"అది ఏమైనా చెప్పిందా?" బుసలు కొడుతూ అడిగాడు వెంకట్రామయ్య.
"అబ్బే, భారతి ఏం చెప్పలేదు" తడబడుతూ అన్నాడు శరత్.
"మరి నీకెలా తెలుసు. దానికి ఈ పెళ్ళి ఇష్టంలేదని?"
"ఎందుకో నాకు అలా అనిపించింది. అంతేకాదు. నాకూ ఈ పెళ్ళి ఇష్టం లేదు.
వెంకట్రామయ్య శరత్ ముఖంలోకి అయోమయంగా చూశాడు.
"నేను ఒక అమ్మాయిని ప్రేమించాను."
"ఆ అమ్మాయి భారతి కంటే అందమైందా?"
"ప్రేమించడానికి అందం ఒక్కటే ప్రధానంకాదు."
"భారతి గుణానికి తక్కువా!"
"అదికాదు మామయ్యా! నన్ను అర్థంచేసుకో."
వెంకట్రామయ్య దెబ్బతిన్నట్టు చూశాడు.
"కోపం తెచ్చుకోకు మామయ్యా! ఆ మాట కొస్తే భారతిని వివాహము చేసుకొనే అర్హత నాకు లేదేమో?"
"ఇది చెప్పడానికేనా ఇంతదూరం వచ్చావు? ఒక ఉత్తరం ముక్క రాసి పడేస్తే పోయేదిగా?" వెంకట్రామయ్య కంఠం తీవ్రంగా వుంది.
"ఆ పిల్ల భారతి కంటే అందమైందా?" మళ్ళీ వెంకట్రామయ్య ప్రశ్నించాడు.
"కాదు."
"శ్రీమంతుల బిడ్డా?"
"కాదు."
"బాగా చదువుకుందా?"
"అవును. కాని నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి కారణాలు ఇవేవీ కావు."
"మరి ఏమిటి?"
ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. అంతే.... అంతకంటే ఇంకా నేనేమీ చెప్పలేను."
"నీకు భారతి అంటే ఇష్టంలేదా?"
"ఇష్టమే, కాని ఆ ఇష్టం వేరు. నాకు ఒక చెల్లెలు వుంటే.... భారతిని చూసినట్టే చూసేవాడ్ని."
"శరత్!"
"మామయ్యా, బాధపడుతున్నావా?"
"మరి బాధపడనురా? నీమీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను -" వెంకట్రామయ్య కంఠం జీరపోయింది.
"నేనంటే నీకెందుకింత అభిమానం మామయ్యా?"
"ఎందుకా? మేనల్లుడివి అని...."
శరత్ అదోలా నవ్వాడు.
"ఎందుకురా నవ్వుతావు?"
"నేను నీకు నిజంగా మేనల్లుడ్ని కాదుగా?"
"శరత్!" వెంకట్రామయ్య దెబ్బతిన్నట్టు శరత్ ముఖంలోకి చూశాడు.
"నేను ఎవర్నో నాకు తెలియదు. నన్ను పెంచిన తల్లిదండ్రులు నాకు తెలియదు నీకు తెలుసు. అయినా నన్ను స్వంత మేనల్లుడిగా చూశావు. కూతుర్ని ఇచ్చి పెళ్ళి చెయ్యాలనుకున్నావు. ఇంత విశాల హృదయం కలవాడివి.... కన్నకూతురు తన మనసుకు నచ్చినవాడ్ని వివాహం చేసుకుంటానంటే క్షమించలేవా మామయ్యా!" శరత్ కంఠం నిర్లిప్తంగా వుంది.
వెంకట్రామయ్య శరత్ ముఖంలోకి అయోమయంగా చూస్తూ వుండిపోయాడు.
"ఎందుకు మామయ్యా అలా చూస్తావ్?"
"ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారురా?"
"నిజం ఎంతకాలం దాగుతుంది?"
"ఏమిటి నిజం?"
"నేను సుశీలమ్మకూ, రామనాథంగారికీ పుట్టిన బిడ్డను కాదు."
"శరత్! నీకు పిచ్చిపట్టిందా?"
"ఇంకా పూర్తిగా పట్టలేదు."
"అంతా అబద్ధం! ఎవరు చెప్పారు నీకు ఈ అబద్ధం?"
శరత్ విరక్తిగా నవ్వాడు.
"నిజాన్ని అబద్ధంగా కొంతకాలం కొందర్ని నమ్మించినా, ఒకనాటికి అది బయటపడకుండా వుండదుగా."
"ఏమిట్రా నువ్వనేది? ఈ విషయం సుశీలకు తెలిస్తే దాని గుండె బద్ధలైపోదూ!" బాధగా అన్నాడు వెంకట్రామయ్య.
"అమ్మకు చెప్పేవచ్చాను. నేను ఎవర్నో తనకు తెలియదన్నది నీకు మాత్రం తెలుసని చెప్పింది."
"ఆఁ!"
శరత్ తలవంచుకున్నాడు.
"సుశీలకు చెప్పే వచ్చావా? ఇంత జరిగినా అది యింకా బ్రతికే వుందా?"
శరత్ మాట్లాడలేదు.
"అది నిన్ను కన్నబిడ్డకంటే ఎక్కువగా చూచుకుంది. దానికి ఇంత ద్రోహం చేస్తావట్రా?" వెంకట్రామయ్య దిగులుగా అడిగాడు.
"నేనంత విశ్వాస ఘాతకుడ్ని కాదు మామయ్యా!"
"మరి ఎందుకురా ఇక్కడికి వచ్చావు?"
"నేను ఎవర్నో తెలుసుకుందామని!"
"తెలుసుకొని ఏం చేస్తావు?"
"ఒక్కసారి నన్ను కన్నతల్లిని చూస్తాను. పుట్టగానే నన్ను ఎందుకు పరిత్యజించిందో తెలుసుకుంటాను. నా తండ్రి ఎవరో తెలుసుకుంటాను."
