Previous Page Next Page 
ఫస్ట్ క్రష్ పేజి 24

 

టి వి లో ఆ వార్త చూసి మాధవి హమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది.
విజిత ఆనందం పట్టలేక థాంక్స్ ఏ లాట్ బుజ్జి అని ఒక మెస్సేజ్ పెట్టింది వినీల్ కి. 
యశ్వంత్ కి థాంక్స్ అన్నయ్యా అని చెప్పి వినీల్ పోలీస్ కమీషనర్ ఆఫీస్ నుంచి బయటికొచ్చాడు.
ఇంతలో వినీల్ ఫోన్ మ్రోగింది. 
చెప్పండి నాన్నగారు అన్నాడు.
ఒరే వినీల్ ! నేను మీ అమ్మ ఇవాళ ట్రైన్ లో బయలుదేరి రేపు ప్రొద్దున హైదరాబాద్ వస్తున్నామురా. మన డాక్టర్ కంటి వైద్యునికి ఒక మారు చూపించుకోమన్నాడు. కంటిలో ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంది. హైద్రాబాద్లో చూపించుకోండి అని చెప్పాడు. నీకేం ఇబ్బంది లేదు కదా అన్నాడు.
అయ్యో నాన్నా. మీరు వస్తానంటే నాకు హ్యాపీ నాన్నా. మిమ్మల్ని రిసీవ్ చేసుకునేందుకు నేను పొద్దున్నే స్టేషన్ కొస్తాను అన్నాడు.
ఇంకో ముఖ్య విషయం రా. పొద్దున్నే మన సిద్ధాంతి గారు ఫోన్ చేశారు. మొన్న నీవు పంపిన అమ్మాయి జాతకం వివరాలు నీ జాతకంతో మళ్ళీ పోల్చి చూశాడట. మీ ఇద్దరి జాతకాలు అద్భుతంగా సరిపోయాయి అని చెప్పాడు. ఆరోజు ఆయన జాతకాలు శిష్యునికిచ్చి చూడమన్నాడట. అతను లెక్కవేయడంలో పొరపాటు జరిగిందట. తరువాత సిద్ధాంతి గారే మీ ఇద్దరి జాతకాలు తీసుకుని నీది ఆ అమ్మాయిది మరోమారు పొంతనలు వేసి చూశాడట. భేషుగ్గా కుదిరింది అని చెప్పాడు. ఇంతకూ ఎవరురా ఆ అమ్మాయి. తన వివరాలు ఏంటి అని అడిగాడు.
మీరు ఎలాగు రేపు ఇక్కడకు వస్తారు కదా. రేపు అన్నీ వివరంగా చెప్తాను నాన్నగారు అన్నాడు వినీల్.
సరేరా. రేపు పొద్దున స్టేషన్ కి రావడం మర్చిపోకు అని మరీ మరీ చెప్పాడు. 
తప్పకుండా నాన్నగారు అన్నాడు ఫోన్ పెట్టేస్తూ.
అమ్మయ్య నాన్నగారు ఒక శుభ వార్త చెప్పారు.
అక్కయ్యకి అర్జెంటు గా కాల్ చెయ్యాలి అని శశిరేఖ కు ఫోన్ చేసాడు.
ఏంట్రా బుజ్జి సంగతులు అంది శశి.
నాన్న ఫోన్ చేసిన సంగతి చెప్పాడు. అక్కా నాది విజిత జాతకాలు బాగానే కుదిరాయంట. సిద్ధాంతి గారు కొంచెం పొరపాటు జరిగింది. మళ్ళీ చెక్ చేసి దివ్యంగా కుదిరాయి ఇద్దరి జాతకాలు అని చెప్పాడంట. ఇక నువ్వు నాన్నగారికి నీ దగ్గరినుంచి ఏమీ పంపకు అన్నాడు.
ఓహ్ చాలా గుడ్ న్యూస్ చెప్పావురా. విజితతో కూడా షేర్ చేసుకో. అల్ ది బెస్ట్ అంది శశిరేఖ.
అప్పుడు టైం చూస్తే రెండు గంటలు.
లంచ్ చేసావా అని విజిత కి మెసేజ్ పెట్టాడు.
ఊహూ ఇంకా లేదు అని రిప్లై ఇచ్చింది విజిత.
అభ్యంతరం లేకుంటే లంచ్ కి వస్తావా అన్నాడు.
ఎగిరి గంతేసింది విజిత. మా శ్రీవారు రమ్మంటే రాకుండా ఉంటానా. తప్పకుండా వస్తాను. ఏ హోటల్ కి రాను అని అడిగింది.
హోటల్ పేరు మెసేజ్ పెట్టాడు. తనూ ఆ హోటల్ కి బయలుదేరాడు.
విజిత కోసం వెయిట్ చేస్తూ రిసెప్షన్ దగ్గర కూర్చోనున్నాడు వినీల్.
ఖాళీగా ఉండటం ఎందుకని లాప్ టాప్ ఓపెన్ చేసాడు. ఆఫీస్ మెయిల్స్ కి రిప్లై ఇస్తున్నాడు. 
ఇంతలో మృణాల్ ఫోన్.
ఎప్పుడొస్తున్నావు నీల్ ఆఫీస్ కి అని.
మృణాల్ కి చెప్పాడు విజి ఇండస్ట్రీస్ ఇబ్బందులు, రేపు నాన్నగారు రావడం, తన హెల్త్ చెక్ అప్ గురించి. ఎల్లుండికి తప్పకుండా ఆఫీస్ లో ఉంటాను అని చెప్పాడు.
తొందరేమీలేదు. మామూలుగా నీతో ఒకసారి మాట్లాడాలని అడిగాను. అంతే అర్జెంటు ఏమీ లేదు అన్నాడు మృణాల్.
థాంక్స్ మృణాల్ అని చెప్పాడు వినీల్.
విజిత వచ్చింది.
గులాబీ రంగు చీరలో అపరంజి బొమ్మలా కనిపించింది.
అబ్బా ఆమె నడుస్తుంటే వినీల్ రెప్ప ఆర్పకుండా ఆమెనే చూస్తున్నాడు.
ఇక చూసింది చాలు చెప్పండి బుజ్జి గారు అంటూ సోఫాలో అతని పక్కనే కూర్చుంది.
ఇవాళ నీతో కలిసి లంచ్ చేద్దాం అనిపించింది విజ్జీ. కొన్నిముఖ్యమైన విషయాలు కూడా నీతో పంచుకోవాలి అని పిలిచాను అన్నాడు.
థాంక్స్ బుజ్జీ నీ బిజీ షెడ్యూల్ లో నేను గుర్తు వచ్చినందుకు అంది.
లోపలి కెళదామా. లంచ్ చేస్తూ మాట్లాడుకోవచ్చు అన్నాడు.
ఛలో అంది అతని చెయ్యి పట్టుకుని అతనితో పాటు తనూ లేస్తూ.
మమ్మీ డాడీ చాలా చాలా హ్యాపీ నీల్. నువ్వు అంత పెద్ద సమస్యను సునాయాసంగా తీర్చావు. నిన్న వాళ్లిద్దరూ నన్ను నీకిచ్చి పెళ్లి చేసేందుకు నీ అభిప్రాయం కనుక్కోవడం కోసం మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఇద్దరికీ చాలా నచ్చావు అంది విజిత సంతోషంగా.
ఓహ్ వెరీ గుడ్ న్యూస్ విజ్జీ. మా నాన్నగారు కూడా ఫోన్ చేశారు గంట క్రితం. మన జాతకాలు పొరపాటున సరిగ్గా చూడలేదట. సిద్ధాంతి గారు పొద్దున నాన్నగారికి ఫోన్ చేసి మన జాతకాలు దివ్యంగా కుదిరాయి అని చెప్పారట. ఆయన నీ వివరాలు అడిగారు. మా అమ్మ, నాన్న ఇవాళ భీమవరంలో బయలుదేరి రేపు ప్రొద్దున హైదరాబాద్ వస్తున్నారు. నాన్నకు కంటి చెక్ అప్ చేయించుకోమని అక్కడ మా డాక్టర్ చెప్పారట. నేను అన్ని విషయాలు ఆయన ఇక్కడికి వచ్చిన తరువాత వివరంగా చెప్తాను అన్నాను.
ఓహ్ ఇది చాలా పెద్ద శుభవార్త నాకు. మన ఇరువురి జాతకాలు కుదరడం అనే పెద్ద విషయానికి శుభం కార్డు పడింది. వెరీ నైస్ నీల్ అంది మహా ఆనందపడిపోతూ. మామయ్యగారిని నేను తీసుకెళ్లి చెక్ అప్ చేయిస్తాను రేపు అంది విజిత.
అప్పుడే వరసలు కూడా కలిపేసావా చిట్టీ అన్నాడు.
మరీ ! కంగారుపడొద్దులే. రేపు ఆయన ముందు అలా అనను. మన పెళ్లి అఫిషియల్ గా అనౌన్స్ అయ్యేంతవరకు అలానే చేద్దాం అంది. ఈ సమయంలో మీ వాళ్ళు రావడం మంచిది. మా వాళ్ళు మీ వాళ్ళు కలిసి మాట్లాడుకోవచ్చు. రేపు అందరికి  భోజనాలు మా ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను  అంది.
ఊహూ అమ్మ ఊరుకోదు. ఆవిడ తన చేత్తో నాకు వండి పెట్టాలని ప్రయత్నిస్తుంటుంది. నేను చాలా కాలం అమెరికా లో ఉన్నా కదా. ఆమె చేతి వంట మిస్ అయ్యాను. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ఉన్నాగా. అందుకు ఎలాగైనా తన చేతి వంట తినిపించాలి ఆరాటపడుతుంటుంది. అయినా చూద్దాంలే ఎక్కడైతే ఏముంది అన్నాడు వినీల్.  
ఏమో నీల్. నువ్వు మా విషయాలలో బాగా బిజీ అయ్యావు అంది విజిత నొచ్చుకుంటూ.
అయితే ఏముంది విజ్జీ. నాకు ఇదొక అవకాశం. ఇష్టం కూడా అన్నాడు.
సరే నేనొకటి అడుగుతాను చెప్తావా అంది.
ఆమ్మో కొంపదీసి మొన్న హోటల్ లో జరిగిన సంఘటన గురించా అని భయపడ్డాడు. అడుగు విజ్జీ అన్నాడు బింకంగా.
మన పెళ్ళైతే నువ్వు నీ ఉద్యోగం మానేసి మా ఇండస్ట్రీస్ చూసుకుంటావా అని అడిగింది. 
ఆమ్మో నా ప్రియాతి ప్రియమైన సాఫ్ట్వేర్ కోడింగ్ వదిలెయ్యడమా అన్నాడు ఫీల్ అవుతూ.
మరి ఎలారా బుజ్జీ. నేను ఒక్కగానొక్క దాన్ని మా వాళ్లకు. డాడీకి కూడా జరిగిన ఈ చేదు సంఘటనలు బాగా భయపెడుతున్నాయి. శారీరకంగా మానసికంగా ఆయన డల్ అయ్యారు. ఈ పరిస్థితులలో ఇంత పెద్ద బిజినెస్ చూడాలంటే నేనైతే అస్సలు చూడలేను. నువ్వు ఒక్కడివే ఒంటి చేత్తో నడపగలవు. ప్లీజ్ ఆలోచించు అంది బిక్కమొహం పెట్టి నువ్వే దిక్కురా అన్నట్లు.
ఆమ్మో ఇది మళ్ళీ బావురుమని ఏడ్చేటట్లుంది అని భయపడ్డాడు వినీల్.
కొంచెం టైం ఇవ్వు విజ్జీ. రేపు ఎలాగూ ఈ విషయాలన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుతారు. ఆలోపు నా నిర్ణయం చెప్తాను. సరేనా అన్నాడు అనునయిస్తున్నట్లు.  
వినీల్ కి పెద్ద సందేహం వచ్చింది. కొంపదీసి నన్ను ఇల్లరికం అల్లుడిగా రమ్మంటున్నావా అన్నాడు విజితతో.
మీరు విజి ఇండస్ట్రీస్ ఓనర్ గా వస్తున్నారు మా ఇంటికి. మా డాడీ కి చెప్పి ఆస్తి మొత్తం మీ పేర రాయమంటాను. మీరేమీ విజ్జీ భర్త గా రావొద్దు. నేనే నీల్ భార్యగా ఉంటాను. అప్పుడు నీకు ఓకే కదా అంది.
వద్దు వద్దు. ఆ ఆస్తులు అవీ నాకేమీ వద్దు. అవి నీ పేరనే ఉండనీ. నాకు నీ  ప్రేమొక్కటి రాసివ్వు చాలు అన్నాడు వినీల్.  
అది ఎప్పుడో రాసిచ్చాగా. నువ్వే ఇంకా తీసుకోలేదు. నేనేం చేసేది అంది కినుకగా బుంగమూతి పెట్టి.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS