?" అడిగాడు రవి.

    "ఏమో! ఎలా పగిలిందో నాకేం తెలుసు? అయినా పగిలితేనేం? ఇంకోటి కొంటాం. దానికోసం ఏమిటీ రాద్ధాంతం? ఫో ఇక్కడి నుంచి.... ఫోవే! నువ్వు కూడా ఫో" కోపంతో వణికిపోతూ అరచాడు.

    "అంత కోపమెందుకు నాన్నా! అద్దం పగిలితే ఇంకోటి కొంటాం. నేనడిగేది అందుక్కాదు మీకేమీ దెబ్బ తగల్లేదు కదా?"

    కనకారావు స్పృహలోకొచ్చాడు.

    "ఒరేయ్ రవీ! ముందా ఫ్యాక్టరీ వర్కర్స్ ని గెంటించు ఇక్కడి నుంచి. వాళ్ళ అరుపులు భరించలేకుండా వున్నాను. కమీషనర్ గారికి ఫోను చెయ్. అవసరమయితే వాళ్ళమీద కాల్పులు జరపమను-ఫర్లేదు. కావాలంటే పోలీసులకు డబ్బివ్వు."

    "అదంతా నేను చూసుకుంటాను నాన్నా! మీరూరికే వర్రీ అవకండి. అయినా మీ వంట్లో బావుండటం లేదు-అన్ని విషయాలూ నా మీద వదలి మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమని చెప్తే వినరు."

    "ఏమిటి? అన్నీ నీమీద వదిలేయాలా? ఒరేయ్! నువ్వు ముందు నా కళ్ళెదురుగా కనిపించకుండా వెళ్ళిపో! వెళ్ళు- గెటౌట్!"

    అరచి నీరసంగా సోఫాలో కూలబడిపోయాడతను.

    శారద, రవి మొహమొహాలు చూసుకుని నవ్వుకున్నారు.

    "మీకు మరీ చాదస్తం ఎక్కువయిపోతోంది. అన్నీ నష్టాలు వస్తున్నాయి. డబ్బు లెక్కల్లో తేడాలు వస్తున్నాయి. వస్తే మాత్రం మనకేమిటి ఇదేం మన సొంత సొమ్మా? పోతే పోనీండి."

    "అదికాదే! ఇంకొద్ది రోజులే మిగిలింది. ఆ రాజశేఖరం తిరిగివచ్చేస్తాడు. ఇక్కడి అవకతవకల గురించి వాడడిగితే నేనేం చెప్పను?" దిగులుగా, బాధగా అన్నాడు.

    శారద గుండె ఝల్లుమంది ఆ మాటతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS