థాంక్స్ నీల్ అని చెప్పాడు కృతజ్ఞతగా.
నీల్ అతని దగ్గర కి కుర్చీ లాక్కుని 'సర్ మీకు కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలి. మీ ఆక్సిడెంట్ జరిగినప్పుడు యశ్వంత్ తో డిస్కస్ చేసాను. అతని అంచనా ప్రకారం మీ ఫ్యాక్టరీ లో కానీ, ఆఫీస్ లో కానీ మీ స్టాఫ్ లో కొందరు మీ శత్రువులకు హెల్ప్ చేస్తున్నారు. వాళ్లకు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. ఇప్పుడు యశ్వంత్ తో మాట్లాడితే కొన్ని పేర్లు చెప్పాడు. మీ జనరల్ మేనేజర్ ఇంకో ఇద్దరి తో కలిసి బయటివాళ్లకు ఎప్పటికప్పుడు మీ రహస్యాలు చేరవేస్తున్నాడు అని ఆ ఇద్దరు ఎవరనేది కూడా విడమర్చి చెప్పాడు.
రాజుగారు ఒక్కసారి నిర్ఘాంతపోయాడు. విజి ఇండస్ట్రీస్ పెట్టినప్పటినుంచి జనరల్ మేనేజర్ ఆ కంపెనీలోని ఉన్నాడు. అంచలంచెలుగా అతనికి పదోన్నతులిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఇంత నమ్మక ద్రోహం చేస్తున్నాడా నాకు తెలియకుండా అని ఆశ్చర్యపోయాడు.
మీకు కొన్ని ఆధారాలు చెప్తాను అంటూ ఓ పదినిముషాలు అతను ఏమేం చేస్తున్నాడో చెప్పాడు వినీల్. అంతేకాదు మీ ఆక్సిడెంట్ కు కుట్రలో ప్రధాన పాత్ర కూడా అతనిదే.
ఆధారాలతో వినీల్ చెప్తున్నమాటలకు రాజుగారి తో పాటు మాధవి, విజిత కూడా ఆశ్చర్యపోయారు. ఇంత సమాచారం తన దగ్గరకూడా లేదు అని వాపోయారు రాజుగారు. వినీల్ చాకచక్యాన్ని, అసాధారణ ప్రతిభని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
ఓ పెద్ద కప్పులో హార్లిక్స్ కలుపుకుని తెచ్చి వినీల్ కిచ్చింది విజిత.
థాంక్స్ అని చెప్పి తీసుకున్నాడు.
రాత్రి ఒంటిగంటయ్యింది. రాజుగారికి అంతా అయోమయంగా ఉంది. ఆయన ఇప్పటి వరకు ఒకవైపే చూసాడు. ఈ కుట్రలు ఆయన ఊహించనివి. తన జనరల్ మేనేజర్ తనకు ఇంత అపకారం చేస్తాడని ఊహించలేకపోయారు. అతన్ని ఇప్పటివరకు బాగా నమ్మాడు. ఆమ్మో అని అతని ఒళ్ళు జలదరించింది.
మరి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకు ఎలా చెప్పాలి. వాళ్లకు ఆధారాలు లేందే ఒప్పుకోరు కదా . అందులోనూ మనీ లాండరింగ్ పెద్ద ఆఫెన్సు అన్నారు రాజుగారు.
ఇవిగోండి సర్ వాళ్ళ అభియోగాలు అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన పేపర్స్ చూపించాడు. ఇవ్వన్నీ కూడా మీ జనరల్ మేనేజర్ మీ స్టాఫ్ మరికొందరితో కలిసి చేసినవే. మీ ఆక్సిడెంట్ రోజు నాకు అనుమానం వచ్చి నేను రిక్వెస్ట్ చేస్తే యశ్వంత్ ఆల్రెడీ వాళ్ళ మీద నిఘా పెట్టాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే అదే చెప్పాడు. బలమైన కొన్ని ఆధారాలు దొరికాయి. నేను రేపు యశ్వంత్ ని కలుస్తాను. రేపంతా ఇదే పనిమీద ఉంటాను. వాళ్ళను రెడ్ హాండెడ్ గా పట్టుకునే ప్రయత్నం చేస్తాను. ఎలాగూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు రోజులు టైం ఇచ్చారు. ఈలోగానే మనకు అన్నీ ఆధారాలు దొరుకుతాయి అన్నాడు వినీల్ కాంఫిడెన్స్ గా.
ఓహ్ చాలా గ్రేట్ నీల్. నేనున్న పరిస్థితులలో చాలా అయోమయంగా ఉన్నాను. నువ్వు దేవుడిలా వచ్చి నన్ను ఆదుకుంటున్నావు అన్నాడు వినీల్ చేతులు పట్టుకుంటూ.
అయ్యో అంతంత పెద్ద మాటలు అనకండి. మీరు నిశ్చింతగా హ్యాపీ గా ఉండండి. ఇవన్నీ ఊహించినవే. కంగారుపడతారని మీకు ముందే చెప్పలేదు. అందులోనూ మీ ఆరోగ్య పరిస్థితి బాగా లేదు. ఇవన్నీ నేను చూసుకుంటాను అన్నాడు భరోసా ఇస్తూ.
మాధవి కూడా చాలా చాలా థాంక్స్ బాబు అంది. అన్నీ విన్న ఆవిడకు కూడా మొదటిసారి చాలా భయం కలిగింది. తమ కుటుంబం మీద ఎంత పెద్ద కుట్రలు జరుగుతున్నాయో తెలిసాక చాలా భీతి కలిగింది.
సరే సర్. మీరు రెస్ట్ తీసుకోండి. ఇవేవీ ఆలోచించకండి. నేను రేపు ఇదే పనిమీద ఉంటాను అన్నాడు వినీల్.
బయటికి వచ్చి బై చెప్తూ చాలా చాలా థాంక్స్ నీల్ అంది విజిత.
నువ్వూ ఏమీ వర్రీ అవ్వకు విజ్జీ. వ్యాపారమన్నాక ఇలాంటివి జరుగుతుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు.
వెళ్ళబోతూ విజిత వైపు చూసాడు వినీల్. అర్ధ రాత్రిలోనూ ఆ అందం వసివాడలేదు. తనని ఎప్పుడూ రెచ్చగొడుతూనే ఉంటుంది.
ఏంటి ఏమన్నా కావాలా బుజ్జి అని అడిగింది విజిత నవ్వుతూ.
అహహా ఏం లేదు అంటూ వచ్చేసాడు వినీల్. ఆమ్మో పెళ్ళయ్యేంతవరకూ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అనుకున్నాడు.
విజిత ఇంట్లోకి వెళ్ళబోతూ ఆగింది.
డాడీ మమ్మీతో అంటున్నాడు మన అమ్మాయికి వినీల్ నిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని. రాజుగారు అప్పటికే వినీల్ గురించి ఒక అభిప్రాయానికొచ్చారు.
మీ ఐడియా చాలా బాగుంది అంటోంది మాధవి. మన విజ్జీకి సరియైన జోడి అతను అంది. మీకు కూడా మీ వ్యాపారానికి చాలా అండగా ఉంటాడు. బాగా చురుకుగా తెలివైనవాడు. ఈ సమస్యలు తీరిన తరువాత ఆ అబ్బాయి దగ్గరి కెళ్ళి మీరు అడగండి అతనికి మనమ్మాయిని చేసుకోవడం ఇష్టమో కాదో. ఈలోపు నేను విజ్జీ ని అడుగుతాను తన అభిప్రాయం అంటోంది మాధవి.
అమ్మయ్య, ఒక పెద్ద సమస్య తీరింది అనుకుంది విజిత.
విజిత లోపలికి రాగానే వాళ్ళు టాపిక్ మార్చారు.
****
ప్రొద్దున్నే ఐదింటికల్లా లేచి చక చక రెడీ అయ్యి కిందకు వచ్చాడు వినీల్.
ఏంటి అప్పుడే రెడీ అయ్యి వెళుతున్నారు. పక్కింటినుంచి విజిత అడుగుతోంది.
యశ్వంత్ రమ్మన్నాడు విజ్జీ అర్జెంటుగా. వెళుతున్నాను అని చెప్పి కారు తీస్తున్నాడు.
కొంచెం కాఫీ ఇస్తాను. తాగి వెళ్ళండి అంది.
టైం లేదు విజ్జీ. ప్లీజ్. నేను వెళ్ళాలి అని కారు రివర్స్ చేసుకుని బయలుదేరాడు.
పోలీస్ కమీషనర్ ఆఫీస్ లో అప్పటికే వచ్చున్నాడు యశ్వంత్.
రా రా వినీల్ అన్నాడు.
ఇద్దరికీ వేడి వేడిగా కాఫీలోచ్చాయి.
యశ్వంత్ తమ పోలీస్ ఆపరేషన్ మొత్తం వివరించాడు వినీల్ కి.
ఆ ఆపరేషన్ నిర్వహించిన ఐదు మంది పోలీస్ ఆఫీసర్స్ ని పిలిచాడు.
విజి ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ గోవిందరావు, అతనితో పాటు ఆఫీస్ లో పనిచేసే మరో ముగ్గురిని తెల్లవారు ఝామున అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.
వారి దగ్గరనుంచి పూర్తి ఆధారాలు దొరికాయి.
ఒక్కొక్కరి దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు.
గోవిందరావు ఇచ్చిన వాంగ్మూలం లో తను ఎవరి బలవంతం మీద చేస్తున్నది, వాళ్ళు తనకు ప్రతిగా ఏమి ఇచ్చారు, విజి ఇండస్ట్రీస్ ని ఎలా మోసం చేసాడు, రెండు సంవత్సరాల నుంచి వెంకటరాజు గారికి తెలీకుండా విజి ఇండస్ట్రీస్ అకౌంట్స్ తారుమారు చేస్తూ మనీ లాండరింగ్ చేశానని ఒప్పుకున్నాడు.
అప్పటికప్పుడు ఆ నలుగురి మీద ఎఫ్ ఐ ర్ ఫైల్ చేసి, పదకొండు గంటలకు కోర్ట్లో హాజరు పరిచారు.
జడ్జి గారు పద్నాలుగు రోజులపాటు రిమాండ్ విధించారు.
ఆ కోర్టు కాపీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి స్కాన్ చేసి మెయిల్ చేశారు.
అప్పుడు టైం మధ్యాహ్నం ఒంటిగంట అయ్యింది.
వినీల్ విజిత కి ఫోన్ చేసి టి వి ఆన్ చేసి లైవ్ చూడమని చెప్పాడు.
యశ్వంత్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గోవిందరావు, అతను మనుషులు ఎలా మనీ లాండరింగ్ చేసింది, విజి ఇండస్ట్రీస్ ని, వెంకటరాజు గారిని ఎలా మోసం చేసింది అంతా సాక్ష్యాలతో వివరించాడు.
ఇందులో వెంకటరాజు తప్పు కానీ, విజి ఇండస్ట్రీస్ కి సంబంధం కానీ లేదని తేల్చి చెప్పాడు.
ఎవరి ప్రేరణతో గోవిందరావు చేసాడో వాళ్ళను కూడా అన్ని ఆధారాలతో త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పాడు.
తమతో పాటు చాకచక్యంగా పనిచేసిన వినీల్ కి డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు.
ప్రెస్ కాన్ఫరెన్స్ లో యశ్వంత్ ప్రక్కనే వినీల్ కూడా కూర్చోనున్నాడు.
ఇదంతా అన్ని టి.వి చానెల్స్ లో లైవ్ టెలికాస్ట్ అయ్యింది.
ఇదంతా లైవ్ చూస్తున్న వెంకటరాజు గారు హమ్మయ్య మరో గండం గట్టెక్కింది భగవంతుడా అనుకున్నాడు.
ఈ సారి అతని కళ్ళముందు వినీల్ విశ్వరూపం చూపిస్తున్న శ్రీకృష్ణుడులా కనిపించాడు.

