ఒకవైపు తన అన్వేషణకు కొన అంటూ దొరికినందుకు సంతోషంగా వుంది. మరోవైపు తనను కన్నతల్లిని ఏ రూపంలో చూడాలో ఎలా వుంటుందోనని ఆవేదనగా వుంది.
దాదాపు ఏడు గంటల ప్రాంతంలో వెంకట్రామయ్య ఇంటికి వచ్చాడు పొలం నుంచి.
"బయలుదేరదామా?" అడిగాడు శరత్ వెంకట్రామయ్యను."
వెంకట్రామయ్య ఓ క్షణం ఆలోచనలో పడ్డాడు.
"శరత్, నువ్వు చేస్తున్న పని మంచిది కాదేమో! నీ తల్లి ఆ గుడిసెల్లో మనిషి అయి వుంటే?"
"నేను ఆ గుడిసెలకు సంబంధించిన వాడినే అవుతాను. నాలో వాళ్ళ రక్తం ప్రవహిస్తూ వుంది. అయినా నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు. నీ అల్లుణ్ణి చేసుకోవటానికి కూడా సిద్ధంగా వున్నావు" అన్నాడు శరత్.
"అది వేరు. నువ్వు మా దగ్గర పెరిగావు."
"అయినా నాలో వాళ్ళ రక్తమే వుందిగా!"
"శరత్!"
"ప్లీజ్ మామయ్యా! సారీ! నిన్ను అలా పిల్చే అర్హత నాకు ఉందో లేదో!"
వెంకట్రామయ్య దెబ్బతిన్నట్టు శరత్ ముఖంలోకి బాధగా చూశాడు.
"బయలుదేరు. వెళ్దాం" అంటూ శరత్ లేచి నిలబడ్డాడు.
వెంకట్రామయ్య యాంత్రికంగా లేచి నిలబడ్డాడు.
ఇద్దరూ ఊరిబయట మురికి వాడకు వచ్చేటప్పటికి బాగా చీకటి పడింది.
పగటి వెలుగులో కంటే రాత్రిపూట ఆ వాడ మరీ వికృతంగా కన్పిస్తుంది.
కప్పులు జారిపోయి, గోడలు పడిపోయి, ఆ గుడిసెలు, దుర్గంధపూరితమైన పావురాళ్ళ గూళ్ళలా వున్నాయి.
ఆ గుడిసెలలోకి వెళ్లే మట్టి త్రోవలు గతుకులతో, మురికితో అక్కడ వుండే వారి బతుకుల్లాగే వున్నాయి.
రోడ్డు పక్కగా ప్రవహిస్తున్న మురుగులో పందులు ఆనందంగా దొర్లాడుతున్నాయి.
వీధి కొళాయి ముందు మట్టికుండలతో, మురికి బట్టల్తో, జిబ్బు తలలతో ఆడవాళ్ళు నిలబడి వున్నారు.
పొగచూరిన మునిసిపాలిటీ దీపాల వెలుగు మందంగా వుంది.
కొన్ని గుడిసెలలోంచి పొగ వస్తూ వుంది.
ఒక పన్నెండేళ్ళ పిల్ల కల్లుముంత తీసుకొని భయపడుతూ ఒక గుడిసెలోకి వెళ్ళింది. శరత్ కాళ్ళు అప్రయత్నంగా ఆ గుడెసె ముందు నిలబడిపోయాయి.
లోపల నుంచి ఒక మగగొంతు ఎవర్నో బూతులు తిడుతూ వుంది.
శరత్ అనుకోకుండా ఆ గుడిసెలోకి వెళ్ళాడు. వెంకట్రామయ్య పిలుస్తున్నా వినిపించుకోలేదు. వెంకట్రామయ్య బయటే నిలబడిపోయాడు.
మిరపకాయ బజ్జీలు దొరకలేదు తాతయ్యా! ముప్ఫై పైసలు మిగిలాయి" అంటూ ఆ పిల్ల కల్లుముంత కింద పెట్టింది.
చిరిగిపోయిన చాపమీద అర్థనగ్నంగా పడివున్న ముసలివాడు లేచి కూర్చున్నాడు.
లోపల అడుగుపెట్టగానే భరించలేని నీచువాసన వచ్చింది శరత్ కు.
అప్పటికే ముసలివాడు మత్తుగా వున్నాడు.
"దొంగలంజా! ఇట్టారా! నీ ప్రాణం తీస్తా!" అంటూ అరిచాడు ముసలివాడు.
"తాతయ్యా! నేనేం చెయ్యలేదు నన్ను కొట్టొద్దు" అంటూ అప్పుడే నీళ్ళలో పడ్డ కోడిపెట్టలా వణికిపోతూ దూరంగా జరిగి నిల్చుంది.
ముసలివాడు ప్రక్కనే వున్న కర్రను పైకి ఎత్తాడు. పైకి లేచిన కర్ర గాలిలోనే ఆగిపోయింది. శరత్ కర్ర పట్టుకున్నాడు!
ముసలివాడు అతికష్టం మీద కళ్ళెత్తి శరత్ ను చూశాడు.
"దొంగముండా. ఇదంటే నువ్వు ఆడుతున్న నాటకం బాబుగారింట్ల తిరుగుతున్నావా? నీ అమ్మలా నువ్వూ."
"ఓబులూ!"
వెనకే వచ్చిన వెంకట్రామయ్య గట్టిగా పిల్చాడు. ఆ ముసలివాడు ఓ క్షణం వెంకట్రామయ్య ముఖంలోకి చూసి ఎముకలను అతుక్కున్న ముడతలు పడ్డ చేతులు జోడించాడు.
తమరా బాబుగారూ.... ఇది ఈ లంజ.... సూడండి, ఇప్పటి నుంచే ఈ దొరబాబు వెంట...." తడబడుతూ అన్నాడు.
"ఛ! ఏమిట్రా ఆ మాటలు? ఆ అబ్బాయి మా అల్లుడు. తనతో వచ్చాడు.
"అట్టాగా చమించండి ఏదో.... నేరక అన్నాను మళ్ళీ చేతులు జోడించాడు.
"ఎన్నేళ్ళొచ్చినా నీ తాగుడు మానవన్నమాట. పసిది సంపాదించి తెస్తుంటే.... సిగ్గులే....దూ" వెంకట్రామయ్య చీదరించుకున్నాడు.
"అవును! బాబూ! తిట్టండి బాగా తిట్టండి. అది - దీని తల్లి చేసిన పాపానికి ఇది అనుభవిస్తూంది" అంటూ భోరున ఏడ్వసాగాడు.
ఆ పిల్ల వెంటనే వెళ్ళి తాతను పట్టుకొని "తాతయ్యా ఏడవకు ఇదిగో తాగు!" అంటూ ముంత అందించింది.
శరత్ కళ్ళలో నీరు తిరిగింది. అక్కడ మరోక్షణం నిల్చోలేకపోయాడు.
శరత్ బయటికి వచ్చాడు.
