Next Page 
ప్రతీకారం పేజి 1


                                   ప్రతీకారం

                                                                        వాసిరెడ్డి సీతాదేవి

                                          

    నల్లమల అడవి ఒళ్ళువిరుచుకుని కళ్ళు తెరిచి మత్తుగా నవ్వింది. కొండ వెనకగా కన్పిస్తున్న తూర్పు ఆకాశం అరుణ రేఖల్ని పులుముకొని పులి చంపిన లేడి నెత్తురు-ఆత్రంగా తాగిన తోడేలు మూతిలా వుంది.
    చీకటిలో పారాడుతూ చెట్ల సందుల నుంచి జారిన వెలుగు పొడలు కొండ రాళ్ళమీద, కుష్టురోగి శరీరం మీది మచ్చలా కన్పిస్తున్నాయి.
    ప్రియుని కంఠస్వరం విన్న ప్రియురాలి గుండెలా విప్పి చెట్టుకు కట్టివున్న మేకపిల్ల మెడలో గంటలు మ్రోగాయి.
    పొదలో ఏదో జంతువు కాలికింద, ఎండు ఆకులు కన్నెపిల్ల నవ్వులా గలగలమన్నాయ్.
    తను కలలో కూడా  వూహించని వ్యభిచారాన్ని అంటగడితే భర్తముందు స్థాణువులా బిగిసిపోయి నిల్చున్న నవ వధువులా, ఆ శబ్దం విని మేకపిల్ల భయంతో బిగుసుకు పోయింది.
    మంచం మీద రాత్రంతా నిద్రలేకుండా కూర్చుని వున్న ముగ్గురు వ్యక్తుల తాలూకు ఆరుకళ్ళు, యుగాలుగా చీకటితో పోరాడుతున్న మిణుగురు పురుగుల్లా కళకళలాడుతున్నాయ్.
    "అది పులే! సందేహం లేదు. రాత్రంతా పొదలో పొంచి కూర్చున్నది!" అన్నాడు మూర్తి ఉత్సాహంగా.
    "కాదు. అది పులి కాదు. పులికి జిత్తులు వెయ్యడం రాదు!" అన్నాడు శర్మ.
    "పులికూడా చాలా తెలివైన జంతువు" అన్నాడు మూర్తి.
    జగన్నాధం చేతిలోకి తుపాకి తీసుకొని గురిపెట్టి, పొదలో నుంచి శబ్దం వస్తున్న వైపు దీక్షగా చూస్తున్నాడు.
    ఏదో జంతువు పొదలోనుంచి దూకి మెరుపులా పరుగు తీసింది.
    "నేను చెప్పలా? అది పులి కాదు. లేడి!" అన్నాడు శర్మ.
    జగన్నాధం ఒక్క ఉదుటున మంచం మీది నుంచి దూకాడు. లేడి పరిగెత్తిన వైపుకు పరుగుతీశాడు.
    "పులికోసం వచ్చిన జగన్నాధానికి కనీసం లేడికూడా దొరికేలా లేదు" అన్నాడు శర్మ బద్ధకంగా ఆవలిస్తూ.
    "చూస్తూండు. జగన్నాధం ఆ లేడిని చంపకుండా తిరిగి రాడు" అన్నాడు మూర్తి ఒళ్ళు విరుచుకుంటూ.
    "జగన్నాధం ఓపికను మెచ్చుకోవాలి. మనకు ఒక్క రోజుకే బోరు కొట్టేసింది. దాదాపు నెలకు పది పదిహేను రోజులన్నా వేటలోనే గడుపుతాడు" అన్నాడు శర్మ.
    "అవును. జగన్నాధానికి వేట పిచ్చి చాలా ఎక్కువ. నేనూ అప్పుడప్పుడు వస్తుంటానుగా? అతనికి వేటలో ఏదో అనిర్వచనీయమైన ఆనందం లభిస్తుందనుకుంటాను. వరసగా రెండేసి రోజులు పెళ్ళాం, బిడ్డల్ని తలవకుండా అరణ్యంలోనే వుండిపోతాడు" అన్నాడు మూర్తి.
    "ఏం ఆనందమో బాబూ! నాకు నిద్ర ముంచుకొస్తోంది" అంటూ శర్మ మంచె మీద ముడుచుకు పడుకున్నాడు.
    లేడి వెంట పరిగెత్తిన జగన్నాధానికి మనం గుర్తు కూడా ఉండం, ఎప్పటికొస్తాడో ఏం పాడో!" విసుగ్గా అన్నాడు మూర్తి.
    ఐదడుగుల పదకొండు అంగుళాల పొడవూ, కండపుష్టి గల జగన్నాధం చెట్ల మధ్యగా, కొండరాళ్ళ మీద తుపాకి పట్టుకుని పరుగు తీస్తూ ఉంటే చెట్లమీంచి పిట్టలు అరుస్తూ లేస్తున్నాయి. బలంగా పడుతున్న జగన్నాధం కాళ్ళ కింద కొండరాయి నల్లగా మెరుస్తోంది.
    జగన్నాధం వయస్సు ముప్పై ముప్పై- అయిదు సంవత్సరాల మధ్య వుంటుంది. పట్టుదలను సూచించే కిందకు సాగిన గడ్డం, ఉత్సాహానికి ప్రతినిధిగా కన్పించే పొడవాటి ముక్కూ, ఆ చిన్న కళ్ళలో నిశితంగా, నిశ్చలంగా కన్పించే చూపులు. ఒకసారి చూస్తే మరుపురాని ప్రత్యేకత ఏదో ఉంది అతని వ్యక్తిత్వంలో.
    లేడి కన్పించినట్టే కన్పించి మళ్ళీ ఇట్టే మాయమైంది. జగన్నాధం నిలబడి నలువైపులా చూపుల్ని సారించాడు.
    లేడి కొరకు వెదుకుతున్న జగన్నాధం కళ్ళకు నల్లటి ఎంబాసిడర్ కారు, ఘాట్ రోడ్డు దిగుతూ కన్పించింది. చూస్తూ నిల్చున్నాడు జగన్నాధం.
    కారు ఒక్కసారిగా ఆగింది. డ్రైవరు సీటునుంచి ఒక యువకుడు దిగి రోడ్డుకు అడ్డంగా వున్న రాళ్ళను తొలగించటానికి వంగాడు.
    మరుక్షణంలోనే పొదలమాటునుంచి నలుగురు వ్యక్తులు కర్రలతో ఆ యువకుడ్ని చుట్టుముట్టడం చూశాడు జగన్నాధం.
    కార్లోనుంచి దూకిన ఒక యువతీ "రక్షించండి! రక్షించండి!" అంటూ వెర్రిగా కేకలు పెడుతూ రోడ్డుకు అడ్డంపడి పరుగుతీస్తూంది. ఆ యువకుడు దెబ్బలు తింటూ అరుస్తున్నాడు.
    ఆ అరుపులు కొండరాళ్ళను 'ఢీ'కొని ప్రతిధ్వనిస్తున్నాయి.
    జగన్నాధం ముందుకు పరుగెత్త సాగాడు. వాళ్ళు నలుగురు ఉన్నారు. అయినా ఫర్వాలేదు. తన చేతిలో రైఫిల్ ఉంది. ఆ యువకుడ్ని తను రక్షించగలడు!
    ఆలోచిస్తూ ఆత్మ స్థయిర్యంతో పరుగు వేగాన్ని హెచ్చించాడు.
    "రక్షించండి! రక్షించండి!" అరుస్తూ జగన్నాధానికి ఎదురుగా పరిగెత్తుకొస్తున్న స్త్రీ. ముందుకు పరుగెత్తుతున్న జగన్నాథాన్ని పట్టుకొని పడబోయింది.
    జగన్నాథం ఒక్కసారిగా ఆ యువతిని పడకుండా చేతితో గట్టిగా పట్టుకొని గుండెలమీదకు లాక్కున్నాడు. ఆమె నిలదొక్కుకొని జగన్నాథం ముఖంలోకి అర్ధితూ చూసింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS