"ఈ ప్రపంచం మొత్తంలో నీ అంత సౌందర్యపతి లేదనిపిస్తోంది."
"ఊఁ...." గలగలా నవ్వింది. "మరి, నాకేమనిపిస్తోందోతెలుసా?"
"ఊఁ....చెప్పు."
"జీవితాంత ఇలాగే, మీ కౌగిట్లో బందీనయి వుండిపోవాలనిపిస్తోంది. ఈరేయి ఇలాగే నిలిచిపోతే, మనం ఎప్పటికీ ఇలాగే వుండిపోతాం కదూ!" అతని భుజంమీద తలపెట్టి చిన్నగా చెప్పింది చెవులో చెబుతూన్నట్టుగా.
మిన్ను విరిగి మీద పడ్డట్టుగా పెద్ద చప్పడయింది. ఇద్దరూ లేచి నుంచుని తిరగిచూశారు. ఒక ఆటో, స్కూటరు ఢీ కొన్నాయి. ఆటోరిక్షావాడు స్కూటరుని కొట్టి వెళ్ళిపోయాడు. స్కూటరు మీదున్న వాళ్ళిద్దరూ కింద పడిపోయారు. అతను వెంటనే లేచి నుంచున్నాడు. ఆమె లేవలేక పోతోంది. చీరంతా ఊడిపోయింది. మెల్లగా లేవనెత్తాడు అతను. ఎలాగో అతని ఆసరాతో చీర సర్దుకుంది. ఆమె. అతి కష్టంమీద మళ్ళీ స్కూటర్ మీద కూర్చుంది.
సుమతి గుండె దడదడా కొట్టుకుంటోంది. "ఎంత గండం గడిచింది? చిన్నవాళ్ళు పాపం. ప్రమాదం జరిగుంటే?" సుమతి మరి ఆలోచించ లేకపోతోంది. తనూ, గోవిందూ పడ్డట్టుగా ఊహించుకుంటోంది. కళ్ళు తిరిగినట్టుయింది. తూలిపోయింది.
"సుమతీ! ఏమయింది? లే....." అంటూ గాభరాగా భుజం తట్టాడు గోవింద్.
"కళ్ళు తిరిగాయి" అంది సుమతి.
"పద, ఇంటికి పోదాం." స్కూటర్ స్టార్టుచేశారు గోవింద్ వెనకసీట్లో కూర్చున్న సుమతి, లతలా అతన్ని పెనవేసుకుకూర్చుంది. ఒకచెయ్యి అతని నడుంచుట్టూ వేసి, మరోచెయ్యి అతని భుజంచుట్టూ వేసింది. తల అతని భుజాని కానించింది. ఆ రాత్రంతా ఏవో పీడకలలు రావడంవల్ల భయంతో గోవింద్ ని గట్టిగా పట్టుకుని పడుకుంది 'యాక్సిడెంటు చూసి భయపడి పోయింది పాపం' అనుకుంటూ పసిపిల్లలా జోకొట్టి పడుకోబెట్టాడు గోవింద్.
* * *
విశాఖపట్టణంలో సర్ క్యూట్ హవుస్ కి వెనకవైపుగా ఎత్తయిన కొండమీద కట్టారు నరసింహారావుగారు ఒక చిన్న ఇల్లు. ఇల్లు చిన్నదే అయినా, ముచ్చటగా ఎంతో వసతిగా రాతి కట్టడంతో అందంగా కట్టారు. ఇంటి డాబామీంచి చూస్తే పూర్తి విశాఖపట్టణం అంతా కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రివేళ లైట్లతో మిలమిలలాడే నగరశోభ కన్నుల కింపుగా వుంటుంది. ఇంటిముందున్న గులాబీతోటా, వెనకవైపున్న కూరగాయల పాదులూ, గేటు కిరువైపులా నైట్ క్వీన్ చెట్లూ ఎంతో ఆహ్లాదంగా వుంటుంది.
నరసింహరావుగారు ఒక పెద్ద ఎరువుల కంపెనీలో పనిచేసి రిటైరయ్యారు. భార్య కామాక్షమ్మా, తనూ ఇద్దరే ఆ యింట్లో వుండడం. గోవింద్ కి కాలేజీ, లేకపోతే స్నేహితులూ. అస్తమానం బయటే తిరిగేవాడు. "వీడి కొక్కక్షణం ఇంట్లో కాలు నిలవదు. ఆస్తమానం స్నేహితుల గొడవే. చక్కగా ఒక ఆడపిల్లయినా పుట్టివుంటే బావుండేది. ఇంటిపట్టు నుండేది, బోలెడంత కాలక్షేపం. ఇంత ఇంటికీ ఇద్దరం బిక్కు బిక్కు మనుకుంటూ" తిచినప్పుడల్లా ఇదే విసుగూ, ఇవేమాటలు కామాక్షమ్మ. నరసింహారావుగారు ముసిముసిగా నవ్వుతూ, "ఇప్పుడేం పోయింది, త్వరగా కోడల్ని తెచ్చుకుంటే సరి" అనేవారు.
"వాడోప్పుకో వద్దూ....ఆ మాటంటేనే కస్సుమంటాడు. ఈ సంవత్సరంతో చదువయిపోతుంది కూడానూ వాడుదేవరావుగా రమ్మాయిదికూడా ఈ సంవత్సరంతో చదువయిపోతుందట. లక్షణమైన పిల్ల" కొడుకుని ఒప్పించమన్నట్టుగా వుంది ఆమె ధోరణి.
"నాకు తెలుసులేవే నీ మనసంతా ఆ పిల్లమీదే వుందని. వాసుదేవరావు కళ్లుకూడా మనమీదే వున్నాయి. పరీక్షలయిపోనీ కదిలిద్దాం" అనేవారు.
వాసుదేవరావుగారి వ్యాపారం ఒక పెట్రోలు పంపూ, ఒక గ్యాస్ ఏజన్సీ మరో ఇనపసామాన్ల దుకాణం ఇవన్నీ ఆయన పేరుమీదే వున్నాయి. సుమతి ఏడాది పిల్లప్పుడు ఆయన భార్య పోయింది. మరోపెళ్ళి చేసుకుంటే ఆమె సుమతిని సరిగ్గాచూస్తుందో చూడదోనన్న భయంచేతా, భార్యని మరచిపోలేకా, ఆయన మళ్ళీ వివాహం చేసుకోకుండా అలాగే వుండిపోయాడు ఎందరో చుట్టాలు సుమతిని పెంచుతామని ముందుకొచ్చినా ఆయన ఒప్పుకోలేదు. సుమతి సంరక్షణకోసం ప్రత్యేకంగా ఎంతో డబ్బిచ్చి, మంచి ఆయాని పెట్టేరు. సరిపూర్ణ యవ్వనంలో అడుగుపెడుతూన్నకూతుర్నిచూసి, జాబిల్లిని చూసిన పసిపాపలా సంబరపడిపోతూవుండేవారు. కష్టం అంటే ఏమిటో, కన్నీళ్ళంటే ఏమిటో తెలీకుండా పెరిగిన సుమతికి, అన్నివిధాలా యోగ్యతకల సంబంధం నరసింహారావుగారిదే ననిఆయన నమ్మకం.
దానికి కారణం నరసింహారావుగారూ, తనూ మంచి స్నేహితులు కావడంవల్లా, నరసింహారావుగారి భార్య కామాక్షమ్మాకూడా అతనికితగ్గ ధర్మపత్ని కావడంవల్లా, కామాక్షమ్మగారి సహచర్యంలో సుమతి తల్లిప్రేమను చవిచూడగలదనే నమ్మకంకూడా ఆయన వుంది. పైగా గోవింద్ అంటే తనకీ సుమతికీ కూడా ఆయన వుంది. పైగా గోవింద్ అంటే తనకీ, సుమతికీ కూడా ఇష్టమే గోవింద్ కూడా 'మామమ్యా, మామయ్యా' అంటూ సరదాగా కబుర్ల చెపుతూ తిరుగుతాడు. సుమతి గోవింద్ తో మాట్లాడుతూ వుంటే వారిరువురినీ చూసి సంబరపోయేవారు.
చదువయిపోగానే గోవింద్ కి హైద్రాబాద్ ఆంద్రాబ్యాంక్ లో ప్రొబేషనరీ ఆఫీసరుగా ఉద్యోగం వచ్చింది.
"ఇల్లూ వాకిలీ వదిలిపెట్టి ఒంటరిగా అక్కడికెళ్ళి నీ కెందుకురా ఉద్యోగం?ఇక్కడే ఏదయినా బిజినెస్ పెట్టుకోకూడదూ?" అన్నారు నరసింహరావుగారు.
"మాకుమాత్రం ఏ పదిమంది వున్నారు? ఉన్న ఒక్కడివీ, ఈ వయస్సులో మా కళ్ళముందు లేకుండా వుండడం, మేం భరించలేము నాయనా" అంది కామాక్షమ్మ.
అయినా గోవింద్ వినలేదు. 'బిజినెస్' తనవల్ల కాదన్నాడు. చేసేదిలేక ఒప్పుకున్నారు నరసింహరావుగారు. కామాక్షమ్మ మాత్రం ఒక్క షరతు పెట్టింది. అది వేసవిలో సుమతిని పెళ్ళిచేసుకోవడం.
"ఇప్పుడప్పుడే ఒద్దు" అన్నాడు గోవింద్.
"ఇప్పుడు చేసుకొకపోతే ఎందులోనన్నా పడి చస్తా" నంది కామాక్షమ్మ.
మొత్తానికి గోవింద్ ఓడిపోయాడు.
సుమతితో గోవింద్ పెళ్ళి నిశ్చయమైంది.
* * *
గోవింద్, సుమతీల వివాహం దగ్గరికొచ్చేసింది. నరసింహారావుగారూ, కామాక్షమ్మలు చేస్తున్న హడావుడి ఇంతా అంతా కాదు. ఏడువారాల నగలూ కొనేసింది ఆమె. ఏఏ దుకాణాలలో, ఏ ఏ రకం కొత్తచీర లున్నాయో అన్నీ తెప్పించేసింది. ఇన్నాళ్ళకి ఆ యింట్లో మరో ఆడమనిషి తిరగబోతుంది. అదే ఆమె సంబరం. గోవింద్ కూడా ఏవేవో కొనేస్తున్నారు స్నేహితులను వెంటబెట్టుకు వెళ్ళి. పదిహేను రోజులయినా పూర్తి షాపింగు అవనేలేదు.
వాసుదేవరావుగారు సరేసరి. కూతురి నోట్లోంచి మాట రావడం ఆలస్యం ఆ వస్తువును అమర్చిపెడుతున్నారు. అతనికున్నదల్లా ఒక్కటే లోటు. భార్య పోవడం తల్లిలేని కొరత సుమతికి కనబడకుండా వుండడానికి ఎంతో తాపత్రయ పడుతున్నాడు. 'ఆయా'ఇంట్లో పనిమనిషి కాదు, ఒక ఇంటిమనిషి అలాగానే వుంటుంది. వాసుదేవరావుగారికి ఎప్పు డేంకావాలో, సుమతి కేం కావాలో ఆమెకు బాగా తెలుసు. ఇంటికొచ్చే పోయే స్నేహితుల్లో వంటయింటి వారెవరో, వసారాలో వారెవరోకూడ ఆమెకు తెలుసు. అంతేకాదు, నిజమైన ప్రేమ చూసే బంధువులెవరో, వుత్తుత్తి వాళ్లెవరోకూడా తెలుసు. అందుకే అన్నిపనులూ వాసుదేవరావు గారు ఆమెకే అప్పగించారు. "ఆయమ్మా....ఈ సమయంలో అమ్మ వుంటే ఎంత బావుండేది" కళ్ళనీళ్ళు పెట్టుకుంది సుమతి.
"ఊరుకొండమ్మా....ఏం చేస్తాం?" ఆయమ్మకూడా కళ్ల నీళ్లు పెట్టుకుంది.
