Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 37


    ఇప్పుడు చెప్పలేను ముందు నువ్వు చెప్పాలనుకుంది చెప్పు భారతీ!" అన్నాడు శరత్.


    భారతి ఏదో అనబోయి తటపటాయించింది.


    శరత్ కు అర్థం అయింది. సన్నగా, మెత్తగా నవ్వాడు.


    "నేను చెప్పనా?"


    భారతి మాట్లాడలేదు. చూస్తూ వుండిపోయింది.


    "నీకు నన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ మాట చెప్పాలనే వచ్చావు. చెప్పడానికి సందేహిస్తున్నావ్. అంతేనా?"    


    "నీకెవరు చెప్పారు బావా?"


    "ఎవరూ చెప్పలేదు, నీ మాటల్నిబట్టి, నీ దిగులు అర్థం చేసుకున్నాను."


    "బావా, నన్ను క్షమించగలవా?"


    శరత్ తేలిగ్గా నిట్టూర్చి నవ్వేశాడు.


    "బాధపడుతున్నావా బావా?"


    "లేదు భారతీ! సంతోషంగా వుంది."


    భారతి నమ్మలేనట్టు చూసింది.


    "నమ్మకంగా లేదా?"


    భారతి పలకలేదు.


    "నేను నిజమే చెబుతున్నాను భారతీ. నాకు నువ్వంటే చాలా ఇష్టం. కాని ఆ ఇష్టం అందరూ ఊహించేది మాత్రం కాదు! నేనెప్పుడూ నిన్ను నేను నా భార్యగా ఊహించుకోలేదు."


    "బావా నిజంగానా!" సంతోషంగా అడిగింది భారతి.


    "నిజం భారతీ! నేను ఒకమ్మాయిని ప్రేమించాను. ఆమెనే చేసుకోవాలనుకున్నాను! అమ్మకు ఆ విషయం చెప్పేశాను."


    "ఎవరు బావా, ఆ అమ్మాయి?"


    "రాజేశ్వరి, నాకు జూనియర్."


    "మరి దిగులుగా ఉన్నావేంబావా! అత్తయ్య అంగీకరించలేదా?"


    "నేనేం దిగులుగా లేను భారతీ. అది సరే నువ్వు వరించిన ఆ రాకుమారుడెవరో చెబుతావా?"


    "పో బావా," భారతి తెల్లని చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి.


    "చెప్పు భారతీ!"


    "ఈ ఊరే. బి.ఏ. చదివాడు. ఆస్థిపాస్థులు ఉన్నాయి. ఇక్కడ వుండి వ్యవసాయం చూసుకుంటున్నాడు."


    "మామయ్యా ఒప్పుకోవడంలేదా?"


    భారతికి కళ్ళలో నీరు తిరిగింది.


    "మామయ్యకు నేను చెప్తాలే. హాయిగా వెళ్ళి నిద్రపో." అన్నాడు శరత్.


    తేలికపడిన మనసుతో భారతి వెళ్ళిపోయింది. శరత్ రిలీఫ్ గా గాలి పీల్చుకున్నాడు.   


                                     12


    తెల్లవారి కాఫీ ఫలహారాలు పూర్తి అయాక వెంకట్రామయ్య శరత్ ముందు పెళ్ళి ప్రస్తావన తెచ్చాడు.


    "మీ అమ్మకు ఉత్తరం రాశాను. చెప్పిందా?"


    శరత్ తల ఊపాడు.


    "ముహూర్తాలు పెట్టించమన్నావా?"


    "అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం మామయ్యా! ఊరు కూడా చూసినట్టు వుంటుంది." అన్నాడు శరత్.


    వెంకట్రామయ్య శరత్ ముఖంలోకి లోతుగా ఓ క్షణం చూసి లేచి నిల్చున్నాడు. "సరే! పద !" అన్నాడు.  


    "మామిడితోట దగ్గిరకు వెళ్దామా? నువ్వు చూళ్లేదుగదూ? చూట్టానికి నువ్వెప్పుడు వచ్చావు కనక?" అంటూ చకచకా నడక సాగించాడు వెంకట్రామయ్య.


    వెంకట్రామయ్యకు అనుమానంగానే వుంది.


    శరత్ కు యీ వివాహం యిష్టంలేదేమో? అందుకే వచ్చాడేమో? భారతి సంగతి తెలిసిందా? ఎలా తెలుస్తుంది? అదే ఉత్తరం రాసిందేమో.   


    వెంకట్రామయ్యకు కూతురిమీద అంతులేని కోపం వచ్చింది. కోపంతో నడక వేగం పెరిగింది.


    ఎదురుపడ్డ ప్రతివాళ్ళకూ తన అల్లుడు అని పరిచయం చేస్తూ ఉంటే శరత్ కు ఎలాగో అనిపించింది చాలామంది "పెళ్ళి ఎప్పుడు" అని కూడా అడిగారు.    


    "ముహూర్తం పెట్టించాలి" అని సమాధానం ఇస్తున్నాడు వెంకట్రామయ్య.


    ఇద్దరూ వెళ్ళి ఒక మామిడి చెట్టుకింద కూర్చొన్నారు. మౌనంగా కూర్చున్నారు.


    "చెప్పరా, ఏమిటి ఇలా చెప్పాపెట్టకుండా ఊడిపడ్డావ్?" వెంకట్రామయ్య అడిగాడు.


    "మామయ్యా, పెద్దవాళ్ళకు తమ పిల్లలమీద ఎన్నో ఆశలు వుండవచ్చును కాని పిల్లల మనసులు అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించాలి." అన్నాడు శరత్.


    వెంకట్రామయ్య ఓ క్షణం శరత్ ముఖంలోకి చూసి "ఏమిట్రా నువ్వనేది?" అన్నాడు.


    "భారతికి ఈ వివాహం ఇష్టమో కాదో తెలుసుకున్నావా?"


    "దాని మొహం, దాని మంచిచెడ్డలు దానికేం తెలుసు. ఇంకా చిన్నపిల్ల. నీకంటే మంచివాడ్ని తేగలనా ఏమిటి?"


    "మంచీ చెడూ విషయం కాదు. అది చేసుకొనే వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి వుంటుంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS