Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 29


    ఎండ నెత్తి మాడుస్తూ వుంది.


    తల నాదుగా వుంది.


    మనసు చేదు చేదుగా వుంది.


    కడుపులో ఆకలి మంటగా వుంది.


    ఎదురుగా కన్పించిన హోటల్లోకి వెళ్ళాడు శరత్.


    టిఫెన్ చేస్తూ వుంటే రాజేశ్వరి జ్ఞాపకం వచ్చింది. మనసు ఎలాగో అయింది.   


    రాజేశ్వరి తనకోసం ఎంతకాలమైనా ఎదురుచూస్తూ వుంటుందా?


    శరత్ తన మనసును తడిమి చూసుకున్నాడు. అక్కడ ఆమె తనకోసం ఎదురు చూడాలనే కోరిక లీలగా తోచింది.


    తన కోరిక న్యాయమైంది కాదు. కాని రాజేశ్వరి మరొకరి భార్యగా ఊహించడానికే తనకు ఎంతో బాధగా వుంది.


    రాజేశ్వరి కొంతకాలం తన కొరకు చూస్తుంది. రాజేశ్వరి ప్రేమించగలదు. కాని ఆ ప్రేమ కోసం అర్థంలేని త్యాగం చేసే సెంటిమెంటల్ ఫూల్ కాదు. ప్రాక్టికల్ గా ఆలోచించగలదు. తను అలా కాదు. తనకు సెంటిమెంట్సు ఎక్కువ. రాజేశ్వరి ఎన్నోసార్లు ఆ మాటే అన్నది.     


    సాయంత్రం ఒకసారి రాజేశ్వరి దగ్గరకు వెళితే?


    వెంటనే వారిద్దరి మధ్యా జరగబోయే సంభాషణ ఊహించుకొని ఆ ఆలోచనను వెనక్కు నెట్టేశాడు.


    ఒక్కక్షణం శరత్ కు తనకెవరూ లేనట్టు అనిపించింది.


    తనకు తను వినీలాకాశంలో దూరంగా మినుకు మినుకుమనే ఒంటరి నక్షత్రంలా కన్పించాడు.


    తనలో నుంచి ఎవరో విడిపోయి దూరంగా నిల్చుని తననే పరీక్షగా చూస్తున్నట్టూ, జాలిపడుతున్నట్టూ అనిపించింది.     


    శరత్ ఉలిక్కిపడ్డాడు.


    ఏమిటిది? తనను చూసి తను జాలి పడుతున్నాడా? సెల్ఫ్ సెన్స్ లేదు. లేదు. తనను చూసుకుని తను జాలిపడడు. పడకూడదు.  తనకు అందరూ వున్నారు. కనకపోయినా కన్నబిడ్డలా ప్రేమించి పెంచే తల్లి వుంది. కన్న తండ్రిలా కాకపోయినా పెంచిన తండ్రిలా తన క్షేమం కోరే తండ్రి వున్నాడు. తనను గౌరవించి ప్రేమించే ప్రియురాలు వుంది. తనకేం తక్కువని తనమీద తనకే జాలి కలుగుతోంది?


    కాని తన కన్న తల్లి ఎలా వుందో? అడుక్కుంటూ వుంటూ తనను ఎందుకు కనిపారేసింది? ఎక్కడ పారేసింది?  


    ఆపైన ఆలోచించే శక్తిలేని వాడిలా చివుక్కున లేచి నిల్చున్నాడు.


    బిల్లు ఇచ్చి బయటకు వచ్చాడు.


    "బాబూ! ఓ పది పైసలు! బాగా బతికినదాన్ని!" అడ్డం వచ్చింది బిచ్చగత్తె.


    శరత్ ఠక్కున ఆగిపోయాడు. చివ్వున తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు.


    ముఖంలో వృద్ధాప్యం కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది.


    చాపిన చేతిని చూశాడు.


    ఉలిక్కిపడ్డాడు.


    వేళ్ళు సగం సగమే ఉన్నాయి.


    ఈమె కోసమా తను రెండు రోజులుగా వెతుకుతున్నాడు!


    శరత్ కు చిరాకు వేసింది.


    ముందుకు అడుగు వెయ్యబోయి ఆగిపోయాడు. ఆమె అడ్డం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనిపించింది.  


    "నీకు పిల్లలు లేరా?" అన్నాడు.


    "ఉన్నారు బాబూ! ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, మనమలు, మనుమరాండ్రు...."


    "మరి ఈ గతి ఎందుకు పట్టింది?"


    ఆయన పోయాక నా దశ పోయింది బాబూ! చివరికి ఈ రోగం ఒకటి. ఈ జబ్బు మా నాన్నకు వుండేది. నాకూ వచ్చింది. ఇంట్లో అందరూ అసహ్యించుకోసాగారు. కోడళ్ళు తరిమేశారు. కొడుకులు ముఖం కూడా చూపించలేదు. అయినా ప్రాణం మీద వ్యామోహం తగ్గలేదు. నిలువునా ప్రాణాలు తీసుకోలేకపోయాను" అన్నది ఆమె.   


    శరత్ గుండెల మీది బరువును ఎవరో దింపేసినట్టు తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు.


    జేబులో నుండి ఐదు రూపాయలనోటు తీసి ఆమె చేతిలో పెట్టి వడివడిగా వెళ్ళిపోయాడు.


    ఈమెను తన తల్లిగా భావించి రెండు రోజులుగా ఎంత బాధపడ్డాడు?     


    మంచిదే అయింది. ఆమె కనిపించింది. కనిపించకపోతే మనసులో అదో బాధ మిగిలిపోయేది.


    శరత్ కు చిన్నప్పుడు తల్లి చెప్పిన కథ ఒకటి గుర్తువచ్చింది.


    శరత్ రోజూ తల్లి పక్కలో పడుకొని కథ  చెబితే గాని నిద్రపోయేవాడు కాదు.


    ఆ కథ -


    అది ఒక అరణ్యం. రాజు గుర్రం మీద వెళుతున్నాడు. సైనికులు ముందు వెళుతున్నారు.


    మార్గమధ్యంలో ఒక బాటసారి ఎదురైనాడు.


    అతని కాళ్ళకు చెప్పులు లేవు. అతికష్టంమీద నడుస్తున్నాడు. రాజుకు అతన్ని చూస్తే జాలివేసింది.


    తను గుర్రంమీద వున్నాడు. చెప్పులు అవసరంలేదు. పాపం ఆ బాటసారి అరణ్యంలో చెప్పు ల్లేకుండా వెళుతున్నాడు. తన చెప్పులు ఇస్తేసరి!


    అనుకొని రాజు గుర్రాన్ని ఆపి అతన్ని పిలిచి తన చెప్పులు ఇచ్చాడు. బాటసారి సంతోషంగా తీసుకొని నమస్కరించాడు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS