టెస్ట్ చేస్తే కరోనాగా నిర్ధారణ అయ్యింది.
డాక్టర్ గా తనకే తెలుసు కాబట్టి ఇంట్లోనే ఒంటరిగా మందులు వేసుకుంటానని చెప్పింది వినీల్ కి.
వినీల్ ని దగ్గరకి రావొద్దని గట్టిగా చెప్పింది.
ఆమె మాటలు వినీల్ వినలేదు. ఆఫీస్ కి ఫోన్ చేసి తన సమస్య చెప్పి ఓ వారం రోజులు ఇంటి నుంచి పని చేస్తానని పర్మిషన్ తీసుకున్నాడు.
విజిత ఎంత చెప్పినా వినీల్ వినలేదు. తను కూడా విజితతోనే ఉన్నాడు. తనే కాఫీలు అవి చేసి విజితకి ఇచ్చేవాడు. అతనికి స్నేహితులు చాలా మంది ఉన్నారు. అందరూ వంతులేసుకుని పదార్ధాలు ఇంటికి పంపేవాళ్లు.
వినీల్ తన కోసం అలా రిస్క్ తీసుకోవడం విజితకి బాగా ఇబ్బంది అనిపించి ఎందుకు వినీల్ ఇంత అవసరమా. ఒక్క వారం నేను ఒంటరిగా గదిలో ఉంటాను. మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది. నావల్ల నీకు ఈ అంటువ్యాధి సోకుతుంది కదా అని గట్టిగా అరిచేది అలా అయినా భయపడి తన మాట వింటాడని. కొన్ని విషయాలు వినీల్ ను ఎవ్వరూ శాసించలేరు. విజిత ఎంత దూరం పెట్టినా నీతోనే నేను అని ఆ వారం ఆమెతోనే ఉన్నాడు.
వస్తే రానీ విజ్జీ. నీతోపాటే నేను కూడా అని ఆమెకు ఆ వారంరోజులు అన్ని సపర్యలు చేసాడు. కరోనా సోకినట్లు మనవాళ్లెవరికి చెప్పొద్దు అన్నాడు. అనవసరంగా వాళ్ళు కంగారు పడతారు. విజిత కూడా ఆ మాటకు సరేనంది.
విజితకి మనసులో వినీల్ కి ఏమవుతుందో అని చాలా బాధగా ఉన్నా అతని సాహచర్యం మీద, ప్రేమానురాగాల మీద బాగా మురిపెం కలిగింది.
దైవవశాత్తు వినీల్ కి కరోనా సోకలేదు. అమ్మయ్య అనుకుంది విజిత.
ఓ వారం తరువాత విజిత కూడా పూర్తి గా కోలుకుంది.
వినీల్ ఆఫీస్ వర్క్ లో బిజీ గా ఉన్నా విజిత కి అమెరికాలో ఉన్న ముఖ్య ప్రదేశాలను చూపిస్తూ ప్రతి క్షణం ఆనందింపచేసాడు. వినీల్ కి అక్కడ చాలా ఫ్రెండ్స్ ఉండటంవలన రోజూ ఎవరో ఒకరు తమ ఇంట్లో విందుకు పిలిచేవారు. వినీల్ తో అలా కలిసి తిరగటం విజిత కి చాలా ఆనందం కలిగించింది. పనిలో పని అక్కడ కారు డ్రైవింగ్ కూడా నేర్చుకుంది. వినీల్ తోడుంటే ఏదైనా సాధించగలను అన్న నమ్మకం ఆమెకు ఎక్కువయ్యింది.
అలా అటు వినీల్ ఆఫీస్ వర్క్ ఒక వైపు, హనీమూన్ ఓ వైపు బిజీ బిజీగా సాగింది అమెరికాలో.
తను తల్లినవుతానంటూ విజిత వినీల్ దగ్గర పర్మిషన్ తీసుకుంది.
ఆ విషయంలో అతనికి ఆనందం కలిగింది.
అనుకున్న టైం కి రెండు నెలలలో తన ఆఫీస్ పని ముగించాడు వినీల్.
వినీల్ కంపెనీ నుంచి వెళుతున్నందుకు బాధగా ఉన్నా అతను తన పదవీకాలంలో ఆ కంపెనీకి చేసిన అవిరళ కృషికి అందరి ప్రశంసలు అందుకున్నాడు.
అతని గౌరవార్ధం ఓ పెద్ద విందు, సన్మానం ఏర్పాటు చేసింది కంపెనీ.
వినీల్, విజితలిద్దరిని సన్మానించారు. వినీల్ గురించి అందరూ గొప్పగా పొగిడారు.
ఆ విషయం అన్ని సోషల్ మీడియా లోనూ, న్యూస్ చానెల్స్ లోనూ ప్రపంచవ్యాప్తంగా వచ్చింది.
ఓ వైరల్ గా కూడా మారింది.
అందరి ప్రశంసలు, మన్ననలు అందుకున్నారు భార్యా భర్తలు ఇద్దరూ.
ఇద్దరికీ ఒకరిపై మరొకరికుండే ప్రేమ పూర్తిగా బహిర్గతమయ్యింది.
కొన్ని సోషల్ ఆర్గనైసేషన్స్ భార్యా భర్తలంటే ఇలా ఉండాలి అంటూ విజిత వినీల్ పై కధానాలల్లి ప్రచురించారు.
వినీల్ తో పాటు తనకు దక్కిన గౌరవానికి విజిత ఉబ్బితబ్బిబ్బయ్యింది.
అమెరికాలో ఉన్న రెండు నెలలలో విజిత వినీల్ భార్యా భర్తలుగా ఒక్కటయ్యారు.
ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవిస్తూ పాలూ నీళ్లలా బాగా కలిసిపోయారు.
విజిత వినీల్ ల హనీమూన్ అమెరికాలో సుఖంగా ముగిసింది.
అమెరికా ట్రిప్ విజయవంతంగా ముగించుకుని ఇండియాకి బయలుదేరారు.
****
కాలచక్రంలో ఓ మూడు నెలలు గడిచాయి.
వినీల్ విజి ఇండస్ట్రీస్ కి తనే అంతా అయ్యాడు.
బిజినెస్ అల్లుడి చేతులో పెట్టి రాజుగారు బాగా రిలాక్స్ అయ్యారు.
ఆస్తిలో సగం వినీల్ పేర రాస్తానన్నారు రాజు గారు.
వినీల్ ససేమిరా ఒప్పుకోలేదు అందుకు.
విజిత పేరు మీదే ఉండనివ్వండి ప్లీజ్ అని ఖచ్చితంగా చెప్పాడు.
అది రాజుగారికి చాలా ఆనందం కలిగించింది.
కొద్ది కాలంలోనే తన సత్తా ఏంటో నిరూపించాడు వినీల్.
విజి ఇండస్ట్రీస్ లాభాలు రెండింతలు చేసాడు.
మిగతా కంపెనీలను దాటి ముందుకు దూసుకెళుతున్నాడు.
అనుబంధంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టాడు పెద్ద ఎత్తున.
అలా తన కోరిక కూడా నెరవేర్చుకున్నాడు.
వినీల్ శిష్యరికంలో విజిత బాగా శిక్షణ పొందింది విజి ఇండస్ట్రీస్ నడపడంలో.
ఇపుడు విజిత ఒంటిచేత్తో బిజినెస్ నడపడం చూసి రాజుగారు ముక్కు మీద వేలేసుకున్నారు.
ఔరా అల్లుడు నీకు నువ్వే సాటి, సరిలేరు నీకెవ్వరు అని మనసులో అనుకున్నాడు.
విజి ఇండస్ట్రీస్ వ్యవహారాలన్నీ ఇప్పుడు విజిత చూసుకుంటోంది. ఏమైనా సందేహాలుంటే వినీల్ సహాయం చేస్తున్నాడు.
వినీల్ తను ప్రారంభించిన సాఫ్ట్వేర్ కంపెనీకి కొత్త ఆర్డర్స్ తెప్పించుకుని ఆ కంపెనీని బాగా విస్తరిస్తున్నాడు.
విజి ఇండస్ట్రీస్ కి కావాల్సిన సాఫ్ట్వేర్ కూడా వినీల్ తను స్థాపించిన సాఫ్ట్వేర్ కంపెనీలోనే తయారు చేస్తున్నాడు.
బాగా అనుభవం ఉన్న సాఫ్ట్వేర్ కోడింగ్ దిగ్గజాలను అప్పోయింట్ చేసుకున్నాడు.
తన శిష్యురాలైన ఎయిర్ హోస్టెస్ తను ముంబై లో జాయిన్ ఐన కంపెనీకి రాజీనామా చేసి వినీల్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది.
వినీల్ సారధ్యంలో బాగా నడుస్తోంది సాఫ్ట్వేర్ కంపెనీ.
అటు విజి ఇండస్ట్రీస్, ఇటు తన సాఫ్ట్వేర్ కంపెనీ రెంటికి బాగా కష్టపడుతున్నాడు అల్లుడు అని గ్రహించారు రాజుగారు. అప్పుడప్పుడు అల్లుణ్ణి ఆరోగ్యం జాగ్రత్త అంటూ హెచ్చరిస్తుంటాడు ఆయన.
నేను చూసుకుంటానులే డాడీ అంటుంది విజిత.
మా వాడికి పని కనబడితే మనం ఎవ్వరం కనబడం అని జోక్ చేస్తుంటాడు సుధాకర్.
ఎంత బిజీగా ఉన్నా మధ్యాన్నం టైం కి విజిత కేబిన్ కెళ్ళి భోజనం చేయకుంటే వినీల్ పని అయిపోయినట్లే.
ఫోన్ చేసి గట్టిగా ఏడుపు రాగం తీస్తుంది.
మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు వినీల్ ని ఎలా కంట్రోల్ చెయ్యాలో విజితకు బాగా తెలుసు.
అంతేలెండి మీరు రారు నాకు తెలుసు అంటూ ఫోన్ లో ఒక ఏడుపు రాగం తీస్తుంది విజిత.
ఆ శబ్దానికి వినీల్ గుండెలో రైళ్లు పరిగెడుతాయి. ఇక అంతే పరుగు లంకించుకుని విజిత ముందు రెక్కలు కట్టుకుని వాలిపోతాడు.
విజి ఇండస్ట్రీస్ కి దగ్గరలోనే వినీల్ ఖరీదైన రెండు విల్లాలు ఖరీదు చేసాడు.
ఒకటి తమకోసం, మరొకటి తల్లితండ్రుల కోసం తీసుకున్నాడు.
సుధాకర్, సుధ భీమవరం నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు.
వారానికి రెండు రోజులు రాజుగారి ఇంట్లో భోజనాలు అందరికీ.
ఆ రెండు రోజులు అందరూ సందడిగా హుషారుగా గడుపుతారు.
****
అనుకున్నట్లుగానే విజిత తన కోరిక తీర్చుకుంది.
ట్విన్స్ పుట్టారు. మగపిల్లలు.
విజిత అంతటితో ఆగలేదు. మీ ఇంట్లోలానే నాకూ ముగ్గురు పిల్లలు కావాలి నీల్ అంది.
వినీల్ కి కూడా సంతోషమేసింది ఆ విషయంలో.
ఈ సారి ఆడపిల్లైతే బాగుణ్ణు అని కోటి దేవుళ్ళకు మొక్కుకున్నారు ఇద్దరూ.
రెండేళ్ల తరువాత విజితకి మళ్ళీ ట్విన్స్.
ఈ సారి కూడా మగపిల్లలే.
వినీల్ కి భయం వేసింది. ఇక ఈ పిల్లల యజ్ఞం ఆపేద్దాం విజ్జీ అన్నాడు.
విజిత కూడా నవ్వుతూ సరే అని వినీల్ ని ఓ రిక్వెస్ట్ చేసింది. ఓ ఆర్ఫనేజ్ స్టార్ట్ చేద్దాం అంది. అనాధ పిల్లల్ని చేరదీసి చక్కగా చదివించొచ్చు అంది. వినీల్ డబల్ ఓకే చేసాడు.
రాజుగారు, సుధాకర్ వాళ్ళు ఓ ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చెయ్యండి. మేము చూసుకుంటాం అని వినీల్ కి చెప్పారు.
విజిత ఫ్రెండ్స్, వినీల్ ఫ్రెండ్స్, వినీల్ అక్క శశిరేఖ మాత్రం రోజు వాట్సాప్ మెసేజ్ లు ఇవ్వడం మాత్రం మానలేదు ఇద్దరికీ. దాని సారాంశం ప్లీజ్ ఇంకొక్కసారి ట్విన్స్ ట్రై చెయ్యండి. హాట్ ట్రిక్ అవుతుంది అని.
ఇక ఇద్దరు పిల్లలు బామ్మ దగ్గర, మరో ఇద్దరు అమ్మమ్మ దగ్గర పెర్మనెంట్ అయ్యారు. వీక్ ఎండ్స్ లో విజిత, వినీల్ వాళ్ళని కలుస్తుంటారు.
అలా ఫస్ట్ క్రష్ తో మొదలైన విజిత జీవితం, వినీల్ సాహచర్యంలో సుఖంగా సాగిపోయింది.
శుభం

