Previous Page Next Page 
తపస్వి పేజి 26


    డైనింగ్ టేబిల్ నిండా రకరకాల ఆహార పదార్ధాలు! అవన్నీ వామనమూర్తికి చాలా ఇష్టమైనవే! వంటవాడు ప్రత్యేకించి వామనమూర్తి మెప్పు పొందటం కోసం తయారు చేశాడు. ఎంతో ఆశతో ఆ పిండి వంటలు అందుకోబోతున్న వామనమూర్తికి ఏమూల నుండో "నువ్వెందుకొస్తున్నావో నాకు తెలియటం లేదనుకున్నావా! రా! ఇంకెప్పుడూ అలా మాట్లాడకు" అంటున్నట్లు వినిపించింది. గభాలున చేతిలోది ప్లేట్లోకి విసిరేశాడు. నోరంతా చేదయిపోయింది. ఎదురుగా అమృత తుల్యమైన పదార్ధాలు. మనసు నిండా తినాలని ఆశ! నోరు మాత్రం విషమయి కూచుంది. ఏమి చిత్రమైన అవస్థ!
    వంచనతో కూడిన స్నేహాన్నయినా ఆత్మవంచనతో అంగీకరించటానికి సిద్దపడిన భాస్కరరవు పరిదీనమూర్తి అతని సంపదలో అణువణువూ వ్యాపించి వామనమూర్తిని వదలటం లేదు.
    డైనింగ్ టేబిల్ ముందు చేతుల్లో ముఖం ఆన్చుకుని ఆహార పదార్ధాల వంక తీరని కాంక్షతో చూస్తూ ఏ ఒక్కటీ నోట పెట్టుకోని వామనమూర్తిని చూసి లోలోపల ఆశ్చర్యపోవటమే తప్ప భయంతో ఏమీ అడగలేకపోయాడు వంటవాడు.
    కూచుని కూచుని ఎప్పటికో లేచాడు వామనమూర్తి.
    "సార్! అవన్నీ..." భయంగా అడిగాడు వంటవాడు.
    "తీసెయ్యి!"
    "బాగా కుదరలేదా సార్!"
    ఏమని చెప్పగలడు? అసలు రుచి చూడగలిగితేగా!
    "వంట్లో కులాసాగా లేదు!"
    "డాక్టర్ కు చూపించుకోండి సార్!"
    వామనమూర్తి నవ్వాడు.
    "నవ్వకండి సార్! మీరు డాక్టరని నాకు తెలుసు. ఎవరి మందు వాళ్ళకు పనిచెయ్యదు. మా డాక్టర్ కి చూపించుకోండి."
    వామనమూర్తి సమాధానం చెప్పలేదు.
    డాక్టర్...మందులు....ఈ రెండు పేర్లు వినగానే అతని మనసు ఎలాగో అయిపోతుంది.
    పేరు ప్రఖ్యాతులు కూడా ఒక వింత జబ్బులాంటివేమో!
    ఒకసారి వచ్చాయంటే ఒకంతట పోవు! వామనమూర్తి దగ్గరకు వచ్చిన కేసులు ఇది వరకులా నయమవటం లేదు. ఇది వరకులా వామనమూర్తి కాంప్లికేటెడ్ కేసెస్ నయం చెయ్యలేక పోతున్నాడు. కొన్ని కొన్ని సందర్భాలలో అతి మామూలు కేసులు కూడా ఫెయిలవుతున్నాయని గుసగుసలు లేకపోలేదు. అయినా వామనమూర్తి గొప్ప సర్జన్ అని చెప్పుకోవటం మానలేకపోతున్నారు. ఏదో వ్యామోహంలో క్లిష్టమైన కేసులన్నీ అతని దగ్గరకు తీసుకొస్తున్నారు. వామన మూర్తే మరొక డాక్టర్ పేరు సజెస్టు చేసినా వినిపించుకొనేలా లేరు. ప్రవాహంలో పడి కొట్టుకుపోవడం తప్ప మరో మార్గం దొరకటం లేదు వామనమూర్తికి....
    తనకు బాగా లేదు! మందు కావాలి. ఎక్కడ దొరుకుతుంది తనకు కావలసిన మందు? రెండు చోట్ల. ఒకటి విక్రం దగ్గర, రెండు సుధ దగ్గర. మొదటిది తను అందుకోలేడు. రెండవది తను అందుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించినా అందుతుంది.
    వెంటనే సుధ దగ్గరకు బయలుదేరాడు.
    వామనమూర్తిని చూసి సుధ చాలా ఆశ్చర్యపోయింది.
    "అదేమిటి వామన్! అలా ఉన్నావేం? జబ్బు పడ్డావా?" ఆందోళనగా అడిగింది. అప్పటికి సుధ వామనమూర్తిని చూసి దగ్గర దగ్గర నెలరోజులు అవుతుంది. వామనమూర్తి రానప్పుడు రాలేదేమని సుధ ఎప్పుడూ ప్రశ్నించలేదు. వచ్చిననాడు నిరాదరించలేదు.
    సమాధానం చెప్పకుండా తననే చూస్తోన్న వామనమూర్తి ధోరణికి మరింత ఆందోళన పడుతూ "వామన్! ఏమిటిలా తయారయ్యావు! ఒంట్లో బాగుండలేదా? మందు తీసుకోవటం లేదా?"అంది.
    "మందు!....అవును. మందు కోసమే వచ్చాను. అయినా అది మందు అవునో కాదో తెలియటం లేదు. నాకేదీ ఎప్పుడూ నిశ్చయంగా తెలియదు. సుధా! నువ్వు నాతో రాగలవా?"
    సుధ ఎక్కడికని అడగలేదు. "పద" అంది.
    బయటకు వచ్చి కారులో కూర్చుని పక్కనున్న తలుపు తెరిచాడు. సుధ కారులో అతని ప్రక్కన కూర్చుంటూ "కారు కొన్నావా?" అంది.
    "అవును. నేనిప్పుడు చాలా గొప్పవాడ్ని. భాస్కరరావు తన ఆస్తి అంతా నాకు వ్రాశాడు."
    "అదేం? ఆయనకు వైద్యం చేసినందుకా?"
    "సుధా"
    అరిచాడు వామన్. తెల్లబోయి చూసింది సుధ....వామన్ నుదుటిపైన చెమటను తన పైట కొంగుతో వత్తుతూ "ఏం జరిగింది వామన్?" అంది.
    సుధ స్పర్శతో కొంత శాంతించి "ఏం లేదు! ఏం లేదు" అన్నాడు గొణుగుతున్నట్లు.
    వామన్ భవనాన్ని, ఆ సంపదను చూసి చాలా ఆశ్చర్యపోయింది సుధ.
    "నీ స్నేహితుడు చాలా గొప్పవాడనుకుంటానే?" అంది.
    "అవును చాలా గొప్పవాడు."
    "అది సరే. నువ్విలా అయిపోయావేం?"
    "నాకు చాలా ఆకలిగా ఉంది" పసిపిల్లవాడిలా అన్నాడు వామన్.
    "పద. ఏమైనా తిందువు గాని..."
    దగ్గర కూర్చుని తనే స్వయంగా వడ్డించింది సుధ. ఎన్నడూ తిండి ముఖం ఎరగని వాడిలా ఆవురావురుమని తింటోన్న వామనమూర్తిని వింతగా చూసింది. కాని ఏమీ అడగలేదు.
    కడుపునిండా తిన్న వామనమూర్తికి స్ఫురించింది. తన నోటిలో విషం మాయమయింది. తనను పరిహసించే ఆ నవ్వు మాయమయింది. తనను వెంటాడే ఆ పరిదీనమూర్తి మాయమయింది.
    "సుధా! ఇప్పుడు నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? ఈ సంపదా ఇదంతా...."మొట్టమొదటి సారి ఆ సంపదను సంతృప్తితో తలుచుకుంటూ అడిగాడు.
    "నాకు ప్రత్యేకించి ఏమనిపిస్తుంది? నాకు ఎలాగయినా ఒకటే. డబ్బుంటే ఇంకా సుఖపడొచ్చు! లేకపోతే సర్దుకోవటం నేర్చుకోవచ్చు." మామూలుగా అంది సుధ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS