ఆడవాళ్ళు సంధ్య కసువులు చిమ్మి ముంగిళ్ళలో నీళ్ళు చల్లుతున్నారు.
శరత్ అందరి దృష్టినీ ఆకర్షిస్తూ నడుస్తున్నాడు.
పల్లెటూళ్ళలో కొత్తవ్యక్తి ప్రవేశించగానే అందరూ కుతూహలంగా చూస్తారు.
"ఎవరింటికి బాబూ!" రచ్చబండమీద కూర్చునివున్న ఓ వయసు మళ్ళిన పెద్దమనిషి ప్రశ్నించాడు.
"వెంకట్రామయ్యగారింటికి" శరత్ నిలబడి వినయంగా సమాధానం యిచ్చాడు.
"ఆయనకు నువ్వేమవుతావ్?" నోట్లోనుంచి చుట్టతీసి, తుపుమని పక్కన ఊసి లావుపాటి ముసలాయన ప్రశ్నించాడు.
"మేనల్లుణ్ణి!"
"ఎట్టెట్టా? వెంకట్రామయ్య మేనల్లుడివా?" కుతూహలం చూపించాడు మొదటివ్యక్తి.
"అంటే రామనాథం కొడుకువా?"
శరత్ "అవును!" అనలేకపోయాడు. తల ఊపాడు అతి కష్టం మీద.
"పెద్ద వాడివా, రెండవవాడివా?" బుర్రమీసాలు కదులుతూ వుంటే ప్రశ్నించాడు మూడోవ్యక్తి.
"పెద్దవాడినే...." గొంతుకు ఏదో అడ్డుపడినట్టు అన్నాడు శరత్.
అందరూ కుతూహలంగా ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు.
వాళ్ళు అలా చూసుకున్నారో లేదో కాని శరత్ కు మాత్రం అలాగే అనిపించింది.
గబగబా ముందుకు సాగాడు. బుర్రమీసాల పెద్ద మనిషి యేదో అడుగుతూ వుంటే వినిపించుకోకుండా.
"కుర్రవాడు బాగున్నాడు."
"టెక్కు చాలా వుంది. మాట్లాడుతూ వుంటేనే వెళ్ళిపోతున్నాడు దులపరించుకొని"
వెనకనుంచి మాటలు విన్పిస్తున్నాయి.
తను ఊహించిన మాటలు విన్పించలేదు. శరత్ రిలీఫ్ గా నిట్టూర్చాడు.
శరత్ తెలిసీ తెలియని వయసులో ఒకటి రెండుసార్లు ఆ ఊరు వచ్చాడు. ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడూ రాలేదు. వెంకట్రామయ్య భార్యాపిల్లలతో అప్పుడప్పుడు చెల్లెలి ఇంటికి వెళ్తూ వుండేవారు. ఎప్పుడయినా వచ్చినా సుశీలమ్మ పిల్లల్ని వెంటబెట్టుకొని వచ్చేది కాదు.
ఆమె భయం ఆమెకుంది. ఆ ఊళ్ళో శరత్ తన బిడ్డ సంగతి ఎవరికయినా తెలుసేమోనని ఆమె భయం.
నీళ్ళ కావిడతో వస్తున్న వ్యక్తిని ఆపి "వెంకట్రామయ్య ఇల్లు ఎక్కడ?" అని అడిగాడు శరత్.
అతను ఓ క్షణం శరత్ ను ఎగా దిగా చూసి "ఆరికి మీరేమవుతారు బాబూ?" అన్నాడు.
శరత్ కు చిరాకు వేసింది.
"నాతోరండి. నేను అక్కడికే వెళుతున్నాను" మళ్ళీ అన్నాడు బయలుదేరుతూ.
"తమరు ఆరి అల్లుడుగారా!" రెండడుగులు వేసి ప్రశ్నించాడు.
"అవును" ముక్తసరిగా అన్నాడు శరత్.
"నేనప్పుడే అనుకున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. మీ అమ్మగారి పోలికే. చూడగానే అనుకున్నాను" అన్నాడు అతను ఆ కావిడిని భుజం మార్చుకుంటూ. శరత్ కు నవ్వొచ్చింది.
"పప్పన్నం ఎప్పుడు పెడతారు బాబూ! మా భారతి మీకు తగిన...."
"నీ పేరేమిటి?" మధ్యలో అందుకొని అడిగాడు శరత్.
"ఎంకటేశ్వర్లు...."
ఒక డాబా యింటిముందు, వీధి గడపలో కాలు పెడుతూ.
"అయ్యగారూ.... అయ్యగారూ-" అంటూ పొలికేకలు పెట్టాడు ఎంకటేశ్వర్లు.
"ఎందుకురా ఆ కేకలూ -" అంటూ బయటికి వచ్చిన వెంకట్రామయ్య శరత్ ను చూసి ఓ క్షణం విస్మయంతో నిలబడిపోయాడు.
"శరత్! నువ్వా? ఏమిటి. చెప్పాపెట్టకుండా వచ్చావ్?" విస్మయం నుంచి పూర్తిగా బయటపడకుండానే అన్నాడు వెంకట్రామయ్య.
"ఏం మావయ్యా చెప్పకుండా రాకూడదా?" నవ్వుతూ అన్నాడు శరత్.
"ఆహాఁ! అది కాదు -"
"అయ్యో అదేమిటండీ బాబును అలా నిలబెట్టే మాట్లాడుతున్నారు? రా బాబూ, రా!" అంటూ ఆహ్వానించింది. సంభ్రమాశ్చర్యాలలో తలకమునకలైపోతూ వెంకట్రామయ్య భార్య బంగారమ్మ.
శరత్ లోపలకు వస్తూ వసారాలో కూర్చుని లాంతర్లు తుడుస్తున్న భారతికేసి చూశాడు. భారతి అదే సమయంలో తలెత్తింది. చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో ఏదో అపశృతి వున్నట్టు అనిపించింది శరత్ కు.
"బాగున్నావా భారతి?" మృదువుగా అడిగాడు.
భారతి సమాధానంగా నవ్వింది. పేలవంగా, నిర్జీవంగా వుంది ఆ నవ్వు.
ఎందుకు భారతి అంత ముభావంగా వుంది? తనకు ఈ వివాహం ఇష్టం లేదన్న సంగతి అమ్మ ఉత్తరం ద్వారా తెలియపర్చి వుంటుంది. అందుకే భారతి అంత బాధపడుతూ వుంది.
ఆ కర్ణుడికి ఎందరో, శాపాలు పెట్టారు, ఎందరి చేతో వంచించబడ్డాయి.
కాని తనో -? తనే అందరికీ శాపంగా తయారైనాడు. తనవల్ల ఎందరు బాధపడుతున్నారు? తన జన్మ ఎంత పాపిష్టి జన్మ. తన నీడ తాకిన ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు.
