ఆమ్మో అంటూ రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టేసాడు వినీల్.
***
ముహూర్తం ప్రకారం ఆరోజు మొదటి రాత్రి ఏర్పాటు చేశారు ఇద్దరికీ.
ముందు అక్కడా ఇక్కడా అనుకున్నా చివరకు విజిత కోరిక ప్రకారం ఆమె బెడ్ రూమ్ ను డెకరేట్ చేశారు.
పంతులు గారు రాత్రి తొమ్మిది గంటలకు ముహూర్తం పెట్టారు.
ఏదో అర్జెంటు కస్టమర్ కాల్ వస్తే వినీల్ ఏడుగంటల వరకు బిజీగా అతన్ని గైడ్ చేసి ఆ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ని ఓకే చేసి హమ్మయ్య అనుకుని లాప్ టాప్ క్లోజ్ చేసి చూసేసరికి చుట్టూ పెద్దవాళ్ళు అందరూ కూర్చోనున్నారు అతన్నే చూస్తూ. ఒక్కమారు విస్తుపోయాడు వినీల్.
అరే మీరంతా ఎందుకు నాకోసం వెయిటింగ్ అన్నాడు ఇబ్బందిపడుతూ.
రాజు గారు గొంతు విప్పారు. అల్లుడు గారు ఈరోజు మీకు, విజితకు శోభనం. అన్ని ఏర్పాట్లు జరిగాయి. తొమ్మిది గంటలకు ముహూర్తం. ఇప్పుడు ఏడయ్యింది. మీరు ఓ గంటలో రెడీ అయితే సరిపోతుంది అన్నారు.
ఓహ్ గుర్తుంది మామయ్యా. ఇప్పుడే ఓ అర గంటలో రెడీ అవుతాను అన్నాడు.
రెడీ అయ్యి విజిత బెడ్ రూమ్ అదే శోభనం గదిలోకి అడుగు పెట్టాడు వినీల్.
ఓహ్ ఘుమ ఘుమ లాడుతోంది ఆ గది.
చక్కటి పరిమళం వినీల్ మనసును చుట్టేసింది.
పట్టె మంచాన్ని పూలతో అందంగా అలంకరించారు.
చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు విజిత ఫొటోలతో ఆ గది గోడలు అందాలను విరజిమ్ముతున్నాయి.
చాలా టేస్ట్ ఉంది విజిత కి అనుకున్నాడు వినీల్.
తన లాగే తన గది కూడా చాలా ముచ్చటగా ఉంది.
అంతా చూస్తున్న వినీల్ అప్పుడు గమనించాడు. ప్రతి విజిత ఫోటో పక్కన తన ఫోటో చేర్చి ఉంది.
తను సేకరించిన వినీల్ ఫోటోలను చాలా అందంగా విజిత తన ఫోటోల ప్రక్కనే పొందుపరిచింది.
ఆమ్మో విజ్జీ యూ ర్ గ్రేట్ అండ్ లవ్లీ అనుకున్నాడు.
ఓ పది నిముషాలకు కిలకిలమంటూ నవ్వులతో కొందరు ఆడవాళ్ళ గొంతులు వినిపించాయి.
విజితను గదిలోకి వెళ్లమంటూ జాగ్రత్తే విజ్జీ అన్నారు ఆమెను గది లోపలికి పంపించి తలుపు వేస్తూ.
తెల్లని పట్టు చీరలో, చేతిలో పాల గ్లాసుతో, నుదుట తిలకం, తెల్లని బుగ్గపై నల్లని దిష్టి చుక్క, మిలమిల మెరుస్తూ వజ్రాలు పొదిగిన పాపిటి బిళ్ళ, అందమైన కురులను ఒడిసిపట్టి వేసిన నల్ల త్రాచు లాంటి జడ, ఆ జడకు చుట్టిన మల్లెల దండలు, తెల్లని మెరిసే పాదాలకు ఎరుపు రంగు పారాణి, కాటుక కళ్ళలో నునుసిగ్గు దొంతరల సోయగాలు, ఆ సిగ్గు బుగ్గలవరకు పాకి మందారాలు విరబూసినట్లు ఆ ఎర్రని చెక్కిళ్ళు, ఓహ్, ఓ అప్సరస దివినుంచి భువికి తన కోసం దిగినట్లు వినీల్ కళ్ళు ఆనందంతో అరవిచ్చుకున్నాయి. అతని మనసు గాలిలో తేలుతోంది.
వినీల్ లేచి విజిత దగ్గరకు వచ్చి ఆమె వెనకాల చూసాడు. ఎవరూ కనిపించలేదు.
ఎవరి కోసం వెతుకుతున్నారు అంది విజిత.
నా ముద్దుల భార్య విజిత కోసం. ఆమె కనపడలేదు అన్నాడు మళ్ళీ వెతుకుతూ.
చాలు లెండి అబ్బాయిగారి జోకులు. నేనే మీ విజితని. ఏంటి నా అలంకరణ బాగోలేదా అంది.
అర్రే నువ్వా విజ్జీ. ఎవరో అప్సరస నా కోసం దివి నుంచి భువికి దిగి వచ్చింది అనుకున్నాను సుమీ అన్నాడు ఆమె మొహం తన చేతుల్లోకి తీసుకుని. ఎంత సొగసు విజితది అని తదేకంగా ఆమెనే చూస్తున్నాడు.
థాంక్స్. చూసింది చాలు. ఇక ఈ విజిత మీదే. అంటే మీలో సగం అన్నమాట. నన్ను లోపలికి రానివ్వండి బుజ్జిగారు అంది.
వినీల్ ఆమె చేతిలోని పాల గ్లాసు ప్రక్క టేబుల్ పై పెట్టి తనను అమాంతం రెండు చేతులతో ఎత్తుకున్నాడు.
అతని మెడచుట్టూ రెండు చేతులు వేసి ముద్దు పెట్టింది విజిత.
మంచం దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. మంచంపై చల్లిన గులాబీ రేకులు విజిత చెక్కిళ్ళ ముందు చిన్నబోతున్నాయి.
పాల గ్లాసు తీసుకొచ్చి ఆమె చేతి కిచ్చి నువ్వు తాగి నాకివ్వు అన్నాడు.
ఇదేంటి. మీరు తాగి కదా నాకివ్వాలి అంది.
ఉహూ ఫర్ ఏ చేంజ్ అని ఆమె నోటి దగ్గర పెట్టాడు గ్లాసు. తను కొంచెం పాలు తాగి అతని చేతికిచ్చింది.
థాంక్స్ అని అతను ఆ పాలు తాగాడు. చూసావా ఎంత తియ్యగున్నాయో పాలు అని మొత్తం తాగేశాడు.
ఓహ్ నా ఎంగిలి జబ్బు మీకు కూడా అంటిందన్నమాట అంది నవ్వుతూ విజిత.
మరీ. నీలో సగం నేను కదా అన్నాడు వినీల్. విజ్జీ నిన్ను చూస్తుంటే నాలో కవి నిద్రలేస్తున్నాడు.
చెప్పండి కవిగారు. మీ కవిత్వం విని నేనూ సంతోషిస్తాను అంది విజిత నవ్వుతూ.
ఆవిడకి వినీల్ అక్క శశిరేఖ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి మా బుజ్జిగాడు అప్పుడప్పుడు కవిత్వం రాస్తుంటాడు. అది వాడి హాబీ అని.
గొంతు సవరించుకుని చెప్పాడు వినీల్.
జాబిల్లిని నీ నొసట బాసికం బిళ్ళగా కట్టుకుని, వెన్నెల మధుపర్కాలు ధరించి, క్షీరసాగర తరంగాల మీద నడిచివచ్చే నీ కోసం, కౌగిళ్ళ లోగిళ్ల వాకిళ్లు తెరిచి, గుండెను బంగారు మండపంగా తీర్చిదిద్దనా నేను.
వావ్ నీల్ ! సూపర్బ్ థాట్. చాలా అందంగా చెప్పావు అంటూ అతను బుగ్గపై ఓ ముద్దు పెట్టింది విజిత.
ఇంత కష్టపడి చెప్తే అంతేనా అని దీనంగా చూసాడు వినీల్.
ఇంకేం కావాలిరా బుజ్జీ అంటూ ముద్దులతో అతని మొహం నింపేసింది చాలు చాలు అంటున్నా.
****
ఆ నవ దంపతులకు మూడు రాత్రులు మూడు సెకన్లలా మధురంగా గడిచిపోయాయి.
జీవితానికి సరిపడా ఆనందపుటంచుల్ని చూసారు ఇద్దరూ.
మేము ఇద్దరం కాదు ఒకరే అన్నట్లు ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు అమృతాన్ని ఆస్వాదిస్తూ.
ఓ పదిరోజుల తరువాత వినీల్ విజిత అమెరికా బయలుదేరారు.
తన ఉద్యోగం సంబంధించి చివరి ఘట్టం హడావిడిలో వినీల్ ఉన్నాడు.
విజితకి, తనకి బిజినెస్ క్లాస్ లో టికెట్స్ బుక్ చేసాడు.
బయలుదేరే రెండు రోజుల ముందు వినీల్ కి అమెరికా ఆఫీస్ లోని సహోద్యోగి నుంచి ఫోన్ వచ్చింది.
నువ్వు ఒక్కడివే అమెరికా రా నీల్. భార్య ని తీసుకు రావొద్దు. మన ఇండియా లో లా ఇక్కడ కరోనా గురించి అంత శ్రద్ధ, జాగ్రత్తలు లేవు. ఎవరూ కరోనా నియమాలను పాటించట్లేదు. అందువల్ల అక్కడక్కడ కరోనా కేసులు నమోదవుతున్నాయి. వ్యాధి తీవ్రత, మరణాలు అంతగా లేకపోయినా కొంత ఇబ్బంది, ఓ వారం ఇంటికే పరిమితం కావడం జరుగుతోంది. మన స్నేహితులలో కూడా కొంత మందికి ఇలానే జరిగింది. కాకుంటే అందరూ రికవర్ అయ్యి సేఫ్ గానే ఉన్నారు. నువ్వొక్కడివే వస్తే చాలా మంచిది అని పదే పదే చెప్పాడు అతను.
అదే మాట విజిత తో అన్నాడు వినీల్.
ప్లీజ్ విజ్జీ నువ్వు నాతో రావొద్దు. నాకంటే వెళ్ళక తప్పదు. అక్కడ కొంత ఇంట్లో కూర్చుని, మరికొంత ఆఫీస్ కి వెళ్లి పని చెయ్యాల్సి ఉంటుంది. అక్కడ ఇంకా కరోనా పరిస్థితి పూర్తిగా సమిసిపోలేదట అని బ్రతిమిలాడాడు.
విజిత వినలేదు. వినీల్ తో వెళ్లాలని పట్టుబట్టింది. తనూ వినీల్ ని బ్రతిమిలాడింది ప్లీజ్ ప్లీజ్ అంటూ.
వినీల్ పెద్దవాళ్ళ చేత కూడా చెప్పించాడు విజితకి. ఊహూ తను ఒప్పుకోలేదు.
ఇక తప్పేదిలేక విజిత ని తన వెంట తీసుకెళ్లాడు అమెరికాకి.
****
అమెరికా వెళ్లిన తరువాత ఓ వారం హ్యాపీ గా గడిచింది.
ఆ తరువాత ఓ రోజు అనుకున్నట్లే విజిత కి కరోనా లక్షణాలు కొద్దిగా కనిపించాయి.

