Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 42

    రాజశేఖరం అక్కడ్నించి తిన్నగా పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు.

    "ఏం కావాలి?" అడిగాడు కానిస్టేబుల్.

    "ఇన్స్ పెక్టర్ తో మాట్లాడాలి!"

    "అంటే.... నీ లెవల్ కి మేము పనికిరామేరా సాలే! చెప్పు .... ఏం కావాలో?"

    రాజశేఖరానికి కోపం ఆగలేదు.

    "బాస్టర్డ్! నన్ను సాలే అంటావా?" అంటూ బలంగా పిడికిలి బిగించి అతని పొట్టలో కొట్టాడు.

    ఆ అకస్మాత్తు చర్యకు కానిస్టేబుల్ వెనక్కు తూలి పడబోయాడు.

    ఆ దృశ్యం చూసి మరో నలుగురు కానిస్టేబుల్స్ వచ్చి అతని రెక్కలువిరిచి పట్టుకున్నారు.

    "ఏమ్ రా! స్టేషన్ కొచ్చి మమ్ముల్నే కొడతావ్ రా? బాడుకవ్-సాలే! నిన్ను ఈడనే ఖతమ్ జేస్తాం."

    అందరూ తలోవేపు నుంచీ బూటుకాళ్ళతో తన్ని కొడుతూంటే నేలమీద పడిపోయాడతను.

    "అప్పుడే ఇన్స్ పెక్టర్ జీప్ దిగి రావడంతో అతనిని వదిలేశారు.


    "ఎవడీడు?" అడిగాడు ఇన్స్ పెక్టర్.

    "ఎవడో పిచ్చాడు మన కానిస్టేబుల్ని ఎటాక్ చేశాడు."

    "బయటకు తోలండి!" అనేసి అతను వెళ్ళిపోబోతుంటే రాజశేఖరం చప్పునలేచి నుంచున్నాడు.

    "ఇన్స్ పెక్టర్! అయ్ వాంట్ స్పీక్ టు యూ! ఇటిజ్ అర్జెంట్ మేటర్."

    ఇన్స్ పెక్టర్ ఆశ్చర్యంగా చూశాడు.

    అతని అమెరికన్ యాసలో ఇంగ్లీష్ కొంచెం కుతూహలం కలిగించింది.

    "ఏమ్మాట్లాడాల?"

    "స్లమ్ లో ఒక ముసల్ది ఒక స్కూల్ కెళ్ళే చిన్నపిల్లను ఎత్తుకొచ్చింది. ఆ పిల్ల కళ్ళు, కిడ్నీలు అన్నీ నర్శింగ్ హోమ్ వాళ్ళు కొనుక్కుంటారట. వెంటనే మీరు దాన్ని కస్టడీలోకి తీసుకోపోతే ఆ పిల్ల చచ్చిపోతుంది."

    ఇన్స్ పెక్టర్ కి అనుమానం కలిగింది. అతను పిచ్చాడు కాదని.

    "ఏ స్లమ్ లో వుందా ముసల్ది?"

    "ఆ ఓవర్ బ్రిడ్జి దగ్గర"

    "ఆ రాజశేఖరం ఎస్టేట్స్ స్లమ్మా?"

    "ఆ! అవును! నాదే!"

    అతను ఆశ్చర్యపోయాడు.

    "ఏమిటి?"

    "ఏమీలేదు! నేనుండేదక్కడే."

    "ఆల్ రైట్! గంగారాం! నువ్వూ నరసింహా జీప్ లో వీడిని తీసుకెళ్ళి చూడండి. నిజమో, కాదో."

    "పదబే!" అన్నాడు గంగారాం అనే హెడ్ కానిస్టేబుల్.

    "ఏయ్ 'బే' అన్నావంటే మర్యాదగా వుండదు" కోపంగా అన్నాడు రాజశేఖరం.

    "చల్ చల్ బే" అంటూ యిద్దరు కానిస్టేబుల్సూ అతనిని జీప్ దగ్గరకు తీసికెళ్ళారు బలవంతంగా.

    కొద్ది క్షణాల్లో జీప్ స్లమ్ కి చేరుకుంది.

    ముసల్ది తలుపు తెరుస్తూనే పోలీసులను చూసి ఒక్క వుదుటున పరుగెత్తబోయింది. కానీ కానిస్టేబుల్ వెంటపడి జుట్టుపట్టుకుని వెనక్కు తీసుకొచ్చాడు.

    ఈలోపల మరో కానిస్టేబుల్ లోపలికెళ్ళి యిద్దరు పిల్లలను బయటకు తీసుకొచ్చాడు.

    ఇద్దరూ భయపడి ఏడ్చేయటం మొదలు పెట్టారు.

    ఆ ముసలమ్మనూ, పిల్లలనూ తీసుకుని వెళ్ళిపోయారు.

    అందరూ రాజశేఖరాన్ని నిందించటం ప్రారంభించారు.

    "దాని బ్రతుకది బ్రతుకుతోంది. పోలీసులకెందుకు పట్టించావ్?" అన్నాడు గడ్డపాడు.

    "అది చేసే పని తప్పుపని కాదా?"

    "ఎవడు తప్పులు చేయడం లేదు? అందరి తప్పులూ సరిదిద్దుతావా? మన ఎమ్మెల్ల్యేలు, ఎంపీలే మాతో దొంగ ఓట్లు వేయించి దేశాన్ని పరిపాలిస్తున్నారు. అంటే గవర్నమెంటే దొంగ గవర్నమెంటే కదా! ఆళ్ళనెవరయినా ఏమైనా చేయగలరా?" అడిగాడతను.

    రాజశేఖరంకి ఏమీ సమాధానం దొరకలేదు.

    "నువ్వేదో గొప్ప పని చేశాననుకుంటన్నావేమో! పోలీసోళ్ళు భాగ్యమ్మనేమీ చేయలేరు. ఆ పిల్లలను కొనే ఆస్పత్రి ఎవళ్ళదనుకుంటున్నావ్? మన ఢిల్లీ మంత్రి కొడుకుది. ఆడిని పోలీసోళ్ళేం జేస్తారు? మంచిగ పైసలు తీసుకుని వదిలేస్తారు" అన్నాడు రాములు.

    "అసలీడినీ జాగాలోకి ఎవళ్ళు రానిచ్చున్రు? ఈడకెళ్ళి తోసేయండ్రి" అన్నాడు డప్పు కొట్టేవాడు.

    "రాజేం తప్పు జేశాడు? ఆ ముసల్దాన్ని పోలీసులకు పట్టించాల్సిందే" అంది డాన్స్ చేసే పిల్ల రాణి.

    సోనీ ఆ గొడవంతా చూసి పరుగెత్తుకొచ్చింది.

    "ఏమయింది?" అడిగిందామె.

    జరిగిందంతా చెప్పాడు రాజశేఖరం.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS