Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 34


    ప్రతి నిముషం తనను కౄరంగా వెంటాడుతున్న ఈ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా వుండటం ఎలా?


    రాత్రంతా సరిగా నిద్రలేని శరత్ బద్ధకంగా లేచాడు.


    తల్లిని పలకరించాలంటే భయంగా వుంది.


    బద్దలవడానికి సిద్ధంగా వున్న నిండుకుండలా కన్పిస్తూంది ఆమె.


    శరత్ స్నానంచేసి, టిఫెన్ చేసి గదిలో బట్టలు సర్దుకోసాగాడు.


    అలికిడై తలెత్తి చూశాడు.


    రామనాథం వాకిట్లో నిల్చుని వున్నాడు.


    ఆయన ఏదో అడగబోయి. మానేసి, గిర్రున తిరిగి, చకచకా బయటికి వెళ్ళిపోయాడు.


    ఆయన వెళ్ళిన వైపే చూస్తూ వుండిపోయాడు శరత్ ఆలోచిస్తూ.


    సూట్ కేసులోకి బట్టలు సర్దుకొని, తాళం వేసుకొని నిలబడ్డాడు.


    ఎదురుగా తల్లి నిల్చుని వుంది. ఆమె ఎంతసేపటినుంచి నిల్చుని వుందో శరత్ కు తెలియలేదు.


    ఆమె ముఖంలోకి చూసే ధైర్యం లేనట్టు తలవంచుకున్నాడు.


    "వెళ్ళక తప్పదా?"


    శరత్ సమాధానం ఇవ్వలేదు. నేరస్థుడు బోనులో నిల్చున్నట్టు నిల్చున్నాడు.


    "ఎక్కడికి వెళుతున్నావు?"


    "మామయ్య దగ్గిరకు"


    "అక్కడి నుంచి?"


    "చెప్పలేను మామయ్య ఇచ్చిన భోగట్టాను బట్టి వుంటుంది."


    "ఇదిగో ఇది వుంచు."


    శరత్ తలెత్తి చూశాడు. సుశీలమ్మ చాచిన చేతిలో నోట్లకట్టలు కన్పించాయి.


    "వెయ్యిరూపాయలు, తీసుకో"


    శరత్ సందేహిస్తూ నిల్చున్నాడు.


    "ఏమిట్రా అంత ఆలోచన? అప్పుడే ఈ అమ్మా, ఈ యిల్లూ ఈ డబ్బూ పరాయిది అనిపిస్తోందా?" ఆమె కంఠం నిర్లిప్తంగా వుంది.


    "అమ్మా!" శరత్ ఉద్రేకంగా అన్నాడు. డబ్బు అందుకున్నాడు.


    "ఇది కూడా వుంచు."


    "ఏమిటమ్మా!"


    "చెక్ బుక్!"


    శరత్ చెయ్యి చాపలేదు.


    "తీసుకో బాబూ! ఎంతకాలం, ఎక్కడెక్కడ తిరగాలో! డబ్బుకు ఇబ్బంది పడకు."


    "ఎందుకమ్మా?"


    "ఎందుకేమిటిరా? నువ్వు దూరం అయిన బాధతోపాటు డబ్బుందో లేదో, తిన్నావో లేదో అనే బాధను కూడా భరించమన్నావా?" తీవ్రంగా వుంది సుశీలమ్మ కంఠం.    


    "నాన్నగారు...."


    "మీ నాన్నగారే ఇవ్వమన్నారు. ఆయనకు మాత్రం నీమీద ప్రేమ లేదట్రా! రాత్రంతా నిద్రపోకుండా నీ చిన్నప్పటి సంగతులే చెప్తూ కూర్చున్నారు. నేను ఆడదాన్ని భోరున ఏడవగలను. కొంత బాధను దించుకో గలను. కాని ఆయనకు ఆ అదృష్టం కూడా లేదు. మనసు తేలికపడేలా  చేసుకోవగలగటం కూడా ఒక వరమేనని మీ నాన్నని చూస్తుంటే నాకు అనిపిస్తుంది. తీసుకో" అంటూ చెక్ బుక్ అందించింది.


    శరత్ చెక్ బుక్ అందుకొని తెరిచి చూశాడు.


    బ్లాక్ చెక్కులమీదవున్న రామనాథం సంతకం కన్నీళ్ళు కమ్మిన చెక్ కళ్ళకు మసగ్గా కన్పించింది.    


    "అమ్మా! ఒక అనర్హుడికి ఇంత ప్రేమాభిమానాలను పంచి యిస్తున్నారు ఎందుకమ్మా!" శరత్ కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.


    "బాబూ! ఏమిట్రా ఆ మాటలు. పద భోజనం చేద్దువుగాని...." పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ డైనింగ్ హాల్లోకి నడిచింది సుశీలమ్మ.   


    శరత్ కు అన్నం సహించడం లేదు. తల్లి కొసరి కొసరి వడ్డిస్తూ వుంటే ఆమె సంతృప్తి కోసం తినసాగాడు.


    "అమ్మా! తమ్ముడు వచ్చి నా గురించి అడిగితే ఏం చెబుతావమ్మా."


    "ఏం చెప్పమంటావు?"


    "నీ ఇష్టం!" ఏ సమాధానం ఇవ్వాలో తోచని శరత్ అలా అన్నాడు.


    "పెట్టె తీసుకొని బయలుదేరుతూ శిలాప్రతిమలా నిల్చుని వున్న తల్లి దగ్గరకు వచ్చి నన్ను దీవించి పంపమ్మా!" అన్నాడు.


    "బాబూ!" అంటూ శరత్ ను చుట్టుకుపోయి భోరుమంది.


    శరత్ కదలకుండా నిలబడిపోయాడు.


    కొంతసేపటికి తనను తాను సంబాళించుకొని "వెళ్ళిరా బాబూ" అన్నది విరక్తిగా.


    "అమ్మా! నాకొక మాట ఇస్తావా?"


    "నువ్వు అడగబోయేది ఏమిటో నాకు తెలుసు" అన్నట్టు సున్నితంగా నవ్వింది సుశీలమ్మ.


    "నేను ఎలాంటి పిచ్చి పనీ చెయ్యనురా! నీకోసం కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తూ కూర్చుంటాను" అన్నది. ఆమె కంఠం కొద్దిగా వినిపించింది.


    శరత్ మరోక్షణం అక్కడ నిలబడలేనివాడిలా గబగబా వెళ్ళిపోయాడు.


    సుశీలమ్మ శిలాప్రతిమలా నిలబడిపోయింది.


                                 11


    శరత్ శివాపురం చేరేసరికి సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి.


    పశువులు ఇళ్ళకు వస్తున్నాయ్.


    పిల్లలు బజార్లలో ఆడుకుంటున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS