Previous Page Next Page 
ఫస్ట్ క్రష్ పేజి 26

 

మిమ్మల్ని విజితకు తెలిసిన కంటి డాక్టరు వద్దకు తీసుకెళతాను నాన్నా. తనూ వస్తుంది. టిఫిన్ చేసి వెళదాం అన్నాడు.
విజిత అయన్ని అడిగింది ఎంతుంది కంటి ప్రెషర్ అని.
ఆయన తన జేబులోంచి డాక్టర్ చెక్ చేసి రాసిన రిపోర్ట్ చూపించాడు.
అది ఒకమారు చూసింది విజిత.
కంగారు పడాల్సిందేమి లేదు అంకుల్. కొంచెం ఎక్కువ ఉంది. డ్రాప్స్ వాడితే తగ్గుతుంది.
ఒకమారు చెక్ చేసి డ్రాప్స్ రాసిస్తారు అంది.
థాంక్స్ అమ్మా అన్నాడు ఆయన.
ఒరే బుజ్జీ నువ్వు జాతకం పంపిన అమ్మాయి హైదరాబాద్ లోనే ఉందా అని అడిగాడు సుధాకర్ కొడుకుని.
ఆ అమ్మాయి ఈ అమ్మాయే నాన్నగారు అని విజిత వైపు చూపాడు.
సుధాకర్ కు గుండెలో రాయి పడ్డట్లయ్యింది. 
వినీల్ అమ్మ సుధ మాత్రం చక్కగా ఉందిరా అమ్మాయి అంది మురిసిపోతూ విజిత సిగ్గుని కూడా పట్టించుకోకుండా.
ఆంటీ మీకు టిఫిన్ ప్లేట్స్ లో పెట్టేదా అని అడిగింది విజిత.
నీకెందుకమ్మా శ్రమ. నేను పెడతానుండు అని లేచింది ఆవిడ.
ఫరవాలేదు మీరు కూర్చోండి అని ముగ్గురికి ప్లేట్స్ పెట్టి ఘుమ ఘుమ లాడే ఉప్మా, వడ వడ్డించింది. అందులోకి రెండు రకాల చెట్నీలు కూడానూ. 
అబ్బా ఎంత రుచి అంటూ సుధ మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. నువ్వు కూడా కూర్చోరా అమ్మలూ మాతో కలిసి తిందువు కానీ అని బ్రతిమాలింది. 
మీరు తినండి ఆంటీ. మీదైన తరువాత నేను తింటాను అంది.
హే నీ చాదస్తం. రా ఇలా నా ప్రక్కన కూర్చో అంటూ వదిలిపెట్టలేదు వినీల్ అమ్మ.
ఆమె చాలా సీదా సాదాగా ఆప్యాయంగా ఉంది.
వినీల్ చెప్పినదాన్నిబట్టి ఆవిడ పెళ్లయినతరువాత డబల్ ఎం ఏ చేసింది ఓపికగా.
వినీల్ వాళ్ళింట్లో అందరూ చాలా అందంగా ఉంటారు అనుకుంది విజిత. 
విజిత కు తనే వడ్డించింది సుధ. అందరి ప్లేట్స్ కూడా తనే తీసి వంటింట్లో సింక్ లో వేసింది ఆవిడ.
అయ్యో ఆంటీ నేను చేస్తాను కదా. మీరెందుకు అంది నొచ్చుకుంటూ విజిత.  
ఫరవాలేదులేమ్మా. ఎవరు చేస్తే ఏంటి అంది.
టిఫిన్ చాలా బాగుంది అని మెచ్చుకున్నారు సుధాకర్ కూడా. ఆయనకి లోపల కంగారు అలానే ఉంది. అది వెంకటరాజు గారిని చూస్తే ఎలా ఉంటుందో అని భయంగా ఉంది. 
నేను వెళ్లి రెడీ అవుతాను. ఓ అరగంటలో బయలుదేరదాం అంది విజిత వినీల్ తో. 
ఓకే అన్నాడు.
ఆంటీ మీకు భోజనాలు మా ఇంట్లోనే అంది విజిత.
అయ్యో ఎందుకురా మీకు శ్రమ. నేను ఏదో ఒకటి చేస్తాను ఇక్కడ అంది సుధ.
ప్లీజ్ ఆంటీ అంది విజిత.
సరేలేమ్మా ఇవాళ్టికి వెళదాం. రేపు  మనం ఇక్కడ వండుకోవచ్చు అన్నాడు వినీల్ సుధతో.
సరేనమ్మా నీ ఇష్టం అంది సుధ. ఆవిడకి కొడుకుకి ఏదో ఒకటి చేసిపెట్టాలని తహతహలాడుతోంది. 
విజిత వెళ్ళగానే సుధ అడిగింది వాళ్ళు  రాజులు కదరా. అందులోనూ కోటీశ్వరులు. ఈ అమ్మాయి నీకు ఎక్కడ తారసపడింది అంది సుధ. సుధాకర్ కి కూడా అదే అంతుబట్టలేదు.
వినీల్ కథ మొత్తం చెప్పాడు. అఫ్ కోర్స్ తమ  హోటల్   రూమ్ ఎపిసోడ్ తప్ప.
అంతా విని ఇద్దరూ నిర్ఘాంతపోయారు ఇంత జరిగిందా అంటూ.
వినీల్ ఇద్దరినీ ఉద్దేశించి అడిగాడు ఈ అమ్మాయి మీకు ఓకే నా అని.
నీకు నచ్చిన అమ్మాయి మాకు డబల్ ఓకే రా అన్నారు ఇద్దరూ ముక్తకంఠంతో.
నీ ఇష్టమే మా ఇష్టం. మీరు ఇద్దరూ కలసి బ్రతకవలసిన వాళ్ళు. మీరు ఒకరినొకరు అర్ధం చేసుకుంటే అదే పదివేలు. అమ్మాయి చాలా నచ్చింది నాకు. నీకు తగిన జోడీ. మరి వెంకటరాజుగారు మీ పెళ్ళికి ఒప్పుకుంటారా అంది సుధ. 
ఎలాగూ మీరు వచ్చారు కాదమ్మా. మధ్యాన్నం భోజనాలకు వెళ్ళినప్పుడు ఆ విషయం కూడా చర్చకి వస్తుంది. దాన్ని బట్టి చూద్దాం అన్నాడు వినీల్.
సరేరా నీ ఇష్టం. మీ అన్నయ్య అక్కయ్య కి మంచి సంబంధాలు దొరికాయి. వాళ్లిద్దరూ పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారు. నీవూ ఒక ఇంటివాడవైతే మాకు అంతకంటే సంతోషమేముంటుంది చెప్పు అన్నాడు సుధాకర్.
విజిత నుంచి మెసేజ్ వచ్చింది నేను రెడీ అంటూ . మీరు రెడీ అయితే కిందకు రండి వెళదాం అని.
ముగ్గురూ కిందకు దిగారు. విజిత కూడా వినీల్ కారులోనే ఎక్కింది. సుధాకర్ ముందు సీట్లో కూర్చున్నాడు. వెనుక సుధ, విజిత కూర్చున్నారు. విజిత చీర కట్టు, జడ, ఆడంబరం లేని తన అందం సుధ తెగ మెచ్చుకుంది. ఆమె మాటలకు విజిత తెగ సిగ్గుపడింది. రియర్ వ్యూ మిర్రర్ లోంచి వినీల్ మధ్య మధ్యలో విజితనే గమనిస్తున్నాడు. విజిత కూడా చూస్తోంది. ఇద్దరి చూపులు మూగగా మాట్లాడుకుంటున్నాయి. 
అరగంట ప్రయాణంలో సుధ బోలెడు కబుర్లు చెప్పింది విజిత కి. వినీల్ గురించి ఎన్నో తమాషా విషయాలు చెప్పింది అతను వారిస్తున్నా. విజిత నవ్వు ఆపుకోలేకపోయింది ఆవిడ మాటలకు. వాళ్ళిద్దరికీ బాగా కుదిరింది అనుకున్నాడు వినీల్.
హాస్పిటల్ లో తెలిసిన డాక్టర్ దగ్గరికి సుధాకర్ ని డైరెక్ట్ గా తనే తీసుకెళ్లింది విజిత. 
వాళ్లిద్దరూ లోపలికెళ్ళిన తరువాత సుధ కొడుకుతో అంది. చాలా మంచి అమ్మాయిరా. ఒద్దికగా ఉంది. ఆ ఏడుకొండల వాడి దయవల్ల ఈ అమ్మాయి నీకు పెళ్లామైతే నువ్వు నిజంగా అదృష్టవంతుడివి రా బుజ్జీ అంది.
కానీ ఈ ఐశ్వర్యం అవి నాకు పడవు కదమ్మా. కాకుంటే ఇప్పటికే నేను వీళ్ళ కుటుంబంతో చాలా దూరం ప్రయాణం చేసాను. ఇప్పుడు కాదంటే ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. అది ఊహించలేని విషయం. నిజానికి విజితలో తప్పుబట్టే ఒక్క ఆవగింజంత లోపం కూడా లేదు. నాకున్న భయమల్లా వారి సిరిసంపదలు అన్నాడు వినీల్.
వాళ్ళతో మాట్లాడిన తరువాత ఆలోచిద్దాములేరా. నువ్వేమీ దిగులు పడకు. అమ్మాయిని మటుకు చేజార్చుకోకు. ఈ కాలంలో ఇలాంటి అమ్మాయి దొరకడమంటే అది ఊహించని అదృష్టమే. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ నీకు ఇలాంటి అమ్మాయి దొరకదు. పెళ్ళికి ముందు కలిసి ఉండటాలు, పెళ్ళైన మూడు నాళ్ళకే విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో నీ కోసం తొమ్మిదో తరగతి నుంచి కాపు కాస్తూ నువ్వే సర్వస్వము అనుకుంది పిచ్చి పిల్ల. నా దిష్టే తగులుతోంది ఆ అమ్మాయికి. ఇంటికెళ్ళగానే గుర్తు చెయ్యి. దిష్టి తియ్యాలి విజితకి అంది సుధ.
అమ్మ మాటలకు నవ్వుకున్నాడు వినీల్. విజితపై బాగానే ప్రేమానురాగాలు కలిగాయి తల్లితండ్రులిద్దరికి. ఇదీ ఒకందుకు మంచిదేలే అనుకున్నాడు.


****


సుధాకర్ కి కంటిలో డ్రాప్స్ వెయ్యడం వలన కొంచెం బ్లర్  గా ఉంది.
ఆయన చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చింది విజిత.
డాక్టర్ చెక్ చేశారు. కంటిలో కొంచెం ప్రెషర్ పెరిగింది. ఇబ్బందేమీ లేదు. డ్రాప్స్ రాసిచ్చారు. ఓ రెండు నెలలు వాడితే కంట్రోల్ అవుతుందని చెప్పారు అంది విజిత.
ఓహ్ గుడ్ అన్నాడు వినీల్.
థాంక్స్ విజిత అంది సుధ.
అయ్యో ఆంటీ థాంక్స్ ఎందుకు అంది విజిత.
విజిత సుధాకర్ చెయ్యి పట్టుకుని కారు వరకు తీసుకు వచ్చింది. ఆయన్ని మెల్లగా ఎక్కించి డోర్ క్లోజ్ చేసింది. 
వెనుక సుధ తో కూర్చుంది.
టైం ఒంటి గంట అవుతోంది.
ఇంట్లో కారు పార్క్ చేసిన తరువాత వినీల్ తో అంది విజిత మా ఇంటికి వెళదాం ప్లీజ్ అని. 
అమ్మ నాన్నలకు చెప్పాడు.
సరే అని అందరూ పక్కింటి గేట్ తీశారు.
విజిత ముందే మాధవి కి ఫోన్ చెయ్యడంతో ఆవిడ గుమ్మం దగ్గరే వీళ్ళ కోసం వెయిట్ చేస్తోంది.
వీళ్ళు రాగానే ఆప్యాయంగా రండి అంటూ లోపలికి తీసుకెళ్లింది. సుధాకర్ ని గుర్తుపట్టిన మాధవి బాగున్నారా అన్నయ్య గారు అంటూ పలకరించింది.
బాగున్నానమ్మా అని బదులిచ్చాడు సుధాకర్.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS