"అందువల్ల ప్రయోజనం?"
"నేను ఎవర్నో తెలుసుకోవడమే.... అంతవరకూ నాకు విశ్రాంతి లేదు."
వెంకట్రామయ్య చూస్తూ వుండిపోయాడు.
"చెప్పు మామయ్యా! నేనెవర్ని? నా కన్నతల్లి ఎవరు? ఆమె ఇప్పుడు ఎక్కడ వుంది? ఎలా వుంది?"
వెంకట్రామయ్య మాటా పలుకూ లేకుండా గుడ్లప్పగించి చూడసాగాడు.
"మామయ్యా! చెప్పవా?" అంటూ ఉద్రేకంగా రెండు చేతులూ పట్టుకున్నాడు.
"తెలియదు."
శరత్ వెంకట్రామయ్య చేతుల్ని చటుక్కున వదిలేశాడు.
"ప్లీజ్! అబద్ధం ఆడకు. నిజం చెప్పు. నన్ను ఈ నరకబాధ నుంచి కాపాడు. నాకోసం కాకపోయినా, మా అమ్మ - అదే, మీ చెల్లెలి కోసమైనా చెప్పు. నేను ఈ రహస్యం తెలుసుకోందే తిరిగి వెళ్ళను. నేను కన్పించకపోతే అమ్మ ఎంత బాధపడుతుందో నీకూ తెలుసు. కనీసం ఆమె కోసమైనా చెప్పు." శరత్ ఉద్రేకంతో ఊగిపోతున్నాడు.
"నిజం రా శరత్! నాకు తెలియదు." జాలిగా అన్నాడు వెంకట్రామయ్య.
"నీకు తెలుసు. అబద్ధం ఆడకు."
"నీకు ఎలా చెప్పనురా! నిజంగా నాకు తెలియదు."
"నువ్వు కదూ నన్ను తెచ్చి అమ్మకు అప్పగించింది?"
"అవును!"
"ఎక్కడనుంచి తెచ్చావు?"
వెంకట్రామయ్య వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాడు. ఆలోచనలో పడ్డాడు.
"నేను నీకు ఎక్కడ దొరికానో చెప్పు!"
"కోటయ్య ఇంటినుంచి తెచ్చాను."
శరత్ కళ్ళు ఒక్కసారిగా వెలిగాయి.
"ఎవరా కోటయ్యా? ఎక్కడ వుంటాడు?"
"ఒకప్పుడు మనింట్లో పాలేరుగా వుండేవాడు. ఇప్పుడు బాగా పెద్దవాడైనాడు. ఊరి బయట గుడిసెల్లో వుంటాడు. తిరిగే ఓపిక కూడా లేదు. తలొక ముద్దావేస్తే తిని పడివుంటాడు."
అతనికి నేనేమౌతాను?"
"తెలియదు. మీ అమ్మ పిల్లవాడుపోయిన దిగుల్లోవున్న రోజులు అవి. ఒకనాడు రాత్రి ఏదో పనిమీద కోటయ్యను పిలవడానికి వెళ్ళాను. కోటయ్య పెళ్ళాంతో ఘర్షణ పడుతున్నాడు! ఆ బిడ్డ ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదని ఆమే అంటున్నది. వాడు పెంచక తప్పదనీ, పసిబిడ్డను గాలికి వదిలెయ్యలేననీ అంటున్నాడు. అదే సమయంలో నేను లోపలికి వెళ్ళాను. అనుకోకుండా కోటయ్య చేతుల్లో వున్న బిడ్డను చేతుల్లోకి తీసుకున్నాను. మురికి గుడ్డలమధ్య మంచి ముత్యంలా మెరిసిపోతున్నాడు. మినుకు మినుకుమంటూ చూస్తూ, బోసినవ్వులు నవ్వుకుంటున్నాడు. ఏనాటి అనుబంధమో.... చూడగానే నా చెల్లెలికి నిన్ను తీసుకెళ్ళి చూపించాలనిపించింది. కోటయ్యతో ఆ మాటే చెప్పాను. అతను సంకోచంగా అంగీకరించాడు. అంతే. ఆనాటినుంచి సుశీల నిన్ను కన్నకొడుకులాగా చూసింది. నీ వివరాలు నాకు తెలుసుకోవాలనిపించలేదు. సుశీల నన్ను అడగలేదు" ఆగి నిట్టూర్చాడు వెంకట్రామయ్య.
"పద మామయ్యా! ఆ కోటయ్య దగ్గరకు వెళ్దాం" అన్నాడు శరత్.
వెంకట్రామయ్య ఆలోచనలో పడ్డాడు.
"పోనియ్ నేనే వెళతాను" అంటూ లేచి నిల్చున్నాడు శరత్."
"ఇప్పుడు కాదు, రాత్రికి వెళ్దాం. నేనే తీసుకెళతాను" అన్నాడు వెంకట్రామయ్య.
ఇద్దరూ మౌనంగా ఇంటి ముఖం పట్టారు. ఎవరి ఆలోచనలలో వాళ్ళు నడుస్తున్నారు.
13
ఆ పగలంతా శరత్ అశాంతిగానే గడిపాడు. కొత్త ఊరు, కొత్త ఇల్లు. ప్రతి నిముషం ఒక యుగంలా తోస్తుంది. భారతి దగ్గిర పుస్తకాలు తీసుకున్నాడు. కాని మనసును అందులో చొప్పించలేకపోతున్నాడు.
సాయంత్రం అవుతుంది. తనకు తనకు కన్నతల్లి ఎవరో తెలుస్తుంది.
ఆ మాట అనుకోగానే శరత్ గుండెల వేగం హెచ్చసాగింది.
తన తల్లి ఆ గుడిసెల్లోనే వుందేమో! కోటయ్య ఎవరు? తనకు తాతగాని కాదుగదా! కోటయ్య వంటరిగానే వున్నాడు అని మామయ్య చెప్పాడుగా! అంటే కోటయ్యకు ఎవరూ లేరనేగా! కోటయ్య కూతుర్ని వెళ్ళగొట్టాడా? ఆమె ఎక్కడ వుందో తనకు తెలియదంటే?
కోటయ్య తనను పెంచే విషయంలో భార్యతో ఘర్షణ పడ్డాడని మామయ్య చెప్పాడు. అంటే కోటయ్య కూతురు తనను కన్నతల్లికాదు. అంటే తనెవరు?
శరత్ తల ఆలోచనలతో బద్ధలైపోతుంది. ఎంతగా సమయం గడవడం లేదు. మనసు ఆశ నిరాశలలో కొట్టుకులాడుతూ వుంది.
కోటయ్యకు తప్పక తన తల్లి ఎక్కడ వుందో తెలిసే వుంటుంది.
