Previous Page Next Page 
ఫస్ట్ క్రష్ పేజి 28

 

కంప్లీట్ చేసి వేరే  వాళ్లకు అప్పచెప్పాలంటే అంత సమయం పడుతుంది అని చెప్పాడు.
అసలు నువ్వు ఒప్పుకోవడమే అదృష్టం నీల్. ఎందుకంటే నీకు సాఫ్ట్వేర్ మీద ఎంత ప్రేమో నాకు తెలుసు. నీకు వీలునుబట్టి   అలానే చెయ్యి అన్నాడు. ఎలానూ ఎంగేజ్మెంట్, పెళ్లి ఇవన్నీ రెండు మూడు నెలలు పడతాయి. ఆలోపు నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చేయొచ్చు అన్నారాయన.
అలాగే మామయ్యా అన్నాడు వినీల్.
నీ నిర్ణయం మంచిదిరా తమ్ముడు అని సమర్ధించాడు వీర్రాజు.
నా పనులు వేరే వాళ్లకు అప్పగించాలంటే నేను రెండు నెలలు అమెరికా కూడా వెళ్లాల్సి వస్తుంది అన్నాడు వినీల్.
ఎలాగూ మ్యారేజ్ తరువాత నువ్వూ విజిత ఇద్దరూ అమెరికా వెళ్ళండి.  విజిత కజిన్స్ అందరూ అక్కడే ఉన్నారు. మా అన్నయ్య కూతుళ్లు అల్లుళ్ళు కూడా అక్కడే ఉన్నారు. మీ పెళ్ళికి రాలేకపోయినవాళ్ళని మీరు అక్కడ కలవవొచ్చు.   నీ పనులు ముగుంచుకుని, అందరినీ చూసుకుని రావొచ్చు అన్నారు వెంకటరాజు.
మంచి ఐడియా మామయ్యా అన్నాడు నీల్. కళ్ళతోనే అడిగాడు విజితని ఏమంటావు నువ్వు అని. ఓకే అంది తను. వారి కళ్ళ మాటలు అందరూ గమనించారు.
సిద్ధాంతి గారిని రేపు పిలిపించమంటారా ముహుర్తాలు చూసేందుకు అని అడిగారు రాజుగారు సుధాకర్ ని.
పిలిపించండి బావగారు అన్నారు ఆయన కూడా వరసలు కలుపుతూ.
శుభం రా. ఇప్పుడే సిద్ధాంతికి ఫోన్ చేసి రేపు రమ్మని చెప్పు అన్నారు  వీర్రాజు. 


****


వెంకటరాజు గారు ఏ విషయం పట్టుకున్నా వదిలిపెట్టరు.
అనుకున్నట్లే పక్క రోజు కారు పంపించి సిద్ధాంతి గారిని పిలిపించారు.
వినీల్ ఆఫీస్ పని ఉండటంతో పొద్దున్నే వెళ్ళిపోయాడు.
విజిత పేరెంట్స్, వినీల్ పేరెంట్స్, వీర్రాజు, శ్యామల సమక్షంలో వినీల్ విజితల జాతకాలు పరికించిన తరువాత సిద్ధాంతి గారు ఇంకో రెండు వారాల్లో నిశ్చితార్ధానికి మంచి ముహూర్తం ఉందని, అలాగే వచ్చే నెల రెండవ వారంలో పెళ్లి ముహూర్తం చాలా బాగుందని చెప్పాడు. ఆ ముహూర్తాలు అందరికీ నచ్చాయి.
రాజు గారు పెళ్లి భీమవరంలోనూ, రిసెప్షన్ హైదరాబాద్ లోనూ పెట్టుకుందామని అందుకు సమ్మతమేనా అని సుధాకర్ దంపతులను అడిగారు. వారు సరే అన్నారు.
పెళ్లి సంగతులు మెస్సేజ్ పెట్టింది విజిత.
వినీల్ నుంచి రిప్లై వచ్చింది ఓహ్ గుడ్ గుడ్ అంటూ.
లంచ్ తీసుకొచ్చేదా మీకు అని మళ్ళీ మెస్సేజ్ పెట్టింది.
ఊహూ వద్దు. ఇక్కడే తింటాను.
నీకు టైం ఉంటె ఆఫీస్ కి రా సాయంత్రం. అలా కారులో ఒక రైడ్ వెళ్లి కాఫీ తాగి వద్దాం అన్నాడు వినీల్.
ఓహ్ సరే అంటూ సంతోషంగా మెస్సేజ్ పెట్టింది విజిత.
ఆ సాయంత్రం ఇద్దరూ తాము మొదట కలిసిన నెక్లెస్ రోడ్ లోని ఈట్ స్ట్రీట్ హోటల్ కి వెళ్లారు.
ఆ రోజు తాము కలిసిన టేబుల్ ఖాళీగానే ఉంది.
అక్కడ కూర్చుని రెండు ఐస్ క్రీం లు తెప్పించుకుని పాత స్మృతులు నెమరువేసుకున్నారు.
ఆ రోజు విజిత ఎలా ఏడుపు అభినయం చేసింది ఇమిటేట్ చేసి చూపించాడు వినీల్ నవ్వుతూ. ఇవాళ ఇక ఏడ్చే పని లేదుగా అని విజితని ఏడిపించాడు.
ఇంక అవసరంలేదులెండి బుజ్జి గారు అంది.
పెళ్లి ముహూర్తాలు ఫిక్స్  అయ్యేప్పటికీ ఇద్దరికీ హుషారుగా ఉంది.
విజిత మనసు గాల్లో తేలుతోంది. వినీల్ పరిస్థితి కూడా ఇంచుమించు అంతే.
చాలా థాంక్స్ విజిత అన్నాడు వినీల్ ఆమె చేతులు పట్టుకుని.
ఎందుకు అంది అర్ధంకాక. 
నన్ను నీ భర్తగా ఎన్నుకున్నందుకు.
బాగుంది బుజ్జీ. ఆ మాట నేననాలి. ఇన్నాళ్ల నా నిరీక్షణకు మీ అంగీకారంతో తెరపడింది. జీవితంలో నాకంటే నేను ఎక్కువగా ప్రేమించేది మిమ్మల్నే అంది విజిత.
అబ్బా నీది మరీ చాదస్తం రా విజ్జీ. నీలాంటి అమ్మాయి నా జీవిత భాగస్వామి గా దొరకడం నిజం గా నా అదృష్టం రా అన్నాడు వినీల్. 
ఇక పొగడ్తలు ఆపండి బుజ్జి గారు. మీరు మీ జాబ్ కి రాజీనామా చేసి మా డాడీ కి తోడుగా ఉంటానంటే ఆయన మొహం వెలిగిపోయింది. చాలా రిలాక్స్డ్ గా ఉన్నారు.
రాత్రి కూడా అమ్మతో అంటున్నాడు మనం చాలా అదృష్టవంతులం వినీల్ లాంటి అల్లుడు దొరకడం అని.
సో మీకు లెర్నింగ్ లైసెన్స్ నుంచి త్వరలోనే పెర్మనెంట్ లైసెన్స్ రాబోతోంది అంది విజిత నవ్వుతూ. 
అవును. ఇంతలో ఎంత మార్పు. అంతా చక చక జరిగిపోతోంది అని ఆశ్చర్యపోయాడు వినీల్. నేను మా కంపెనీ కి ఇవాళే మెయిల్ పంపాను విజ్జీ నా రాజీనామా గురించి. పెళ్ళైన తరువాత ఓ రెండు నెలలు అమెరికా వెళదాం. అక్కడ నా వర్క్ కంప్లీట్ చేసుకుంటే నేను రిలీవ్ అయిపోవచ్చు అన్నాడు.
మన హనీమూన్ అమెరికాలో అన్నమాట అంది.
యస్. ఎంచక్కా ఎంజాయ్ చెయ్యొచ్చు అన్నాడు.   
మరి నాకు ఎర్లీ గా పిల్లలు కావాలి నీల్ అంది.
అలాగే. పెళ్లయినతరువాత ఎలాగూ లైసెన్స్ వస్తుంది కదా. నువ్వు ఎప్పుడంటే అప్పుడే అన్నాడు.
చాలా చాలా థాంక్స్ అంది విజిత ఆ మాటలకు పొంగిపోతూ. 


****


రెండు వారాల తరువాత హైదరాబాద్ లోని ఓ పెద్ద హోటల్ లో విజిత, వినీల్ నిశ్చితార్ధం ఫంక్షన్ జరిగింది. 
ఫంక్షన్ కి వినీల్ అన్నయ్య శేఖర్, వదిన జసంత, పిల్లలు ఆనంది, ఆషా వచ్చారు. శేఖర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో చీఫ్ గా ఉన్నాడు. జసంత కంటి డాక్టర్. ఆనంది ఐదవ తరగతి, ఆషా మూడవ తరగతి చదువుతున్నారు. 
వినీల్ తన అన్నయ్యని, వదిన, పిల్లలను విజితకి పరిచయం చేసాడు.
జసంత, విజిత బాగా కలిసిపోయారు.
మెడిసిన్ గురించి కబుర్లు మొదలు పెట్టారు.
విజిత పిల్లల్ని బాగా ముద్దు చేసింది.
ఇద్దరు ఆడపిల్లలు చక్కగా గలగలా మాట్లాడుతున్నారు.
అత్తయ్య చాలా ప్రేమ చూపిస్తుంది విజ్జీ. ఆవిడ ప్రేమను భరించడం చాలా కష్టం. మన అమ్మ కూడా ఆమె ముందు తక్కువే అనిపిస్తుంది. చాలా మంచి వ్యక్తి ఆమె. మన చేత ఒక్క పని చేయనివ్వదు. అంతా తనే చేస్తానంటుంది. ఎంతో బ్రతిమాలితే ఒక చిన్న పని అప్పచెప్తుంది. ఇక మామయ్య గారు చాలా ఆప్యాయంగా కన్న కూతురిలా చూసుకుంటారు. నువ్వు ఈ ఇంటికి కోడలు కావడం నిజంగా నీ అదృష్టం అంది జసంత. 
ఇంతలో సుధ అక్కడికి వచ్చింది. ఏరా జెస్సి ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించింది.
జసంత ఆమెకు వంగి పాద నమస్కారం చేసింది. 
ఇదిగో ఇవే వద్దన్నానా అంటూ మందలించింది సుధ కోడలిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ.
పిల్లలు బామ్మా అంటూ ఆవిడని కౌగలించుకున్నారు.
నా బంగారు తల్లులు అంటూ ఆవిడ ఇద్దరు పిల్లల్ని తెగ ముద్దు చేసింది. 
వెంకటరాజు గారి బిజినెస్ సర్కిల్ చాలా పెద్దది. చాలా మంది వచ్చారు ఎంగేజిమెంట్ ఫంక్షన్ కి.
విజిత, వినీల్ ఫ్రెండ్స్, వినీల్ ఆఫీస్ వాళ్ళు అందరూ మిస్ కాకుండా అటెండ్ అయ్యారు.
మీనూ అంతా తానై బాస్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ సజావుగా జరిగేట్లు చూసింది. విజిత మేక్ అప్ కూడా తనే స్పెషల్ గా చేయించింది.


***


ఓ నెల తరువాత అనుకున్న ముహూర్తానికి విజిత, వినీల్ ల పెళ్లి  వైభవంగా భీమవరం లో జరిగింది.
రాజుగారు ఏమాత్రం వెనుకాడకుండా పెళ్లి ఘనంగా చేశారు.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS