శరత్ గాభరాపడిపోయాడు. శరత్ కు ఊహ తెలిశాక ఎప్పుడూ సుశీలమ్మ అంతగా ఏడ్వడం చూళ్ళేదు.
"అమ్మా ఎందుకమ్మా ఏడుస్తావ్? ఇప్పుడేమయిందని? నామీద నాకు నమ్మకం లేదా అమ్మా?" అంటూ తల్లి రెండు చేతులూ పట్టుకున్నాడు.
"బాబూ!" అంటూ కొడుకు తలను గుండెలకు హత్తుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది.
"ఏడవకమ్మా! కన్నతల్లి కంటే మిన్నగా పెంచిన నీకు ద్రోహం చెయ్యనమ్మా! నేను ఎప్పటికీ సుశీలమ్మ కొడుకునే! తల్లిని ఓదారుస్తూ అన్నాడు శరత్.
"ఎందుకురా నన్ను చిత్రవధ చేస్తావు?" వెక్కిళ్ళ మధ్య అన్నది సుశీలమ్మ.
"నిన్ను కష్టపెడుతున్నందుకు క్షమించమ్మా! నన్ను కనిపారేసిన ఆ స్త్రీని ఒకసారి చూడాలని వుందమ్మా."
"అంతేనా బాబూ!"
"అంతేనమ్మా! ఆమె నాకు అమ్మ ఎలా అవుతుందమ్మా? నువ్వే నా అమ్మవు. కాని ఆమెను ఒకసారి చూడాలి. అంతవరకూ నాకు అన్నం సహించదు. నిద్రరాదు."
"బాబూ!"
"అవునమ్మా! నేను నరకయాతన అనుభవిస్తున్నాను! నేను బాధపడితే నువ్వు చూడలేవు. నన్ను బాధనుంచి విముక్తుడ్ని చెయ్యమ్మా!" దీనంగా అన్నాడు శరత్.
సుశీలమ్మ కళ్ళు తుడుచుకుంది.
కొడుకు ముఖంలోకి చూసింది.
"ఆ స్త్రీ ఎవరమ్మా? ఎక్కడ వుంటుంది? నన్నెందుకు కనిపారేసింది? చెప్పమ్మా!"
"నాకు తెలియదు." చిన్నగా తనకు తానే చెప్పుకుంటున్నట్టు అన్నది సుశీలమ్మ.
"అమ్మా!" శరత్ కంఠం తీవ్రంగా వుంది.
"నిజం బాబూ! నాకు తెలియదు."
"నేను నమ్మను."
"బాబూ!"
"చెప్పమ్మా!"
"నా మాట మీద నీకు నమ్మకం లేదా? నిన్ను కన్న స్త్రీ ఎవరో నాకు తెలియదు. తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. నిన్ను నేను కన్నాననే భ్రమను పెంచుకున్నాను. ఆ భావం కూడా మనసులోకి రానివ్వకుండా పెంచాను! నేను నీకు అమ్మలా లేనట్రా?"
"సరేనమ్మా! నీకు అంత ఇష్టం లేకపోతే చెప్పొద్దులే."
"నిజం రా కన్నా...."
"కాదు.... కర్ణా...."
"బాబూ!"
శరత్ విరక్తిగా నవ్వాడు.
"అమ్మా ఒక్కసారి నేను నాకు జన్మనిచ్చిన ఆ స్త్రీని చూస్తే మాత్రం నష్టం ఏమిటమ్మా?"
"నేను ఈర్ష్యపడుతున్నా ననుకుంటున్నావా?"
"కాదమ్మా! నేను నీకు ఎక్కడ దూరం అవుతానోనని భయపడుతున్నావు."
సుశీలమ్మ మౌనంగా వుండిపోయింది.
"నువ్వు పొరపడుతున్నావమ్మా. ఈ రహస్యం దాచినందుకు నేను నీకు దూరం కావచ్చును."
"బాబూ!"
"అవునమ్మా! ఈ రహస్యం నన్ను పిచ్చివాడ్ని చేసేస్తుంది. నేను పిచ్చివాడ్నయితే నీకు దూరం కానా...." సుశీలమ్మ చటుక్కున కొడుకు నోరు మూసింది.
"నేను నిజమే చెబుతున్నానురా బాబూ." వ్యథగా అన్నది సుశీలమ్మ.
ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె నిజమే చెబుతున్నదనితోచింది.
ఆమె ముఖంలోకి దిగులుగా చూస్తూ కూర్చుండిపోయాడు.
"నిన్ను ఆప్యాయంగా రెండు చేతులూ చాచి అందుకున్నాను. ఎవరి బిడ్డ అని అడగలేదు. అడగాలనిపించలేదు. ఫలానా స్త్రీ కన్నబిడ్డ అని తెలిస్తే నిన్ను నా బిడ్డగా పెంచలేననే భయంకొద్దీ అడగలేదు. నా చనిపోయిన బిడ్డే తిరిగివచ్చాడని భావిస్తూ హృదయానికి హత్తుకున్నాను? అంతే. అంతకంటే నాకేం తెలియదు."
శరత్ కు సుశీలమ్మ దేవతలా కన్పించింది. రెండుచేతులూ ఎత్తి నమస్కరించాడు అప్రయత్నంగా.
"బాబూ ఏమిట్రా అది?"
"నువ్వు దేవతవమ్మా?"
"కాదు అమ్మను, అంతే!"
"మరుజన్మంటూ వుంటే మళ్ళీ మళ్ళీ నీ కడుపునే పుట్టాలని కోరుకుంటున్నానమ్మా!"
సుశీలమ్మ కళ్ళు వెలిగాయి. "బాబూ!" అంటూ కొడుకు తలను ఆప్యాయంగా నిమిరింది.
"అమ్మా!"
"ఏం బాబూ!"
"కనీసం ఇదన్నా చెప్పమ్మా! నేను నీ చేతుల్లోకి ఎలా వచ్చాను? ఎవరు తీసుకొచ్చారు?"
సుశీలమ్మ శూన్యంలోకి చూస్తూ వుండిపోయింది.
"చెప్పవా అమ్మా!"
