వృద్ధుడి కంఠం జీరపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి.
"తాతా! నన్ను ఎవరనుకుంటున్నావ్?"
కోటయ్య కళ్ళు చికిలించి ముఖం శరత్ దగ్గిరగా పెట్టి చూశాడు.
"నువ్వు సత్యనారాయణవు కదూ! కాదు. వాడికి ఏబై ఏళ్ళుంటాయ్, నువ్వు చిన్నవాడివి. ఎవరు బాబూ నువ్వు? ఎందుకొచ్చావ్?" అన్నాడు కోటయ్య ఆప్యాయంగా.
"నా పేరు శరత్!"
"అంటే నాకేం తెలుస్తుంది బాబూ! ఎవరబ్బాయివి?"
శరత్ చెప్పాలా వద్దా అన్న మీమాంసలో పడ్డాడు. ముందే అయితే ఈ కోటయ్య అసలు సంగతి దాస్తాడేమో! మాటల్లో పెట్టి రహస్యం అడగాలి.
"ఏం బాబూ మాట్లాడవ్? అయ్యో! అట్టా ఆ మంచం పట్టి మీదన్నా కూర్చో బాబూ!"
"ఫర్వాలేదు తాతా!"
"ఎవరబ్బాయివి బాబూ? దొరబాబులా వున్నావ్!"
శరత్ ఉలిక్కిపడ్డాడు.
"దొరబాబు, దొరబాబు" అందరూ అదేమాట!
"ఆ సత్యనారాయణ ఎవరు?"
"ఉన్నాడులే పుండాకోర్ ఒకడు. అదే నా బిడ్డను నాకు దూరం చేశాడు. పచ్చి మోసం! ఎన్ని కబుర్లు చెప్పాడనుకున్నావ్! నా బిడ్డ చదువుకొని కలెక్టర్ అవుతాడనుకున్నాను. నా బిడ్డ ఎంత అందంగా వుండేవాడనుకున్నావ్!" గతంలోకి జారిపోతూ తనకు తనే చెప్పుకుంటున్నట్టు సన్నగా గొణిగాడు కోటయ్య.
కోటయ్య కొడుకు చదువుకున్నాడా? అందంగా వుండేవాడా? మోసంతో చచ్చిపోయాడా? అంటే తను.... శరత్ గుండెలు దడదడలాడాయి.
"నువ్వెవరు బాబూ! ఎందుకొచ్చావ్?"
"అది తర్వాత చెప్తాను తాతా! ఆ సత్యనారాయణ సంగతి చెప్పు. నీ కొడుకు ఎట్లా, ఎందుకు చచ్చిపోయాడో చెప్పు" ఆతృతగా అడిగాడు.
కోటయ్య గోడకు చేరబడి కళ్ళు మూసుకున్నాడు.
"తాతా! అన్నం తిన్నావా?"
"ఇంకా లేదు. పాపం ఆదెమ్మ తెచ్చిపెట్టి పోయింది."
"ఆదెమ్మ ఎవరు?"
"ఈ గూడెంలో వుండే ఒక మనిషి. రోజూ ఎవరో ఒకరు ఒక ముద్ద పడేస్తారు బాబూ."-
కోటయ్యకు కడుపులో ఏదో కదిలినట్టయింది.
బోసినవ్వు నవ్వాడు అదోలా.
"ఎందుకు తాతా నవ్వుతున్నావ్?"
"శరీరంలో అన్ని శక్తులూ చచ్చినా, అదొక్కటి మాత్రం చావలేదు బాబూ, అదొక్కటే.... అదొక్కటే."
"ఏమిటి తాతా అది?" ఆశ్చర్యంగా అడిగాడు శరత్.
అదే బాబూ.... మనిషి చచ్చేదాకా వెంటపడి పీక్కుతినేది ఆకలి...."
శరత్ ఆశ్చర్యంగా కోటయ్య ముఖంలోకి చూశాడు.
"తాతా చదువుకున్నావా?"
"ఆఁ "
"ఎంతవరకు?"
"ఒక నిండుజీవితం అంత చదివాను బాబూ?"
శరత్ కోటయ్య ముఖంలోకి విస్మయంగా చూశాడు.
"ఎంతో జీవితం చూశాను. పెద్దదొరల ఇళ్ళల్లో పని చేశాను కండల్ని కరిగించి పనిచేశాను. భూమి బద్దలుకొట్టి రత్నాలు పండించాను బాబూ! వయస్సు వచ్చింది. ఈ వయసు ఎవర్నీ వదల్దు దీని పంజాలో చిక్కినవాడు ఎంత గొప్పవాడయినా ఇంతే బాబూ."
"ఎంత బాగా మాట్లాడుతున్నావ్ తాతా."
తాత బోసినోరు విప్పి నవ్వాడు!
"ఆకలేస్తుందన్నావు, అన్నం తిను తాతా!" అన్నాడు శరత్. కోటయ్య కర్ర తీసుకొని లేవబోయాడు.
"నువ్వు కూర్చో తాతా! నేను తెచ్చి పెడతాను."
కోటయ్య వారిస్తున్నా వినకుండా వెళ్ళి గిన్నె మీద మూత తీశాడు. నూకల సంకటి దాని నిండా మట్టిగడ్డలు కన్పిస్తున్నాయి. ఆ సంకటి మీద కొంచెం ఉప్పు, ఒక మిరపకాయ వున్నాయి.
అది చూసి శరత్ మనసులో ఏదో కలుక్కుమంది.
శరత్ గిన్నె తెచ్చి కోటయ్య ముందు పెట్టాడు.
కడవలో నీళ్ళు గ్లాసులోనికి వంచి తెచ్చి పక్కన పెట్టాడు.
"నువ్వట్టా ఆ మంచం పట్టెమీద కూర్చోబాబూ." అన్నాడు కోటయ్య.
పాంట్ తో కింద కూర్చోవాలంటే శరత్ కు కష్టంగానే వుంది. మంచం కోటయ్య దగ్గిరగా లాగి పట్టె మీద కూర్చున్నాడు.
కోటయ్య సంకటిలో నీళ్ళుపోసి, ఉప్పుతో పిసికి మిరపకాయ నంజుకుంటూ ఆవురావురుమని తింటూ వుంటే శరత్ చూస్తూ కూర్చున్నాడు.
శరత్ మనసు కలత చెందింది.
