Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 41


    అబ్బ! నరకం అంటే ఎక్కడోలేదు. కాని ఈ నరకాన్ని సృష్టించింది ఎవరు? మానవుడి మీద జరుపుతున్న అత్యాచారానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం కదా? ఈ అన్యాయాల్ని అరికట్టే రోజు రాదా?


    ఎందుకు రాదూ? వస్తుంది! తప్పకవస్తుంది! మనిషి మనిషిగా బతికే రోజు వస్తుంది.


    శరత్ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. వెంకట్రామయ్య బుర్ర పనిచేయడం లేదు. ఆలోచనారహితంగా శరత్ ను అనుసరిస్తున్నాడు.


    ఆ గుడిసె కొంచెం పెద్దదిగా వుంది. హరికెన్ లాంతరు వెలుగులో కూర్చున్న వాళ్ళు పెద్దగా నవ్వుతున్నారు, ఆడవాళ్ళు కూడా వున్నారు. వాళ్ళ మధ్య పాతబడిన హార్మోనియం పెట్టె వుంది, పక్కనే పగిలిపోయిన కుండలా వుంది. ఖాళీ అయిన కల్లుముంతలు దూరంగా పడివున్నాయి పకోడీల తాలూకు వాసనా? పొట్లాల కాగితాలూ.... అక్కడక్కడ ఉమ్ములూ-


    ఒక మధ్యవయసు స్త్రీ ఊగుతూ బూతుపాట పాడుతూ వుంది. వయసులో వున్న పిల్ల ఒకతి అసభ్యకరమైన సైగలు చేస్తూ నాట్యం చేస్తూ వుంది. చుట్టూ వాళ్ళు విరగబడి నవ్వుతున్నారు. మధ్య మధ్య అసహ్యంగా మాట్లాడ్తున్నారు.


    శరత్ నిట్టూర్చాడు. ముందుకు కదిలాడు.


    "చూస్తున్నావుగా? ఇంకా నీ తల్లిని వెదకాలని వుందా? పద! ఇంటికి వెళ్దాం!" అన్నాడు వెంకట్రామయ్య.


    శరత్ వినీ విననట్టే ముందుకు సాగాడు.


    శరత్ ఆగు! కొంచెం ఆలోచించు!"


    "ఏమిటి?" అన్నట్టు వెంకట్రామయ్య ముఖంలోకి చూశాడు.


    "నీకు భయంగా లేదురా?"


    "ఎందుకు?"


    "ఒకవేళ నీ తల్లి కూడా ఆ బూతుపాట పడుతూ వెకిలిగా నవ్వుతున్న ఆడదానిలాగే ఎదురైందనుకో....?


    "అందుకు నేను ఒక్కణ్నే సిగ్గుపడనక్కర్లేదు. వాళ్ళు అలా అవడానికి కారణమైన సభ్యసమాజం మొత్తం సిగ్గుపడాలి." చురుగ్గా చూసి వేగంగా రెండు అడుగులు ముందుకు వేశాడు.


    "అయ్యో నా బిడ్డో! నా కొంప మునిగిందర్రో ఓరి ముదనష్టపోడా! ఎక్కడ చచ్చావురా!" పిచ్చిగా అరుస్తూ, ఏడుస్తూ ఓ స్త్రీ చుట్టూ పూర్తిగా జారిపోయిన గుడిసెలో నుంచి బయటకు వచ్చింది.


    గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వుంది.


    "ఏమిటే మంగా, ఏమైంది?" వెంకట్రామయ్య మంగమ్మను అడిగాడు.


    "అయ్యో బాబుగారూ! నా బిడ్డ సచ్చిపోతున్నాడండీ! మందు కోసమని అమ్మగారి దగ్గిర అడుకొచ్చిన పదిరూపాయలు ఆ సచ్చినోడు లాక్కెల్లాడండీ!" గుండెలు బాదుకుంటూ ఏడవసాగింది.  


    "ఇంకెక్కడి మందే! వాడు చుక్కమ్మ గుడిసెలో మస్తుగా మత్తుగా పడివున్నాడు" అన్నాడు వెంకట్రామయ్య.   


    "అనుకుంటూనే వుండా! ఓరి సచ్చినోడా! నీ జిమ్మడిపోను నీకు పొయ్యేకాలం రాను. ఎంతపని చేసినావురా!" తిట్లూ, ఏడుపూ నేను ముందంటే నేను ముందంటున్నాయి ఆమె కంఠంలో.


    శరత్ బాగా వంగి గుడిసెలోకి ప్రవేశించాడు. ఒక కుక్కి మంచంలో, మురికిగుడ్డలమధ్య ఓ బుల్లి మానవాకారం పడివుంది.


    శరత్ వెనకే వచ్చిన ఒకతను పిల్లవాణ్ని తాకి చూసి అంతా అయిపోనాది. ఇంకెందుకే అరుస్తావ్?" అంటూ బయటికి వచ్చాడు.


    శరత్ అలాగే నిల్చుండిపోయాడు.


    మంగమ్మ ఏడుపులకు పదిమందీ కూడారు.


    శవాన్ని తెచ్చి గుడిసె బయటపెట్టారు. మంగమ్మ నేలమీద దొర్లి దొర్లి ఏడుస్తూ వుంది. మొగుణ్ణి దుమ్మెత్తిపోస్తూ ఏడుస్తూ వుంది.


    నా కొడుకు సావలేదు. ఎవడ్రా నా కొడుకు సచ్చిపోనాడని సెప్పిన నాయాలు. నా కొడుకు బాగా చదువుతాడు. కలకటేరు అవుతాడు. అప్పుడు సూస్కోండి. నాటు సరుకు ఏసుకుంటానేమో!"   


    "ఎహే! ఊరుకో! సూడు నీ కొడుకు సచ్చిపోనాడు."


    శరత్ తలెత్తి చూశాడు.


    అంతకుముందు చూసిన దృశ్యంలో హార్మోనియం ముందు కూర్చుని వున్న ధృడకాయుడు గాలిలోకి చేతులు తిప్పుతూ, ఊగిపోతూ అంటున్నాడు. అతన్ని పట్టుకొని తీసుకొస్తున్న వాళ్ళిద్దరూ అతనికి కొడుకు చచ్చిపోయాడని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.  


    "నా కొడుకు సదువుతాడు.... కలకటేరు...." అంటూ ఆగి, వంగి మంచంమీద పడివున్న కొడుకు శవాన్ని కొద్దినిముషాలు చూసి, నేలమీద చతికిలపడ్డాడు.


    అలా కూర్చుని మరో రెండు నిముషాలు చూశాడు.


    "ఒరే, నరసిమ్మా ఎంతపని చేసినావురా! అంటూ గొల్లుమన్నాడు మత్తు వదలిపోయిన ఆ తండ్రి.


    శరత్ ఆ దృశ్యం చూడలేకపోయాడు. జేబులో నుంచి వందరూపాయల నోటు తీసి శవం దగ్గిరగా పడేసి గబగబా ముందుకుసాగాడు.


    "ఎందుకురా వందరూపాయలు పడేశావ్?" వెంకట్రామయ్య చిరాగ్గా అన్నాడు.


    "శరత్ కు సమాధానం ఇవ్వాలని లేదు. మనసంతా చేదు చేదుగా వుంది.


    "వీళ్ళను ఎవరూ బాగుచెయ్యలేరు. ఆ వందరూపాయలు పెట్టి రాత్రంతా మత్తుగా తాగేస్తారు" అన్నాడు వెంకట్రామయ్య.   


    శరత్ కు మనసు మనసులో లేదు.


    ప్రేమ్ చంద్ కథ "కఫస్" జ్ఞాపకం వచ్చింది.


    తనను సుశీలమ్మ పెంచుకోకపోతే ఈ గుడిసెల్లోనే పెరిగేవాడు, అలాగే తాగి బూతులు మాట్లాడేవాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS