సుశీలమ్మ కళ్ళు తిప్పి కొడుకుని చూసింది. కొడుకు పట్టుదలను అర్థం చేసుకుంది.
ఇక లాభంలేదు. వీడి నిర్ణయానికి తిరుగులేదు. మొదటి నుండి మొండిఘటమే. మనసులోకి వచ్చింది చెయ్యకుండా నిద్రకూడా పోడు.
"అమ్మా, చెప్పవా?"
"చెబుతాను బాబూ!" అంటూ ఓ క్షణం ఆగింది.
"నాకు పెళ్ళయిన రెండేళ్ళకు మగపిల్లవాడు పుట్టిపోయాడు నాకు చిన్నప్పటినుంచీ పిల్లలంటే చాలా యిష్టం. మామయ్య నాకంటే రెండేళ్ళు పెద్ద. నా తర్వాత ఇంట్లో చిన్నపిల్లలు లేరు. ఇరుగుపొరుగు పిల్లలను తీసుకొచ్చి. వాళ్ళకు నీళ్ళు పోసేదాన్ని ముస్తాబు చేసేదాన్ని. పొద్దస్తమానం వాళ్ళతోనే కాలం గడిపేదాన్ని. అప్పుడప్పుడు మా అమ్మ నన్ను వెతుక్కొనేది కూడా" అంటూ ఆగింది సుశీలమ్మ.
శరత్ ఆత్మీయతగా తల్లి ముఖంలోకి చూశాడు.
"పిల్లవాడు పోవడంతో బాగా దిగులుపడ్డాను. ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది పైగా ఆ తర్వాత చాలాకాలం వరకు నాకు పిల్లలు కలుగలేదు. మీ నాన్నగారు నన్నెంతో ప్రేమిస్తారు. అభిమానిస్తారు, గౌరవిస్తారు అటువంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం" ఆగి కన్నీళ్లు తుడుచుకుంది.
"ఊఁ చెప్పమ్మా!" ఆతృతగా అడిగాడు.
"పిల్లవాడు పోయిన దిగులుతో ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. గాలి మార్పుకు ఎన్ని ప్రదేశాలో తిప్పారు. ఎందరో డాక్టర్లకు చూపించారు. ఇక నాకు పిల్లలు పుట్టరనే దిగులు పట్టుకుంది. అదే సమయంలో మా అమ్మకు జబ్బుగా వుందని కబురు వచ్చింది. ఆయన నన్ను తీసుకొని బయలుదేరారు. చావుబతుకుల్లో వున్న అమ్మ దగ్గిర నన్ను వదిలి. ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. అమ్మ పోయింది. నెలరోజులు అక్కడే వున్నాను. ఒకరోజు రాత్రి -" కంఠం గద్గదమైంది, మాట్లాడలేనిదానిలా కూర్చుండి పోయింది.
"ఊఁ ఒకరోజు రాత్రి ఏం జరిగిందమ్మా?"
సుశీలమ్మ కొడుకు కళ్ళలోకి చూసింది.
ఆ కళ్ళలో, ముఖంలో కన్పించిన ఆతృతకు ఆమె విరక్తిగా తనలో తనే నవ్వుకుంది.
అందుకే అంటారేమో "బ్లడ్ ఈజ్ థక్కర్ దాన్ వాటర్" అని. కన్నతల్లిని, కన్యగానే పరిత్యజించిన ఆ స్త్రీని చూడాలని ఎంత ఆరాటపడిపోతున్నాడో?
"చెప్పమ్మా!"
"అది వేసవికాలం. పదిగంటలు కావస్తోంది. ఇంకా అన్నయ్య ఇంటికి రాలేదు. నేను వసారా గుంజకు ఆనుకొని కూర్చొని వున్నాను. ఆరుబయట నాకు ఎదురుగా కూర్చొని జీతగాడు కబుర్లు చెబుతున్నాడు.
అన్నయ్య వస్తుంటే లేచి నిల్చున్నాను, పై పంచె భుజాలమీదగా కప్పుకున్నాడు. రెండుచేతులు పై పంచ లోపల వున్నాయి. రెండు చేతులతో పదిలంగా ఏదో వస్తువు పట్టుకొని ఉత్తరీయం చాటున చాచాడని తెలుస్తూనే వుంది" సుశీలమ్మ కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.
సుశీలమ్మ గొంతు పెగల్చుకొని మాట్లాడటానికి ప్రయత్నిస్తూ వుంది. మాట్లాడలేకపోతుంది. శరత్ ముఖంలోకి. మళ్ళీ ఆ ముఖం కన్పిస్తుందో లేదో అన్నంత ఆరాటంగా చూస్తూ వుండిపోయింది.
"చెప్పమ్మా! మామయ్య ఏం తెచ్చాడు?"
"బాబూ!" వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొనే ప్రయత్నంలో సతమతమై పోసాగింది.
శరత్ ఆదుర్దాగా తల్లి ముఖంలోకి చూస్తున్నాడు.
"ఏమిటన్నయ్యా అది? ఏదో తెచ్చినట్టున్నావు?" అని అడిగాను.
"అవునమ్మా! నీకోసం ఓ మంచి బహుమతి తెచ్చాను." అన్నాడు.
నేనేమంత ఉత్సాహం చూపించలేదు, నవ్వి ఊరుకున్నాను.
"ఇలారా చెల్లీ! అన్నయ్య లోపలకు వెల్తూ పిల్చాడు.
నేను అన్నయ్య వెనకే వెళ్ళాను.
మెల్లగా ఇంట్లో నిలబడి "ఇదుగో నీకోసం ఎటువంటి బహుమతి తెచ్చానో చూడు!" అంటూ పంచె చాటున వున్న చేతుల్ని ముందుకు చాచాడు. అన్నయ్య చేతుల్లో మురికి బట్టల్లో చుట్టిన పసిబిడ్డవుంది. ముఖం మాత్రం కన్పిస్తూ వుంది. బిడ్డ నిద్రపోతూ వుంది. అది చూసి నేను స్థాణువులా నిలబడిపోయాను.
"తీసుకో సుశీ!" అన్నయ్య తన చేతుల్ని ముందుకు చాచాడు.
నేను వెర్రిదానిలా చూస్తూ నిలబడిపోయాను. నేను చూస్తున్నది కలో నిజమో తెలియడం లేదు.
పిల్లవాడు కళ్ళు తెరిచాడు. వెలుతుర్ని చూస్తున్నాడు. బట్టల్లోనుంచి ఎర్రటి చిన్న చేతుల్ని కదిలిస్తున్నాడు గుప్పెళ్ళు మూసి.
"నీకు పిల్లలంటే ఇష్టం కదూ? దిక్కులేని పసివాడు. నీ చేతుల్లో పెరుగుతాడని తెచ్చాను" అన్నాడు అన్నయ్య.
నేను అన్నయ్య ముఖంలోకి విస్మయంగా చూశాను. అంతలోనే వాడు "కేర్" మన్నాడు.
అనుకోకుండా చటుక్కున ముందుకువచ్చి, బిడ్డను అందుకుని గుండెలకు హత్తుకున్నాను.
అంతవరకూ గుండెల్లో పేరుకొని వున్న దిగులేదో కరగిపోతున్నట్లు అనిపించింది. అంతే! ఎవరిబిడ్డ అని కూడా అడగలేదు. అన్నయ్య చెప్పలేదు. నాకు అడగాలనిపించలేదు ఆ భావం పొరపాటున కూడా మనసులోకి రాలేదు! నా బిడ్డే అనుకున్నాను. అలాగే పెంచాను మీ నాన్న అడిగారు. నా బిడ్డే అన్నాను. నా మానసిక స్థితిని అర్థం చేసుకున్న ఆయన మళ్ళీ ఆ ప్రశ్న వెయ్యలేదు."
గబగబా చెప్పి కళ్ళు తుడుచుకుంది సుశీలమ్మ.
శరత్ తలదించుకొని ఆలోచిస్తున్నాడు. సుశీలమ్మ మళ్ళీ ప్రారంభించింది.
"పల్లెటూర్లో ఏ విషయమైనా ఇట్టే పొగలా ఊరంతా వ్యాపిస్తుంది. అందుకే తెల్లవారుజామునే టాక్సీలో అన్నయ్య నన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. నువ్వు మా బిడ్డవు కాదని ముగ్గురికే తెలుసు" తనకు తనే చెప్పుకుంటున్నట్టు చిన్నగా అన్నది.
