రాక్షసుడు
-యండమూరి వీరేంద్రనాథ్
అతడి కళ్ళలో ఒక శక్తి వుంది!
ప్రపంచంలో మరే కళ్ళకీ లేని శక్తి అది! కేవలం అతడికి మాత్రమే వుంది. అది మెస్మరిజమూ కాదు- హిప్నాటిజమూ కాదు. కేవలం సాధన ద్వారా వచ్చిన శక్తి అది. సాధనంటే మళ్ళీ యోగమూ, ధ్యానమూ కాదు. కష్టాలూ- చుట్టూ వుండే రాక్షస మనస్తత్వాలూ- మోసం చేసిన మిత్రులూ, ఆఖరి క్షణంలో ఆదుకున్న శత్రువులూ- వాళ్ళవల్ల అంగుళం దూరం వరకూ వచ్చి వెళ్ళిపోయిన అపాయాలూ- పస్తులున్న రోజులూ- నిద్రలేని రాత్రులూ అన్నీ కలిసి అతడికి ఆ శక్తినిచ్చాయి.
ఒక్క నిముషం మాట్లాడితే చాలు, ఆ మాటల్లో అవతలి వ్యక్తి బలహీనతని పట్టుకుంటాయి ఆ కళ్ళు. అదే వాటికున్న శక్తి.
డబ్బు -స్త్రీ... దైవభక్తి... కీర్తి కండూతి....జూదం... ప్రతీ మనిషికీ ఎక్కడో ఏ మూలో ఒక బలహీనత వుంటుంది. దాన్ని సరిగ్గా పట్టుకుంటాయి ఆ కళ్ళు.
ఆ తరువాత అతడు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ కిచ్చి, తనని కావాల్సింది తను తీసుకుంటాడు. అతడిలో గొప్పతనం ఏమిటంటే అతడు అవతలివారి బలహీనతని గుర్తించినట్టు చులకనగా మాట్లాడడు.
అతడిలో ఇంకో గుణం కూడా వుంది. అతడు నవ్వడు. అవును. అతడు నవ్వడు. అతడి జీవితంలో ఇంతవరకూ ఎప్పుడూ ఒక్కసారి కూడా నవ్వలేదు.
అతడి కోర్కె ఒకటే. ఇంకా ఇంకా సంపాదించాలి! అంతే.
అయితే అతడి ఆశయం సంపాదించటం కాదు. ఒకర్ని సంతృప్తిపరచాలి. అలా సంతృప్తి పరిచి మరొకరి ఆచూకి తెలుసుకోవాలి.
1
అర్థరాత్రి స్వేచ్చగా అరుస్తున్న కీచురాయి, పక్కనే వచ్చిపడిన 'దబ్బు' మన్న శబ్దానికి భయంతో ముణగదీసుకుని ఆ చెత్తకుండీలో మరింత మూలకి నక్కింది.
ఆ కుండీ పక్కనే రెండంతస్థుల భవనంలో అయిదు నిముషాల క్రితం ఒక నలభై ఏళ్ళావిడ చిరాగ్గా అటూ ఇటూ పచార్లు చేస్తూంది. ఆ గదిలోనే పక్కమీద ఒక స్త్రీ మెలికలు తిరిగిపోతోంది. పచార్లు చేస్తున్న స్త్రీ విసుగ్గా "ష్... గొడవ చెయ్యకు" అంటోంది. ఇదేమీ పట్టనట్టు ఒక రిటైర్డు నర్సు ఆ స్త్రీ కడుపు వత్తుతూంది.
కాస్త నొప్పులు రాగానే ఆస్పత్రిలో చేర్పించి వుంటే తన బాధ్యత తీరిపోయేది కదా. ఇలా ఎందుకు చేశానా అని బాధపడుతూ పచార్లు చేస్తూంది వార్డెను.
నర్సు నానా తిప్పలూ పడుతూంది.
పక్కవాళ్ళకి నిద్రాభంగం కలక్కుండా ఆ అర్థరాత్రి ప్రసవవేదన పడుతూంది ఆమె. కాస్త మూలుగు బయటకొచ్చినప్పుడల్లా 'నోర్మూసుకో' అని తిడుతూంది వార్డెను.
"కాస్త వయసు పైబడ్డాక వచ్చిన కాన్పుకదమ్మా. అంత తొందరగా అవదు" అంటూంది నర్సు.
"వయసు పైబడే వరకూ పెళ్ళి చేసుకోకపోతే ఇంతేమరి" కసిగా అనుకుంది వార్డెను. ఆవిడకీ పెళ్ళవలేదు గానీ, ఆవిడ ఏ అంగానికి స్త్రీత్వం లేకపోవటంతో ఇలాంటి ప్రమాదాలు రాలేదు.
"లోపల శిశువు తిరగబడ్డట్టున్నాడు" అంది నర్సు.
"వాడంత తొందరగా చావడ్లే. అబార్షన్ చేయిస్తేనే చావలేదు" అంది కసిగా వార్డెను. అంతలో, అప్పటివరకూ ఆపుకున్న దానిని మరి ఆపుకోలేనట్టు ఆనకట్ట తెగినట్టు ఒక కేక- కాబోయే తల్లి నోటి నుంచి కీచుగా వెలువడింది.
పుట్టక ముందే తన మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని చూడడం కోసం... కడుపులోనే విషం పెట్టి చంపెయ్యటానికి ప్రయత్నం చేసినా చావని శిశువు బయటపడింది.
భూమ్మీద మొట్టమొదటి గాలి పీల్చుకోవటానికి వచ్చిన ఏ శిశువుకైనా ఆహ్వానం పలుకుతూ జననమవ్వగానే ముక్కు శుభ్రం చేసి కడుగుతారు.
కానీ ఇక్కడ అలాటిదేదీ జరగలేదు. నర్సు యాంత్రికంగా పేగు కత్తిరించి ముడివేసింది. వార్డెను 'తొందరగా- తొందరగా' అని హెచ్చరిస్తూ వుంటే, 'మాయ' కూడా బయట పడకముందే, పిండం రూపాన వున్న ఆ మాంసం ముద్దని కిటికీలోంచి బయటకు విసిరేసింది.
అర్థరాత్రి స్వేచ్చగా అరుస్తూన్న కీచురాయి, పక్కనే దబ్బుమని వచ్చిపడిన శబ్దానికి భయంతో ఆ చెత్తకుండీలో మరింత మూలకి నక్కింది.
* * *
సూడ్రా. కళ్ళు సెదిరిపోవటల్లేదు" అన్నాడు గంగులు తెరనే చూస్తూ. తెర మీద శ్రీరాముడు రాక్షస సంహారం చేస్తున్నాడు. పక్కనే వానరులు అతడికి సాయపడుతున్నారు. పది నిముషాల తర్వాత సినిమా పూర్తయింది. బైటకొచ్చినడుస్తూ దారిలో అన్నాడు.
"మనం బాగా బతకాలంటే అట్టాటోడు పుట్టాల్రా".
"ఎట్టాటోడు".
"ఇప్పుడు సూసి అప్పుడే మర్చిపోయినావేట్రా? మళ్ళీ దేముడే పుట్టాల".
దేవదాసు మాట్లాడలేదు.
"అసలు మంచితనానికి ప్రపంచంలో ఇలువే లేకపోయిందిరా. పట్టపగలే దోపిడీలూ, దొంగతనాలూ, సీసీసీ- ఎదవబతుకంట ఎదవ బతుకు... అసలు మడిసిగా పుట్టినందుకు ఎట్ట బతకాల్రా? రాజాలా బతకాలి. అంతేగానీ ఎప్పుడూ పక్కాణ్ని మోసం సేసుకుంట బతుకుతారెందుకురా ఈళ్ళు?"
"డబ్బు కోసం".
"పొద్దున్నించీ సాయంత్రం వరకూ కట్టం సేసుకుంట మనం బతకటంలే... అందరూ అట్ట బతకరేంరా?"
"అందరికీ నీలా కట్టపడాలన్న బుద్ధి వుండొద్దా".
"బుద్ధి కాదురా - గౌరవం వుండాలి. నీతి, న్యాయం అంటే బయముండాలె. అయిలేకే ఇట్ట పాడైపోతున్నారు జనం" గంగులు కంఠంలో బాధ కనపడింది. అంగీలోంచి బీడి తీసి వెలిగించుకోబోయి, వీధి చివర్లో జనం వుండటం చూసి ఆగిపోయాడు. ఇద్దరూ మొహమొహాలు చూసుకుని దగ్గరగా వెళ్ళారు.
