Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 42


    తను ఈనాడు ఇలా వుండడానికి తనే కారణమా! కాదు తనకు సమాజంలో కల్పించబడ్డ స్థానం....!


    "కోటయ్య గుడిసె ఇటు!" అన్నాడు వెంకట్రామయ్య కుడి వైపుకు తిరుగుతూ.


    "ఇవ్వాళ వద్దు మామయ్యా! ఇంటికెళ్దాం పద! అన్నాడు శరత్."


    వెంకట్రామయ్య ఆగి శరత్ ముఖంలోకి చూశాడు.


    "ఇవ్వాళ నా మనసు బాగాలేదు. రేపు చూద్దాంలే." అంటూ గబగబా ముందుకు సాగాడు శరత్.


    వెంకట్రామయ్య సంతోషంగా శరత్ ను అనుసరించాడు.


                                       14


    "ఛ పో! ఛా! ఛా! నా దగ్గిరేముందనే ఊరికే వస్తావ్? మోకాళ్ళను దగ్గిరగా తీసుకొని, గోడకు చేరబడి కూర్చునివున్న కోటయ్య అలికిడి విని, పక్కనే వున్న కర్ర చేతిలోకి తీసుకొని ఎత్తాడు."


    విసరబోతున్న కర్రను చటుక్కున పట్టుకున్నాడు శరత్.


    "ఎవరదీ? రాములా! ఇవ్వాళ పనికెళ్ళలేదట్రా!" వణుకుతున్న కంఠంతో ప్రశ్నించాడు కోటయ్య.


    "నేను రాముల్ని కాదు కోటయ్యా!" తాతా అనబోయి కోటయ్యా" అన్నాడు శరత్.


    "ఎవరూ?"


    శరత్ ఏం చెప్పాలో తోచని వాడిలా ఆ వృద్ధుణ్ణి చూస్తూ నిల్చున్నాడు.


    "ఎవరు బాబూ నువ్వు? ఇంకా నయం, కుక్క అనుకున్నా, కర్ర విసిరేవాణ్ణే!" అంటూ వెలుగు మందగించి చింతగింజల్లా చెట్టు బెరడులా, ముడతలు పడ్డ చర్మంతో లోతుగా వున్న కళ్ళు చికిలించి చూశాడు కోటయ్య.


    శరత్ కోటయ్య రూపాన్ని చూస్తూ నిల్చున్నాడు. ముడతలుపడ్డ చర్మం, ఎముకలను అంటుకొని వుంది. పొడవాటి నల్లటి కాళ్ళూ, చేతులూ పొగచూరిన ఎదురు బద్దల్లా వున్నాయి.    


    మోకాళ్ళ పైకి, చిరిగి మురిగ్గా వున్న పంచ మడిచికట్టాడు. ఏ అచ్చాదనాలేని పైభాగం అస్థిపంజరంలా వుంది.     


    శరత్ నాలుగువైపులా పరికించి చూశాడు. గుడిసె కొంచెం విశాలంగానే వుంది. గోడలు పడిపోయి వున్నాయి. ఇంటిమీది నడికప్పు ఎగిరిపోయి వాసాలు కన్పిస్తున్నాయి. నేలంతా గుంటలు పడి వుంది. వాకిలికి చిరిగిపోయిన తడిక వుంది. ఆ తడిక మీద సినిమా బొమ్మలు అతికించి వున్నాయి. వాటి రూపం చూస్తుంటే అవి ఎంతకాలం క్రితం అతికించబడ్డాయో చెప్పడం కష్టమే.  


    ఒక పక్కగా తాళ్ళు తెగి వేలాడుతున్న కుక్కి మంచం వుంది. ఆ మంచం మీద ఒక గొనెపట్టా, చిరిగి మురికిగా వున్న ధోవతీ వున్నాయి!


    ఒక మూల మట్టి కడవ వుంది. ఆ కడవ పక్కనే చొట్టలుపడి మట్టికొట్టుకున్న జర్మన్ సిల్వర్ గిన్నె, గ్లాసూ వున్నాయి. ఆ గిన్నె మీద మూకుడు మూతపెట్టి వుంది.


    శరత్ నిట్టూర్చాడు.


    ఈ ఇంట్లో తను పుట్టాడా? ఈ కోటయ్య రక్తం తనలో వుందా? తను ఈ కోటయ్యకు ఏమౌతాడు? మనమడా?    


    కోటయ్యకు ఏదో గుర్తువచ్చినట్లుంది. ముఖంలో కోపం, బాధా కన్పించాయి.


    "నువ్వా బాబూ! ఎందుకొచ్చావ్? మళ్ళీ ఏం చూడాలనివచ్చావ్?" ఆ  వణుకుతున్న కంఠంలోని తీవ్రతకు శరత్ ఆశ్చర్యంగా చూశాడు.  


    "మాట్లాడవేం బాబూ! నేను ఎలా వున్నానో చూట్టానికి వచ్చావా, చూశావుగా! ఇక వెళ్ళు."


    శరత్ కోటయ్యను చూస్తూ నిల్చున్నాడు.


    "నా కొడుకును - దేశం.... దేశం.... అంటూ బలిచ్చి నువ్వు సుఖంగా ఉద్యోగం చేసుకుంటున్నావా? పిల్లా పాపతో వర్ధిల్లుతున్నావా?"


    శరత్ కు ఏం సమాధానం ఇవ్వాలో తోచడం లేదు.


    "తెల్లవాడు ఎల్లి పోయాడుగా! దానికేగా నా కొడుకుని బలిచ్చావ్!ఆడు  ఎల్లిపోతే అందరూ సుఖంగా బతుకుతారన్నావుగా? నాలాంటి ముసలాళ్ళ కోసం అవేంటో విశ్రాంతి భవనాలు కట్టిస్తారన్నావుగా? ఎయ్యి ఆ భవనాలు! కట్టించావా? నన్ను తీసుకెళ్ళడానికొచ్చావా? మాట్లాడవేం?" కోటయ్యకు దగ్గుతెర వచ్చింది.      


    కఫం తెగేదాకా దగ్గి. తుపుక్కున పక్కనే ఊశాడు.


    శరత్ కు కడుపులో దేవినట్టయింది.


    "ఏం బాబూ మాట్లాడవ్? బాధపడుతున్నావా? నిన్ను చూడగానే నా కొడుకు గుర్తొచ్చాడు. అందుకే ఏదేదో అన్నాను. నన్ను చూడటానికొచ్చావా? చూడు. చావలేక బతుకుతున్నాను. ఎందుకు బతుకుతున్నానో తెలుసా? నా కొడుకు కన్న కలలు పండిన రోజు చూద్దామనే బాబూ! కానీ ఆ కలలు? ఏమైనాయి? కలలుగానే కరిగిపోయాయా?" ముసలాడు ఉద్రేకంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. మళ్ళీ దగ్గుతెర వచ్చింది.


    "ఆవేశపడకు తాతా!" అన్నాడు శరత్ కోటయ్య పక్కన కూర్చుని భుజం మీద చెయ్యి ఆనించి.


    "తాతా! ఇదేమిటి కొత్త పిలుపు. అప్పుడు బాబాయి అనేవాడివిగా అది సరేగాని తెల్లవాడు ఇంకా ఎల్లిపోలేదా? అందుకేగా చెట్టులాంటి నా కొడుకు నేలకు ఒరిగిపోయాడు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS