Previous Page Next Page 
ఫస్ట్ క్రష్ పేజి 29

 

ఆయన పుట్టి పెరిగిన ఊరు, అందులోనూ వారి తండ్రి, తాతలు ఆ ఊరికి తమ వంతుగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వెంకటరాజు గారు కూడా తన వంతు కృషి చేశారు.
అందుకే భీమవరంలో అందరికి రాజుగారంటే అభిమానం, ప్రేమ.
అందులోనూ ఆయన కూతురు పెళ్లి అనేసరికి ఊరు ఊరంతా కదిలి వచ్చింది.
రాజుగారు అందరికి వసతి, భోజనాలు, విందు, వినోదాలు ఏర్పాటు చేశారు.
అందుకు చాలా డబ్బు ఖర్చయ్యింది.
ఏమాత్రం వెనుకాడకుండా ఘనంగా విజిత పెళ్లి చేశారు ఆయన. 
భీమవరం లో పెళ్లి కాబట్టి విజిత బంధువులు, వినీల్ బంధువర్గం చాలా మందే వచ్చారు.
రాజుగారు పెళ్ళికి ప్రత్యేక అతిధులుగా భీమవరం గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయులు, ఆఫీస్ స్టాఫ్, స్కూల్ లో పనిచేస్తున్న వారందరినీ కుటుంబ సభ్యులతో సహా పేరు పేరునా ఆహ్వానించాడు.
విజిత చదివినప్పుడు ఉన్న ఉపాధ్యాయులు కొంత మంది రిటైర్ అయ్యిన వాళ్ళను కూడా వెతికి పట్టుకుని వేరే ఊర్ల నుంచి తన స్వంత ఖర్చులతో కుటుంబసమేతంగా పిలిపించారు.
వారందరికీ ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేశారు. 
ఉపాధ్యాయులందరికీ విజిత వినీల్ చేత పాద పూజ చేయించి, ప్రత్యేక బహుమతులతో గౌరవించారు.
ఆ గౌరవానికి, సముచిత సన్మానానికి వారందరూ ఉబ్బితబ్బిబ్బయ్యారు.
వారందరికీ వినీల్ విజిత అంటే చాలా ఇష్టం. ఇద్దరూ తమ క్లాసుల్లో పోటీపడి చదివేవారు.
వినీల్ టెన్త్ క్లాసులో సాధించిన మార్కుల రికార్డు ఇప్పటివరకు ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయారని, ఆ దరిదాపులకు కూడా రాలేకపోయారని ప్రధానోపాధ్యాయులు అందరిముందు గర్వంగా చెప్పారు.
వినీల్ తండ్రి సుధాకర్ గారు తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ లోనే చదివించడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు.
తన కూతురు విజిత పెళ్లి శుభ సందర్భంలో గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధికి గాను తన వంతుగా పది లక్షల రూపాయలతో వసతులు ఏర్పాటు చేస్తానని వెంకటరాజు గారు అందరి ముందు అనౌన్స్ చేశారు.
రాజుగారి మాటలకు అందరూ నిలుచుని పది నిముషాలపాటు కరతాళధ్వనులు చేశారు.
మనకు చదువు చెప్పిన గురువుల కన్నా ఆశీర్వదించేవాళ్ళు ఎవరుంటారు. ఆ విధంగా అందరూ విజిత, వినీల్ ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. 
పెళ్ళికి విజిత స్నేహితులు, వినీల్ స్నేహితులు చాలా మంది వచ్చారు.
తమ స్కూల్ ఫ్రెండ్స్ చాలా మందిని విజిత తన పెళ్ళికి ఆహ్వానించింది.
వారిలో చాలా మంది తన సీనియర్స్, వినీల్ క్లాస్ మేట్స్ కూడా.
వినీల్ కి చాలా ఆశ్చర్యం వేసింది వాళ్ళందరిని చూసి.
ఆనందంగా అందరిని పేరు పేరునా పలకరించాడు.
చదువుకునేప్పుడు అంత సమయం దొరకలేదు వాళ్లందరితో ఎంజాయ్ చేసేందుకు.
అందుకే ఇప్పుడు అందరితో చాలా ఆనందంగా గడిపాడు.
అందరూ విజితని ఆకాశానికెత్తేశారు.  
ఇన్నిరోజులు వినీల్ కోసం ఎదురుచూసి అతన్నే పెళ్లి చేసుకున్నందుకు.  
కొందరైతే వినీల్ మొహం మీదనే అనేసారు మేము ఎంతగానో విజితని బ్రతిమిలాడాము మమ్మల్ని ప్రేమించమని, పెళ్లిచేసుకోమని. తను ససేమిరా ఒప్పుకోలేదు. నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయం కూడా మాకు ఎవరికీ చెప్పలేదు. ఇప్పటి వరకు ఆ రహస్యం దాచి ఉంచింది. ఇదిగో మీ పెళ్లి కార్డు వచ్చిన తరువాత మేమందరం షాక్ అయ్యాము. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివిరా వినీల్ అని అందరూ అతనిని ఎత్తుకుని ఊరేగించారు. 
పెళ్ళికి వచ్చిన వారందరికీ ముందుగానే రాజుగారు వసతి ఏర్పాట్లు ఘనంగా చేసి ఉంచారు. 
పెళ్ళికి ముందు రోజు వినీల్ ఫ్రెండ్స్, విజిత ఫ్రెండ్స్ డాన్స్ ఫంక్షన్ ఏర్పాటు  చేశారు.
అందరూ చక్కటి సినిమా సాంగ్స్ కి డాన్స్ చేశారు.
ఆడుతూ పాడుతూ కుర్రకారు మహా జోరుగా ఎంజాయ్ చేశారు.
చాలా మంది పెద్ద తరం కూడా ఆ అభినయాలని చూసి ఉప్పొంగిపోయారు.
వినీల్, విజిత కూడా ఓ డ్యూయెట్ కి చక్కటి అభినయం చేశారు.
అందరూ ఒన్స్ మోర్ అంటూ చప్పట్లు కొట్టారు.
విజిత ఫ్రెండ్స్ వినీల్ ని సోలోగా డాన్స్ చెయ్యాలని పట్టుబట్టారు.
ఇలాంటి సిట్యుయేషన్ వస్తుందని పసిగట్టి వినీల్ ఓ రెండు రోజులు కొత్తగా వచ్చిన RRR సినిమా లోని నాటు నాటు సాంగ్ కి స్టెప్స్ నేర్చుకున్నాడు ఓ డాన్సర్ దగ్గర.
ఆ సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ వేసి ఆగకుండా మొత్తం సాంగ్ పూర్తి చేసి తన ఎనేర్జి ఏంటో నిరూపించాడు వినీల్.
విజిత ఫ్రెండ్స్ అందరూ అతని డాన్స్ కి నిలుచుని చప్పట్లు కొట్టారు సూపర్బ్ అంటూ.
ఒక అమ్మాయి ఆగలేక వినీల్ బుగ్గపై తన పెదాల ముద్ర కనిపించేట్లు వేసింది.
ఇంకో ఇద్దరు కూడా లేవబోయారు.
విజిత ప్లీజ్ అంటూ వారిని వారించింది. 


****


పెళ్లి భోజనాలప్పుడు వినీల్ ప్లేట్ లో తను తిన్న సగం స్వీట్ ఎవరూ చూడకుండా విజిత తీసుకుని తినేసింది. అలాగే రెండు సార్లు చేసింది. వినీల్ ఏదో మాట్లాడుతూ తన ప్లేట్ చేసుకునేసరికి తను తిన్న ఐటమ్స్ మాయం. 
ఏయ్ దొంగా ఇది నీ పనేనా అన్నాడు వినీల్ నవ్వుతూ విజితతో.
మీ ప్రేమను పంచుకుంటున్నాను మహారాజా అంది విజిత నవ్వుతూ.
అబ్బా ! ఇద్దరం ఒక్కటయ్యాముగా ఇంకా ఈ చిలిపి చేష్టలేంటి విజ్జీ అన్నాడు వినీల్.
విజిత అలా వినీల్ తిన్న స్వీట్స్ అతని ప్లేట్ నుంచి తీసుకుని తినడం రాజుగారు, మాధవి కంట పడింది.
ఇద్దరూ ఒకరి నొకరు చూసుకున్నారు నవ్వుకుంటూ.
మనమ్మాయికి వినీల్ అంటే ఇంత ప్రేమ ఉందా అన్నారు రాజు గారు భార్యతో ఆశ్చర్యంగా.
అవునండి నిన్ననే తెలిసింది. మన విజిత కి స్కూల్ రోజులనుండి వినీల్ అంటే ఇష్టమట. ఇష్టమంటే ప్రేమ ఒక్కటే అని కాదు. అతని మంచి అలవాట్లు, చదువులో అతని పట్టుదల, మంచి నడవడిక, అమ్మాయిలపట్ల అతను చూపే గౌరవం ఇవన్నీ మనమ్మాయికి తెగ నచ్చేశాయి. అప్పటినుండి అతన్నే గురువుగా భావించి అతన్నే పెళ్లిచేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. విజిత ఎమ్ సెట్ లో పదవ రాంక్ కృషికి పునాదికూడా అతనే అని చెప్పింది. వినీల్ ని ఆదర్శంగా తీసుకునే విజిత కూడా పట్టుదలతో చదివింది. అతన్ని చూసి జీవితంలో ఓ మంచి నడవడిక అలవరుచుకుంది. చివరకు తను అనుకున్నట్లు వినీల్ నే పెళ్లిచేసుకుంది అంది మాధవి. 
వినీల్ పెళ్లి విషయం పేపర్ లో, మీడియాలో చూసిన అతని శిష్యురాలు ఎయిర్ హోస్టెస్ ఆరోజు విజిత వినీల్ కిచ్చిన బెస్ట్ కపుల్ అవార్డు తాలూకు ఫొటోస్ రిలీజ్ చెయ్యొచ్చా అని వినీల్ కి ఫోన్ చేసి అడిగింది. వినీల్ హ్యాపీగా సరే అన్నాడు. ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన సమాచారం మేరకు ఆ ఎయిర్లైన్స్ విజిత్ వినీల్ గురించి కధనం, ఫోటోలు సోషల్ మీడియా లోనూ, తమ వెబ్సైటు లోనూ పబ్లిష్ చేసింది. విజిత కు సర్ప్రైస్ గా అవి చూపించాడు వినీల్. అందరూ సోషల్ మీడియాలో వచ్చిన ఆ ఫోటోలు, వీడియోలు చూసి ఆనందించారు. 
ఇక విజిత అత్తగారు సుధకు రోజూ కోడలికి దిష్టి తియ్యడం ఒక అలవాటుగా మారింది. 


****


ఇక హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన వినీల్, విజిత రిసెప్షన్ కి చాలా మంది అతిధులు వచ్చారు.
రాజుగారికి తెలిసిన పెద్ద బిజినెస్ మెన్, సినీ వర్గాల వారు చాలా మంది హాజరయ్యారు.
అంతకంటే ఎక్కువగా వినీల్ కి తెలిసిన సాఫ్ట్వేర్ క్లైంట్స్, ఫ్రెండ్స్, కస్టమర్స్ అటెండ్ అయ్యారు.
వారందరిని చూసి రాజుగారికి చాలా సంతోషమేసింది.
ఫరవాలేదు అల్లుడు గారికి పెద్ద సర్కిల్ ఉంది అనుకున్నాడు.
వినీల్ కొచ్చిన గిఫ్ట్స్ చూసి విజిత చాలా ఆశ్చర్యపోయింది.
అబ్బో ఈ బుజ్జిగాడికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారే అనుకుంది. 
విజిత ఫ్రెండ్స్ చాలామంది వినీల్ హ్యాండ్సమ్, తెలివితేటలు, చురుకుదనం చూసి బాగా పొగిడారు.
నువ్వు ఒప్పుకుని నీకు అభ్యంతరం లేకపోతే మేము కూడా అతన్ని చేసుకుంటాం అని మొహమాటం లేకుండా అడిగారు. 
తలపట్టుకోవడం విజిత వంతయ్యింది.
వినీల్ తో వీళ్లంతా మీ ఫాన్స్. మిమ్మల్ని పెళ్లిచేసుకుంటారంట అంటూ ఆటపట్టించింది. 

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS