సుశీలమ్మ కళ్ళలో భయం పారాడింది.
"అనాధ బిడ్డ అని చిన్నప్పుడే తెలిస్తే మన దగ్గిరవాడు అలా అరమరిక లేకుండా చనువుగా పెరిగేవాడా?" పుట్టెడు దిగులు సుశీలమ్మ కంఠంలో పలికింది.
"అది మనం పెంచేదాన్ని బట్టి వుంటుంది. అటువంటి బేధాలు మనలో లేనట్టు తెలుసుకొనేలా పెంచాలి."
"చాలామంది అలాగే పెంచుతారు గదండీ."
"ఏనాడో ఒకనాడు ఆ విషయం తెలియకపోదు. మనం పట్నంలో వుంటున్నాం గనక యింత కాలమయినా ఈ రహస్యాన్ని దాచగలిగాం.
సుశీలమ్మ వింటూ కూర్చుంది.
"ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పడ్డాక ఆ రహస్యం తెలిస్తే లోతుగా గాయపడతారు. అనేక ఆలోచనలు వస్తాయి. చిన్నప్పుడే తెలిస్తే అంతగా తలక్రిందులై పోరు" అన్నాడు.
"వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడేమో!" అనలేక అంటున్న ఆమె గొంతులో ఏదో అడ్డుపడినట్టు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది.
రామనాథానికి కూడా ఆ భయం లేకపోలేదు.
ఆ భయాన్ని దాచుకుంటూ వెళ్ళడు. ఎలా వెళతాడు? ఎక్కడికి వెళతాడు? అసలు ఎందుకు వెళ్ళాలి? వాడికి మనమేం తక్కువ చేశామని వెళ్తాడు?" అన్నాడు.
సుశీలమ్మకు ఎక్కడికో లోతు తెలియని అగాధంలోకి పడుతున్న వ్యక్తికి జారుడుమెట్లు చేతికి అందినట్టు అనిపించింది.
"వాడు వెళ్ళిపోడంటారా?" చేతికందిన జారుడుమెట్టును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు అన్నది.
"పిచ్చిదానా! వాడెక్కడి కెల్తాడే? వాడు ఎప్పటికీ సుశీలమ్మ కొడుకే.
"నేను సుశీలమ్మ కొడుకునే!" అన్న శరత్ బాబు మాటల్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు రామనాథం.
అగాధంలోకి పడిపోతున్న సుశీలమ్మ చేతికి మెట్టు ఒడుపుగా దొరికినట్టు అనిపించింది.
"నిజంగానా? వాడు వెళ్ళిపోతే నేను బతకనండీ" కంఠం రుద్దమయింది.
"ఛ! ఏం మాటలవి? నా వల్లనే ఈ అనర్థం ఏర్పడింది. నువ్వు వాడికి తల్లివి కాగలిగావు కాని నేను తండ్రిని కాలేకపోయాను" గద్గద కంఠంతో అన్నాడు రామనాథం.
"అలా అనకండి. మీకూ వాడి మీద ప్రేమ వుంది. అది నాకు తెలుసు. నిజం చెప్పండి. వాడు ఏం చేస్తాడోనని మీకు మాత్రం భయంగా లేదూ!"
రామనాథం కళ్ళలో నీరు తిరిగింది.
"నాకు తెలుసు. వాడంటే మీకూ ఇష్టమే. మీరూ బాధపడుతూనే వున్నారు."
"వాడు ఎక్కడికెళ్ళడూ?" మాట మార్చే ఉద్దేశంతో అన్నాడు రామనాథం.
"ఏమో తెలియదు. పిచ్చి సన్నాసి! వాడూ నా గురించి బాధపడుతున్నాడండీ పొద్దున్నే కలవరిస్తున్నాడు. "అమ్మా!" అంటూ పిచ్చికేక వేశాడు. నామీద ఏదో పీడకల వచ్చిందట!"
"నేను చెప్పలా? వాడు నిన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళడు."
"ఆ మాటే వాడూ అన్నాడండీ?"
"ఎప్పుడూ?"
"నిన్న సాయంకాలమే. నేను బాధపడుతుంటేనూ...."
"నువ్వు వాడి ముందు బాధపడకు. గుచ్చి గుచ్చి ఏమీ అడగకు ఎప్పటిలాగే ఉండు. రెండురోజుల్లో వాడు మళ్ళీ అన్నీ మర్చిపోతాడు.
అన్నాడే కాని శరత్ ఈ విషయాన్ని అంత త్వరగా మర్చిపోడు. రామనాథానికి అంతరాంతరాల్లో ఎక్కడో భయంగానే వుంది. అంత త్వరగా మర్చిపోవడానికి పసివాడు కాడని తెలుసు. అయినా భార్యకు ధైర్యం చెప్పడానికి అన్నాడు.
"నాకు ఆఫీసు టైం అయింది."
"టిఫెన్ చెయ్యండి" అంటూ టిఫెన్ ప్లేట్లో పెట్టింది.
"నువ్వు కూడా తిను."
"నేను తర్వాత తింటాను."
రామనాథం టిఫెన్ చేస్తూ వుంటే సుశీలమ్మ శరత్ చిన్ననాటి విషయాలు చెప్పసాగింది.
రామనాథం శ్రద్ధగా వింటూ టిఫెన్ చేస్తున్నాడు.
రామనాథం భార్యకు దిగులుగా కనిపించవద్దని మరోసారి హెచ్చరించి ఆఫీసుకు వెళ్ళిపోయాడు.
సుశీలమ్మ కూర్చున్న చోటునే దిగాలుపడి కూర్చుండిపోయింది.
భర్త వెళ్ళిపోగానే మళ్ళీ పుట్టెడు దిగులు ఆమె మనసును కుదిపింది.
9
శరత్ పిచ్చెక్కినట్లు ఊరంతా ఎక్కడెక్కడో తిరిగి అప్రయత్నంగానే అనేక బస్ స్టాపుల్లో నిన్నటి బిచ్చగత్తె కోసం చూచాడు.
ఆమె ఎక్కడా కన్పించలేదు.
తన పిచ్చికి తనే నవ్వుకున్నాడు.
