రాజు ముందుకు వెళ్ళిపోయాడు.
బాటసారి అక్కడే నిల్చున్నాడు. చెప్పులు వేసుకున్నాడు.
అతని మనసులోకి ఒక ఆలోచన వచ్చింది.
రాజు అడక్కుండానే చెప్పులు ఇచ్చాడు. అడిగితే గుర్రాన్ని ఇవ్వకపోతాడా? హాయిగా నడవకుండా త్వరగా గమ్యాన్ని చేరుకోవచ్చు. రాజుగారి గుర్రం తన దగ్గిర వుంటుంది.
బాటసారి ఎలుగెత్తి రాజును పిల్చాడు.
రాజు గుర్రాన్ని మళ్ళించి వెనక్కు వచ్చాడు.
"ఏమిటి?" రాజు అడిగాడు.
"రాజా! తమరు దయా స్వరూపులు. అడక్కుండానే చెప్పులు ఇచ్చారు. వేసుకుంటే సుఖంగా వుంది. ఇప్పుడు నడవాలంటే కొంచెం కష్టంగానే వుంది. ఆ గుర్రాన్ని కూడా దయచేస్తే...."
మాట పూర్తికాకుండానే రాజు గుర్రాన్ని దిగాడు.
బాటసారి ఆనందంగా ముందుకు వచ్చాడు.
రాజు చేతిలో వున్న కమ్చీతో "ఛెళ్ళు ఛెళ్ళున" నాలుగు తగిలించాడు.
"బుద్ధి వచ్చిందా?" అడిగాడు రాజు.
"నాకేం బాధగాలేదు. సంతృప్తిగా వుంది" అన్నాడు బాటసారి.
రాజు ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూశాడు.
"అవును రాజా! అడక్కుండానే చెప్పులు ఇచ్చారు. అడిగితే గుర్రం ఇవ్వకపోతారా అనే భావం నాలో ఏర్పడింది. అడక్కుండానే వెళ్ళిపోయాననుకోండి. జన్మంతా బాధపడేవాడ్ని. నన్ను నేను చేజేతులారా అవకాశాన్ని జారవిడుచుకున్న దద్దమ్మగా చిత్రించుకుంటూ బాధపడేవాడ్ని. ఇప్పుడు నా మనసులో నుంచి ఆ గిలిపోయింది. రెండు దెబ్బలు తిన్నా ఫర్వాలేదు" అన్నాడు.
శరత్ ఆ కథను తల్చుకొని తనలో తనే నవ్వుకున్నాడు.
రాజేశ్వరి ఏదో అనగానే కన్పించిన బిచ్చగత్తెను తను హింసించుకున్నాడు. బాధపడ్డాడు. ఆమె కోసం గాలించాడు. ఆమె కనిపించింది. తన మనసులో గిలి వదిలి పోయింది.
ఇలా ఎంతకాలం అని, ఎక్కడెక్కడని వెదుకుతాను? అమ్మను అడక్క తప్పదు.
శరత్ దృఢ నిశ్చయానికి వచ్చాడు.
ఇంటికి వచ్చేటప్పటికి తల్లి ఎదురు చూస్తూ వుంది.
"ఏమిట్రా బాబూ! ముఖం అలా పీక్కుపోయిందేం? పద భోజనం చేద్దువు గాని" అన్నది సుశీలమ్మ.
"భోజనం చేసే వచ్చానమ్మా."
భోజనం చెయ్యాలని లేదు. అందుకే అబద్ధం చెప్పాడు.
"ఎక్కడ చేశావ్?"
"ఒక ఫ్రెండ్ ఇంట్లో"
మరో ప్రశ్న వేసే అవకాశం ఇవ్వకుండా గబగబా తన గదిలోకి వెళ్ళాడు.
తల్లి నిట్టూర్పు వెనక నుంచి విన్పించింది.
బట్టలు మార్చుకోకుండా మంచానికి అడ్డంపడ్డాడు. కళ్ళు మూసుకున్నాడు.
అంతలోనే చివ్వున లేచి కూర్చున్నాడు. గబగబా బయటికి వచ్చి తల్లి గదిలోకి వెళ్లాడు.
ఆమె పడుకొని వుంది. కొడుకుని చూడలేదు.
"అమ్మా!"
సుశీలమ్మ దిగ్గునలేచి కూర్చుంది.
"ఏం బాబూ!" అంటూ కొడుకుని చూసింది.
అతని కళ్ళలో ఏదో సంకల్పం స్పష్టంగా కన్పించి గతుక్కుమంది.
శరత్ తల్లి ముఖంలోకి చూశాడు.
ఆ ముఖం ముసురు పట్టిన ఆకాశంలా వుంది.
ఆ కళ్ళలో శ్రావణ మేఘాలు కమ్మి వున్నాయి.
అమ్మ చాలా బాధపడుతూ వుంది తన ప్రశ్న విని తట్టుకోగలదా?.
ఏమైనా సరే అడక్క తప్పదు.
"అమ్మా ఒకటి అడుగుతాను చెబుతావా?" వినయంగా అడిగాడు.
సుశీలమ్మ భయం భయంగా కొడుకు ముఖంలోకి చూసింది. సమాధానం ఇవ్వలేదు.
ఉబికివస్తున్న దుఃఖాన్ని వెనక్కు నెట్టే ప్రయత్నంలో ఆమె కళ్ళు గట్టిగా మూసుకొని తెరిచింది.
"ఏమ్మా! మాట్లాడవ్? అడగనా?"
"ఏమిట్రా బాబూ!" ఆమె కంఠంలో నుంచి మాటలు అతి ప్రయత్నం మీద బయటపడ్డాయి.
"నేనెవర్నమ్మా?"
ఛెళ్ళున ఎవరో వీపు మీద కొట్టినట్టు త్రుళ్ళిపడింది సుశీలమ్మ.
"చెప్పమ్మా! నేనెవర్ని?"
"నువ్వెవరివా? నువ్వు నా బిడ్డవు." ఆమె కంఠంలో మాటలు గరగర లాడాయి.
"నేను నీ బిడ్డనేనమ్మా! అది కాదనను. కాని నన్ను కన్న తల్లి ఎవరు? కన్న తండ్రి ఎవరు?"
సుశీలమ్మ పిచ్చి చూపులు చూసింది.
"చెప్పమ్మా ప్లీజ్! తెలుసుకునేంతవరకూ నాకు శాంతి ఉండదు నా తల్లి ఎవరు? నన్నెందుకు పారేసింది? ఎక్కడ పారేసింది?"
"బాబూ!"
"ఎందుకమ్మా అంత బాధపడ్తావ్?"
సుశీలమ్మ ఒక్కసారిగా బోరుమంది.
