Next Page 
ప్రేమ...పెళ్ళి....విడాకులు పేజి 1

ప్రేమ...పెళ్ళి....విడాకులు

పెళ్లి అనేది ఒక విడదీయరాని జీవన బంధం. 
పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది.
అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత.
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది. 
ఇప్పటి పెళ్లిళ్ళు అన్నీ యాంత్రికంగా జరుగుతున్నాయి.
ఆ సంప్రదాయాల వెనుక దాగున్న అర్ధాన్ని తెలుసుకునే ఓపిక ఉండట్లేదు.
ఎక్కువ భాగం రిజిస్టర్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి.
ఎందుకంటే వధూవరులు పెళ్లి చేసుకుని ఫారిన్ వెళతారుకానుక. 
నేటి యువతరం ప్రేమ కోసం ఏమైనా చేస్తున్నారు.
ప్రేమించడం మొదలు పెట్టారంటే తన చుట్టుపక్కలా ఏం జరిగినా కన్నెత్తి చూడరు. 
చూసిన వెంటనే ప్రేమలో పడటం, ఫేస్ బుక్ ప్రేమ, ఇంటర్నెట్‌, ఫోన్‌ల ద్వారా ప్రేమాయణాలు కొనసాగిస్తున్న నేటి యువత తమ తల్లిదండ్రుల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
అంతేకాదు  చిగురించిన ప్రేమ రాలిపోయే ముందే పెళ్లి చేసేసుకోవాలని యూత్ అవసరపడుతోంది.
ఇందుకు గాను తల్లిదండ్రుల అంగీకారాన్ని సైతం లెక్క చేయట్లేదు.
వారి సమ్మతం లేకుండానే పెళ్లిళ్ళు జరిగిపోతున్నాయి.
ఆర్థిక పరంగా నేటి యూత్ సెటిల్ కావడంతో తల్లిదండ్రులపై ఆధారపడకుండా ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకుని వారి వారి జీవితాన్ని వారే ఎంచుకునే స్థాయికి ఎదిగిపోతున్నారు.
అయితే యువత తల్లిదండ్రుల సమ్మతంతో పెళ్లి చేసుకోవాలంటే మాత్రం కొంచెం ఓపికతో వ్యవహరించి సంయమనం పాటిస్తూ ఈ  సూత్రాలు పాటించే ప్రయత్నం చెయ్యండి. 
ప్రేమ గురించి తల్లితండ్రులకు చెప్పి కాస్త వారికి ఆలోచించే టైమ్ ఇవ్వండి ; మీకంటే వయసులో పెద్దవారు, మిమ్మల్ని కని పెంచిన వారు, మిమ్మల్ని ప్రేమించే వారు కనుక మిమ్మల్ని తప్పక అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు ;  వారు మీ ప్రేమను ద్వేషించేందుకు కారణం ఏమిటో తెలుసుకోండి ; దీని గురించి ప్రేయసి / ప్రియుడి దగ్గర చర్చించకండి ; మీ కుటుంబీకులతో మనస్సు విప్పి మీ ఆలోచనా విధానం వివరించండి ; మీరు కూడా వారి స్థానంలో ఉండి ఆలోచించండి ; మీ ప్రేమను తల్లిదండ్రులకు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి ; తల్లిదండ్రులను ద్వేషించకండి ; ఓపికతో మీ ప్రేమ నిజమైందని నిరూపించండి ; తల్లిదండ్రులకు అనుగుణంగా మీ ప్రేయసి /  ప్రియుడి అలవాట్లను మార్చేందుకు ప్రయత్నించండి ; తల్లిదండ్రులు మీకు ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయాన్ని మరిచిపోకండి.
కొన్ని సందర్భాల్లో పై  సూత్రాలు ఉపయోగపడతాయి. కానీ తల్లిదండ్రులు గౌరవం కోసం వద్దంటే మాత్రం మీ ప్రేమపై మీకు అపార నమ్మకముంటే మీరే మీ జీవితాన్ని ఎంచుకోవచ్చు.
ఇలా రాసుకుంటూ వెళ్తే  ప్రేమ,  పెళ్లి గురించి చాలా విషయాలు ఉంటాయి. కాకుంటే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.  
జీవితం గొప్పది. అందులో సమస్యలు కావు. అవి మనం సృష్టించుకున్నవి. వాటికి సమాధానం మన చేతుల్లోనే ఉంటుంది. పంతాలు, పట్టింపులకు పోతే చాలా అనర్ధాలు జరిగే ప్రమాదాలుంటాయి. 
ఓ సినీ గేయకవి గారు అన్నట్లు ' అందమైన జీవితము అద్దాల సౌధము,  చిన్న రాయి విసిరినా చెదరిపోవును, ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును'.  
జీవితం ఎంతో విలువైనది. దానిని జాగ్రత్తగా కాపాడుకోవడం మన విధి. 
ఒక పెళ్లి రెండు జీవితాలను, రెండు కుటుంబాలను కలుపుతుంది. భవిష్యత్తును ఎంతో ప్రభావితం చేస్తుంది. 
మరి అది వికటించి విడాకులకు దారి తీస్తే  తీవ్ర పరిణామాలు ఎదురై జీవితాలు, కుటుంబాలు కకావికలమవుతాయి.  
నేటి జీవన విధానాన్ని సాంకేతికత శాసిస్తోంది. 
మన ప్రతి చర్య సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిక్షిప్తం చేయబడుతోంది. 
థియేటర్ కు వెళితే ప్రతి సినిమా కు ముందు  చట్టబద్ధమైన హెచ్చరికలా ఒక ట్రైలర్ వేస్తారు. 
ప్రముఖ హీరోనో, దర్శకుడో అమ్మాయిలు అజాగ్రత్తగా ఉంటె ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని వివరిస్తారు.   
ప్రైవేట్ ఫోటోలు ఆకతాయిల చేతికి వెళితే ఏమి జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అని వివరించి చెప్తారు. 
అయినా ఎక్కడో ఒక చోట కొన్ని ఇబ్బందికర సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజూ.  
సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఒక సెకనులో ఏ విషయమైనా దావానంలా వ్యాపిస్తుంది.
చేతిలో ఉన్న మొబైల్, అందులో ఉన్న కెమెరా చాలా శక్తివంతమైనవి. 
అజాగ్రత్తగా ఉంటె అవి జీవితాలను కూడా మార్చేస్తాయి. 
ముందు కాలంలో అంటే కంప్యూటర్స్, ఇంటర్నెట్,  మొబైల్ ఫోన్స్ ఏవీ లేని రోజుల్లో ప్రేమ అంటే ఒక కాగితం మీద రాసి ఏ బుక్ లోనో మరే విధంగానో ప్రేమికులు ఇచ్చిపుచ్చుకునేవారు ఎవ్వరికీ కనపడకుండా. 
అప్పుటి కాలంలో ఇలా తమ ప్రతి చర్య సెల్ఫీ తీసుకునే అవకాశం ఉండేది కాదు. అందువలన ఎంతో భద్రత ఉండేది.
ఇప్పుడు ప్రతిదీ మొబైల్ కెమెరా లో భద్రపరచపడుతోంది. 
అది ఒక్కోసారి ఎంతో ప్రమాదం కూడా. 
అంటే ప్రతి నిమిషం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
ఇక మెయిల్స్, వాట్సాప్, పేస్ బుక్, ఎలాంటివైనా హద్దుమీరితే ఇబ్బందికరమే. జీవితాలను మింగేసి మనసుకు శాంతి లేకుండా చేస్తాయి. 
ఈ డిజిటల్ ప్రపంచంలో ప్రతిదీ ఆచి తూచి వ్యవహరించాలి. లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి.  
            ఈ నవల ద్వారా నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. 
చదువుకునే వయసులో బాగా చదువుకోండి లేదా మీరెన్నుకున్న రంగంలో మీ ప్రతిభను చాటండి. 
ఆకాశమే హద్దుగా శ్రమించండి. 
తల్లితండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తు కోసం తమ జీవితాలను పణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తారు. 
తమ పిల్లలు ఎంతో ఎత్తు కు ఎదగాలని ఆశిస్తారు. 
యువత ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు మిమ్మల్ని కన్నవారిని ఒక్క మారు సంప్రదించండి. 
మనమంతా తల్లి గర్భంలోనుంచి బయటికొచ్చే ఈ లోకం వెలుగు చూసాం. కనీసం తల్లి కైనా చెప్పండి. 
ఎవరూ మీ మాట కాదనరు. ఈ నవల లో మంజరి జీవితం, తన వల్ల తల్లితండ్రులుకు ఎదురైన కష్టాలు నిజ జీవితంలో కళ్లారా చూసిన తరువాత ఈ నవల  రాయాలనిపించింది. 
కేవలం తన తెలివి తక్కువ తనంతో ఆమె ఒక అద్భుతమైన జీవితాన్ని చేజేతులా నేలపాలు చేసుకుంది. 
మానవ జీవితం ఒక గొప్ప వరం. 
మనసును సన్మార్గంలో నడిపితే ఈ భూమి మీద ఏదైనా సాధించవచ్చు. సమస్యలనేవి అందరికీ ఎదురవుతాయి. అవి   కేవలం తాత్కాలికం. 
వాటికి భయపడి జీవితం వదిలేసి పారిపోకూడదు. 
ధైర్యంగా ఎదుర్కొండి. 
మీరు సుఖంగా ఉండండి. 
మీ తల్లి తండ్రులను సుఖపెట్టండి. 
                                             ఇక కథలోకి వెళదాం .....................
****


మూడేళ్ళ క్రితం ఓ సోమవారం. 
ఆరోజు కోర్ట్ బాగా బిజీగా ఉంది. 
అందుకు తోడు నా కేసులు కూడా చాలా ఉన్నాయి. 
లంచ్ అవర్ వరకు ఊపిరి సలపనంతా పనితో సతమతమై అమ్మయ్య అనుకుంటూ లంచ్ రూమ్ లోకి దారితీసాను. 
సాధ్యమైనంతవరకు ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటాను. వీలుపడకపోతే కోర్ట్ కాంటీన్లో ఎదో ఒక అల్పాహారం తీసుకుంటాను. 
తోటి లాయర్స్ జోక్స్ వింటూ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. 
ఇంతలో మొబైల్ మోగింది. 
అప్పటి వరకు సైలెన్స్ లో పెట్టడంవలన తెలీలేదు. 
ఎందుకంటే కోర్ట్ హాల్ లో డిస్టర్బన్స్ ఉండకూడదు. 
ఎవరబ్బా అని చూస్తే మధు నుంచి ఫోన్. 
అప్పటికే నాలుగు మిస్సెడ్ కాల్స్ ఉన్నాయి. 
అరెరే అనుకుంటూ ఆన్సర్ చేసాను చెప్పరా మధు అంటూ. 
మధుసూధన్ నా చిన్నప్పటి స్నేహితుడు. 
అంతేగాక నా ఆంతరంగిక మిత్రుడు కూడా. 
జాతీయ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ గా ఉన్నాడు హైద్రాబాద్లో.   
వారానికొకసారి ఇద్దరం కలుస్తుంటాం కుటుంబాలతో కూడా. 
అదొక అలవాటుగా పెట్టుకున్నాం. 
వాడికి ఒక అబ్బాయి, అమ్మాయి. 
అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 
మూడు నెలల క్రితం మ్యారేజ్ చేసాడు. 

 

 


Next Page 

  • WRITERS
    PUBLICATIONS