లంచ్ లో అన్ని ఐటమ్స్ బాగున్నాయి అన్నాడు లడ్డు తింటూ.
సగం కొరికిన అతని చేతిలోని లడ్డు తీసుకుని థాంక్స్ అంటూ తింది విజిత.
అబ్బా నీకిదేం అలవాటు. ఎప్పుడూ నా ఎంగిలి తింటావు అన్నాడు.
అది ఎంగిలి కాదు రా బుజ్జి. నీ ప్రేమను నాలో అలా పంచుకుంటాను. మరి ఆ రోజు తమరు అంత ఎంగిలి చేశారు. దానికేంటి సమాధానం అంది నవ్వుతూ.
అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆ హోటల్ విషయానికే వస్తోంది ఈ పిల్ల. అబ్బా అనుకున్నాడు. ఈ సస్పెన్స్ ఎప్పుడు తీరుతుందో. అనుకున్నట్లు అదేమీ జరగకుంటే తన పరువు కాపాడినట్లు అవుతుంది.
ఏంటి ఆలోచన. మీ అక్క మాదిరి ట్విన్స్ ఏమో చెప్పలేం అంది ఆటపట్టిస్తూ.
ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది అన్నాడు భయంగా.
ఓ వారం ఆగు. అంత తొందరెందుకు అంది అతని గాభరా చూసి.
నువ్వే ఆలోచించు విజ్జీ. ఇది మన ఇరు కుటుంబాలకు ఇబ్బంది కలిగించే విషయం కదా. అందుకే ఇన్ని మార్లు దాని గురించి అడుగుతున్నా అన్నాడు.
బంగారు బుజ్జీ ! అలాంటివేమీ జరగవులెండి. ఆరోజు నేను సేఫ్ గానే ఉన్నాను. మీరేమీ అంత కంగారు పడొద్దు. నేనూ డాక్టర్ నే కదా. అలా ఉంటె మిమ్మల్ని దగ్గరకు కూడా రానిచ్చేదాన్ని కాదు. మీరంటే నాకు ఇష్టం కాబట్టి, మీతోనే నా పెళ్లి అనుకున్నాను కాబట్టి నేను కూడా అంత రిస్క్ తీసుకున్నాను. అలా అయినా మీరు మన పెళ్ళికి కమిట్ అయ్యి ఒప్పుకుంటారని. అందులో మీ తప్పు కొంత ఉన్నా నా తప్పు కూడా చాలా ఉంది. చెప్పానుగా నా ఫస్ట్ క్రష్ ని నేను వదులుకోలేను. మిమ్మల్నే నా జీవిత భాగస్వామిగా ఊహించుకున్నాను అంది విజిత ఎమోషనల్ గా.
అమ్మ దొంగా ! చాలా తెలివైనదానివి నువ్వు. నన్ను బాగా ఆటపట్టించావు. పోనీలే. ఇప్పటికైనా నాకు ధైర్యాన్నిచ్చావు. ఇన్నిరోజులు ఏం జరుగుతుందో అని హడలిపోయాను అన్నాడు వినీల్.
అది ఫైవ్ స్టార్ హోటల్ అవడంతో జనరల్ మేనేజర్ పర్సనల్ గా చెక్ చేస్తున్నాడు సర్వీస్ బాగుందా లేదా అని.
విజిత టేబుల్ దగ్గరకొచ్చి ఆగాడు.
మేడం ! మీరేంటి సర్ప్రైజ్. మమ్మీ డాడీ రాలేదా అని అడిగాడు.
లేదండి. నేను నా ఫ్రెండ్ వచ్చాము అంది వినీల్ ని చూపిస్తూ.
నమస్తే సర్ అని వినీల్ ని గ్రీట్ చేసాడు అతను.
మేడం ఇవాళ స్పెషల్ స్వీట్ తెప్పిస్తానుండండి అన్నాడు.
సర్వర్ ని పిలిచి స్వీట్ తెమ్మని చెప్పి ఈ టేబుల్ కి బిల్ వేయొద్దు అని చెప్పాడు.
ఉంటాను మేడం. అందరికీ సరిగా సర్వ్ చేస్తున్నారా లేదా అని చెక్ చేస్తున్నాను అన్నాడు.
మీరు వెళ్ళండి. మేము తినేసి వెళ్తాము అంది థాంక్స్ చెప్తూ.
మరో మారు నమస్తే చెప్పి అతను వెళ్ళాడు.
అతను వెళ్ళాక విజిత అంది ఆ హోటల్ లో వాళ్లకి ఎక్కువ భాగం షేర్స్ ఉన్నాయని.
ఓహ్ గుడ్. మీ డాడీ మంచి బిజినెస్ టైకూన్ అన్నాడు. బాగా బిజినెస్ విస్తరించారు అని మెచ్చుకున్నాడు.
బిజినెస్ డెవలప్ కోసం డాడీ చాలా కష్టపడ్డారు నీల్. కాకుంటే ఆయన వెనుక ఏమి జరుగుతుందో గ్రహించలేకపోయారు. సరియైన టైం లో నువ్వు వచ్చావు ఆపద్బాంధవుడిలా.
అంత పెద్ద మాటలెందుకులే అన్నాడు నవ్వుతూ.
నీ కాటుక కళ్ళు చాలా బాగున్నాయి విజ్జీ అన్నాడు మెచ్చుకోలుగా.
థాంక్స్. ఏంటి సినిమా పాట గుర్తుకొచ్చిందా. అవునూ అబ్బాయిగారు మెల్ల మెల్లగా రొమాంటిక్ మూడ్ లోకి వస్తున్నారు గుడ్ గుడ్ అంది.
అంతా నువ్వే చేసావు అన్నాడు నవ్వుతూ ఇంకో సినిమా డైలాగ్ గుర్తుకొచ్చి.
అవునులెండి మహాశయా అంతా నాదే తప్పు, ఒప్పుకుంటున్నాను సరేనా అంది నవ్వుతూ.
****
రోజులాగే దినచర్యలో భాగంగా ఐదు గంటలకు క్లబ్ కెళ్ళి తన టెన్నిస్ అవి ముగించుకుని రైల్వే స్టేషన్ కు వెళ్ళాడు వినీల్.
ట్రైన్ ఓ గంటపాటు లేట్ అంటూ అనౌన్స్మెంట్. అబ్బా అనుకుంటూ ఓ న్యూస్పేపర్ కొనుక్కున్నాడు.
ఏడు గంటలకు రావాల్సిన రైలు ఎనిమిది గంటలకు వచ్చింది తాపీగా.
ఇంతలో విజిత మెస్సేజ్. స్టేషన్ కి వెళ్ళారా అని.
ఇప్పుడే రైలు వచ్చింది విజ్జి. ట్రైన్ గంట లేట్ అయ్యింది. ఇంకో గంటలో వస్తాను అని రిప్లై ఇచ్చాడు.
కోచ్ నెంబర్ వెతుక్కుని లోపలికి వెళ్ళాడు. అమ్మా నాన్నలను చూడగానే ఒక్కమారు సంతోషం ఉప్పొంగింది.
ఏరా బుజ్జి ఎలా ఉన్నావు అంటూ ఇద్దరూ ఒకేసారి పలకరించారు ఆనందంతో.
హైదరాబాద్ కి వచ్చిన ఈ ఆరునెలల్లో ఒక్కసారి భీమవరం వెళ్ళాడు. అది కూడా నాలుగు నెలలయింది.
నేను బాగానే ఉన్నాను నాన్నా. రండి వెళదాం అని పోర్టర్ కి లగ్గేజ్ అప్పగించి మాట్లాడుతూ స్టేషన్ బయటకొచ్చారు.
నిన్న శశి ఫోన్ చేసిందిరా అంది అమ్మ. నువ్వు కలిశావట కదా దాన్ని అంది.
అవునమ్మా ముంబై పనుంటే వెళ్లాను అన్నాడు తను విజిత గురించి చెప్పిందా అన్న డౌట్ వచ్చింది.
అమ్మ ఇంక ఏం మాట్లాడకపోయిసరికి చెప్పుండదులే అనుకున్నాడు.
పది గంటలకు ఐ హాస్పిటల్ కు వెళదాం నాన్నగారు అన్నాడు.
సరేరా అన్నాడాయన.
కారు పార్క్ చేసి లగ్గేజ్ తీసాడు వినీల్. వీర్రాజు గారు పలకరించారు వినీల్ ని. పేరెంట్స్ ని పరిచయం చేసాడు ఆయనకి.
పక్కింటి వైపు చూస్తే విజ్జీ నవ్వుతూ కనిపించింది. టిఫిన్ తెస్తాను అని సంజ్ఞ చేసింది.
సరే అన్నాడు.
తాళం తీసి లోపలికెలుతుంటే పక్కింటినుంచి ఫ్లాస్క్ లో కాఫీ తెచ్చాడు విజిత వాళ్ళ పని కుర్రాడు.
ఎక్కడినుంచి రా కాఫీ అంది వినీల్ అమ్మ.
పక్కింటివాళ్ళు పంపారమ్మా అన్నాడు. టిఫిన్ కూడా వస్తుంది అని చెప్పాడు.
ఎందుకురా వాళ్లకు శ్రమ. నేను చేస్తానుగా అంది వంటింట్లోకి వెళుతూ. నిన్ననే ఒక వారానికి సరిపడా పచారీలు తెచ్చాడు వినీల్.
అందరి స్నానాలు పూర్తయ్యాయి. నాన్నగారు కాసేపు ధ్యానం చేసుకున్నారు. అందరి కాఫీలు పూర్తయ్యాయి.
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.
తలుపు తీసాడు వినీల్.
ఎదురుగా విజిత. ఒక పెద్ద బుట్ట పట్టుకుని నిల్చుని ఉంది.
లోపలికిరా అన్నాడు.
డైనింగ్ టేబుల్ పై బుట్ట పెట్టింది. అందులోని బాక్స్ లు తీసి బయట పరిచింది.
అక్కడే కూర్చున్న అమ్మా నాన్నకు విజిత ను పరిచయం చేసాడు వినీల్.
ఈ అమ్మాయి మన పక్కింటి అమ్మాయి. పేరు విజిత. డాక్టర్. భీమవరం వాళ్ళు అని చెప్పాడు.
ఇద్దరికీ నమస్కారం చేసింది విజిత.
ఇలారామ్మా అని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంది వినీల్ అమ్మ సుధ.
వినీల్ నాన్నగారు సుధాకర్ విజిత నాన్నగారి పేరు అడిగారు.
వెంకటరాజు గారు అని చెప్పింది.
ఉలిక్కిపడ్డాడు సుధాకర్
ఇంటిపేరు అని అడిగాడు.
చెప్పింది విజిత.
సందేహం లేదు. ఇతను అతనే. గతం ఒక్కసారిగా కళ్ళముందు కదలాడింది సుధాకర్ కి. విజిత అమ్మ మాధవిని వెంకటరాజు ప్రేమించినప్పుడు మాధవి అన్నతో కలిసి ఒక ఐదు మంది పోలీస్ స్టేషన్ కెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. రాజు గారి వాళ్ళ ఇంటిమీదకి కూడా వెళ్లి దుర్భాషలాడారు. ఆ గ్రూప్ లో తనూ ఉన్నాడు. ఇప్పుడు అతను ఎదురైతే ఎలా పలకరిస్తాడో అని కంగారుపడుతున్నాడు ఆయన. పైకి అవేమీ కనిపించనీకుండా మామూలుగానే ఉన్నాడు.

