శరత్ అన్యమనస్కంగానే అత్తామామలు వేస్తూన్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాడు.
వెంకట్రామయ్య ఆలోచనలు కూడా పరిపరి విధాలుగా వున్నాయి.
వీడు ఇంత అకస్మాత్తుగా ఎందుకు ఊడిపడ్డట్టు? సుశీల తన వివరం సంగతి చెప్పి వుంటుంది. అందుకే వచ్చి వుంటాడు.
అంటే! వీడికి భారతిని చేసుకోవడం ఇష్టం లేదా? సుశీల ఆ విషయం రాయలేక వాణ్ణే స్వయంగా వెళ్ళి చెప్పమని పంపించిందేమో అంతే అయి వుండాలి."
బంగారమ్మకు ఇదేం పట్టలేదు. అల్లుడు వచ్చాడన్న సంబరంతో వంట చేస్తూ వుంది.
భోజనాల దగ్గిర కూడా భారతి ముభావంగానే వుంది.
శరత్ పడుకొని ఆలోచిస్తున్నాడు. మామయ్య దగ్గిర ఈ విషయం ఎలా ప్రారంభించాలి? ఎక్కడ? ఎప్పుడు?
తెల్లవారి సమయం చూసి ఊరి బయటికి పిల్చుకెళ్ళి మాట్లాడడానికి నిర్ణయించుకున్నాడు.
ప్రయాణ బడలికవల్ల శరత్ కు నిద్రముంచుకువస్తూ వుంది.
తన గదిలోకి ఎవరో వస్తున్న అలికిడై బద్ధకంగా కళ్ళు తెరిచాడు.
ఒకసారిగా ఎవరో స్విచ్ నొక్కడం వల్ల గదిలో లైటు వెలిగింది. శరత్ కళ్ళు మూతలు బడ్డాయి.
"బావా"
శరత్ కళ్ళు చికిలించి చూశాడు.
మంచం మీద దిగ్గున లేచి కూర్చున్నాడు.
"నువ్వా భారతీ! రా కూర్చో!" అన్నాడు శరత్ తడబడుతూ.
భారతి మంచం పట్టెమీద ఓ చివర కూర్చుంది. తల దించుకుని ఏదో మాట్లాడాలనే ప్రయత్నంలో వున్నట్టు కూర్చుంది!
శరత్ కు ఆమెను చూస్తుంటే బాధగా వుంది. జాలిగా వుంది. తన మీద తనకే కోపంగా వుంది.
భారతికి ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? చిన్నప్పటినుంచి తనమీద ఎన్ని కలలు అల్లుకుందో? పెద్దవాళ్ళకు బుద్ధి వుండదు, చిన్నప్పుడే పిల్లల మనసుల మీద ఫలానావాడు మొగుడు.... అంటూ ముద్రవేస్తారు. చిన్నప్పటినుంచీ తమ యిద్దర్నీ భార్యాభర్తలు అనే అంటూ వుండేవారు. భారతిని చూసి రెండు సంవత్సరాలకు పైనే అయింది. సన్నగా, తెల్లగా! బంగారు తీగలా కన్పించింది. ఆ అమ్మాయిని చూస్తుంటే శరత్ మనసు బాధపడసాగింది ఎలా ఓదార్చాలో బోధపడటంలేదు.
"బాగున్నావా భారతీ!" అన్నాడు, అంతకంటే ఏమనాలో బోధపడలేదు.
భారతి సమాధానంగా శరత్ ముఖంలోకి దిగులుగా చూసింది.
భారతికి కూడా దిగులుగా వుంది. బావకు తన మనసులో మాట ఎలా చెప్పాలో తెలియక బాధపడుతూ వుంది.
అత్తయ్యకు నాన్న తనను గురించి రాసి వుంటాడు. అందుకే బావ వచ్చి వుంటాడు. చిన్నప్పటి నుంచీ బావ తనను ఎంతో ఆదరంగా చూసేవాడు. తనను భార్యగా ఊహించుకుంటూ ఎన్ని కలలు కన్నాడో? ఎంత దిగులుగా కన్పిస్తున్నాడో!
బావ ఈ ఊరు మొదటిసారిగా వచ్చాడు. తనను నిలదీసి అడగటానికే వచ్చి వుంటాడు. ఏమయినా సరే ఈ రాత్రే బావతో మనసు విప్పి మాట్లాడాలి. తనను క్షమించమని అడగాలి. తెల్లవారితే నాన్న గొడవ చేసేస్తాడు.
బావ చదువుకున్నాడు. మంచివాడు. తనను అర్థం చేసుకోగల సంస్కారం వుంది.
"ఏం భారతీ ఏమయినా చెప్పాలని వచ్చావా?" అన్నాడు శరత్ నిర్లిప్తంగా.
భారతి అతని ముఖంలోకి లోతుగా చూసింది.
"బావా!"
"చెప్పు భారతీ! సందేహం ఎందుకు?"
"నువ్వింత అకస్మాత్తుగా ఎందుకొచ్చావ్?"
"నువ్వేమనుకుంటున్నావ్?" నవ్వుతూ ప్రశ్నించాడు శరత్.
"నాన్న ఉత్తరం రాశాడు కదూ?"
"అవును?"
"అందుకే వచ్చి వుంటావనుకుంటున్నాను."
శరత్ సమాధానం చెప్పలేదు. చూస్తూనే వుండిపోయాడు.
నన్ను క్షమించగలవా బావా?" దీనంగా వుంది భారతి కంఠం.
శరత్ విస్మయంగా చూశాడు.
"క్షమించాలా? ఎందుకు?" విస్మయంగా అడిగాడు. ఆమె శరత్ కళ్ళలోకి చూసింది. దిగులుగా కన్పించాడు.
"చెప్పు భారతీ, నువ్వేం తప్పుచేశావని నిన్ను క్షమించాలి?" భారతి తలదించుకుంది.
"చెప్పు భారతీ!"
భారతికి ఎలా చెప్పాలో తెలియడం లేదు.
"అసలు నువ్వెందుకు వచ్చావు? నన్ను వివాహం గురించి అడగటానికేగా?"
శరత్ ఓ క్షణం ఆమె ముఖంలోకి నిశితంగా చూసి, "కాదు" అన్నాడు.
భారతి విస్మయంగా చూసింది.
"మరి!"
"వేరే పనిమీద వచ్చాను."
"పనా? ఏమిటది?"
