Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 44


    దేశంలో ఎంతమంది ఇలా బతుకుతున్నారో! ఇలా బతికేవాళ్ళే ఎక్కువ. తను కూడా ఇలా బతకవలసినవాడే, కాని....   


    శరత్ తన జీవితాన్ని వీళ్ళ బతుకులతో పోల్చుకుంటూ కూర్చున్నాడు.


    ఎన్నో ఆలోచనలు వచ్చాయి!


    అధిక సంఖ్యాకులు ఇలా వుంటే కొందరు మాత్రం తనలా వుండటానికి కారణం ఏమిటి? ఎక్కడవుంది ఈ లోపం?     


    శరత్ లో మొదటిసారిగా ఇలాంటి ఆలోచనలు వచ్చాయి.


    ఎక్కడో, ఏదో లోపం వుందని అనిపించసాగింది.


    తను ఎం. ఎస్. పాసయ్యాడు లెక్చెరర్ గా కూడా పనిచేశాడు కాని తనకు తన జన్మరహస్యం తెలిసినప్పటినుంచే అనేక ఆలోచనలు వస్తున్నాయి.   


    కోటయ్య అన్నం తిని గిన్నెలో చెయ్యి కడుక్కుని గిన్నె పక్కగా పెట్టాడు.


    కోటయ్యకు కడుపు చల్లబడింది. నిద్రవస్తున్నట్టు అనిపించింది. గోడకు చేరబడి కళ్ళు మూసుకున్నాడు.


    కొడుకు రాముడు కళ్ళముందు కన్పించాడు.... ....   


                            *    *    *


    కోటయ్య తండ్రి, తాత ముత్తాతలూ ఆ వూళ్ళోనే పుట్టి, అక్కడే గతించారు.


    తాతగారి హయాంలో సొంతఇల్లు, కొంత భూమీ కూడా ఉంది.


    తండ్రి కాలంలో పొలం కాస్తా పోయి ఇల్లు మాత్రం మిగిలింది.


    కోటయ్య పుట్టేసరికి పెంకుటిల్లు అమ్మి బస్తీలో ఇల్లు కొన్నారు.


    కోటయ్య చిన్నతనం ఈ గుడిసెలోనే గడిచింది. కోటయ్య వెంకట్రామయ్య తండ్రి దగ్గిర పాలేరుగా పనిచేశాడు. తండ్రి పోయాక కొంతకాలం కోటయ్య కూడా ఆ ఇంట్లోనే పాలేరు పనిచేశాడు.


    పెళ్ళి చేసుకున్నాడు. కొడుకు పుట్టాడు. ఆ ఇంట్లోనే కొడుక్కు రెండేళ్ళు నిండగానే భార్య పోయింది.


    కొడుకుని ఊళ్ళో వున్న స్కూల్లో వేశాడు. పొద్దుకూకులూ చేసి వచ్చి చెయ్యి కాల్చుకోవాలంటే కష్టం అనిపించేది. పదిమంది పోరుపెడితే మళ్ళీ పెళ్ళిచేసుకున్నాడు.


    రెండో భార్య రంగమ్మ అదోలాంటి మనిషి. కాపరానికి వచ్చిన కొద్దిరోజులకే కొడుకుని నానా బాధలూ పెట్టింది.    


    కొడుకు రాముణ్ని బాగా చదివించాలని కోటయ్య కోరిక.


    ఒకరోజు పొలం నుంచి తిరిగొచ్చిన కోటయ్య రాముణ్ని రంగమ్మ కర్ర తీసుకుని పిచ్చిగా బాదడం చూశాడు.


    కోటయ్యకు వొళ్ళు తెలియని కోపం వచ్చింది. ఆ కర్రలాక్కుని భార్యను చావబాదాడు. రంగమ్మ తెల్లవారి పుట్టింటికి ప్రయాణం అయి వెళ్ళిపోయింది.


    కోటయ్యకు ఆ వూళ్లో ఉండాలనిపించలేదు. పక్క వూళ్ళో భూస్వామి భద్రయ్యగారింట్లో పాలేరుగా చేరాడు.


    కోటయ్యది ఉక్కులాంటి శరీరం. తన చేతులతో భూమిని బద్దలు కొట్టాడు ధాన్యరాశుల్ని యెత్తిపోశాడు.    


    కోటయ్య చేతులు చేయని పనిలేదు. కోటయ్య తిరగని ప్రదేశం లేదు ఆ ఊళ్ళో. ఆ ఊళ్ళో వాళ్ళందరికీ కోటయ్య తల్లో నాలిక అయ్యాడు.


    భద్రయ్య గారింట్లో కోటయ్యకు వున్న స్థానం ఒక జీతగాడికి ఉండే స్థానం కాదు. ఎంతో గౌరవంగా చూశారు. తను ఒక జీతగాడిని మాత్రమేనని కోటయ్య ఏనాడూ భావించలేదు. ఆ ఇల్లు తనదిగా భావించి పొలాలు తనవిగా భావించి, వళ్ళొంచి చమట కార్చాడు!


    ఇతర కమతగాళ్ళతో తనను ఎప్పుడూ పోల్చుకునేవాడు కాడు. భద్రయ్యగారి హృదయంలో తనకు ఒక ప్రత్యేకస్థానం వున్నట్టు భావించేవాడు భద్రయ్యగారి భార్య వెంకాయమ్మ కోటయ్యను ఎంతో ఆదరించేది.


    కోటయ్య భద్రయ్యగారి చావిట్లో ఒకవార తడికలు పెట్టుకుని కొడుకుతో వుండేవాడు. రాముడు ఊళ్లోవున్న స్కూల్లో చదువుకున్నాడు.


    బ్రతికిచెడ్డ కోటయ్యను భద్రయ్య నోరారా "కోటయ్యా" అని పిల్చేవాడు. భద్రయ్య కోటయ్యను నమ్మి. నమ్మించేవాడు. భద్రయ్య ఆదరం, అభిమానం, విశ్వాసాలతో కోటయ్యను శాశ్వతంగా తనని కట్టిపడేసుకున్నాడు.


    కోటయ్య భద్రయ్యగారింట్లో ఓ భాగంగా. కుటుంబంలో ఒక మనిషిగా. యజమానికి విశ్వాసంగల కుక్కగా మసలుకున్నాడు.


    ఆ కుటుంబంలో కోటయ్య, ఒకరకంగా చెప్పాలంటే ఊహకందని ఏదో బంధంతో బంధించబడ్డాడు.


    రాముడు థర్డ్ ఫారం పాసయ్యాడు. భద్రయ్యగారు వాణ్ణి కూడా పనిలో పెట్టమన్నాడు. ఈ విషయంలో మాత్రం కోటయ్య యజమానిమాట జవదాటాడు. కొడుకుని తీసుకెళ్ళి గుంటూరులో వున్న తాతా అమ్మమ్మలకు అప్పగించాడు హైస్కూల్లో చేర్పించాడు.


    అప్పుడప్పుడు వెళ్ళి చూసివస్తూ వుండేవాడు. పదీ, పరకా తీసుకెళ్ళి ముసలాళ్ళ చేతులలో పెట్టేవాడు.


    కోటయ్య కొడుకు మీద కొండంత ఆశ పెట్టుకున్నాడు.


    బాగా చదివించి పెద్ద ఆఫీసర్ని చెయ్యాలని కోటయ్య కోరిన కోరికతో ఎన్నో గాలిమేడలు కట్టుకున్నాడు.


    కోటయ్య కొడుకు స్కూల్ ఫైనల్లో పాసయి కాలేజీలో చేరాడు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.


    రాముడి తాత చనిపోయాడు. అమ్మమ్మ మాత్రం పెద్ద వయసు వచ్చినా ఓపిక తెచ్చుకుని మనమడికి వండిపెడుతూ వుంది. కోటయ్య భార్యకు కబురు పంపించాడు. రానని మొరాయించింది.


    అది 1942 వ సంవత్సరం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS